కోటి లింగేశ్వరస్వామి | special story to lord siva | Sakshi
Sakshi News home page

కోటి లింగేశ్వరస్వామి

Published Tue, Jul 5 2016 10:41 PM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM

కోటి లింగేశ్వరస్వామి

కోటి లింగేశ్వరస్వామి

పుణ్యతీర్థం

 

విజయవాడ ప్రకాశం బ్యారేజీపైన కృష్ణమ్మ గుండెల మీదుగా ప్రయాణించి, కొస వరకు నడిచి, ఆ చివర కుడివైపుగా సుమారు పది కిలోమీటర్లు ప్రయాణించాలి. సన్నని బాట. బాటకు ఇరువైపులా అరటితోటలు గెలలతో మనతో పాటు కబుర్లు చెబుతూ ప్రయాణిస్తుంటాయి. కొద్దిగా ముందుకు వెళితే, పొట్టిగా ఉన్న మునగచెట్లు, నిండుగా మునగకాడలతో చేతులు కదుపుతుంటాయి. మరికాస్త ముందుకు వెళ్లేసరికి దొండపాదులు వాటి పిల్లల్ని కిందకు వేళ్లాడదీస్తూ కనిపిస్తాయి. ఎంతో అందమైన ప్రకృతిలో ప్రయాణపు అలుపు తెలియకుండా కోటిలింగేశ్వర శైవక్షేత్రానికి చేరుకుంటాం. శివుడిని ధ్యానిస్తూ, ఆలయంలోకి ప్రవేశించ గానే కైలాసన అడుగుపెట్టిన భావన ఒడలెల్లా కలుగకమానదు.

 

పాదరస శివలింగం...
ఆలయంలో ప్రధాన ద్వారం దాటగానే, ఒక పక్క పాదరసంతో రూపొందిన రసలింగేశ్వరుడు దర్శనమిస్తాడు. పాదరసం విడిగా ఉంటే కరిగిపోతుంది కనుక, ఒక గదిలో ఉంచి, ఆయనకు చల్లని గాలులు వీచేలా ఏసి అమర్చారు. అద్దాల ద్వారం గుండా స్వామిని దర్శించుకోవచ్చు. 350 కిలోల పాదరసంతో రూపొందిన శివలింగదర్శనం దివ్యానుభూతిని కలుగచేస్తుంది.

 

ప్రధాన ఆలయం
ఆలయ నిర్మాణం విచిత్రంగా ఉంటుంది. ప్రధాన ఆలయంలో అర్చనలు నిర్వర్తించుకోవడానికి అనువుగా ఒక పక్క శివపార్వతుల ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. మరోపక్క... ఉత్సవాలకు సంబంధించిన రాధాకృష్ణులు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు, సిద్ధిబుద్ధి సమేత వినాయకుడు, సీతా, లక్ష్మణ, హనుమత్సమేత రాములవారు దర్శనమిస్తారు. ఇక ప్రధాన ఆలయంలో శివుడు లింగాకృతిలో దర్శనమిస్తూ, ఆ లింగం మీద నలుదిక్కులా ఆకృతిలో కూడా భక్తులకు కనువిందు చేస్తాడు. ఆలయంలో స్వయంగా అందరూ అభిషేకాలు చేసుకోవచ్చు. ఆ లింగానికి నాలుగు దిక్కుల నుంచి ప్రవేశం ఉంది. నాలుగు దిక్కులకూ నాలుగు నామకరణాలు చేశారు. ముఖద్వారంలో ఒక వైపు వినాయకుడు, మరొక వైపు కుమారస్వామి విగ్రహాలు గోమేధికంతో తయారయినవి ప్రత్యేకంగా పరవశింపచేస్తాయి.

 

మూలవిరాట్టుకు కిందుగా!
పాతాళంగా పిలచే గర్భాలయంలోనూ శివుడు కొలువుతీరి ఉన్నాడు. ఇక్కడ శివుడు కిరీట ధారణతో విలక్షణంగా దర్శనమిస్తాడు. ఇక్కడే భక్తులు ప్రతిష్టించిన కొన్నివందల స్ఫటిక లింగాలు, వాటితో పాటే చిన్నచిన్న రసలింగాలు కూడా సందర్శకుల గుండెల్లో గుడులు కట్టుకుంటాయి.

