హీరోయిన్స్ కెరీర్ తల్లి పాత్రలతో ఎండ్ అవుతుందనే అభిప్రాయం ఉంది సినీఫీల్డ్‌లో! కానీ అర్చనా జోయిస్ సినీ ప్రయాణమే తల్లి పాత్రతో మొదలైంది. ‘కేజీఎఫ్’లో రాకీ భాయ్‌కి అమ్మగా నటించి, దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకుంది. వరుస సినీ, సిరీస్ అవకాశాలతో అదరగొడుతున్న ఆమె గురించి కొన్ని వివరాలు...
అర్చన పుట్టి పెరిగిందంతా కర్ణాటకలోని రామనాథపురలో. నాన్న శ్రీనివాసన్, అమ్మ వీణ.. ఇద్దరూ ప్రైవేటు టీచర్లు. అర్చనకు క్రమశిక్షణతో పాటు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం నేర్పించారు.
చిన్నప్పటి నుంచే సంగీతం, నాట్యంలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. ఇంటర్ తర్వాత డిగ్రీ చేయాలా? లేక నాట్యం వైపు వెళ్లాలా? అనే సందిగ్ధంలో పడింది.
మామూలు డిగ్రీలో జాయిన్ అయితే బాల్యం నుంచి ప్రేమించిన నాట్యానికి దూరమవుతానేమో అని భావించి, బెంగళూరు యూనివర్సిటీ, నాట్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కథక్ అండ్ కొరియోగ్రఫీలో చేరింది. మూడేళ్ల ఆ డిగ్రీలో పట్టా పొంది, దేశవిదేశాల్లో నృత్యప్రదర్శనలు ఇచ్చింది.
బీఎఫ్‌ఏ చేస్తున్న రోజుల్లోనే ‘మహాదేవి’ సీరియల్ కోసం జరిగిన ఆడిషన్స్‌లో ఆమె పాల్గొంది. ఇచ్చిన డైలాగ్స్‌ని తడబడకుండా బ్రహ్మాండమైన ఫీల్‌తో చెప్పి, ఆ సీరియల్‌లో నటించే చాన్స్‌ని దక్కించుకుంది. అనుకున్నట్టుగానే అది ఆమెకు మంచిపేరే కాదు.. మరెన్నో సీరియల్స్‌లో అవకాశాలనూ తెచ్చిపెట్టింది. అలా వరుస సీరియల్స్ చేస్తూనే చెన్నైలోని పద్మా సుబ్రహ్మణ్యం అకాడమీలో చేరి ఫైన్‌ఆర్ట్స్‌లో మాస్టర్స్ చదివింది.
సీరియల్స్ అంటే ఒకే పాత్రలో నెలల తరబడి నటించడం వల్ల వైవిధ్యానికి చోటుండదు. ఆ వైవిధ్యం కోసమే సమయం చిక్కినప్పుడల్లా నృత్యప్రదర్శనలిస్తూ, కవర్ సాంగ్స్ కూడా చేయడం మొదలుపెట్టింది. అవన్నీ మంచి ఆదరణ పొందాయి. ఆ పర్‌ఫార్మెన్స్ చూసే దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’లో తల్లి పాత్రను ఆఫర్ చేశాడు. అప్పటికి అర్చన వయసు 21ఏళ్లు మాత్రమే. అయినప్పటికీ ఆ పాత్రలో అలవోకగా నటించి, మెప్పించింది. ఆ తర్వాత ‘ఘోస్ట్’, ‘మ్యూట్’ చిత్రాలతోనూ తన ప్రతిభ చాటుకుంది. ‘మాన్షన్ 24’ అనే సిరీస్‌తో వెబ్ దునియాలోకీ అడుగుపెట్టింది. ఆ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. అర్చన నటించిన తాజా చిత్రం ‘యుద్ధ కాండ’ విడుదలకు సిద్ధంగా ఉంది.
సినిమాల్లోకి రాకముందే మా దూరపు బంధువు శ్రేయస్‌తో నాకు పెళ్లయింది. నా నాట్యం, నటనకు వైవాహిక జీవితం ఎప్పుడూ అడ్డు కాలేదు. సినిమా, సిరీస్‌ల వల్లే నాకిష్టమైన డా¯Œ ్సకు కాస్త దూరమయ్యాను. అందుకే ఇకపై నాట్యానికి, నటనకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని, ఎప్పటికీ గర్తుండిపోయే పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాను!
– అర్చనా జోయిస్.
Comments
Please login to add a commentAdd a comment