![Great Artist Keki Moose 50 Years Of His life Waiting For His Love](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/mose.jpg.webp?itok=2qSEs_Lm)
యధార్థ ప్రేమ కథ ఇది. ప్రియురాలు ఇచ్చిన మాటను నమ్మి పది, పన్నేండేళ్లు కాదు ఏకంగా జీవితాంతం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆఖరి శ్వాస వరకు అలానే ఉండిపోరు. ఆమె వస్తుందని చివరి శ్వాస వరకు ఎదరుచూసిన గొప్ప ప్రేమ పిపాసి.
ఆ వ్యక్తే మహరాష్ట్రలోని ఖందేశ్‌కు చెందిన కళాతపస్వీ కెకీ మూస్. ఆయన తనకు ఎంతో ఇష్టమైన ఫోటోగ్రఫీ కోసం చాలీస్‌గావ్ అనే ఊరిలో మూస్ ఆర్ట్ గ్యాలరీని స్థాపించారు. ఈ ఆర్ట్ గ్యాలరీ ట్రస్టీ, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కమలాకర్ సామంత్ ఆయన అంతులేని ప్రేమ కథను వివరించారు. ఆయనిచ్చిన సమాచారం ప్రకారం..
1912 అక్టోబర్ 2న ముంబైలోని మలబార్ హిల్‌లో పిరోజా, మానెక్జీ ఫ్రాంజీ మూస్ అనే పార్సీ దంపతులకు కెకీ జన్మించారు. కెకీ పూర్తి పేరు కైకుసారో మానెక్జీ మూస్. వాళ్ల అమ్మ ఆయన్ను కెకీ అని పిలిచేవారు. ఆ తర్వాత ఆ పేరే ఆయన ఐడెంటిటీగా మారింది. చాలిస్‌గావ్ స్టేషన్‌కు సమీపంలో రాతితో నిర్మించిన ఒక బంగ్లాలో ఆయన నివసించారు.
ముంబైలోని విల్సన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక, ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లారు. కానీ, తన సోడా వాటర్ ఫ్యాక్టరీ, లిక్కర్ షాపు బాధ్యతలను కెకీయే చూసుకోవాలని మానెక్జీ భావించారు. 1934-35 మధ్యలో మానెక్జీ చనిపోయిన తర్వాత, షాపు నిర్వహణ బాధ్యతలను కెకీ తల్లి పిరోజా తీసుకున్నారు.
కొడుకు ఇంగ్లండ్ వెళ్లి ఉన్నత చదువులు చదివేందుకు ఒప్పుకున్నారు. 1935లో లండన్‌లోని బెన్నెట్ కాలేజ్ ఆఫ్ షెఫీల్డ్‌లో చేరారు. నాలుగేళ్ల కమర్షియల్ ఆర్ట్ కోర్సులో డిప్లొమా పూర్తి చేశారు. ఈ కోర్సులో ఫోటోగ్రఫీ కూడా ఒక సబ్జెట్. అది కూడా చదువుకున్నారు కెకీ. ఆ తర్వాత ఆర్ట్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్‌కు చెందిన రాయల్ సొసైటీలో గౌరవ సభ్యత్వం పొందారు. అమెరికా, జపాన్, రష్యా, స్విట్జర్లాండ్‌లను సందర్శించారు. అక్కడ చాలా ఫోటోగ్రఫీ ప్రదర్శనలను చూశారు. చాలామంది కళాకారులను కలిశారు. 1938లో భారత్‌కు తిరిగి వచ్చారు.
ప్రేమ చిగురించింది..
ఆయన ముంబైలో చదువుతుండగా నీలోఫర్ మోదీ అనే యువతితో ఆయనకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. చదువు పూర్తయిన తర్వాత చాలిస్‌గావ్‌లో ఉంటున్న తన తల్లిదండ్రులతో కలిసి ఉండాలని కెకీ మూస్ నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం ఆయనకు, నీలోఫర్‌కు మధ్య విభేదాలకు కారణమయింది.
కెకీ కుటుంబం ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నప్పటికీ, నీలోఫర్ సంపన్న కుటుంబానికి చెందిన వారు. దీంతో నీలోఫర్ తల్లిదండ్రులకు వారి ప్రేమ విషయం అంత నచ్చలేదు. అయినప్పటికీ వారిద్దరూ పెళ్లిచేసుకోవడానికి వారు అంగీకరించారు.అయితే, నీలోఫర్ ముంబై వదిలి చాలిస్‌గావ్‌లాంటి గ్రామీణ ప్రాంతానికి వెళ్లేందుకు ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. కెకీతో కలిసి చాలిస్‌గావ్ వెళ్లేందుకు నీలోఫర్ సిద్ధమైనప్పటికీ, ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కెకీ ముంబై నుంచి చాలిస్‌గావ్ వెళ్లేటప్పుడు నీలోఫర్ ఆయనకు వీడ్కోలు పలికేందుకు విక్టోరియా స్టేషన్‌కు వచ్చారు.
అది ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ మార్చారు. నీలోఫర్ కైకీకి వీడ్కోలు పలుకుతూ..ఆయన చేతిని తన చేతిలోకి తీసుకుని ఏదో ఒక రోజు తాను కచ్చితంగా పంజాబ్ మెయిల్‌లో చాలిస్‌గావ్ వస్తానని, తనతో కలిసి డిన్నర్ చేస్తానని మాటిచ్చారు. ఆ ఒక్క మాట కోసం ఆయన తన చివరి శ్వాస వరకు ఎదురుచూస్తూ ఉండిపోయారు.
ఎంతలా ఎదురు చూశారంటే..
ప్రియురాలి మాటలపై నమ్మకం ఉంచిన కెకీ మూస్, ఆ రైలు వచ్చినప్పుడు తన బంగ్లా కిటికీలు, తలుపులు అన్నీ తెరిచి ఉంచేవారు. రోజులో మిగిలిన భాగమంతా అవన్నీ మూసేసి ఉండేవి. రైలు వచ్చే సమయానికి దీపాలు వెలిగించేవారు. తోటలోని తాజా పూలతో బొకే తయారుచేసేవారు.
తర్వాత తోటలో పువ్వులు లేని సమయంలో వాడిపోని అలంకరణ పూలతో పూలగుత్తులు తయారుచేశారు. ప్రతిరాత్రీ ఆయన ఇద్దరి కోసం భోజనం తయారుచేసేవారు. ఈ పద్ధతిలో ఆయన ప్రతిరోజూ తన ప్రియురాలికి స్వాగతం చెప్పేందుకు రెడీగా ఉండేవారు. అలా చివరి వరకూ ఆయన తన ప్రియురాలికిచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
అలా పంజాబ్ మెయిల్ వచ్చి వెళ్లిపోయిన తర్వాతే ఆయన ప్రతిరోజూ డిన్నర్ చేసేవారు. తన చివరి డిన్నర్ డిసెంబరు 31, 1989 వరకు అలానే చేశారు. ఆ రోజూ కూడా పంజాబ్ మెయిల్ రైలు వెళ్లిపోయిన తర్వాతే భోజనం చేసి పడుకున్నారని, ఇక లేవలేదని సావంత్ చెప్పుకొచ్చారు.
చిన్న ట్వీస్ట్ ఏంటంటే..
కెకీ చనిపోయిన తర్వాత ఆయన ఇంట్లో తాను రెండు లేఖలను చూశానని సామంత్ తెలిపారు. వాటిలో ఒకటి ఆయన ప్రియురాలి నుంచి వచ్చింది. రెండోది కేకీ బంధువు హథిఖాన్‌వాలా నుంచి వచ్చిందని ఆర్ట్ గ్యాలీరీ ట్రస్టీ ఎగ్జిక్యూటివ్ సామంత్ తెలిపారు.
ఆయన ప్రియురాలిని లండన్ పంపించివేశారని, అక్కడ ఆమె వివాహం చేసుకున్నారని లేఖలో హథిఖాన్‌వాలా కేకీకి తెలిపారు. అయితే కేకీ ఆ ఉత్తరాలను ఎప్పుడూ చదవలేదని సామంత్ చెప్పారు.
ఎన్నింటిలో ప్రావిణ్యం ఉందంటే..
కెకీ మూస్ ప్రపంచ ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్. పెయింటర్, సంగీత ప్రేమికుడు, గొప్ప శిల్పి. ఆయనకు పేపర్‌ను అనేక రకాలుగా మడిచి కళాకృతులుగా మార్చే ‘ఒరిగామి’ అనే ఆర్ట్ కూడా తెలుసు. అంతేగాదు మంచి రచయిత, అనువాదకుడు, తత్త్వవేత్త కూడా. అన్ని మత గ్రంథాలను అధ్యయనం చేశారు.
ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, గుజరాతీ, ఉర్దు, మరాఠీ భాషలు వచ్చు. సొంత లైబ్రరీ నిర్మించాలన్న ఉద్దేశంతో దాదాపు 4వేల పుస్తకాలు సేకరించారు. ఉర్దూ కవిత్వమంటే ఆయనకు ఎంతో ఇష్టం. అలాగే ఇతర ఆర్టిస్టుల చెక్కశిల్పాలు, విగ్రహాలు, పురాతన వస్తువులు, పాత అరుదైన పాత్రలు, బొమ్మలు, పాత ఫర్నీచర్, నాణేలను ఆయన సేకరించారు. అనేక రకాల సంగీతానికి సంబంధించిన క్యాసెట్లు, గ్రామ్‌ఫోన్ రికార్డులు సేకరించడం కెకీకి ఒక హాబీ. హిందీ, మరాఠీ, గుజరాతీ, రాజస్థానీ, అలాగే పిల్లల పాటలకు సంబంధించి ఆయన దగ్గర పెద్ద కలెక్షనే ఉంది.
(చదవండి: చరిత్రలో అజరామరంగా నిలిచిపోయిన ప్రేమకథలు..!)
Comments
Please login to add a commentAdd a comment