మెట్రో రైలుకు మహిళా డ్రైవర్
చెన్నై: తమిళనాడులోని చెన్నై నగరానికి ప్రతిష్ఠాత్మక మెట్రోరైలును ఒక ప్రముఖ రాజకీయ నాయకురాలు జెండా ఊపి ప్రారంభిస్తే.. నగరానికి చెందిన ఓ నవయువతి ఈ మొట్టమొదటి రైలుకు మొట్టమొదటి మహిళా డ్రైవర్గా ఆవిష్కృతమయ్యారు. చెన్నై ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ నుంచి ఇంజనీరింగ్లో డిప్లమో చేసిన ప్రీతి (28) రైలు డ్రైవర్ కావాలని కలలు కంది. దీని కోసం ఢిల్లీలో ఏడాదిన్నర పాటు శిక్షణ తీసుకుంది. ముగ్గురు యువతులు పోటీలో ఉండగా చివరకు ఈ అవకాశాన్ని ప్రీతి దక్కించుకుంది. అలందూర్ స్టేషన్ నుంచి కోయంబేడు వరకు ప్రీతి డ్రైవర్గా వ్యవహరించారు.
దీనిపై ప్రీతి తండ్రి అన్బు ఆనందం వ్యక్తం చేశారు. మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటినుంచి కష్టపడి, చివరకు తన కలను సాకారం చేసుకుందంటూ మురిసిపోయారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేతులుమీదుగా చెన్నై నగరానికి మొట్టమొదటి మెట్రో రైలు సోమవారం ఉదయం పట్టాలెక్కింది. తమిళనాడు సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం పచ్చజెండా ఊపారు. మెట్రో సొబగులతో మెరిసిపోయిన ఆనందూర్ స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. మొట్టమొదటి మెట్రో రైల్లో ప్రయాణం చాలా గొప్పగా ఉందన్నారు.