 
ఇక అక్కడ నుంచి బయటకు వచ్చి ఆలయ ప్రాంగణం పరిశీలిస్తే... ఒక పక్క నవగ్రహాలకు ఆలయాలు వలయాకారంలో నిర్మితమై ఉన్నాయి. నవగ్రహాలు వారి వారి కుటుంబాలతో సహా కొలువుదీరి కనువిందు చేస్తారు. మరో పక్కన నక్షత్ర వృక్షాలు కంటికి ఇంపుగా పచ్చని చిగుళ్లతో, ఆకులతో అలరిస్తాయి. వాటిపై నక్షత్రం పేరు, వృక్షం పేరు రాసి ఉంటాయి.

 
మరోపక్క పన్నెండు రాశులకు సంబంధించిన గంటలతో నిండిన దేవాలయం దర్శనమిస్తుంది. ఆయా రాశుల ముందుకు వచ్చిగంట మోగిస్తారు. ఈ దేవాలయంలో ప్రత్యంగిరాదేవి కొలువుదీరి ఉంది.

 

వివిధ లోహాలతో శివలింగాలు
అక్కడకు నుంచి ఒకటవ అంతస్తులోకి వెళితే... ప్రధాన ఆలయంలో శివలింగంతోపాటు, కుడి పక్కన, ఎడమ పక్కన వివిధ రత్నాలతో రూపొందిన శివలింగాలు మనలను భక్తిపారవశ్యంలో ముంచెత్తుతాయి. ముందుగా రెండున్నర లక్షల విలువ చేసే స్ఫటిక లింగం స్వాగతం పలుకుతుంది. ఆ పక్కన మరకతం, మాణిక్యం, గోమేధికం... వంటి వాటితో రూపొందిన శివలింగాలు కనిపిస్తాయి. శివునికి ఎదురుగా ఉన్న నంది కూడా మరకతంతో రూపొందినదే.


ప్రపంచంలో ఉన్న అన్ని లోహాల శివలింగాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. మహాలింగేశ్వరుడు, అయఃలింగేశ్వరుడు, తామ్ర
లింగేశ్వరుడు, దారు లింగేశ్వరుడు, మరకత లింగేశ్వరుడు, త్రిపుర లింగేశ్వరుడు, ఆరకూట లింగేశ్వరుడు, కాంస్య లింగేశ్వరుడు, నాగ లింగేశ్వరుడు, నీలకంఠేశ్వరుడు... మనలను భక్తిపారవశ్యంలో ముంచెత్తుతారు. ద్వాదశజ్యోతిర్లింగాల ఆకృతులు, క్షేత్రనామాలతో మనలను మంత్రముగ్ధులను చేస్తాయి.

 

లింగప్రతిష్ఠ
కోటి లింగాల ప్రతిష్ఠాపన ధ్యేయంగా ఉన్న ఈ శివాలయంలో భక్తులు స్వయంగా లింగప్రతిష్ఠ చేయడం విశేషం. ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మికతతో ఇక్కడి దేవాలయంలో ప్రతిష్ఠాపన జరుగుతుంది. భక్తులు వారి వారి శక్తిసామర్థ్యాలను బట్టి ఇక్కడ లింగప్రతిష్ఠ జరుపుతారు.

 

తాళ్లాయపాలెం గ్రామం
గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలంలో, మందడం పంచాయితీకి చెందిన తాళ్లాయపాలెం కొత్తరాజధాని తుళ్లూరుకు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో కొలువుతీరి ఉంది. ఇబ్రహీం పట్టణం, తాడేపల్లి, మంగళగిరి, విజయవాడలు నలుదిక్కులా ఉన్నాయి. గుంటూరు కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉంది ఈ క్షేత్రం.  - డా. పురాణపండ వైజయంతి  సాక్షి, విజయవాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement