మిల్లెట్లను కొందరు తృణధాన్యాలంటారు.
ఆరోగ్యాన్ని కోరుకునేవారు తృణీకరించలేనివివి.
కొందరు చిరుధాన్యాలంటారు.
అచిరకాలం జీవించేలా చేసేవివి.
ఆరోగ్యానికి మిన్న... జొన్న
నిత్య కుర్రతనం కోసం... కొర్రలు
స్వస్థత బోధించే ఒజ్జ... సజ్జ
వేగిరం నిమ్మళపరిచే... రాగి
ఆరోగ్యధామాలు... సామలు
శివరాత్రి సందర్భంగా వంటింటి మైదానంలో ప్రభలు చూపే...
ఈ మిల్లెట్లతో రుచికరమైన వంటలు చేసుకుని భుజించండి.
వాటిని వ్యాధుల పాలిట బుల్లెట్లుగా మార్చుకుని కలకాలం జీవించండి.
జొన్న లడ్డు
కావలసినవి:
జొన్నలు + సజ్జలు - కేజీ
బెల్లం తురుము లేదా చక్కెర - 700 గ్రా.
నెయ్యి - పావు కేజీ
ఏలకుల పొడి - టీ స్పూను
తయారి:
జొన్నలను, సజ్జలను విడివిడిగా వేయించి, చల్లారాక
మిక్సీలో వేసి పిండి చేసుకోవాలి (జల్లెడ పట్టకూడదు)
ఒక పాత్రలో జొన్నపిండి, సజ్జపిండి వేసి వాటికి బెల్లం తురుము, ఏలకులపొడి వేసి కలపాలి
నెయ్యి జత చేస్తూ లడ్డూలు తయారుచేసుకోవాలి
జొన్నరొట్టెలు
కావలసినవి:
జొన్నపిండి - కేజీ,
నీరు - తగినంత,
ఉప్పు - తగినంత
తయారి:
ఒక పాత్రలో జొన్నపిండి, ఉప్పు వేసి, తగినంత నీరు చేర్చి చపాతీ ముద్దలా కలుపుకోవాలి
చిన్న ఉండలా పిండి తీసుకుని, మెల్లమెల్లగా చేతితో గుండ్రంగా చేసుకోవాలి
స్టౌ మీద పాన్ వేడయ్యాక రొట్టెను దాని మీద వేసి, కొద్దిగా నీరు చల్లి, తిరగేయాలి
బాగా కాలేవరకు రెండువైపులా తిరగేస్తుండాలి. (ఇదే పద్ధతిలో సజ్జలు, రాగుల పిండితో కూడా రొట్టెలు తయారుచేసుకోవచ్చు)
సంగటి
కావలసినవి:
కొర్రబియ్యం - పావు కిలో
రాగి పిండి - 400 గ్రా.; పెరుగు - కప్పు
ఉల్లిపాయ ముక్కలు - కప్పు; కొత్తిమీర - చిన్నకట్ట
పచ్చిమిర్చి - 4 (నిలువుగా కట్ చేయాలి)
ఉప్పు - తగినంత
తయారి:
మరుగుతున్న నీటిలో కొర్ర బియ్యం వేసి ఉడికించాలి
చిన్న గిన్నెలో చల్లటి నీళ్లు, రాగిపిండి వేసి ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న కొర్రబియ్యంలో వేసి కలపాలి
కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి, ఉడికిన తర్వాత దించేయాలి
చల్లారిన తరువాత పెరుగు, ఉల్లిపాయ ముక్కలు జత చేయాలి
కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి
గోంగూర -కొర్ర అన్నం
కావలసినవి:
కొర్రబియ్యం - అర కిలో గోంగూర - 5 ; కట్టలు
పచ్చిమిర్చి - 6
ఉప్పు - తగినంత
నూనె - కొద్దిగా
ఆవాలు - టీ స్పూను
జీలకర్ర - టీ స్పూను
ఎండుమిర్చి - 5
కరివేపాకు - 2 రెమ్మలు
ఉల్లితరుగు - పావు కప్పు కొత్తిమీర - చిన్న కట్ట
తయారి:
కొర్రబియ్యాన్ని (1:2 నిష్పత్తిలో నీరు పోయాలి) ఉడికించి చల్లార్చాలి.
గోంగూర ఆకును శుభ్రంగా కడగాలి.
బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక గోంగూర ఆకు వేసి వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి
ఒక పాత్రలో కొర్ర అన్నం, గోంగూర పేస్ట్, ఉప్పు, పోపు వేసి బాగా కలపాలి.
కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
మురుకులు
కావలసినవి:
కొర్రపిండి - అరకిలో; మినప్పిండి - పావు కిలో; జీలకర్ర - టేబుల్ స్పూను; నువ్వులు - 2 టేబుల్‌స్పూన్లు; ఉప్పు - తగినంత; వాము - టీ స్పూను; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా; ఇంగువ - కొద్దిగా; మిరియాల పొడి - అర టీ స్పూను
తయారి:
ఒక పెద్ద పాత్రలో కొర్రపిండి, మినప్పిండి వేసి కలుపుకోవాలి;
జీలకర్ర, మిరియాలపొడి, ఇంగువ, నువ్వులు, కొద్దిగా నూనె జత చేయాలి;
నీళ్లు పోస్తూ, జంతికల పిండి మాదిరిగా కలుపుకోవాలి;
బాణలిలో నూనె పోసి కాచాలి;
మురుకుల అచ్చులో పిండి ఉంచి, నూనెలో మురుకులను చుట్టలా వేసి వేగాక పేపర్ న్యాప్‌కిన్ మీదకు తీసుకోవాలి.
అంబలి
కావలసినవి:
రాగిపిండి - 2 టేబుల్ స్పూన్లు, నీరు - అర లీటరు, మజ్జిగ - గ్లాసు (పల్చగా ఉండాలి), ఉప్పు - తగినంత, జీలకర్ర పొడి - టీ స్పూను, కొత్తిమీర - కొద్దిగా
తయారి:
నీళ్లను ఒక గిన్నెలో మరిగించాలి.
చిన్న గిన్నెలో కొద్దిగా చల్లటి నీరు పోసి, అందులో రాగిపిండి వేసి, ఉండలు లేకుండా కలపాలి .
మరుగుతున్న నీటిలో రాగిపిండి వేసి మంట తగ్గించి ఉడికించి దించేయాలి.
చల్లారాక మజ్జిగ, ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలపాలి.
సర్వ్ చేసే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
తెలుసుకుందాం...
చిరుధాన్యాలు అతి తేలికగా జీర్ణమవుతాయి.
మలబద్దకం రాకుండా రక్షిస్తాయి.
శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.
పోషకపదార్థాలు ఎక్కువ.
అసిడిటీ రాకుండా కాపాడతాయి.
ఖనిజలవణాలు, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి.
తక్కువ శాతం గ్లూకోజ్‌ను విడుదల చేస్తాయి.
వరి, గోధుమల కంటె వీటిలో క్యాల్షియం పదిరెట్లు ఎక్కువ.
కర్టెసీ: అర్చన
ఆహార్ కుటీర్, బేగంపేట్, హైదరాబాద్
సేకరణ: డా. వైజయంతి
ఫొటోలు: అమర్ జి.