బండి ఆన్.. లైట్ కూడా ఆన్!
మార్కెట్‌లోకి ‘ఏహెచ్‌ఏ’ ద్విచక్ర వాహనాలు
- హెడ్‌ల్యాంప్ ఆన్–ఆఫ్ స్విచ్ లేకుండా ఏర్పాటు
- పగటిపూట కూడా హెడ్‌ల్యాంప్ వెలుగు తప్పనిసరి
- కేంద్ర ప్రభుత్వ నిబంధనలతో డిజైన్ మార్చిన కంపెనీలు
- రోడ్డు ప్రమాదాల తగ్గింపే లక్ష్యంగా అమల్లోకి..
సాక్షి, హైదరాబాద్: పగటివేళ కూడా లైట్లు వెలిగి ఉండే భారత్ స్టేజ్–4 వాహనాలు మార్కెట్‌లోకి వచ్చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని షోరూమ్‌లలోనూ ఈ వాహనాల అమ్మకాలు మొదలయ్యాయి. భారత్ స్టేజ్–3 వరకు ఉన్న వాహనాల్లో ఇలా కచ్చితంగా లైట్ ఆన్‌లో ఉంచాలనే నిబంధన లేదు. మార్చి 31తో ఆ నమూనా వాహనాల అమ్మకం గడువు పూర్తికావడంతో బీఎస్–4 వాహనాల విక్రయం ప్రారంభమైంది.
ఎందుకీ నిబంధన?
సాధారణంగా ఎదురుగా వచ్చే ద్విచక్ర వాహనం హెడ్‌ల్యాంప్ వెలుగుతుండటంతో మిగతా వాహన చోదకులు అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుందని పలు పరిశోధనల్లో తేలింది. దాంతో ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని నిపుణులు తేల్చారు. ఈ నేపథ్యంలో మన దేశంలో తయారయ్యే బీఎస్–4 ద్విచక్ర వాహనాల్లో హెడ్‌ల్యాంప్ ఆన్–ఆఫ్ స్విచ్ ఉండదు. బండిని ఆన్ చేయగానే హెడ్‌ల్యాంప్ కూడా వెలుగుతుంది. పగలైనా, రాత్రయినా అలాగే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ద్విచక్రవాహనాలతో ప్రమా దాలు ఎక్కువగా జరుగుతుండటం, మరణాల సంఖ్య కూడా అధికంగా ఉండటంతో.. పలు దేశాలు ఈ నిబంధనను అమల్లోకి తెచ్చాయి. యూరప్‌లోని చాలా దేశాల్లో 2003 నుంచే ఈ పద్ధతి అమలులో ఉంది.
కమిటీ సిఫార్సు మేరకు
యూరప్‌లో ‘ఆటో హెడ్‌ల్యాంప్ ఆన్ (ఏహెచ్‌ఏ)’ప్రయోగం సత్ఫలితాలు ఇవ్వ డంతో మన దేశంలోనూ అమల్లోకి తేవాలని నిర్ణయించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సిఫార్సులు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు నియమించిన కమిటీ కూడా దాన్ని ధ్రువీకరించింది. భారత్ స్టేజ్–4ను అమల్లోకి తెచ్చేప్పుడు ఈ నిబంధనను కూడా జత చేయాలని ఆదేశించింది. దీంతో బీఎస్–4 వాహనాల్లో ఏహెచ్‌సీ విధానం మేరకు ఏర్పాట్లు చేయాలని తయారీదారులను కేంద్రం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీఎస్–4 కార్ల విక్రయం ఎనిమిదేళ్ల కిందే ప్రారంభమైనా, ద్విచక్ర వాహనాలకు మాత్రం వర్తింపచేయలేదు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ద్విచక్రవాహనాల్లోనూ బీఎస్–4 తప్పనిసరిగా మారింది. ఇక షోరూమ్‌లలో ఆ వాహనాలను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది.
రవాణా శాఖకు సమాచారమే లేదా?
ఎంతో కీలక నిబంధనను కేంద్రం అమల్లోకి తెచ్చినా.. దీనిపై తెలంగాణ రవాణా శాఖకు సమాచారం లేకపోవడం గమనార్హం. సాధారణంగా మోటారు వాహనాలకు సంబంధించిన నిబంధనల్లో కేంద్రం చేసే మార్పుల సమాచారాన్ని రాష్ట్రాలకు అందజేయాలి. కానీ బీఎస్–4 వాహనాల్లో ఏహెచ్‌ఏ నిబంధనపై ఇప్పటికీ రాష్ట్ర రవాణా శాఖకు నోటిఫికేషన్ అందలేదని తెలిసింది.
ఇంకా పాత వాహనాలు!
కంపెనీల వద్ద పాత (బీఎస్–3) వాహనాలు గుట్టలుగా పేరుకుపోవటంతో మార్చి చివరివారంలో గణనీయంగా ధరలు తగ్గించి అమ్మిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఇప్పటికీ వాటి మొత్తం అమ్మకాలు పూర్తి కాలేదు. చాలా మంది డీలర్లు బినామీల పేరిట వాటిని తాత్కాలికంగా రిజిస్టర్ చేసి ఉంచుకు న్నారు. వాటిని ఇప్పుడు కొనుగోలు దారులకు రెండో రిజిస్ట్రేషన్ రూపంలో విక్రయిస్తున్నారు. ఇలా చాలా షోరూమ్ లలో ఇప్పటికీ బీఎస్–3 వాహనాలే ఉండటంతో కొత్త తరహా వాహనాలు పూర్తి స్థాయిలో రాలేదు. ఇప్పుడిప్పుడే బీఎస్–4 వాహనాల స్టాక్ వస్తోంది.