బహిర్భూమికి ఇంటికెళ్లాల్సిందే
జగిత్యాల రూరల్ జాబితాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో దయనీయ పరిస్థితి.. తమ పిల్లల టీసీల కోసం తల్లిదండ్రుల డిమాండ్
జగిత్యాల రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేక విద్యార్థినులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారే కరువయ్యారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో 77 మంది విద్యార్థులున్నారు. వీరిలో 37 మంది బాలికలు, 40 మంది బాలురు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలో 62 మంది విద్యార్థుల్లో 36 మంది బాలికలు, 26 మంది బాలురు ఉన్నారు.
గతంలో నిర్మించిన మరుగుదొడ్లు, మూత్రశాలలు శిథిలావస్థకు చేరడంతో కూల్చేశారు. వాటి స్థానంలో ఉపాధి హామీ కింద పాఠశాలకు ఒకటి చొప్పున రెండు మూత్రశాలల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. పనులు కొనసాగుతుండగానే జిల్లా అధికారులు నిధులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫలితంగా పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి రెండు పాఠశాలల్లో ఉన్న మొత్తం 139 మంది విద్యార్థులకు ఒకే మూత్రశాల గతి అయ్యింది.
బహిర్భూమికి విద్యార్థులు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచుతున్నారు. పిల్లలకు టీసీలు ఇస్తే పాఠశాల ఎలా నడిపేదని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment