
శ్రీమఠం ఆదాయ మంత్రం
– అర్చన హారతులకు టికెట్
– రూ. 50గా నిర్ణయం
– సోమవారం రాత్రి నుంచి అమల్లోకి
– అసంతప్తిలో భక్తులు
మంత్రాలయం: శ్రీమఠం ఆదాయ మంత్రాన్ని జపిస్తోంది. మంత్రాలయం గ్రామ దేవత మంచాలమ్మ గుడి నిర్వహణ పూర్తిగా మఠాధీశుల చేతుల్లోకి వెళ్లడంతో అమ్మవారి అర్చన హారతికి పైకం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సద్గురు శ్రీరాఘవేంద్రస్వామికి గ్రామ దేవత మంచాలమ్మ ఆశ్రయం ఇచ్చారని చరిత్ర. అందుకు కతజ్ఞతగా ముందుపూజ మంచాలమ్మకు తదుపరి దర్శనం రాఘవేంద్రుల మూలబందావనానికి నిర్ణయించారు. ఒకప్పుడు మంచాలమ్మ ఆలయం ప్రత్యేకంగా ఉండేది. శ్రీమఠం ఈశాన్య భాగంలోని వెలసిన మంచాలమ్మ గుడిని శ్రీమఠం ప్రాకారంలో కలిపి నిర్మించారు. గ్రామానికి చెందిన లింగాయితీలు మంచాలమ్మ పూజారులుగా కొనసాగుతున్నా మఠా«ధీశుల నిర్ణయమే ఇక్కడ శాసనంగా మారింది. ఇప్పటికే మంచాలమ్మ హుండీ ఆదాయం మఠం ఖాతాలో జమ చేస్తున్నారు. దేవర ఉత్సవాలు, తదితర వేడుకలు గ్రామస్తులే చేస్తున్నా ఆలయ ఆదాయం మాత్రం శ్రీమఠానికి చెందేలా నిర్ణయం తీసుకున్నారు. అమ్మవారి అర్చన సహిత హారతులకు టికెట్ పెట్టేశారు. సోమవారం రాత్రి నుంచి రూ.50 చొప్పున టిక్కెట్ నిర్ణయించి కౌంటర్ సైతం ఏర్పాటు చేసేశారు. గ్రామ భక్తులు సైతం ఇక అర్చన, హారతులు పట్టాలంటే కచ్చితంగా రూ.50 చెల్లించాల్సిందే. దీంతో గ్రామస్తులు, భక్తులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు.
పీఠాధిపతి సూచన మేరకే:
శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు సూచన మేరకే అర్చన సహిత హారతులకు టిక్కెట్ నిర్ణయించాం. సోమవారం రాత్రి నుంచి ఈ విధానం అమల్లో ఉంటుంది. మఠం నియమ నిబంధనలు మేరకు భక్తుల సహకరించాలి.
– శ్రీనివాసరావు, శ్రీమఠం మేనేజర్