శాలిగౌరారం : ఇటుకులపహాడ్ సరిహద్దులో ప్రభుత్వ క్వారీలో నిల్వ ఉన్న ఇసుక కుప్పలు
శాలిగౌరారం (తుంగతుర్తి) : శాలిగౌరారం మండలంలోని ఉప్పలంచ, మనిమద్దె, గురుజాల, తుడిమిడి, చిత్తలూరు, వంగమర్తి, ఇటుకులపహాడ్ గ్రామాల సరిహద్దు వెంట మూసీనది ఉంది. ఈ మూసీనదిపై శాలిగౌరారం, నకిరేకల్, కేతేపల్లి, సూర్యాపేట, అర్వపల్లి మండలాల సరిహద్దులో మూసీప్రాజెక్టు నిర్మితమై ఉంది. ప్రాజెక్టు మండలంలోని ఇటుకులపహాడ్, వంగమర్తి గ్రామాల వరకు విస్తరించి ఉంది. మూసీ ప్రాజెక్టులోకి ఇసుకవచ్చి చేరడంతో ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం తగ్గుతోంది.
దీంతో రాష్ట్ర ఖనిజాభివృద్ధి శాఖ అధికారులు ప్రాజెక్టులో నీటినిల్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు పేరుకుపోయిన ఇసుకను తొలగించేందుకు డీ షిల్టింగ్ (పూడికతీత) పేరుతో ఇసుక క్వారీని ఏర్పాటు చేశారు. మూసీ ప్రాజెక్టు పరిధిలో ఇటుకులపహాడ్‌కు సంబంధించిన సరిహద్దులో 4.93 లక్షల క్యూబిక్‌మీటర్ల ఇసుకను పూడికతీసేందుకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ టెండర్లను కోరగా సుమారు 20 మంది ఇసుక కాంట్రాక్టర్లు టెండర్లను దాఖలు చేశారు. దీంతో పోటీ ఎక్కువ కావడంతో డ్రా పద్ధతిలో చేపట్టిన టెండర్ ఖరారులో ఖమ్మం జిల్లాకు చెందిన చారి ట్రాన్స్‌పోర్ట్స్ ఈ టెండర్ దక్కించుకుంది.
రెండు సంవత్సరాలు అగ్రిమెంట్..
మూసీప్రాజెక్టు పరిధిలో ఇసుకను పూడికతీసేందుకు ప్రభుత్వం నిర్వహణదారుడికి రెండు సంవత్సరాల గడువును ఇచ్చింది. గడువు ప్రకారం నవంబర్–2017 నుంచి అక్టోబర్–2019 వరకు 4.93 లక్షల క్యూబిక్‌మీటర్ల ఇసుకను పూడికతీయాలి. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం ఉండడంతో పూడికతీత పనులు 28 మార్చి 2018న ప్రారంభమయ్యాయి. పూడికతీసిన ఇసుకను ప్రాజెక్టు నుంచి ప్రభుత్వం అతి సమీపంలో ఏర్పాటు చేసిన ఇసుకరీచ్ (స్టాక్‌పాయింట్)కు చేరవేయాలి. అనంతరం స్టాక్‌పాయింట్ నుంచి టీఎస్‌ఎండీసీ (తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ద్వారా చలానా పొందిన వాహనాలలో తిరిగి ఇసుకను నింపాలి. దీనంతటికీ ఇసుక పూడికతీత నిర్వాహణదారుడికి ప్రభుత్వం రాష్ట్ర ఖనిజా భివృద్ధి సంస్థ క్యూబిక్‌మీటర్‌కు రూ.75 చెల్లిస్తుంది.
రూ.75లకు క్యూబిక్‌మీటరు ఇసుక పూడికతీత సాధ్యమేనా..?
ఇసుక పూడితతీతో పాటు ప్రాజెక్టులోకి వెళ్లేందుకు కావలసిన రోడ్లు, పూడికతీసిన ఇసుకను స్టాక్‌పాయింట్‌కు తరలించడం, అక్కడి నుంచి కొనుగోలు చేసిన వాహనాల్లో లోడు చేయడం వరకు నిర్వాహకుడిదే బాధ్యత. ఈ పనులన్నీ చేస్తే. కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం చెల్లించేది.. 10 క్యూబిక్‌మీటర్లకు రూ.750. ఈ మొత్తంతో.. ఈ పనులన్నీ అసాధ్యం. తీవ్ర నష్టం వస్తుంది. అయినా నిర్వాహణ దారులు పోటీ పడుతున్నారంటే అసలు ‘మతలబు’ ఇక్కడే ఉంది.
