వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తాను: సీఎం జగన్‌ | AP CM Jagan To Tour Flood hit Areas Video Conference With Collectors | Sakshi
Sakshi News home page

నేనే వస్తా.. సహాయ పునరావాస కార్యక్రమాల తీరును పరిశీలిస్తా: కలెక్టర్లతో సీఎం జగన్‌

Published Thu, Aug 3 2023 4:44 PM | Last Updated on Thu, Aug 3 2023 8:20 PM

AP CM Jagan To Tour Flood hit Areas Video Conference With Collectors - Sakshi

సాక్షి, గుంటూరు: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఖరారు అయ్యింది. ఆగష్టు 7, 8 తేదీల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. వరద ప్రభావిత జిల్లాలైన అల్లూరిసీతారామరాజు, ఏలూరు, ప.గో, తూ.గో, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారాయన. ఈ సందర్భంగా.. సహాయ, పునరావాస కార్యక్రమాలు సమర్థవంతంగా జరగాలని  కలెక్టర్లను ఆదేశించారాయన. 

‘‘ఎక్కడా కూడా విమర్శలకు తావులేకుండా చూడాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపత్తుల సమయంలో కలెక్టర్లు సహా, అధికారులకు ముందస్తుగా నిధులు విడుదల చేస్తున్నాం. అవసరమైన వనరులను సమకూరుస్తూ మిమ్మల్ని ఎంపవర్‌ చేస్తున్నాం. టిఆర్‌-27 నిధులను సకాలంలో విడుదల చేస్తున్నాం.  సహాయ, పునరావాస చర్యలు సమర్థవంతంగా చేపట్టేలా అన్నిరకాలుగా ప్రభుత్వం తోడుగా నిలిచింది. దీనితర్వాత, ఈ పనులు చేయడానికి కొంత సమయం ఇస్తున్నాం. ఆ తర్వాత నేను స్వయంగా వచ్చి ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో మీరు సహాయ పునరావాస కార్యక్రమాలు ఏరకంగా చేపట్టారో స్వయంగా పరిశీలిస్తున్నాను. బాధితులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నాను. ఈసారికూడా నేను వస్తాను, క్షేత్రస్థాయిలో మీరు చేపట్టిన చర్యలు, అందించిన సహాయంపై సమీక్ష చేస్తాను అని ఆయన అధికారులకు తెలిపారు. 

ఉదారంగా వ్యవహరించండి
వరద సహాయ కార్యక్రమాల్లో ఉదారంగా వ్యవహరించండి. మనం ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలాంటి సహాయం కోరుతామో అలాంటి సహాయమే అందించాలి. ఇంట్లోకి వరదనీరు వచ్చినా, అలాగే వరద కారణంగా సంబంధాలు తెగిపోయిన వారికి కచ్చితంగా నిర్ణయించిన రేషన్‌ అందించాలి. దీంతోపాటు తాగునీరు కూడా అందించాలి. ఈ సహాయం అదని వరద బాధిత కుటుంబం ఉండకూడదు. సహాయ శిబిరాల్లో ఉండి, వారు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2000, వ్యక్తులైతే రూ.1000లు ఇచ్చి పంపించాలి. కలెక్టర్లు బాగా చూసుకున్నారనే మాట వినిపించాలి అని అధికారులతో సీఎం జగన్‌ అన్నారు. 

వరద కారణంగా కచ్చా ఇల్లు పాక్షికంగానైనా, పూర్తిగా నైనా ధ్వంసం అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ వర్గీకరణ చేయొద్దు. వారందరికీ కూడా రూ.10 వేలు చొప్పున సహాయం అందించాలి. వరదనీరు తగ్గగానే పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగించండి. మిగిలిన ప్రాంతాలనుంచి వరద బాధిత ప్రాంతాలకు పారిశుద్ధ్య కార్మికులను తరలించండి. వైద్యశిబిరాలను కొనసాగించండి పీహెచ్‌సీల్లో, విలేజ్‌ క్లినిక్స్‌లో సరిపడా మందులు ఉండేలా చూసుకోండి. పాముకాట్లకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచేలా చూసుకోండి. పంట నష్టం, ఆస్తి నష్టంపై వెంటనే ఎన్యుమరేషన్‌చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌కోసం జాబితాను ఉంచండి. అత్యంత పారదర్శకంగా పంటనష్టానికి, ఆస్తి నష్టానికి సంబంధించిన పరిహారం అందించండి. 

► అవసరమైన చోట వెంటనే కొత్త ఇళ్లను మంజూరు చేయండి. ఏటిగట్లమీద ఉన్నవారికి పక్కా ఇళ్లను మంజూరు చేయండి. వరద వచ్చిన ప్రతిసారి వారు ఇబ్బందిపడకుండా… వారికోసం ఇళ్లను మంజూరుచేయాల్సిన బాధ్యత కలెక్టర్లది. అలాంటి ప్రమాదకర ప్రాంతాల్లో ఉండేవారికి రక్షిత ప్రాంతంలో ఇళ్లు ఇవ్వాలి. వారికి శాశ్వతంగా పరిష్కారం చూపాల్సిన బాధ్యత మనది. అవసరమైన స్థలాన్ని సేకరించి, వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లను మంజూరు చేయండి. పోలవరం ఎగువన తరచుగా ముంపునకు గురయ్యే ప్రాంతాలకు ఆర్‌ అండ్‌ ఆర్‌ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇవ్వండి. పశువులకు గ్రాసం కొరతలేకుండా చూడండి. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు… తదితర నిర్మాణాల విషయంలో వెంటనే మరమ్మతులు చేపట్టాలి. వరద బాధిత ప్రాంతాల్లో రక్షిత తాగునీటి సరఫరాను కొనసాగించాలి. పరిస్థితి మెరుగుపడేంతవరకూ వారికి రక్షిత తాగునీటిని అందించాలి. 

► సోమ, మంగళవారాల్లో నేను వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తాను. వరద బాధిత ప్రాంతాలకు నేను వచ్చినప్పుడు ఈ అంశాలకు సంబంధించి ఎవ్వరూ కూడా ఫిర్యాదులు చేయకూడదు. నేను ఎక్కడకు వచ్చేదీ కొన్ని ఆదివారం సాయంత్రం సీఎంవో అధికారులు మీకు వెల్లడిస్తారు. క్షేత్రస్థాయిలో వరద బాధితులకు అందిన సహాయ, పునరావాసం కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తాను అని కలెక్టర్లతో పేర్కొన్నారాయన.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement