బాలిక అనుమానాస్పద మృతి
మృతురాలిది నరసరావుపేట మండలం
సింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : పెద్దలు కుదిర్చిన వివాహం కాదని, ప్రియుడి చేతిలో మోసపోయి కన్నవారికి కడుపుకోత మిగిల్చి కానరానిలోకాలకు వెళ్లింది ఓ అభాగ్యురాలు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉలవపాడు గ్రామానికి చెందిన దాసరి అమరేశ్వరరావు (21)కి, గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిమర్రు గ్రామానికి చెందిన దొడ్డి అర్చన (16) మధ్య రెండేళ్ల క్రితం పరిచయమైంది. బాలిక కుటుంబం వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం తిరుమల వెళుతుండగా రైలు ప్రయాణంలో వీరిద్దరి మధ్య ప్రేమకు అంకురార్పణ జరిగింది. అమరేశ్వరరావు గతేడాది బీటెక్ పూర్తిచేశాడు.
అర్చన రెండేళ్ల క్రితం 10వ తరగతితో చదువుకు స్వస్తిచెప్పింది. పెద్దలు ఆగస్టు 15వ తేదీ వివాహం నిశ్చయించడంతో 13వ తేదీ రాత్రి అర్చన ఇంట్లో నుంచి పారిపోయి అమరేశ్వరరావు వద్దకు చేరింది. ఆ తర్వాత వీరు ఒంగోలులో సినిమాకు కూడా వె ళ్లారు. ఈ నెల 15వ తేదీ అర్చనను అమరేశ్వరరావు సింగరాయకొండ బాలాజీనగర్‌లోని తన స్నేహితుడు చాట్ల సురేష్ ఇంట్లో ఉంచాడు. 16వ తేదీ అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో నోట్లో నుంచి నురగకక్కుకుంటుండగా అర్చనను తీసుకుని అమరేశ్వరరావు, కందుకూరుకు చెందిన మరో స్నేహితుడు రావినూతల ప్రతాప్ సహాయంతో మోటారు సైకిల్‌పై పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్థారించారు.
అక్కడి నుంచి మోటారుసైకిల్‌పై మృతదేహాన్ని తీసుకెళుతుండగా బీట్ కానిస్టేబుల్ రమేష్ అనుమానించి పట్టుకున్నారు. విచారణ చేయగా వారిది ఉలవపాడు అని, ఆ అమ్మాయి ప్రియురాలని, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని తేలింది. వెంటనే సమాచారాన్ని ఉలవపాడు ఎస్‌ఐకి అందించి వీరు చెప్పింది నిజమేనని నిర్ధారించుకుని పోలీసులు అమరేశ్వరరావు, ప్రతాప్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కేసును జరుగుమల్లి ఇన్‌చార్జి ఎస్‌ఐ శ్రీరామ్ విచారణ చేస్తున్నారు. బాలిక మృతదేహాన్ని కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఎస్‌ఐ శ్రీరామ్‌ను వివరణ కోరగా పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే వివరాలు తెలుస్తాయని తెలిపారు.
మా బిడ్డను పొట్టనపెట్టుకున్నాడు
అర్చన ఇష్టం మేరకే వివాహం కుదిర్చాం. అమరేశ్వరరావు మాయమాటలు నమ్మి ఇంట్లో నుంచి పారిపోయింది. మా అమ్మాయిని అప్పగించమని బతిమిలాడాం. అక్కడికి రండి, ఇక్కడికి రండి అని తిప్పించాడు. చివరికి మా బిడ్డను పొట్టనపెట్టుకున్నాడు.
- పద్మావతి, అర్చన తల్లి
మాయమాటలతో వంచించాడు..
మాది వ్యవసాయ కుటుంబం. కల్లాకపటం తెలియని నా కూతురిని అమరేశ్వరరావు మాయమాటలతో వంచించాడు. ఇటువంటి వాడిని టీవీలో ప్రజలందరికీ చూపించి కఠినంగా శిక్షించాలి.
- వెంకటేశ్వర్లు, అర్చన తండ్రి
ప్రియుడి కోసం వచ్చి మృత్యువాత
Published Mon, Aug 18 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM
Advertisement