వేయి మునుల కుదురు యనమలకుదురు
సందర్శనీయం
కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని యన మలకుదురు గ్రామంలో ‘మునిగిరి’ అనే పేరు గల కొండపై శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం కొలువై ఉంది. శివుడు ఇక్కడ ‘రామలింగేశ్వరుడు’గా ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ శివుడు స్వయం భువుగా వెలిశాడు. ఈ దేవాలయంలో శివుడిని వాయులింగంగా కొలుస్తారు.
చరిత్ర
ఒకప్పుడు యనమలకుదురు ప్రాంతం ఎంత ప్రశాంతంగా, తపస్సుకు యోగ్యంగా ఉండేదని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అందువల్లనేమో... విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చి శివుని కోసం తపస్సు చేసుకున్నాడట. ఆ సమయంలోనే అక్కడ వేయి మంది మునులు కొలువు తీరి, యజ్ఞం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. క్షత్రియ లక్షణాలున్న పరశురాముడు, వారు చేస్తున్న యజ్ఞాన్ని రాక్షసుల బారి నుంచి రక్షించాడు. యజ్ఞ పరిసమాప్తి అయ్యాక ఆ ప్రాంతంలో పరశురాముడు శివలింగాన్ని ప్రతిష్టించి ప్రాణప్రతిష్ఠ చేశాడని స్థలపురాణం చెబుతోంది. ఆయన ప్రతిష్ఠ చేసిన కారణంగానే ఇక్కడి శివుడిని రామలింగేశ్వరుడుగా భక్తులు ప్రేమగా భక్తితో, పిలుచుకుంటారు.ఈ గిరి చుట్టూ వేయి మంది మునులు కూర్చుని శివుని గూర్చి తపస్సు చేశారు కనుక, ఈ ప్రాంతాన్ని ‘వేయి మునుల కుదురు’ అని పిలిచారు. వేయి మునుల కుదురు అంటే వెయ్యి మంది మునుల సమావేశం అని అర్థం. కాలక్రమేణా స్థానికుల భాషలో ఇది యనమలకుదురుగా మారిపోయింది. భూమి మీద 612 అడుగుల ఎత్తులో ఉన్న ఈ మునిగిరి కొండ ముఖద్వారంలో ఎత్తయిన హనుమంతుడు స్వాగతం పలుకుతాడు. ఇక్కడ మహాశివరాత్రిని వైభవంగా నిర్వర్తిస్తారు.
చేరుకోవడానికి మార్గాలు...
బస్ మార్గం: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. విజయవాడకు కేవలం 5 కి.మీ. దూరం.
రైలు మార్గం: అతి సమీప ైరె ల్వే స్టేషను విజయవాడ. కేవలం 8 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ నుంచి దేవాలయం వరకు బస్సులు, ఆటోరిక్షాలు అందుబాటులో ఉన్నాయి.
- డా. పురాణపండ వైజయంతి