నగరంలో తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న లక్ష్మీయాగంలో భాగంగా శుక్రవారం లక్ష్మీదేవి, గోవింద పెరుమాళ్ ...
1008 కేజీల ముత్యాలతో అర్చన
భక్తులతో కిక్కిరిసిన ప్రవచన వేదిక
తిరుపతి గాంధీరోడ్డు : నగరంలో తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న లక్ష్మీయాగంలో భాగంగా శుక్రవారం లక్ష్మీదేవి, గోవింద పెరుమాళ్ కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కమనీయంగా సాగిన కల్యాణ ప్రహసనాన్ని వేలాదిమంది భక్తులు చూసి తరించారు. మహాలక్ష్మీ అమ్మవారి జన్మదినంతో పాటు కల్యాణం కూడా నిర్వహించడంతో భక్తులు పోటెత్తారు. సంప్రదాయబద్ధంగా సాగిన మహాలక్ష్మీ కల్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానముల నుంచి స్వామి వారి శేషవస్త్రాన్ని టీటీడీ ఈవో సాంబశివరావు పంపించారు. టీటీడీ నుంచి వచ్చిన వేద పండితులు స్వామి వారి స్తోత్రాన్ని ప్రవచించారు. దీనికిముందు లక్ష్మీదేవి శ్రీహరి వేదిక వద్ద ఉండగా అక్కడకు గోవిందపెరుమాళ్, గోదాదేవి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చారు. సంప్రదాయబద్ధంగా గోదాదేవి, గోవింద పెరుమాళ్ ఎదురోళి జరిగింది. అనంతరం గోవింద పెరుమాళ్‌ను లక్ష్మీదేవి వద్దకు తీసుకెళ్లి కల్యాణం జరిపించారు.
భాష్యకార్లు పీఠాధిపతి శ్రీఅనం త విభూషిత రామచంద్ర జీయర్ స్వామి కల్యాణ ప్రవాసనాన్ని జరిపించారు. కల్యాణానంతరం 20 గంగాళాలతో తీసుకుని వచ్చిన 1008 ముత్యాలతో అభిషేకం చేశారు. కల్యాణోత్సవం అర్ధరాత్రి వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, బీజేపీ నాయకుడు భానుప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. చదలవాడ సుచరిత అమ్మవారికి పట్టువస్త్రాలను బహూకరించారు. ఉదయం లక్ష్మీదేవి ఆవిర్భావం సందర్భంగా 108 గంగాళాలతో పాయసాన్నంను సమర్పించారు. ఉదయం నుంచి భక్తులు చదలవాడనగర్‌కు బారులు తీరారు. మహాలక్ష్మీయాగ నిర్వాహకులు పాలసముద్రాన్ని ఏర్పాటు చేశా రు. ఇందులో పోయడానికి భక్తులు పెద్ద ఎత్తున పాల ప్యాకెట్లను తీసుకుని వచ్చారు. అందులో క్షీరసాగర మథనం చిత్రాలను ఏర్పాటు చేశారు. ఇంకా 60 వంటకాలను కూడా సమర్పించారు. దీనికిముందు సువర్ణ, వెండి పుష్పాలతో అమ్మవారికి అర్చన చేశారు. అర్చనకు ముందు బంగారు పుష్పాలను తాకేందుకు భక్తులు ఎగబడ్డారు.
108 గంగాళాలలో నైవేద్యంగా ఏర్పాటుచేసిన పాయసాన్నంను పలువురు పీఠాధిపతులకు జీయర్ స్వామి సమర్పించారు. తొలి గంగాళాన్ని త్రిదండి చిన్నజీయర్ స్వామికి అందజేయాలని ఆయన తల్లి ఆండాళమ్మకు అందజేశారు. అంనంతరం త్రిదండి శ్రీరంగరామానుజ జీయర్ దేవనాయర్ జీయర్, అహోబిల రామానుజ జీయర్ శఠగోప రామానుజ జీయర్, సేవనాథ జీయర్, నృసింహ జీయర్, త్రిదండి సంపత్‌కుమార్ జీయర్‌లకు అందజేశారు. ఇదిలా వుండగా శుక్రవారం రాష్ట్ర రవాణా శాఖా మంత్రి సిద్దా రాఘవరావు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు పెద్ద ఎత్తున యాగశాలకు చేరుకున్నారు.