మనం సేవకులం: సీఎం జగన్‌ | YS Jaganmohan Reddy review with District Collectors and SPs in Video Conference | Sakshi
Sakshi News home page

మనం సేవకులం: సీఎం జగన్‌

Published Thu, Sep 12 2019 4:16 AM | Last Updated on Thu, Sep 12 2019 2:59 PM

YS Jaganmohan Reddy review with District Collectors and SPs in Video Conference - Sakshi

సాక్షి, అమరావతి: ‘వినతులు ఇచ్చే ప్రజల పట్ల కొందరు సిబ్బంది సవ్యంగా ప్రవర్తించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి.. ఇలాంటి వాటిని సహించేది లేదు.. ప్రజలు ఓట్లు వేస్తేనే మనం ఈ స్థాయికి వచ్చాం.. మనం సేవకులమే కాని, పాలకులం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టీకరించారు. ‘స్పందన’ కార్యక్రమంపై బుధవారం ఆయన సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్పందనలో వచ్చిన వినతులను సీరియస్‌గా తీసుకోవాలని కింది స్థాయి అధికారులందరికీ చెప్పాలని సూచించారు.

సరిగా స్పందించని కేసులు 2 నుంచి 5 శాతం వరకు ఉన్నాయన్నారు. వినతులు, సమస్యలు నివేదించే వారిని చిరునవ్వుతో ఆహ్వానించాలని, కలెక్టర్లు.. అధికారులకు ఈ విషయాలన్నీ తెలిసినవేనని అన్నారు. అయితే పని భారం వల్లో, మరే ఇతర కారణాలవల్లో ఇలాంటివి తలెత్తవచ్చునని, మరోసారి అలాంటి పొరబాట్లు జరగకుండా పరిశీలన చేసుకోవాలన్నారు. స్పందన కార్యక్రమం స్ఫూర్తి తగ్గకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. గొప్ప ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్న విషయాన్ని మరిచిపోవద్దని, అలసత్వం వహించవద్దని పేర్కొన్నారు. ఆ మేరకు యంత్రాంగాన్ని చురుగ్గా పని చేయించాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని, ఈ విషయంలో దిగువ స్థాయి అధికారులకు మార్గ నిర్దేశం చేయాలని చెప్పారు. 

ప్రతి చర్యలో మానవత్వం కనిపించాలి
‘స్పందన’లో సమస్యలు పరిష్కరించుకున్న వారిలో 59 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని, మిగిలిన 41 శాతం మంది మరింత మెరుగ్గా సమస్యలను పరిష్కరించవచ్చనే అప్రాయాన్ని వ్యక్తం చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. వీరికి రాండమ్‌గా కాల్‌ చేసి అభిప్రాయాలు స్వీకరించామని చెప్పారు. ఈ విషయంలో జిల్లాల నుంచి ఎంపిక చేసిన కొంతమంది అధికారులను పిలిపిస్తామని, వినతుల్లో భాగంగా ఇచ్చిన సమాధానాలను వారికే చూపిస్తామన్నారు.

ఏ తరహా సమాధానాలు ఇచ్చారో చూపించి వర్క్‌షాపు నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మార్వో, ఎంపీడీఓ, మున్సిపల్‌ కమిషనర్లు, కలెక్టర్లు.. అందర్నీ పిలిపించి ఈ తరహా ప్రక్రియ చేపడతామని చెప్పారు. మానవత్వం అనేది ప్రతి చర్యలో, ప్రతి అక్షరంలో కనిపించాలని, లేకపోతే వ్యవస్థ ఎందుకు నడుస్తుందో.. అర్థంకాని పరిస్థితి వస్తుందన్నారు. దీనిపై కలెక్టర్లు.. ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లతో మాట్లాడాలని ముఖ్యమంత్రి సూచించారు. వర్షాల కారణంగా జ్వరాలు వస్తున్నాయని, వీటిపై ఆరోగ్య శాఖ, పారిశుద్ధ్య విభాగాలు దృష్టి పెట్టాలని.. ఆస్పత్రులు, ఇతర ప్రాంతాల్లో కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్ల కోసం హెల్ప్‌ డెస్క్‌లు
సొంతంగా ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇచ్చే పథకానికి సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు కలెక్టర్లకు మార్గదర్శకాలను వివరించారు. వాహన యజమాని భార్య అయినా, భర్త అయినా పర్వాలేదని, దరఖాస్తులు ఇవ్వడానికి ఆఖరు తేదీ సెప్టెంబరు 25గా నిర్ణయించామని, సెప్టెంబర్‌ 30 లోగా వెరిఫికేషన్, అప్‌ లోడింగ్‌ పూర్తి చేస్తామని కృష్ణబాబు పేర్కొన్నారు.

