
సాక్షి, అమరావతి: కళ్లెదుట ఎవరైనా రాంగ్ రూట్‌లో వస్తున్నా, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నా, హెల్మెట్, సీటు బెల్టు లేకుండా వాహనం నడుపుతున్నా, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నా ఏమీ చేయలేకపోతున్నామని చాలా మంది బాధపడుతుంటారు. ఇకపై ఇలా బాధపడనక్కర్లేదు. మీ చేతిలోని స్మార్ట్ ఫోన్‌తో ఒక్క ఫొటో క్లిక్ మనిపించి.. దాన్ని రవాణా శాఖకు అందుబాటులోకి తీసుకురానున్న ఫోన్ నంబర్‌కు వాట్సప్ చేస్తే చాలు. ఆ వెంటనే రవాణా శాఖ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు రంగంలోకి దిగి వారి భరతం పడతారు. రాష్ట్రంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారికి పౌర భాగస్వామ్యంతో ముకుతాడు వేసేందుకు రవాణా శాఖ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా 95428 00800 వాట్సప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్రంలో ఎక్కడైనా ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణకు పాల్పడేవారి ఫొటోల్ని ప్రజలు ఈ వాట్సాప్ నంబర్‌కు పంపితే చాలు. అయితే ఇలా పంపే ఫొటోలో వాహన నంబర్ స్పష్టంగా కనిపించేలా జాగ్రత్త వహించాలి.
ఈ ఫొటోలను రవాణా శాఖ ఎన్‌ఫోర్సుమెంట్ బృందాలు పరిశీలించి, వాహన నంబర్ ఆధారంగా వాహనదారుడి అడ్రస్‌కు నేరుగా చలానా పంపుతాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ఫొటోల్ని ఆయా జిల్లాల రవాణా శాఖ అధికారులకు పంపి ఉల్లంఘనులకు ముకుతాడు వేస్తారు. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించేందుకు జిల్లాలవారీగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి లైసెన్సు రద్దు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాతో కూడిన చలానాలు నేరుగా ఇంటికే రానున్నాయి. ప్రజలను నేరుగా భాగస్వాములను చేయడం ద్వారా ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణకు పాల్పడేవారికి అడ్డుకట్ట వేయడం సులభతరమవుతుందని రవాణా శాఖ ఆశిస్తోంది. ఈ విధానంపై అధికారులకు సూచనలు చేసినట్లు రవాణా శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. (చదవండి: ట్రాఫిక్ ఉల్లం‘ఘనుల’ ఆటలు చెల్లవిక)
Comments
Please login to add a commentAdd a comment