రాంగ్‌ రూట్‌ | Driving Schools Training With Old Cars In PSR Nellore | Sakshi
Sakshi News home page

రాంగ్‌ రూట్‌

Published Tue, Sep 4 2018 12:39 PM | Last Updated on Tue, Sep 4 2018 12:39 PM

Driving Schools Training With Old Cars In PSR Nellore - Sakshi

డ్రైవింగ్‌ స్కూళ్ల యాజమాన్యాలు వినియోగిస్తున్న పాత అంబాసిడర్‌ కార్లు

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. కొత్త మోడళ్లకుఅనుగుణంగా డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వాల్సిన డ్రైవింగ్‌ స్కూళ్లుదారితప్పుతున్నాయి. భారీగా ఫీజులు వసూలు చేస్తూ పాతవాహనాల్లో శిక్షణ ఇస్తున్నాయి.శిక్షణ కోసం అనుమతితీసుకునేది ఒక్కదానికే..బ్రాంచ్‌ల పేరుతో ఇష్టారాజ్యంగా కేంద్రాలను పెంచుకుంటూ నిబంధనలకు తూట్లు పొడుస్తూ రాంగ్‌రూట్లో పయనిస్తున్నాయి. ఈ స్కూళ్లనుపర్యవేక్షించాల్సిన అధికారులు కన్పించరు. పదేళ్లుగా డ్రైవింగ్‌ స్కూళ్లపై ఒక్కటంటే ఒక్క కేసు నమోదు కాలేదంటే అధికారుల పనితీరుఅవగతమవుతుంది.

నెల్లూరు (టౌన్‌): అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో డ్రైవింగ్‌ నేర్పాలన్న ప్రభుత్వ లక్ష్యం పక్కదారిపట్టింది. పదుల సంఖ్యలో డ్రైవింగ్‌ స్కూళ్లకు అనుమతి పొందుతూ కొంతమంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బ్రాంచిల పేరుతో ఎక్కడపడితే అక్కడ స్కూళ్లను నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 18 స్కూళ్లకు మాత్రమే అనుమతి ఉంది. అనుమతిలేని స్కూళ్లు 50కి పైగానే ఉన్నాయి. నెల్లూరు నగరంలో 11, గూడూరులో 2, ఆత్మకూరులో 2, సూళ్లూరుపేటలో 2, కావలిలో 1 డ్రైవింగ్‌స్కూల్‌కు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది.

పాత వాహనాల్లోనే శిక్షణ
 మార్కెట్లోకి ఆధునిక టెక్నాలజీతో కొత్త వాహనాలు వస్తున్నా, డ్రైవింగ్‌ స్కూళ్ల యాజమాన్యం మాత్రం పాత వాహనాలనే డ్రైవింగ్‌ శిక్షణకు వినియోగిస్తున్నాయి. ఎన్నోఏళ్ల క్రితం మార్కెట్లోకి వచ్చిన  అంబాసిడర్, మారుతి 800  కార్లలోనే శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు అసలు ఉండవు. పేరుకే డ్రైవింగ్‌ స్కూల్‌. అక్కడ శిక్షణ ఇచ్చే ఇన్‌స్ట్రక్టర్‌ ఉండరు. డెమో క్లాసులు నిర్వహించేందుకు ప్రత్యేక తరగతి ఉండదు. కారు విడి విభాగాలు అసలు ఉండవు. మొక్కుబడి శిక్షణతో మమ అనిపిస్తున్నారు.

నిబంధనలు బేఖాతర్‌
జిల్లాలో డ్రైవింగ్‌ స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను బేఖాతర్‌ చేస్తున్నాయి. శిక్షకులుగా కేవలం లైసెన్స్‌ ఉన్న వ్యక్తిని మాత్రమే నియమిస్తున్నారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారు కనిపించరు. అనుభం ఉన్న  వారి సంఖ్య కూడా తక్కువే. డ్రైవింగ్‌లో శిక్షణ కేవలం 15 రోజుల పాటు, రోజుకు ఒక గంట మాత్రమే నేర్పిస్తున్నారు. నేర్చుకునేందుకు వచ్చిన తొలిరోజు నుంచే వారికి స్టీరింగ్‌ పట్టిస్తున్నారు. డ్రైవింగ్‌ నేర్పించినందుకు ఒక్కొక్కొరి నుంచి స్కూల్‌ను బట్టి రూ. 5వేల నుంచి రూ.8వేలకు వసూలు చేస్తున్నారు. లైసెన్స్‌ కూడా ఇప్పించినట్లయితే అదనంగా మరో రూ.3వేలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఫీజలు పట్టిక ఏ డ్రైవింగ్‌ స్కూల్‌లో కనిపించదు.

తనిఖీలు నిల్‌
డ్రైవింగ్‌ స్కూళ్లపై ఎక్కడా తనిఖీలు కనిపించవు. పదేళ్ల క్రితం నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. డ్రైవింగ్‌ స్కూల్స్‌ యాజమాన్యం ఇచ్చే మామూళ్లతో అధికారులు తనిఖీలు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని వాహనాలకు ఇన్సూ్యరెన్స్, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుండానే డ్రైవింగ్‌ శిక్షణకు వినియోగిస్తున్నారు. ఇన్సూ్యరెన్స్, ఫిట్‌నెస్‌ లేని వాహనాలు ప్రమాదానికి గురైతే బాధితులకు ఒక్క రూపాయి కూడా రాదు. ఇప్పటికైనా రవాణా అధికారులు జిల్లాలో ఉన్న డ్రైవింగ్‌ స్కూళ్లను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్న వాటిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

తక్షణమే తనిఖీలు నిర్వహిస్తాం
డ్రైవింగ్‌ స్కూళ్లపై తక్షణమే తనిఖీలు నిర్వహిస్తాం. డ్రైవింగ్‌ స్కూళ్లకు తప్పనిసరిగా రవాణాశాఖ అనుమతి ఉండాలి. బ్రాంచీల పేరుతో ఎక్కడబడితే అక్కడ డ్రైవింగ్‌ స్కూళ్లను నిర్వహించకూడదు. శిక్షణకు అత్యాధునిక మోడల్‌ వాహనాలను వినియోగించాలి. తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్దంగా ఉన్న డ్రైవింగ్‌ స్కూళ్లపై చర్యలు తీసుకుంటాం.
–ఎన్‌.శివరాంప్రసాద్,జిల్లా ఉపరవాణా కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement