జర్నలిస్ట్, రైటర్ మిన్నీ వైద్ (PC: Minnie Vaid Instagram)
Minnie Vaid: శాస్త్రరంగం నుంచి సైనికరంగం వరకు మనకు స్ఫూర్తిని ఇచ్చే మహిళలు ఎంతో మంది ఉన్నారు. వారి గురించి తెలుసుకుంటే ఆగిపోయిన అడుగులో కదలిక మొదలవుతుంది. ‘అందదు’ అనుకున్న కల చేరువవుతుంది. అలాంటి మహిళలను తన పుస్తకాలతో లోకానికి పరిచయం చేస్తోంది మిన్నీ వైద్. వాస్తవ జీవిత కథతో తాజాగా ‘ఫతే’ అనే పుస్తకాన్ని రాసింది...
జర్నలిస్ట్, రైటర్, డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకుంది ముంబైకి చెందిన మిన్నీ వైద్. మూడు సంవత్సరాల క్రితం ‘ఇస్రో’ మహిళా శాస్త్రవేత్తలపై తాను రాసిన పుస్తకం గురించి హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలి కంటోన్మెంట్ టౌన్‌లో ప్రసంగించింది. ప్రసంగం పూర్తయిన తరువాత జనరల్ అనీల్ చౌదరి మిన్నీతో మాట్లాడారు.
‘ఇస్రోలోనే కాదు, ఆర్మీలో కూడా ఎంతోమంది స్ఫూర్తిదాయకమైన మహిళలు ఉన్నారు. వారి గురించి కూడా తప్పనిసరిగా రాయాలి’ అంటూ కొంతమంది గురించి చెప్పారు ఆయన. అలా ‘ఫతే’ పుస్తకానికి బీజం పడింది.
ఆ పుస్తకంలో...
హరియాణాలోని చిన్న పట్టణంలో పుట్టి పెరుగుతుంది అర్చన. తనది సంప్రదాయ కుటుంబం. ‘ఎక్కడి వరకు చదవాలో అక్కడి వరకే చదవాలి. ఉన్నత చదువులు అవసరం లేదు’ అనేది ఆ కుటుంబ భావన.
కాలేజీ రోజుల్లో ఎన్‌సీసీలో చేరుతుంది అర్చన. అప్పుడే... సైన్యంలో పనిచేయాలని గట్టిగా అనుకుంటుంది.
అయితే తాను ఒకటి తలిస్తే, కుటుంబం ఒకటి తలిచింది.
అర్చనకు ఆర్మీ ఆఫీసర్ లక్ష్మణ్ దెస్వాల్‌తో వివాహం జరిపిస్తారు. పెళ్లితో తన కల కలగానే మిగిలిపోయింది. నాన్–ఫ్యామిలీ ఫీల్డ్‌లో భర్త ఉద్యోగం. సెలవుల్లో అతడు ఇంటికి వచ్చినప్పుడు...ప్రతిరోజూ అపూర్వమైన రోజు. భర్త విధుల్లో చేరిన తరువాత ఉత్తర ప్రత్యుత్తరాలు, ఫోన్‌లో గంటల తరబడి కబుర్లు ఉండేవి!
ఈ సంతోషకాలంలో, తన కల పెద్దగా గుర్తుకు వచ్చేది కాదు.
ఒకరోజు..
లక్ష్మణ్‌కు ఫోన్ చేస్తే ఎత్తలేదు... ఆయన ఫైరింగ్ లో చనిపోయాడు!
భూమి నిలువునా చీలిపోయింది. తాను ఎక్కడో పాతాళలోకంలో పడిపోయింది. అప్పటికే తాను గర్భవతి. బిడ్డను చూసుకోకుండానే ఆయన చనిపోయాడు.
భర్త ఉన్నప్పుడు ఎలాంటి సమస్యా ఎదురు కాలేదుగానీ, అతడు చనిపోయిన తరువాత అత్త, ఆడబిడ్డల నుంచి మానసిక హింస మొదలైంది. ఒక మూలన ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే బాధ పెరుగుతుంది తప్ప తరగదు అనే విషయం తనకు అర్థం కావడానికి ఎంతోసేపు పట్టలేదు.
తాను మళ్లీ బతకాలంటే, కొత్త జీవితం మొదలుపెట్టాలి!
ఆగిపోయిన చదువును మళ్లీ పట్టాలెక్కించింది. ఒక్కో అడుగు వేస్తూ...ఆర్మీలో చేరాలనే తన చిరకాల కోరికను నెరవేర్చుకుంది. ఆర్మీ ఆఫీసర్ స్థాయికి ఎదిగింది. అమ్మాయి ఆలనాపాలన చక్కగా చూసుకుంటుంది.
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌లో ఆలివ్‌గ్రీన్ యూనిఫామ్‌లో గంభీరంగా కనిపించే మేజర్ అర్చన వెనుక ఇంత కన్నీటి కథ ఉందని తెలిసినవారు చాలా తక్కువ.
నిజజీవిత కథ ఆధారంగా మిన్నీ రాసిన ఈ కాల్పనిక పుస్తకం పేరు... ఫతే.
‘ఫతే’ అంటే విజయం. ఎన్ని కష్టాలు దాటితే ఒక విజయం సొంతం అవుతుందో కళ్లకు కట్టే పుస్తకం ఇది.
దీనిలో ఎలాంటి శైలి, విన్యాసాలు, నాటకీయతా లేవు. 126 పేజీలలో సాధారణ వాక్యాలు కనిపిస్తాయి. అయితే అవి ఒక అసాధారణమైన వ్యక్తి గురించి అద్భుతంగా చెబుతాయి.
మిన్నీ ఈ పుస్తకం దగ్గరే ఆగిపోవాలనుకోవడం లేదు. అనేక రంగాలలో మనకు స్ఫూర్తిని ఇచ్చే మహిళలు ఎంతోమంది ఉన్నారు. వారి గురించి కూడా భవిష్యత్‌లో మరిన్ని పుస్తకాలు రాయాలనుకుంటోంది.
చదవండి: బ్యూటిఫుల్ సక్సెస్ మంత్ర
Joycy Lyngdoh: నిరుపేద మహిళ.. తొలుత స్కూల్ బస్ డ్రైవర్‌గా.. ఇప్పుడేమో!
Comments
Please login to add a commentAdd a comment