సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ విధించిన నేపధ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు నాలుగు నెలల ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం కింద ఆర్థిక సాయం అందించనుంది. గురువారం (నేడు) రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రూ.262.49 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొత్తం 2,62,493 మంది లబ్ధిదారులకు నేరుగా రూ.10 వేల చొప్పున ఆన్‌లైన్ చెల్లింపులు జరగనున్నాయి. గత ఏడాది కంటే అదనంగా 37,756 మంది లబ్ధిదారులను రవాణా శాఖ ఎంపిక చేసింది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులకు అక్టోబర్‌లో రూ.పది వేలు ఇవ్వాల్సి ఉంది. అయితే కరోనా కష్టాల నేపధ్యంలో నాలుగు నెలల ముందుగానే సాయం విడుదల చేయనున్నారు. ఈ పథకానికి ఎనిమిది కార్పొరేషన్ల ద్వారా రెండో ఏడాది ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. కొత్తగా ఆటోలు కొన్నవారికీ వాహన మిత్ర పథకాన్ని వర్తింపజేశారు. గతేడాది సెప్టెంబరు 23 నుంచి ఈ ఏడాది మే 16 వరకు వాహనాల కొనుగోలు, యాజమాన్య బదిలీ హక్కులు పొందిన వారిని అర్హులుగా ఎంపిక చేశారు.
లబ్ధిదారుల్లో అత్యధికులు బీసీలే..
► కొత్తగా ఈ ఏడాది 38,605 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 849 దరఖాస్తులు సరైన డాక్యుమెంట్లు లేక తిరస్కరించగా 37,756 మంది కొత్తగా ఎంపికయ్యారు.
► మొత్తం లబ్ధిదారుల్లో 61,390 మంది ఎస్సీలు, 1,17,096 మంది బీసీలు, 14,592 మంది ఈబీసీలు, 29,643 మంది కాపులు, 10,049 మంది ఎస్టీలు, 28,118 మంది మైనార్టీలు, 581 మంది బ్రాహ్మణులు, 1,026 మంది క్రైస్తవులు ఉన్నారు.
► గతేడాది 2,39,957 మందికి లబ్ధి చేకూరగా కొంతమంది వాహన యాజమాన్య హక్కులు బదిలీ చేసుకున్నారు. గ్రామాల్లో సోషల్ ఆడిట్ పూర్తి చేసి లబ్ధిదారుల్ని నిర్ధారించారు. ► గతేడాది లబ్ధి పొందిన వారితో పాటు కొత్తగా ఎంపికైన వారికి ఆన్‌లైన్ ద్వారా వారి ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేయనున్నారు.
► ఈ పథకానికి గాను 8 కార్పొరేషన్లకు అదనంగా నిధుల కేటాయింపు.
ఇదీ పథకం..
ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే పేద డ్రైవర్లకు ‘వైఎస్సార్ వాహన మిత్ర’ ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ఏటా వారికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేస్తారు. ఈ డబ్బును వాహనాల ఫిట్‌నెస్, బీమా, మరమ్మతుల కోసం వినియోగించుకోవచ్చు.
అడగకుండానే ఆదుకుంటున్నారు..
కరోనా కారణంగా పనుల్లేక, క్యాబ్‌లు తిప్పేందుకు వీల్లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేం అడగకుండానే ఈ ఏడాదికి గాను నాలుగు నెలలు ముందుగానే రూ.10 వేల సాయం అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుంది. గతేడాది అందించిన ఆర్థిక సాయంతో వాహనాలకు బీమా, ఫిట్‌నెస్, మరమ్మతులు చేయించుకున్నాం.
– మహేష్, క్యాబ్ డ్రైవర్, విజయవాడ
కరోనా నేపథ్యంలో ముందుగానే సాయం
కోవిడ్–19 పరిస్థితి దృష్ట్యా ఉపాధి లేక క్యాబ్, ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది. వీరిని ఆదుకునేందుకే నాలుగు నెలలు ముందుగా సాయం అందించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. మామూలుగా అయితే అక్టోబర్, నవంబర్ నెలల్లో సాయం అందించాల్సి ఉంది. ఏడాదిలోగానే సాయం అందించి ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు మేలు చేస్తున్నాం.
– పీఎస్సార్ ఆంజనేయులు, రవాణా శాఖ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment