ఒక కాగితం దాని మీద ఒక సంతకం తాలూకు బలం ఆర్చనకు తెలిసినట్టుగా మరొకరికి తెలియదేమో. బెంగళూరుకు చెందిన ఈ సోషల్ యాక్టివిస్టు ‘మంత్రిగారూ... ఈ స్కూళ్ల టాయ్‌లెట్లు ఎప్పుడు బాగుపడతాయి’ అని ఒక కాగితం మీద రాసి ట్విట్టర్‌లో సంతకాలు ఆహ్వానిస్తే 8 వేల మంది చకచకా సంతకాలు చేశారు. పాఠశాల విద్యామంత్రి ఉలిక్కి పడ్డారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశంలో 100 కోట్లు స్కూళ్ల టాయ్‌లెట్లకు కేటాయించారు. అర్చనను అందరూ ‘నింజా’ అని పిలుస్తారు ముద్దుగా. ఫైట్ చేయడం తెలిసిన వారిని నింజా అనడమే కరెక్ట్ కదా.
మార్చి 28న హోలీ పండగ. కాని అర్చన నాలుగైదు రోజుల నుంచే తన ట్విటర్ ఖాతా ద్వారా నీళ్ల పొదుపు గురించి బెంగళూరు వాసులకు సూచనలు చేయడం మొదలుపెట్టేసింది. ‘రంగులు చల్లుకున్న తర్వాత మీ స్నానాన్ని 8 నిమిషాల్లో పూర్తి చేయండి. ఒక్క బకెట్టు నీళ్లలో శుభ్రపడటానికి ప్రయత్నించండి. మీరు కొంటున్న నీళ్లు వాస్తవానికి వాటి రేటు కంటే ఖరీదైనవి’ అని ప్రచారం చేస్తోంది.
28 ఏళ్ల అర్చన కె.ఆర్ బెంగళూరు వాసులకు సోషల్ యాక్టివిస్ట్‌గా సుపరిచితురాలు. తనని తాను ‘శానిటేషన్, మెన్‌స్ట్రునల్ హైజీన్ యాక్టివిస్ట్’ గా చెప్పుకోవడానికి ఇష్టపడుతుంది. ఆమెకు ‘రీప్‌బెనిఫిట్’ సంస్థ తరఫున పని చేస్తుంది. ఆ సంస్థకు ‘సాల్వ్ నింజా’ అనే యాప్ ఉంది. ఈ యాప్ ద్వారా బెంగళూరులో నగర సమస్యలు, నగరంతో ముడిపడిన పౌర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడం, పౌరులే పరిష్కరించుకునేలా చేయడం గురించి అర్చన పని చేస్తుంది. ‘సాల్వ్ స్మాల్ డెంట్ బిగ్’ అనేది వీరి నినాదం. ‘నగరంలో నివసించడానికి అందరూ ఇష్టపడతారు. కాని నగర సమస్యలను పరిష్కరించడంలో కేవలం ఒక శాతం మంది మాత్రమే శ్రద్ధ వహిస్తారు. మన నగరాన్ని బెటర్‌గా చేసుకోవడం మనందరి బాధ్యత’ అంటుంది అర్చన. యువతీ యువకులను ఈ బాధ్యతలోకి మళ్లించడానికి కూడా అర్చన పని చేస్తుంది. ‘యువతే భవిష్యత్తులో మంచి లీడర్లు కావాలి. అందుకని వారికి ప్రజాస్వామ్యంలో అధికార స్థానాల్లో ఉండటం ఎంత అవసరమో కూడా నేను తెలియచేస్తుంటాను. అందుకోసమే ‘డెమొక్రసీ ఎక్స్‌ప్రెస్’ వంటి శిక్షణా తరగతులు కూడా ఇస్తాను’ అని అర్చన అంటుంది.
తన సమస్య నుంచి అందరి సమస్య చూసి
అర్చనది కర్ణాటకలోని హస్సన్ ప్రాంతం. ‘నేను కూడా అందరిలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నాను. కాని ఆ పాఠశాలల్లో టాయ్‌లెట్లు సరిగ్గా ఉండేవి కావు. అందుకని నేను స్కూల్ తరచూ ఎగ్గొట్టేదాన్ని. పెద్దయ్యాక సామాజిక రంగంలో పని చేయడం మొదలెట్టాక ఆ పరిస్థితి ఎలా ఉందో అని తెలుసుకుందామనుకున్నాను. కర్ణాటకలో దాదాపు 300 ప్రభుత్వ స్కూళ్లు చూశాను. కాని 70 శాతం స్కూళ్ల టాయ్‌లెట్లు పనికి రాకుండా ఉన్నాయి. అబ్బాయిలు ఎక్కడో ఒక చోట పని కానిస్తారు. కాని అమ్మాయిలకు వేరే మార్గం లేదు. వారు బడి మానేయాల్సిందే. ఒకమ్మాౖయెతే స్కూలుకు వచ్చి స్కూలు నుంచి వెళ్లేదాకా నీళ్లే తాగను అని చెప్పింది టాయ్‌లెట్‌కు వెళ్లాల్సి వస్తుందని. అందుకే దీనిమీద ఎంత దూరమైనా వెళ్లి పోరాడాలనుకున్నాను’ అంది అర్చన.
సంతకాల ఉద్యమం
కర్ణాటకలో ప్రభుత్వ బడుల్లో టాయ్‌లెట్ల మెరుగుకు అర్చన ‘ఛేంజ్‌డాట్‌ఆర్గ్’ ఫౌండేషన్ సాయంతో సంతకాల ఉద్యమం మొదలెట్టింది. ‘ప్రభుత్వ బడులలో టాయ్‌లెట్ల మెరుగుకు ఉద్యమం’ పేరుతో తొలి సంతకం తాను చేసి ఆన్‌లైన్ పిటిషన్ మీద సంతకాలు ఆహ్వానించింది. ఆమె గ్రౌండ్ వర్క్, ఆమె పెట్టిన దారుణమైన టాయ్‌లెట్ల ఫొటోలు చూసి పౌరులు స్పందించారు. 7000 మంది సంతకాలు చేశారు. ఈ సంతకాల ఉద్యమం దావానలంలా వ్యాపిస్తూ ఉండటంతో రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖా మంత్రి ఎస్.సురేశ్ కుమార్ స్పందించారు. ‘నేను ఈ పరిస్థితిని చక్కదిద్దుతాను’ అని ట్విటర్‌లోనే అర్చనకు సమాధానం ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రికి ఏమి చెప్పుకున్నారో ఏమో మార్చి మొదటివారంలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి యడ్యూరప్ప 100 కోట్ల రూపాయల నిధులు స్కూళ్ల టాయ్‌లెట్ల మరమ్మతులకు మంజూరు చేశారు. ‘ఇది మనందరి విజయం. మన పోరాటం గెలిచింది’ అని అర్చన వ్యాఖ్యానించింది. కేవలం అర్చన సంకల్పం, పోరాటం వల్ల ఈ మంచి పని సాధ్యమైందని చెప్పవచ్చు.
హైవేల పై మరుగుదొడ్ల కోసం...
అర్చన స్కూళ్ల గురించే కాదు హైవేల పై శుభ్రమైన మరుగుదొడ్లు ముఖ్యంగా స్త్రీలకు అవసరం అని మరో ఉద్యమం మొదలు పెట్టింది. ఎన్‌హచ్ 75 మీద తిరుగుతూ ఈ దారిలో మరుగుదొడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో వీడియో రికార్డులు చేసింది. స్త్రీలు ప్రయాణిస్తూ మరుగుదొడ్లు లేకపోవడం వల్ల పడే ఇబ్బందులు తెలియ చేయడం వల్ల హైవేల మీద కొత్త మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ‘షీ డిమాండ్ ఛేంజ్’ అని ఈ ఉద్యమానికి అర్చన పేరు పెట్టింది. నిజమే. మనం మన హక్కులను డిమాండ్ చేయడం మర్చిపోయాం. డిమాండ్ చేస్తే పనులు జరుగుతాయన్న నమ్మకాన్ని కూడా కోల్పోయాం. కాని అర్చనకు హక్కులను పోరాడి సాధించుకోవడం మీద నమ్మకం ఉంది. సంతకానికి ఉన్న శక్తి గురించి కూడా అవగాహన ఉంది. ఆ అవగాహనను అందరూ అందుకోవాల్సి ఉంది. ఈసురోమని బతకడం అలవాటు చేసుకున్నవారికి ఒక దిక్సూచి అర్చన.
Comments
Please login to add a commentAdd a comment