ఖమ్మం బస్టాండ్‌లో బస్సులోని ప్రయాణికుల చేతులపై శానిటైజర్ వేస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కరోనా ప్రమాదకరంగా విస్తరిస్తున్న సమయంలోనూ ఆర్టీసీలో తీరు మారలేదు. రెండు రోజుల క్రితమే ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. బస్కెక్కే ప్రయాణికులకు కచ్చితంగా శానిటైజర్ అందుబాటులో ఉంచాలని స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించినా, అధికారులు నిర్లక్ష్యం వీడలేదు. బుధవారం శానిటైజర్ సీసాలు అందుబాటులో లేకుండానే కొన్ని బస్సులు తిరిగాయి. ఖమ్మంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంలో కోదాడ డిపోకు చెందిన ఓ బస్సులో శానిటైజర్ లేని విషయం ఆయన దృష్టికి వచ్చింది. దీంతో కారణం అడగ్గా, తనకు శానిటైజర్ సరఫరా చేయలేదని కండక్టర్ సమాధానమిచ్చారు. దీంతో వెంటనే ఆ డిపో మేనేజర్‌ను సస్పెండ్ చేయాల్సిందిగా మంత్రి అజయ్‌కుమార్ సంబంధిత ఆర్‌ఎంను ఆదేశించారు. అయితే అసలు కొన్ని డిపోలకే శానిటైజర్ సరఫరా కాలేదని, ఆ కారణంతో డిపో మేనేజర్లు కొందరు కండక్టర్లకు అందివ్వలేదని తెలిసింది.
కోదాడ డిపోకు సరఫరా అయిందీ లేనిదీ విచారణలో తేలనుంది. ఈ విషయం వెలుగు చూడటంతో తమ డిపోలకు కూడా శానిటైజర్ సరఫరా కాలేదంటూ పలువురు డిపో మేనేజర్లు ఫిర్యాదు చేశారు. దీంతో పరిస్థితి గందరగోళంగా ఉందని గుర్తించిన మంత్రి అజయ్‌కుమార్, గురువారం అత్యవసరంగా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మకు పరిస్థితి చక్కదిద్దాల్సిందిగా ఆదేశించారు. బస్సుల్లో శానిటైజర్ ఎందుకు సరఫరా కాలేదో తేల్చి తనకు నివేదిక అందించాలని కోరారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
సొంతంగా కొన్న డీఎంలు..
లాక్‌డౌన్‌కు పూర్వం దాదాపు వారం రోజులపాటు బస్సుల్లో శానిటైజర్ అందుబాటులో ఉంచారు. అప్పట్లో కొన్ని డిపోల్లో స్థానిక డీఎంఅండ్‌హెచ్‌ఓల మార్గదర్శనంలో సొంతంగా శానిటైజర్ తయారు చేసుకున్నారు. నైపుణ్యం లేకుండా కెమికల్స్‌తో సొంతంగా తయారు చేయటం సరికాదని భావించి ఇప్పుడు జైళ్ల శాఖ రూపొందించిన శానిటైజర్‌ను వినియోగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు అక్కడి నుంచి పెద్దమొత్తంలో శానిటైజర్‌ను సరఫరా చేసినట్టు సమాచారం. తమ పరిధిలో డిపోలకు శానిటైజర్ పంపినట్టు ఆర్‌ఎంలు చెబుతుండగా, తమకు అందలేదని కొందరు డీఎంలు పేర్కొన్నారు. కోదాడ విషయంలోనూ ఇలాగే జరిగినట్టు తెలిసింది. శానిటైజర్ అందకపోవటంతో కొన్ని చోట్ల డీఎంలు ప్రైవేటు దుకాణాల్లో సొంతంగా కొని బస్సుల్లో ఉంచగా, కొందరు డీఎంలు అవి లేకుండానే బస్సులు పంపించారు. నిజంగా డిపోలకు శానిటైజర్ సరఫరా కాలేదా, అయినా డీఎంలు నిర్లక్ష్యంగా వ్యవహరించారా అన్నది తేలాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment