సాక్షి, అల్లూరి: వరద బాధితులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసుకున్నామని, పోలవరం నిర్వాసితులకే న్యాయం చేశాకే పోలవరంలో నీళ్లు నింపుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం కోయుగూరులో వరద బాధితులతో సీఎం జగన్ పరామర్శ కొనసాగింది.
చింతూరులో దాదాపుగా 20 రోజుల నుంచి మొదటి ప్రమాదపు ఘంటికపైనే దాదాపుగా ఇన్నిరోజులు నీళ్లు ఉన్న పరిస్థితులు చూడలేదు. నాలుగు మండలాల్లో కలెక్టర్ 20 రోజుల పాటు ఉన్నారు. కలెక్టర్, అధికారులు, వలంటీర్లు.. ఇక్కడే ఉండి పరిస్థితి సమీక్షించడం అభినందనీయం.
సహాయం అందరికీ అందాలనే తాపత్రయం.. గతంలో కన్నా పరిస్థితిలో ఎంతో మారిందని సీఎం జగన్ చెప్పారు. పారదర్శకంగా బాధితులకు పరిహారం అందించాం. అందరికీ రేషన్, ఇంటింటికీ రూ. 2 వేలు అందించాం. అధికారులను భాగస్వామ్యం చేసి.. కావాల్సిన వనరులు సమకూర్చాం అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అందరికీ సహయం, అన్ని సౌకర్యాలు అందాయని నిర్వాసితులు తెలిపారు.
ఎగ్గొట్టే ప్రభుత్వం కాదు.. ఆదుకునే ప్రభుత్వం
ఎవరికి, ఎలాంటి వరద నష్టం జరిగినా సరే.. గ్రామ సచివాలయంలో లిస్ట్‌లో ఉంటుందని, నష్టం వివరాలు ఏమైనా ఉంటే పేరు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని సీఎం జగన్ స్పష్టం తెలియజేశారు. అర్హత ఉన్న అందరికీ రెండు నెలల్లోగా పరిహారం అందుతుందని, ఎలా ఎగ్గొట్టాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉండబోదని పేర్కొన్నారు సీఎం జగన్. తాటాకు గుడిసెల నిర్వాసితులకు పరిహారం రూ. ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.
పోలవరం ముంపు బాధితుల విషయంలో కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు గనుక రాకపోతే.. భారం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, సెప్టెంబర్ లోగా పోలవరం ముంపు బాధితులకు పరిహారం అందిస్తామని, నిర్వాసితులకు పరిహారం అందాకే.. పోలవరంలో నీళ్లు నింపుతామని సీఎం జగన్ తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం.. నిర్వాసితులను ఆదుకుంటాం అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment