సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా అరకు సమీపంలోని అనంతగిరి మండలం డముకు మలుపు వద్ద ప్రైవేటు బస్సు ఘోర ప్రమాదానికి గురైన నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర పరిధిలోని రవాణా శాఖ చెక్ పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల కండిషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను సమగ్రంగా పరిశీలించిన తరువాతే వాటిని రాష్ట్రంలోకి అనుమతించాలని ఆదేశాలిచ్చింది. ఈ విషయంలో అలక్ష్యం వహిస్తే అధికారులపై వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. అన్ని చెక్‌పోస్టుల్లో అంతర్ రాష్ట్ర పర్మిట్లపై కఠిన ఆంక్షలు జారీ అయ్యాయి.
అక్రమంగా ప్రవేశిస్తే ఐదు రెట్ల జరిమానా
ఏపీలోకి ప్రవేశించే పొరుగు రాష్ట్రాల వాహనాలకు సంబంధించిన పన్నులను ఆన్‌లైన్‌లో చెల్లించే అవకాశం కల్పించారు. ఈ పన్నులు వారానికి, నెలకు చొప్పున చెల్లిస్తారు. ఆఫ్‌లైన్‌లోనూ ఈ పన్నులు కట్టించుకుంటున్నారు. పన్ను చెల్లించకుండా ఏదైనా వాహనం రాష్ట్రంలో తిరుగుతూ పట్టుబడితే ఐదు రెట్ల జరిమానా విధించాలని రవాణా అధికారులు ప్రతిపాదించారు.
రెండో డ్రైవర్ ఉండాల్సిందే
టూరిస్ట్, కాంట్రాక్ట్ క్యారియర్ బస్సుల్లో రెండో డ్రైవర్ నిబంధనను కచ్చితంగా పాటించేలా చూడాలని రవాణా శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర పరిధిలోని ప్రజా రవాణా వాహనాలకు సైతం రెండో డ్రైవర్ ఉండాలని పేర్కొంది. డముకు మలుపు వద్ద బస్సు లోయలో పడిపోవడానికి దాని డ్రైవర్‌కు విశ్రాంతి లేకపోవడమే కారణమని గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. డ్రైవర్ అలసటకు గురి కావడం, నిద్ర లేమి వల్ల ఆ ప్రమాదం జరిగిన దృష్ట్యా డ్రైవర్లు విధిగా 8 గంటల డ్యూటీపై నిబంధన పాటించాలని, ఆ దిశగా తనిఖీలు చేయాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. చెక్‌పోస్టుల్లో తనిఖీల సందర్భంగా అశ్రద్ధ వహిస్తే అక్కడ పనిచేసే ఎంవీఐ, ఏఎంవీఐలపై వేటు తప్పదని రవాణా శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment