ఫెయిరీ టేల్.. అర్చన
అర్చన, వేద.. పేరేదైనా ఆ అందం వెండితెరకు సుపరిచితమే. ఒకప్పుడు పచ్చదనంతో నిండుగా ఉన్న నగరం ఆమెకు పరిచితమే. గతంలో శ్రీనగర్ కాలనీలోని గుట్టలు, పూలు, పండ్ల బుట్టలు చూసిన వేద మనసు ఇప్పుడు అక్కడి కాంక్రీట్ జంగిల్‌ను చూసి దిగులు పడుతుంటుంది. తాతయ్య ఇంటికి వె ళ్లేదారిలో కూలిన హవేలీని చూసి గుండె గాయం చేసుకుంటుంది. మసక వెలుతురులో బుర్ఖాలో వెళ్లి చార్మినార్ అందాన్ని చూసి ఆనందిస్తుంది. హైదరాబాద్‌లో తన జీవితం ఫెయిరీ టేల్ లాంటిదంటున్న అర్చనకు నగరంతో ఉన్న అనుబంధం..
నా చిన్నతనంలో సిటీ ఎంతో బ్యూటీగా ఉండేది. నా స్కూలింగ్ అంతా జూబ్లీహిల్స్ భారతీయ విద్యా భవన్‌లోనే సాగింది. అమ్మ క్లాసికల్ డ్యాన్సర్. నాకు డ్యాన్ ్స అంటే ఇష్టం ఉండేది కాదు. ఏడో తరగతిలో అనుకుంటా.. స్కూల్ కల్చరల్ ఈవెంట్స్ కోసం అమ్మ డ్యాన్స్ నేర్పిస్తే ఏదో చేశాను. అందరూ మెచ్చుకున్నారు. ఆ ప్రశంసలే నాలో డ్యాన్స్‌పై ఆసక్తి కలిగించాయి. అప్పుడు పట్టుకున్న డ్యాన్స్‌ను ఇప్పటికీ వదల్లేదు.. ఎప్పటికీ వదలను.
కూలిన కోట
మా తాతయ్య వాళ్ల ఇల్లు బషీర్‌బాగ్‌లో ఉండేది. అక్కడికి శ్రీనగర్ కాలనీ మీదుగా తరచూ వెళ్లేదాన్ని. అప్పటి శ్రీనగర్ కాలనీ అంటే పెద్దపెద్ద బండరాళ్లు, మట్టి రోడ్డు, అక్కడక్కడా ఫ్రూట్ జ్యూస్ బండ్లు, జాంపళ్లు, పూల బుట్టలు ఉండేవి. ఇప్పుడు బిల్డింగ్స్ తప్ప ఏమీ లేవు. అపార్ట్‌మెంట్స్ బాగా పెరిగిపోయాయి. అపార్ట్‌మెంట్ కల్చర్ అస్సలు నచ్చని విషయం. బషీర్‌బాగ్‌లో పెద్ద హవేలీ ఉండేది. అది రాజుల కథల్లో పెద్ద కోటలాగా అనిపించేది. ఇప్పుడటు వెళ్తే కూలిన ఆ జ్ఞాపకం బాధిస్తుంటుంది.
నిజామీ రిచ్‌నెస్...
హైదరాబాద్‌లో షాపింగ్ చాలా ఇష్టం. చార్మినార్ దగ్గర కొత్తగా వచ్చిన ఏ బ్యాంగిల్‌నూ వదిలిపెట్టను. నా దగ్గర బ్యాంగిల్ ్స కలె క్షన్ చాలా ఉంది. ఇక కాశ్మీరీ శాలువాలు అంటే చాలా ఇష్టం. నిజామీ కల్చర్‌లో ఓ రిచ్‌నెస్ ఉంది. అందుకే ట్రెడిషనల్ హైదరాబాదీ ఆభరణాలన్నీ ఇష్టమే. చిన్నప్పుడు ఇంట్లో చెప్పకుండా ఫ్రెండ్స్‌తో కలసి చార్మినార్ వెళ్లేదాన్ని. ఇప్పుడు జనం గుర్తు పట్టకుండా బుర్ఖా వేసుకుని వెళ్తుంటాను.
ఫుడ్ అదుర్స్..
హైదరాబాదీ ఫుడ్ అంటే లొట్టలేసుకుంటూ తింటా. చార్మినార్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ చాలా ఇష్టం. చార్మినార్ ఎదురుగా బండిపై దొరికే చీజ్ దోశ సూపర్బ్‌గా ఉంటుంది. వర్షాకాలంలో పానీ పూరీ, మహారాజా చాట్ చాలా ఇష్టం. పూర్ణ టిఫిన్ సెంటర్‌లో పూరీ, దోశ చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే ఇప్పటికీ.. నగరం నిద్ర లేవకముందే.. అక్కడికి వెళ్లిపోయి కారులో కూర్చునే టిఫిన్ చేస్తుంటాను. ప్రత్యామ్నాయాలు వెతుకుతాను కానీ.., ఇష్టాన్ని వదులుకోను.
నుమాయిష్‌లో కర్రీపప్స్..
నాంపల్లి ఎగ్జిబిషన్ చాలా ఇష్టం. చిన్నప్పుడు ఫ్రెండ్స్‌తో వెళ్లేదాన్ని. అక్కడ కర్రీపప్స్ స్పెషల్. అవి ఇక్కడ దొరకవు. వాటి టేస్ట్ సూపర్. ఇప్పటికీ దొంగచాటుగా వెళ్లి టేస్ట్ చేస్తుంటా. అక్కడ చెరకు రసం కూడా చాలా బాగుంటుంది. చరిత్రాత్మక ప్రాంతాల్లో ట్రావెలింగ్ ఇష్టం. అడుగడుగునా చరిత్రాత్మకత నింపుకున్న హైదరాబాద్ అంటే మరీ ఇష్టం.
అనుకోని మలుపు..
డిగ్రీ చదువుతున్నప్పుడు ‘నేను’ సినిమాకు హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నట్టు ఓ ఫ్రెండ్ ద్వారా తెలిసింది. ఫొటోస్ అయితే పంపించాను. ఎలాంటి అంచనాలు లేవు. హీరోయిన్ అయిపోయాను. చదువు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ తప్ప ఓ ల క్ష్యం అంటూ లేని నా జీవితంలో అనుకోని మలుపు అది. నాకు అమ్మానాన్న ఇద్దరి సపోర్ట్ ఉంది. మూవీ హిట్టయినా, ఫ్లాప్ అయినా.. నేను స్థిరంగా ఉండటానికి పేరెంట్సే కారణం.
చారిటీ కాదు..
బాధ వచ్చినా, సంతోషం వచ్చినా.. బసవతారకం హాస్పిటల్ దగ్గర చికిత్స కోసం వచ్చిన రోగుల బంధువులకు, అమీర్‌పేట్ దుర్గ గుడి దగ్గర ఉన్న పేదలకు అన్నదానం చేయడం అలవాటు. ఇదేదో చారిటీ అనుకోవట్లేదు. నా ఆత్మ సంతృప్తి కోసం.. అంతే.
- శిరీష చల్లపల్లి