నిబంధనలకు తూట్లు..
మండలంలోని ఇటుకులపహాడ్‌లో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇసుకక్వారీ అక్రమాలకు నిలయంగా మారింది. అదనపు వసూళ్ల కోసం సంబంధిత ఇసుక పూడికతీత నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వాహనాల్లో అదనపు ఇసుకను నింపి రోజుకు రూ.లక్షల్లో అక్రమ వసూళ్లకు పాల్పడున్నట్లు తెలుస్తోంది. ఇసుక రవాణాదారుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తూ ప్రతి లారీలో అనుమతి (పాసింగ్)కి మించి అదనంగా 10 నుంచి 15 టన్నుల వరకు నింపుతున్నట్లు సమచారం. ఇసుక రవాణాదారులు ఆన్‌లైన్‌లో నిర్ణీత పాసింగ్‌కు సంబంధించి డబ్బులు చెల్లించి వచ్చిన తర్వాత ఆన్‌లైన్ పద్ధతిలో పొందిన చలానా ప్రకారం లారీలలో ఇసుకను నింపాల్సి ఉంటుంది.
కానీ ఇసుక పూడికతీత నిర్వాహణదారులు లోడింగ్ సమయంలో నిర్ణీత ఇసుకను మించి నింపుతూ క్యూబిక్‌మీటర్ ఇసుకకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో లారీలో కనిష్టంగా 10 గరిష్టంగా 20 క్యూబిక్‌మీటర్ల ఇసుకను నింపుతున్నట్లు తెలుస్తోంది. ఇటుకులపహాడ్ ఇసుకరీచ్ వద్దనుంచి ప్రస్తుతం రోజుకు సగటున 600 క్యూబిక్‌మీటర్ల ఇసుక లోడింగ్ సామర్థ్యం కలిగి ఉండటంతో సుమారు 60 లారీల ఇసుక తరలివెళ్తోంది. దీంతో లారీకి రూ.10 నుంచి 15 వేలు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ రోజుకు రూ.6 లక్షల వరకు అక్రమ ఆదాయాన్ని పొందుతున్నట్లు సమాచారం.
ఈవిధంగా నెలకు రూ.1.80 కోట్లు సంపాదిస్తున్నారు. ప్రభుత్వం క్యూబిక్‌మీటర్‌కు చెల్లించే రూ.75తో మొత్తం 4.93 లక్షల క్యూబిక్‌మీటర్లలో పూడికతీత జరిగితే పూడికతీత నిర్వాహణదారునికి వచ్చేది కేవలం రూ.3.69 కోట్లు. అంటే రెండు నెలల్లో వచ్చే అదనపు ఆదాయానికి సమానం. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇసుక కాంట్రాక్టర్లకు ‘పెద్దల మద్దతు’ పుష్కలంగా ఉండడం, పరోక్షంగా వారి ప్రమేయాలతోనే పనులు జరుగుతుండటం అందుకు నిదర్శనమనేదే ప్రజల వాదన.
నిద్రావస్థలో నిఘా అధికారులు..
ప్రభుత్వ ఇసుక రీచ్‌ల వద్ద రోజుకు లక్షల రూపాయల ఇసుక అక్రమంగా తరలి వెళ్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు. అక్రమ రవాణాను నిరోధించాల్సిన సంబంధిత అధికారులు నిద్రావస్థలో ఉంటున్నారనే ప్రజల వాదనను కొట్టివేయలేని పరిస్థితి. ఇసుక లారీలు సామర్థ్యానికి మించి వెళ్తున్నా.. పట్టించుకునే నాధుడు లేడు. తనఖీలు చేయాల్సిన మైనింగ్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇటువైపు కన్నెత్తికూడా చూడకపోవడం ఇసుక క్వారీల నుంచి అక్రమ రవాణాకు ఆజ్యం పోస్తోంది. ఇదిలా ఉండగా ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన అధికారుల నిత్య పర్యవేక్షణలో ఇసుక క్వారీ కొనసాగాల్సి ఉండగా ప్రస్తుతం సంబంధిత ప్రాజెక్టు అధికారి పోస్టు భర్తీకాకపోవడం అక్రమాలకు అడ్డులేకుండా పోయింది.
ఇసుకరీచ్ పర్యవేక్షిస్తున్న మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ అనారోగ్యంతో కొద్ది రోజులుగా సెలవులో ఉండడం ఇసుకరీచ్‌పై పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. ఎవరైన ఇసుక అక్రమ రవాణపై అధికారులకు సమాచారమిస్తే ఆ విషయాన్ని వెంటనే అక్రమార్కులకు చేరవేయడం, తనఖీకి వచ్చే పూర్తి వివరాలను వారికి వెల్లడించడంతో అక్రమార్కులు అప్రమత్తం కావడం సాధారణంగా మారింది. దీంతో పిల్లిమెడలో గంటకట్టి ఎలుకల వేటకు పంపినట్లుగా అధికారుల తీరు మారిందంటూ ప్రజలు బావించడం గమనార్హం.
ఇసుకలారీలకు పాసింగ్ పరిమితి ఇది..
ఇసుకను తరలించే వాహనాలకు ప్రభుత్వ రవాణా శాఖ నిర్ణీత బరువును నిర్ణయించింది. అందులో ఆరుచక్రాల వాహనంలో 7 క్యూబిక్‌మీటర్లు (10.50 మెట్రిక్‌టన్నులు), 10 చక్రాల వాహనంలో 10.50 క్యూబిక్‌మీటర్లు (17 మెట్రిక్‌టన్నులు), 12 చక్రాల వాహనంలో 13.50 క్యూబిక్‌మీటర్లు (22 మెట్రిక్ టన్నులు), 14 చక్రాల వాహనంలో 17 క్యూబిక్‌మీటర్లు (27 మెట్రిక్‌టన్నులు) ఇసుకను తరలించేందుకు అనుమతి ఉంటుంది. కానీ ఇసుకలారీలు అందుకు రెట్టింపు బరువుతో కూడిన ఇసుకను తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయి.
ధ్వంసమైన రోడ్లు.. పెరుగుతున్న ప్రమాదాలు
సామర్థ్యానికి మించి రెట్టింపు బరువుతో ఇసుకలారీలు ప్రయాణించడంతో మండలంలోని ఇటుకులపహాడ్–నకిరేకల్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. జాతీయ రహదారి–365 పనులు కూడా జరుగుతుండటంతో ఇసుకలారీలు ఎదురు వచ్చినప్పుడు ఇతర వాహనాలు రోడ్డు దిగేక్రమంలో ప్రమాదాలబారిన పడుతున్నాయి. ప్రత్యేకించి మాధరంకలాన్–ఇటుకులపహాడ్ రోడ్డు పూర్తిగా ధ్వంసమై వాహనాల రాకపోకలకు వీలులేకుండా మారింది.
నిబంధనల ప్రకారమే ఇసుకరీచ్‌ను నిర్వహిస్తున్నాం
ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనల ప్రకారమే ఇసుక క్వారీని నడుపుతున్నాం. ఇసుకరీచ్ వద్ద ఆన్‌లైన్‌లో చెల్లించిన చలానా ప్రకారమే లారీల్లో ఇసుకను నిం పుతున్నాం. ఆన్‌లైన్ చలానా లేకుంటే రీచ్‌వద్దకు లారీలను అనుమతించడంలేదు. ఇసుక లోడింగ్‌లో అక్రమాలకు తావులేకుండా పర్యవేక్షణ జరుపుతున్నాం. – హరిప్రసాద్, ఇసుక క్వారీ అధికారి
వేబిల్ లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు
ప్రభుత్వ ఇసుక క్వారీవద్ద నుంచి వేబిల్ లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకుంటాం. ఇసుకను తరలించే వాహనదారులు ఆన్‌లైన్‌లో చలానాలు చెల్లించి వేబిల్ ప్రకారం నిర్ణీత సమయంలో మాత్రమే ఇసుకను తరలించాలి. వేబిల్ లేకున్నా, సమయం దాటినా లేక ఓవర్‌లోడ్‌తో వెళ్లినా సంబంధిత లారీలను పట్టుకుని సీజ్‌చేస్తాం. – శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్, శాలిగౌరారం
Comments
Please login to add a commentAdd a comment