దరఖాస్తుదారులకు సౌకర్యం కోసం రవాణాశాఖ కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశామని, దరఖాస్తులు స్వీకరించేటప్పుడు లబ్ధిదారులను ఇబ్బంది పెట్టకుండా వీలైనన్ని కౌంటర్లు పెట్టాలని చెప్పారు. విశాఖ, విజయవాడల్లో ఆటోలు, ట్యాక్సీలు ఎక్కువ కాబట్టి.. అక్కడ ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్లుకు సూచించారు. మీ సేవ ద్వారా కూడా దరఖాస్తులు ఇచ్చే అవకాశం ఉందని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నెట్‌ సదుపాయం ఉంటే ఎక్కడి నుంచైనా దరఖాస్తు నింపవచ్చనని, మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా కూడా దరఖాస్తు చేయొచ్చని అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తులు ఆమోదం పొందగానే అక్టోబరు 4 నుంచి డబ్బులు పంపిణీ చేయాలని, అక్టోబరు 5న రశీదులను వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. 

ఇళ్ల స్థలాల పంపిణీపై దృష్టి సారించండి
ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి కొత్త పింఛన్లు, కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. అక్టోబర్‌లో ప్రారంభం కానున్న వైఎస్సార్‌ కంటి వెలుగుపై జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు. ఈ విషయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఈ కార్యక్రమం వల్ల కలెక్టర్లు, అధికారుల పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి జిల్లాలో కనీసం 2 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని, ఇన్ని లక్షల మంది జీవితాలను మార్చే అవకాశం ఉన్నందున దీనిపై అందరూ ఫోకస్‌ పెట్టాలని కలెక్టర్లను కోరారు.

రాష్ట్రంలోని 1,45,72,861 కుటుంబాలకు గాను 1,21,62,651 ఇళ్లలో వలంటీర్లు వెరిఫికేషన్‌ పూర్తి చేశారని, ఈ వారంతో  పూర్తి స్థాయిలో పూర్తవుతుందని, ఇప్పటి వరకు 23,83,154 మంది ఇళ్ల స్థలాల కోసం లబ్ధిదారులుగా గుర్తించామని అధికారులు సీఎంకు వివరించారు. పట్టణ ప్రాంతాల్లో 3,772 ఎకరాలు, గ్రామీణ ప్రాంతాల్లో 25,822 ఎకరాలు అందుబాటులో ఉందని చెప్పారు. అన్నీ పూర్తయ్యాక తుది గణాంకాలు నివేదిస్తామని అధికారులు తెలిపారు. అక్టోబరు 15 నుంచి వైఎస్సార్‌ రైతు భరోసా అమలు చేస్తున్నామని, అర్హత ఉన్న వారందరికీ పారదర్శకంగా ఈ పథకం అందేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. 

వరదలు తగ్గగానే అందుబాటులోకి ఇసుక రీచ్‌లు
వరదల కారణంగా ఇసుక రీచ్‌లు నిర్వహించడానికి ఇబ్బంది కలిగిందని, వరదలు తగ్గగానే ఇసుక రీచ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. స్టాక్‌ యార్డుల్లో నిల్వలు పెంచేలా చూడాలన్నారు. ఇసుకలో మాఫియా, దోపిడీ లేకుండా చేశామని, వీలైనంత తక్కువ రేటుకు పారదర్శకంగా ఇసుక పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కొరత కారణంగా పండ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు పడుతున్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. వరదలు తగ్గగానే చురుగ్గా ఇసుకను అందుబాటులోకి తెస్తామని కలెక్టర్లు తెలిపారు. ప్రతి కలెక్టరేట్‌లో ఎక్స్‌ సర్వీస్‌ మెన్, దివ్యాంగుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు.

వీలైతే ఆయా సంఘాలకు చెందిన ప్రతినిధులను ఆ విభాగంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో రూ.5 వేల ప్రత్యేక సహాయంపై సీఎం ఆరా తీశారు. ప్రభుత్వ ఉత్తర్వులు అందాయని, వెంటనే పంపిణీ ప్రారంభిస్తామని ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లో మళ్లీ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. కృష్ణా వరదలపై కూడా సీఎం ఆరా తీయగా విజయవాడ నగరంలో పునరావాస శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement