జాబ్ బోరు... క్యాబ్ జోరు | First Woman Driver monika yadav special interview | Sakshi
Sakshi News home page

జాబ్ బోరు... క్యాబ్ జోరు

Published Mon, Dec 5 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM

జాబ్ బోరు... క్యాబ్ జోరు

జాబ్ బోరు... క్యాబ్ జోరు

ఫస్ట్ ఉమన్ డ్రైవర్
ఈమె పేరు మోనికా యాదవ్. ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ. సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీలో పీజీ చేస్తోంది. ప్రత్యేకత ఏంటి? ఆర్కిటెక్ట్‌గా అయిదు నెలలు పనిచేశాక.. బోర్ అనిపించి.. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి అహ్మదాబాద్‌లో ఊబర్ క్యాబ్స్‌కి అప్లయ్ చేసుకుంది డ్రైవర్‌గా! ఆ జాబ్ వచ్చింది. ఊబర్ క్యాబ్స్‌లో తొలి మహిళా డ్రైవరుగా మహిళా ప్రయాణికులను చాలా సురక్షితంగా గమ్యం చేరుస్తోంది.  ఆ జర్నీ గురించి వివరంగా  ఆమె మాటల్లోనే...

‘జైపూర్‌లో ఆర్కిటెక్చర్ చదివాను. వెంటనే అహ్మదాబాద్‌లోని  సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీలో సీట్ దొరికింది. డిగ్రీ అర్హతతో ఆర్కిటెక్ట్‌గా ఉద్యోగం దొరికింది. చేరాను. అయిదేళ్ల ఆ చదువులో ఎన్నో అసైన్‌మెంట్స్.. ప్రాజెక్ట్స్.. బోర్ కొట్టింది. రోజూ అదే టైమ్‌కి రావాలి.. అదే డెస్క్ దగ్గర కూర్చోవాలి.. అదే షీట్.. స్కేల్.. స్కెచ్..డ్రాఫ్ట్.. డిస్‌గస్టింగ్. అసలు నేనేంటి? నాకేం కావాలి?ఆలోచనలు మొదలయ్యాయి.

ఎవరేమనుకుంటారోనన్న భయం వద్దు.. మీ మనసు ఏం చెప్తుందో అది వినండి. ఆర్కిటెక్చర్ చదివి ఊబర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నానని నన్ను చిన్నచూపు చూసిన వాళ్లూ ఉన్నారు. వాళ్లు మొహం ముందే కామెంట్స్ చేశారు. ఇదేదో లోక్లాస్ ఉద్యోగమని హేళన చేశారు. అయినా డోంట్ కేర్ అనుకున్నా. ఎవరికో నచ్చడం కాదు కదా.. నాకు నచ్చాలి.. నన్ను నేను సమాధానపర్చుకోవాలి. ఉద్యోగాల్లో పెద్ద ఉద్యోగం. చిన్న ఉద్యోగం.. ఆడవాళ్లు చేసేది.. మగవాళ్లు చేసేది అనే తేడాలుండవు. ఆసక్తి, సౌకర్యం రెండే ఉంటాయి. అమ్మాయిలు క్యాబ్ డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తే స్త్రీలకు రక్షణ, భద్రత కూడా!’

ఆ అయిదేళ్లు తీసేస్తే..

నా జీవితంలోంచి ఆర్కిటెక్చర్ చదివిన అయిదేళ్లూ తీసేస్తే... అంతకుముందు నేనెలా ఉన్నానో .. అదే నేను అని డిసైడ్ అయ్యా. ఆర్కిటెక్ట్ కంటే అయిదేళ్ల ముందున్న నా జీవితాన్ని తలుచుకున్నా. దేని పట్ల నాకు ఆసక్తి ఉండిందో గుర్తు తెచ్చుకున్నా.  ఏమాత్రం ఉత్సుకత, కొత్తదనం లేని పని అంటే చిరాకు పడే మనస్తత్వం నాది. నైన్ టు ఫైవ్ జాబ్ అంటే విపరీతమైన అనాసక్తత. ట్రావెలింగ్ అంటే ఇష్టం. దేశంలోని ప్రతి రాష్ట్రానికి వెళ్లా. విదేశాలూ తిరిగాను. కొత్త ప్రదేశాలు ఎక్స్‌ప్లోర్ చేయడం, కొత్త వాళ్లను కలవడం ఇష్టం. అన్నిటికన్నా డ్రైవింగ్.. యెస్.. డ్రైవింగ్ అంటే ప్రాణం. అర్థమైంది. నా మెదడులో ముడిపడ్డ చిక్కు వీడింది. అంతా క్లియర్.. నా గమ్యం ఏంటో క్లిస్టర్ క్లియర్ అయింది. నిరవధికంగా పన్నెండు గంటలు డ్రైవింగ్ చేసినా అలసిపోయిన రోజుల్లేవ్. పైగా చాలా ఉత్సాహంగా ఉండేదాన్ని. అంటే డ్రైవింగ్ సంబంధించి ఉద్యోగాన్ని ఇష్టంగా చేయగలను.

ఓలా నో అంది.. ఊబర్ ఎస్ అంది
నాకు దేనిపట్ల మక్కువో తెలిశాక.. వెంటనే అహ్మదాబాద్‌లోని ఓలా క్యాబ్స్ ఆఫీస్‌కి వెళ్లా. డ్రైవర్ ఉద్యోగం కోసం. నేను వాళ్లకు నచ్చలేదు. బహుశా.. ఆడపిల్ల డ్రైవర్‌గా ఏంటి? అనుకున్నారోఏమో మరి నో అన్నారు. నేనేం నొచ్చుకోలేదు. తక్షణమే ఊబర్ క్యాబ్స్‌ని అప్రోచ్ అయ్యా. ఇక్కడ క్వయిట్ అపోజిట్ రియాక్షన్. నా రెజ్యూమె, నా ఇంట్రెస్ట్ చూసి ఊబర్ క్యాబ్స్ వాళ్లు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ‘రేపటి నుంచే జాయిన్ కావచ్చు’ అని చెప్పారు. లెసైన్స్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకొని ఊబర్‌లో జాయిన్ అయ్యా.. ఫిమేల్ డ్రైవర్‌గా. గుజరాత్‌లోనే ఫస్ట్ ఫిమేల్ టాక్సీ డ్రైవర్‌ని నేను.

డ్రైవర్‌గా కొత్తలో..
ఉత్సాహంగా జాయిన్ అయ్యాను కాని.. కొత్తలో కొంత నెర్వస్‌గా ఫీలయ్యా. అది కొన్ని రోజులే. ప్రతి కొత్త రైడ్.. కొత్త ప్లేస్.. కొత్త మనుషులు ఎక్సయిటింగ్‌గా అనిపించసాగింది. ఓ అమ్మాయి.. క్యాబ్‌ను డ్రైవ్‌చేస్తుంటే హ్యాపీగా.. సేఫ్‌గా ఫీలయిన కస్టమర్సూ ఉన్నారు. వాళ్లలో కొందరు టిప్ ఇచ్చి ఆశీర్వదించారు కూడా. అమ్మాయిలతే నా క్యాబ్‌లో ఫుల్ జోష్.. అండ్ మజా.

ఉదయం అయిదు నుంచి
నా డైలీ రైడ్ ఉదయం అయిదు గంటలకు మొదలవుతుంది. ఎనిమిదిన్నర వరకు ట్రిప్స్ చూసుకొని కాలేజ్‌కి వెళ్తా. సాయంత్రం అయిదింటికి కాలేజ్ అయిపోతుంది. ఆరింటి నుంచి ఊబర్ జాబ్. రాత్రి పదిన్నర వరకు సాగుతుంది. హెక్టిక్ షెడ్యూలే కాని ఎంజాయింగ్ లాట్. ప్రతిరోజూ కొత్త విషయం తెలుసుకుంటున్నా.. కొత్త పాఠం నేర్చుకుంటున్నా.  ఒకసారి అర్థరాత్రి గాంధీనగర్‌లో ఓ అమ్మాయిని పికప్ చేసుకోవాలి. ఫోన్‌లో అడ్రస్ అడుగుతూ వెళ్లా. అయినా సరిగా ట్రేస్ కాలేదు. దాంతో ఆ అమ్మాయికి (ఇంచుమించు నా వయసే) చాలా కోపమొచ్చింది. ఫోన్లోనే చడామడా తిట్టేసింది. నాకూ ఆవేశం వచ్చినా తమాయించుకొని కరెక్ట్ అడ్రస్ ట్రేస్ చేసి పికప్‌చేసుకున్నా. నన్ను చూసి కూల్ అయిపోయింది. సారీ చెప్పింది. కలిసి డిన్నర్ చేద్దామంది. చేశాం.

కట్ చేస్తే..
ఇప్పుడు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఇంకోసారి ఓ మాడ్యులర్ కిచెన్స్ షోరూమ్ ఓనర్ ఎక్కారు కార్లో. అమ్మాయి క్యాబ్ నడుపుతుంటే ప్రౌడ్‌గా ఉంది అన్నారు. ఏం చదివావ్ అని అడిగారు. అర్కిటెక్చర్ అని చెప్పగానే ఆశ్చర్యపోయారు. వాళ్లిల్లు రాగానే లోపలికి పిలిచారు. ఇంట్లో వాళ్లను పరిచయం చేశారు. ఫోన్ నంబర్ ఇచ్చి... ‘నాకు, మా ఆవిడకు ఇంటీరియర్ అంటే ఇష్టం. నీకు లీజర్‌గా ఉన్నప్పుడు రామ్మా.. నేర్పించడానికి. ఫీజు విషయంలో మొహమాటపడొద్దు’ అన్నారు. కొంతమంది ఆంటీలయితే వాళ్ల అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పించమని పట్టుబడుతున్నారు. ఇవన్నీ భలే ఉత్సాహాన్ని నింపుతుంటాయి నాలో. స్ట్రేంజర్‌గా నా కార్లో ఎక్కిన మనిషి వాళ్ల గమ్యం వచ్చేసరికి కుటుంబ సభ్యులుగా మారిపోవడం.. నిజంగా..గ్రేట్. అందుకే అనిపిస్తుంటుంది.. ఊబర్‌లో ఉద్యోగం.. నాట్ ఎ రాంగ్ చాయిస్ అంటూ ముగించింది మోనికా యాదవ్.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement