
సాధారణంగా హీరోయిన్లు వరసపెట్టి సినిమాలు చేస్తుంటారు. కానీ హిట్ కొట్టేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి వాళ్లతో పోలిస్తే కాస్త భిన్నమైన హీరోయిన్ శ్రీనిధి శెట్టి. చేసింది తక్కువ సినిమాలే అయినా కేజీఎఫ్ ఫ్రాంచైజీతో బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇప్పుడు 'హిట్ 3'తో మరోసారి సక్సెస్ అందుకుంది. సరే ఇవన్నీ పక్కనబెడిత ఇంతకీ శ్రీనిధి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే)
ఈమె పూర్తి పేరు శ్రీనిధి రమేశ్ శెట్టి. మంగళూరులో పుట్టి పెరిగిన ఈమె తుళువ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివింది. యాక్సెంచర్ కంపెనీలో జాబ్ తెచ్చుకుంది. ఇందులో జాబ్ చేస్తూనే మోడల్ గానూ పనిచేసింది. అలా 2016 మిస్ సూపర్ నేషనల్ అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. ఈ అవార్డ్ గెలిచిన రెండో దక్షిణాది అమ్మాయిగా రికార్డ్ కూడా సృష్టించింది.
ఇలా మోడల్ గా చాలా పేరు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి.. అనుకోకుండా దర్శకుడు ప్రశాంత్ నీల్ దృష్టిలో పడింది. అలా కేజీఎఫ్ ఫ్రాంచైజీలో ఈమెని హీరోయిన్ గా తీసుకున్నాడు. స్వతహాగా ఇది హీరో సెంట్రిక్ సినిమా అయినప్పటికీ రీనా దేశాయ్ అనే పాత్రలో శ్రీనిధి నటన ఆకట్టుకుంది. అలా ఈమెకు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది.
కేజీఎఫ్ 2 రిలీజైన కొన్నాళ్లకు తమిళంలో విక్రమ్ సరసన 'కోబ్రా' సినిమా చేసింది. ఇది తెలుగులో ఆడలేదు గానీ తమిళంలో మాత్రం మోస్తరు హిట్ గా నిలిచింది. 2022లో కోబ్రా చేసిన శ్రీనిధి.. దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగులోకి 'హిట్ 3'తో పరిచయమైంది.
(ఇదీ చదవండి: సూర్య 'రెట్రో' Day 1 కలెక్షన్.. నాని కంటే తక్కువే)

హిట్ 3 కూడా హీరో సెంట్రిక్ యాక్షన్ మూవీ కావడంతో శ్రీనిధి శెట్టికి ఏమంత ప్రాధాన్య ఉండదులే అని చాలామంది అనుకున్నారు. స్టోరీకి అవసరమయ్యే పాత్ర ఈమెకు దక్కడం, మరోవైపు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో శ్రీనిధి.. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బి అయిపోయింది.
లెక్క ప్రకారం హిట్ 3 ఈమెకు మొదటి తెలుగు సినిమా కాదు. సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' కోసం ఈమెని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ మూవీ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన నాని.. శ్రీనిధిని చూసి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. దీంతో అసలు కంటే ఈ సినిమా ముందొచ్చింది. హిట్ కొట్టేసింది.
మరోవైపు హిందీలో భారీ బడ్జెట్ తో తీస్తున్న 'రామాయణ్'లోనూ శ్రీనిధినే సీతగా ఎంపిక చేశారు. కానీ రావణుడి పాత్ర కోసం యష్ వచ్చేసరికి.. ఈమెకి దక్కిన అవకాశం చేజారిపోయింది. సీత పాత్రలోకి సాయిపల్లవి వచ్చింది. ఏదేమైనా నిదానంగా సినిమాలు చేస్తున్న శ్రీనిధి శెట్టి.. చేసిన ప్రతి మూవీతోనూ హిట్ అందుకోవడం ఇక్కడ విశేషం.
(ఇదీ చదవండి: సూర్యకు ఏమైంది? ఎందుకిలా చేస్తున్నాడు?)
