ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్చే శాఖల్లో ప్రధానమైనది రవాణా శాఖను చెప్పుకోవచ్చు. ఏటా ఈ శాఖ ద్వారా కోట్లాది రూపాయలు సర్కార్‌కు ఆదాయ రూపంలో సమకూరుతాయి. అయితే ఇటీవల ఎదురైన పరిణామాల వల్ల ఆ శాఖ చుక్కానిలేని నావలా తయారైంది. పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులెవరూ లేక పోవడంతో దిగువస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో వ్యవస్థ గాడి తప్పుతోందన్న విమర్శలు వస్తున్నాయి.
శ్రీకాకుళం టౌన్: జిల్లాలో రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో పనిచేస్తోంది. గతంలో ఆర్టీవో స్థాయి అధికారి పర్యవేక్షించే శాఖను పదేళ్లక్రితం స్థాయి పెంచుతూ ప్రభుత్వం ఇక్కడ డిప్యూటీ కమిషనర్‌ను పర్యవేక్షణకు నియమించిం ది. అయితే ఇటీవల ఈశాఖ ఉద్యోగులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో పాటు ఇక్కడ పనిచేస్తున్న, గతంలో పనిచేసి ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన అధికార్లపై అవినీతి నిరోధకశాఖ దృష్టి సారించింది. దీంతో ఆ శాఖ ఉద్యోగుల్లో గుబులు మొదలైంది.
దీర్ఘకాలిక సెలవుపై డీసీ శ్రీదేవి
జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న శ్రీదేవి మూడు రోజుల క్రితమే సెలవుపై వెళ్లారు. ఇక్కడ పరిస్థితులను చక్కదిద్దలేనని భావించిన ఆమె వ్యక్తిగత కారణాలు చూపుతూ జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం వద్ద సెలవు కోసం అభ్యర్థించారు. తన కుమారుని ఆరోగ్యకారణాల రీత్యా స్వస్థలానికి వెళ్లాలని కారణం చూపిన ఆమె కలెక్టర్‌కు ఇక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా వివరించి సెలవు కావాలని అభ్యర్థించడంతో సెలవు మంజూరు చేశారు. అయితే ఓవైపు ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు అవినీతికి పరాకాష్టగా మారడంతో వారిని కట్టడి చేయలేని పరిస్థితిలోనే ఆమె సెలవుపై వెళ్లినట్టు వదంతులు వస్తున్నాయి.
- ఇప్పటికే బదిలీపై వెళ్లిన ఆర్టీవో
జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ తరువాత కేడరులో ఆర్టీవో పర్యవేక్షిస్తారు. ఇక్కడ ఆర్టీవోగా పనిచేసిన కృష్ణయ్య కూడా గత ఏడాది ఆగస్టులో బదిలీపెవైళ్లి పోయారు. ఆతర్వాత ఈ పోస్టులో ఎవరూ నియమితులు కాలేదు. అప్పటినుంచి ఖాళీగా ఉన్న పోస్టులో చేరేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఆ సీటు పర్యవేక్షణ బాధ్యతలు చూసేవారు. ఆమె కూడా సెలవుపై వెళ్లడంతో ఈ సీటు ఇప్పుడు ఖాళీ గానే ఉంది.
అరెస్టయిన బాలానాయక్
జిల్లా రవాణా శాఖలో డిప్యూటీ కమిషనర్, ఆర్టీవో తర్వాత సీనియర్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న బాలానాయక్ ప్రస్తుతం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కారు. ఆయన ప్రస్తుతం అరెస్టయి విశాఖ జైల్లో ఉన్నారు. ఆయన ఇంకా బెయిల్‌పై విడుదల కాలేదు. ఉన్నతాధికార్ల సీట్లతో పాటు సీనియర్ ఇన్‌స్పెక్టరు సీటు కూడా ఖాళీగానే ఉండడంతో ఆ శాఖలో అధికార్ల పర్యవేక్షణ కొరవడింది. దీనికితోడు మరో ఇన్‌స్పెక్టర్ రాంకుమార్ కూడా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉండడంతో ఆ కార్యాలయానికి ఇప్పుడు నాథుడే కరవయ్యారు. పర్యవేక్షణ బాధ్యతల్లో ఎవరూ లేక పోవడంతో అక్కడ పనులన్నీ స్తంభించి పోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఆ శాఖ పర్యవేక్షణ బాధ్యతలు ఎవరూ చేపడతారో వేచి చూడాలి.
రవాణా శాఖకు ఏసీబీ గుబులు !
Published Mon, Jan 4 2016 1:03 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement