Yanamalakuduru
-
మీకు వారసుడిని ఇవ్వలేను.. భర్తకు మెసేజ్ పెట్టి..
సాక్షి, కృష్ణా జిల్లా: యనమలకుదురులో విషాదం చోటుచేసుకుంది. ఐదు నెలల గర్భిణీ సందు కావ్య శ్రీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కావ్య శ్రీ మొదటి కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది. విజయవాడలో స్కానింగ్ తీయించిన భర్త శ్రీకాంత్.. ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు. ఇష్టం లేదని పలుమార్లు భర్త శ్రీకాంత్‌కు కావ్యశ్రీ చెప్పిన కానీ తమకు వారసుడిని ఇవ్వాలంటూ అత్త, మామ వేధింపులకు పాల్పడ్డారు.శ్యామ్ అనే కానిస్టేబుల్ స్కానింగ్ తీసుకెళ్లాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు తన భర్తకు మెసేజ్ చేసిన కావ్య శ్రీ.. మీకు వారసుడిని ఇవ్వలేనంటూ భర్తకు మెసేజ చేసింది. పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కృష్ణానదిలో విద్యార్థుల గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
-
Yanamalakuduru Bridge: రక్తికట్టని మాజీ ఎమ్మెల్యే బోడే డ్రామా
పెనమలూరు(కృష్ణా జిల్లా): యనమలకుదురు పరిధిలో బందరు కాలువపై అసంపూర్తిగా మిగిలిన వంతెన నిర్మాణంపై మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వింత నాటకాలకు తెరలేపారు. ప్రతిపక్షంలో ఉండగా వంతెన శిలాఫలకానికి పిండ ప్రదానాలు చేసి ప్రజలపై కల్లబొల్లి ప్రేమ కురిపించిన ఆయన.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినా వంతెన నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వంతెన నిర్మాణంపై దృష్టి సారిస్తుండటంతో అక్కసుతో కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై నిర్మాణానికి మోకాలడ్డారు. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారాన్ని రాజకీయ స్వలాభం కోసం పచ్చనాటకానికి తెరలేపారు. అధికారంలోకి వచ్చినా నిర్లక్ష్యం.. టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత వంతెన నిర్మాణానికి కాంట్రాక్టర్ అగ్రిమెంట్ రాశారు. అయితే ఆయన వెంటనే పనులు ప్రారంభించలేదు. జలరవాణాకు వంతెన అడ్డుగా ఉంటుందని సాకు చూపి వంతెన పనులు టీడీపీ ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో యనమలకుదురు ప్రజలు దిక్కుతోచక లాకుల మీదుగా నానా ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగించారు. తరచూ ట్రాఫిక్ ఇక్కట్లతో ఈ ప్రాంత ప్రజలు అగచాట్లు పడ్డారు. అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేగా ఉన్న బోడె ప్రసాద్ వంతెన నిర్మాణంపై ఏమాత్రం చొరవ చూపలేదు. కాంట్రాక్టర్‌తో చెట్టాపట్టాల్ వేసుకుని కాలం గడిపారు. గతంలో బోడె ప్రసాద్ వంతెన కోసం ఆందోళనలు చేసి గ్రామస్తులను దగా చేశారు. ఆలస్యంగా పనులు ప్రారంభం.. యనమలకుదురు వంతెన అగ్రిమెంట్ రాసిన తర్వాత పూర్తి స్థాయిలో పనులు 2016లో ప్రారంభించారు. గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ రామవరప్పాడు వద్ద రైవస్ కాలువపై వంతెన నిర్మాణం పనులు ప్రారంభించి, సకాలంలో పూర్తి చేశారు. వంశీ వంతెన పనులు చకచకా పూర్తి చేయటంతో అప్పటివరకు నిద్రావస్థలో ఉన్న బోడె ప్రసాద్ నిద్రలేచి వంతెన పనులు ప్రారంభించారు. తన వలనే వంతెన పనులు ఆలస్యంగా ప్రారంభించామని యనమలకుదురు గ్రామసభలో బోడెప్రసాద్ బహిరంగంగానే క్షమాపణలు చెప్పారు. కాంట్రాక్టర్‌కు బిల్లు ఎగ్గొట్టిన టీడీపీ.. యనమలకుదురు వంతెన పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు టీడీపీ ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోయే నాటికి రూ 3.60 కోట్ల వరకు బిల్లులు చెల్లించలేదు. టీడీపీ పాలనలో కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించే బాధ్యత బోడెప్రసాద్‌పై ఉన్నా ఆయన పూర్తి నిర్లక్ష్యం చూపాడు. దీంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ పథకం ప్రకారం వంతెన పనులు నిలుపుదల చేశాడు. మరో కాంట్రాక్టర్‌తో వంతెన పనులు చేయించాలని ప్రభుత్వం సిద్ధపడగా కాంట్రాక్టర్ కోర్టు స్టే తెచ్చుకున్నాడు. వంతెన పనులు విషయంలో కాంట్రాక్టర్ సహకరించక పోవటంతోనే అసలు సమస్య వచ్చింది. కాంట్రాక్టర్‌కు రూ. 4 కోట్లు బిల్లులు చెల్లించటానికి అధికారులు చర్యలు చేపట్టారు. కాంట్రాక్టర్ బిల్లులు రావాలనే ఉద్దేశంతోనే నేడు బోడెప్రసాద్ వంతెన నాటకానికి తెరలేపారని గ్రామస్తులు మండి పడుతున్నారు. బోడె ప్రసాద్ అరెస్టు.. యనమలకుదురు వంతెన వద్ద శాంతి భద్రతలకు భంగం కలిగించిన మాజీ ఎమ్మెల్యే బోడెప్రసాద్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. యనమలకుదురు వంతెన వద్ద మంగళవారం బోడెప్రసాద్ వంద మందితో వెళ్లి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటమే కాకుండా బందరు కాలువలో దూకుతానని బెదిరించారు. ఈ ఘటనపై పోలీసులు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, బోడెప్రసాద్, మరో వంద మందిపై కేసు నమోదు చేశారు. వారికి నోటీసులు ఇచ్చి, బోడెప్రసాద్, అనుమోలు ప్రభాకరరావును అరెస్టు చేసినట్లు పెనమలూరు సీఐ ఆర్.గోవిందరాజు తెలిపారు. వంతెన కథ ఇది.. యనమలకుదురులో బందరు కాలువపై వంతెన నిర్మాణం చేయాలని 2011లో సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అప్పుడు మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి రూ. 8 కోట్లు మంజూరు చేశారు. అయితే అనుకున్న సమయానికి పనులు జరగక పోవటంతో ప్రతిపక్షంలో ఉన్న బోడె ప్రసాద్ శిలాఫలకం వద్ద పిండ ప్రదానం, కర్మకాండలు నిర్వహించి పచ్చ మీడియా ప్రచారంతో వార్తల్లోకెక్కారు. (క్లిక్ చేయండి: ఇప్పటం పిటిషనర్లకు ఏపీ హైకోర్టు షాక్) వంతెన పనులు పూర్తి చేస్తాం.. యనమలకుదురు వంతెనకు సంబంధించిన బిల్లులు వెంటనే చెల్లించే విధంగా చర్యలు చేపట్టాం. పనులు కూడా ప్రారంభించి త్వరిత గతిన పూర్తి చేస్తాం. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకుంటున్నాం. – కృష్ణారావు, ఈఈ, నీటిపారుదల శాఖ -
యనమలకుదురు వంతెన విషయంలో టీడీపీ డ్రామాలు
-
యనమలకుదురు వంతెన విషయంలో టీడీపీ డ్రామాలు
-
యనమలకుదురులో కొత్త డ్రామాకు తెరదీసిన టీడీపీ
సాక్షి, విజయవాడ: యనమలకుదురు కేంద్రంగా టీడీపీ డ్రామాలకు తెరతీసింది. కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లడంతో యనమలకుదురు వంతెన పనులు నిలిచిపోయాయి. కేసు కోర్టులో ఉందని తెలిసి కూడా టీడీపీ డ్రామా ఆడటం మొదలుపెట్టింది. ఈ డ్రామాలకు నిరసనగా వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ హయాంలో ఈ బ్రిడ్జికి శంకుస్థాపన జరగగా, తర్వాత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆనాడు వంతెన పనులను టీడీపీ ఏ మాత్రం పట్టించుకోలేదు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే పార్థసారథి వంతెన పనులు పూర్తయ్యేందుకు చొరవ చూపిస్తున్నా టీడీపీ నాయకులు నాటకాలు ఆడుతుండటం గమనార్హం. చదవండి: (ఏలూరులో లారీడ్రైవర్పై మోటార్ వెహికల్ ఇన్సెపెక్టర్ దాష్టీకం) -
ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన అవినాష్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు పెద్ద పీట వేశారని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుపరిపాలన అందిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ అన్నారు. రాష్ట్రంలో అర్హులైన వారికి ఉచితంగా ఇల్లు ఇస్తున్నారన్నారు. మహిళల పేర్లతో ఇళ్ల పట్టాలిస్తున్నామని తెలిపారు. ఆదివారం ఆయన యనమాలకుదురులో మెగా టౌన్షిప్లో అర్హులైన మూడు వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 634 మందికి టిడ్కో ఇళ్ల పత్రాలు పంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దమ్మున్న నాయకుడు సీఎం జగన్ పేద ప్రజలకు అండగా ఉన్నారని అభయమిచ్చారు. సీఎం జగన్ 30 లక్షల మందికి ఇల్లు ఇచ్చారని తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు హామీలకే పరిమితమైతే సీఎం జగన్ పాదయాత్రలో చెప్పిన హామీలు నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. ఇక తూర్పు నియోజకవర్గంలో 30 వేల మందికి అమ్మ ఒడి వస్తుందన్నారు. (చదవండి: ప్రధాని ప్రశంసలు సైతం దక్కాయి: దేవినేని అవినాష్) -
ఆ నలుగురిలో సజీవంగా..
లబ్బీపేట (విజయవాడ తూర్పు): రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయమై బ్రెయిన్ డెడ్‌కు గురైన యువకుడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. తమ కొడుకు కళ్లెదుట లేకున్నా.. మరో నలుగురిలో సజీవంగా ఉండాలన్న ఆశయంతో అవయవదానానికి ముందుకొచ్చారు. కృష్ణా జిల్లా యనమలకుదురు కట్ట ప్రాంతంలో నివసించే సంభాన దుర్గాప్రసాద్ (23) ప్రయివేటు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. ఈ నెల 21న ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స కోసం కానూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు దుర్గాప్రసాద్‌ను పరీక్షించి బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు నిర్ధారించారు. ఎంత ఖరీదైన వైద్యం చేసినా ఫలితం ఉండదని, అవయవదానం చేస్తే మరికొందరికి ప్రాణదానం చేయవచ్చని కుటుంబీకులకు వివరించారు. కొడుకు చనిపోతున్నాడనే బాధలోనూ తల్లిదండ్రులు మంచి ఆశయంతో అవయవదానానికి సమ్మతించారు. ‘సన్‌రైజ్’లో అవయవాల సేకరణ బ్రెయిన్‌డెడ్‌కు గురైన యువకుడిని జీవన్‌దాన్ అనుమతి ఉన్న సన్‌రైజ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మరోసారి న్యూరోసర్జన్, న్యూరాలజిస్ట్‌ల బృందం పరిశీలించి బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించిన అనంతరం అవయవాలను సేకరించారు. గుండెను చెన్నై గ్లోబల్ ఆస్పత్రికి, కిడ్నీలు సన్‌రైజ్, ఆయుష్ ఆస్పత్రులకు, లివర్‌ను ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. గుండెను ప్రత్యేక అంబులెన్స్ ద్వారా గన్నవరం, అక్కడి నుంచి విమానంలో చెన్నైకి తరలించారు. పోలీసులు అంబులెన్స్‌కు గ్రీన్ చానల్ ఏర్పాటు చేయడంతో సన్‌రైజ్ ఆస్పత్రి నుంచి గన్నవరం విమానాశ్రయానికి 19 నిమిషాల్లోనే చేరుకుంది. పోలీసులకి సన్‌రైజ్ ఆస్పత్రి అధినేత డాక్టర్ ఎం.నరేంద్రకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. -
కార్తీక పూజలకు ప్రత్యేకంగా శివుడి విగ్రహం
యనమలకుదురు (పెనమలూరు) : కార్తీకమాసం సందర్భంగా పూజలు భక్తులు చేసుకోవటానికి యనమలకుదురు శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయంలో ప్రత్యేకంగా ఇత్తడితో చేసిన శివుడి విగ్రహాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. దాత సంగా నరసింహారావు, ఆయన సతీమణి విజయలక్ష్మి ఈ శివుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో ఆయల కార్యనిర్వహణాధికారిణి ఎన్.భవానీ, అర్చకులు పాల్గొన్నారు. -
దొంగ బిల్లులే..!
యనమలకుదురు గ్రామ పంచాయతీలో నకిలీ బిల్లు యనమలకుదురు ‘పంచాయితీ’ అక్రమాల్లో కొత్త కోణం బిల్లులో పేర్కొన్న సంస్థ లేదని తేల్చిన డీసీటీవో పెనమలూరు : యనమలకుదురు గ్రామ పంచాయతీలో నకిలీ బిల్లులతో నిధులు డ్రా చేసినట్లు వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. పంచాయతీలో చూపిస్తున్న బిల్లుల్లో పేర్కొన్న వ్యాపార సంస్థలేమీ లేవని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ధ్రువీకరించారు. దీంతో నకిలీ బిల్లులతో నిధులు డ్రా చేసినట్లు స్పష్టమవుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు... యనమలకుదురు పంచాయతీ కార్యదర్శిగా రామకోటేశ్వరరావు 2015లో పని చేశారు. ఆ సమయంలో పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ పరికరాల కొనుగోలు, వాటర్ వర్క్స్, ఇతర పనులకు సంబంధించి నకిలీ బిల్లులు పెట్టి రూ.50లక్షలకు పైగా నిధులు డ్రా చేశారు. పంచాయతీ పాలకవర్గ ఆమోదం లేకుండానే ట్రెజరీ నుంచి కాకుండా నేరుగా ఈ నిధులు డ్రా చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు.. నిధులు డ్రా చేసే విషయంలో నిబంధనలు పాటించలేదని గుర్తించి రామకోటేశ్వరరావును సస్పెండ్ చేశారు. అయితే నకిలీ బిల్లులపై మాత్రం విచారణ చేయలేదు. అక్రమంగా డ్రా చేసిన సొమ్మును రికవరీ చేయలేదు. ఈ అవనితీ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు, పలువురు అధికారుల పాత్ర కూడా ఉందని, అందువల్లే కార్యదర్శి సస్పెన్షన్‌తో సరిపెట్టారనే ఆరోపణలు వచ్చాయి. స.హ.చట్టం దరఖాస్తుతో... విజయవాడలోని భావన్నారాయణ వీధిలో డోర్ నంబర్ 45–3–44 /2ఏలో నిఖిత ఎంటర్ప్రైజెస్ పేరుతో రూ.15లక్షల విలువైన పలు రకాల మెటీరియల్ తీసుకున్నట్లు పంచాయతీలో బిల్లులు చూపించారు. ఈ బిల్లులపై ఏపీ జీఎస్టీ నంబర్ 1842 ఆర్సీ నంబర్ వీజే2/02/865 అని ఉంది. ఈ క్రమంలో పంచాయతీ లెక్కల్లో చూపిస్తున్న బిల్లులు అందించిన వ్యాపార సంస్థల వివరాలు ఇవ్వాలని యనమలకుదురు ఉప సర్పంచ్ ముప్పవరపు నారాయణరావు సమాచార హక్కు చట్టం ద్వారా వాణిజ్య పన్నుల శాఖ అధికారులను కోరారు. దీనిపై విచారణ చేసిన విజయవాడ డీసీటీవో నిఖిత ఎంటర్ప్రైజెస్ పేరుతో అసలు తమ పరిధిలో వ్యాపార సంస్థలు లేవని ధ్రువీకరిస్తూ బదులిచ్చారు. ఉయ్యూరులో మంజునాథ ఎంటర్ ప్రైజెస్ పేరుతో కూడా రూ.10 లక్షల వరకు బిల్లులు ఉన్నాయి. అక్కడి డీసీటీవో కూడా మంజునాథ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఎటువంటి వ్యాపార సంస్థ లేదని తెలిపారు. ఇదే తరహాలో మరికొన్ని సంస్థల పేరుతో బిల్లులు పెట్టి నిధులు డ్రా చేసినట్లు సమాచారం. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి నిధుల రికవరీకి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
యనమలకుదురే టార్గెట్
చేతల్లో నిజాయతీ ఏది.. ఇతర గ్రామాల జోలికి వెళ్లని టీడీపీ ముఖ్యనేత పెనమలూరు : తాను నిజాయతీ పరుడినని.. అభివృద్ధి కోసమే వసూళ్లు చేస్తున్నానని చెబుతున్న నియోజకవర్గ ముఖ్యనేత ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యనమలకుదురులో నకిలీ ప్లాన్లపై అధికారులు క్రిమినల్ కేసులు పెట్టడానికి ముందుకు రాగా ముఖ్యనేత అడ్డుకుంటున్నారు. ఓ బిల్డర్ ఇప్పటికే రూ.40 లక్షలు ముఖ్యనేతకు ముట్టచెప్పాడని గుసగుసలు వినపడుతున్న నేపథ్యంలో అక్రమ కట్టడాల వేగం పెరిగింది. ఇతర గ్రామాల జోలికి వెళ్లని నేత మండలంలో గ్రూప్‌హౌస్‌లు దాదాపుగా అన్ని గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నారు. అయితే ముఖ్యనేత ఇతర గ్రామాల జోలికి మాత్రం వెళ్లడంలేదు. ఆ గ్రామాల్లో టీడీపీ నేతలు బలంగా ఉండటంతో సొంతపార్టీ నేతల నుంచే ప్రతిఘటన ఎదురవుతుందని వెనక్కు తగ్గి యనమలకుదురు టార్గెట్‌గా పెట్టుకున్నారని టీడీపీ శ్రేణులే చెబుతున్నాయి. గ్రామాన్ని అభివృద్ధి చేయటానికే తాను యనమలకుదురులో వసూళ్లు చేస్తున్నట్లు కానూరులో ఆదివారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన ప్రకటించారు. మిగిలిన గ్రామాలను స్మార్టు విలేజ్‌లుగా అభివృద్ధి చేయటానికి అక్కడ ఎందుకు వసూలు చేయలేక పోతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే ఈ పని చేయగలవా..? అభివృద్ది మంత్రం చదువుతూ వసూళ్లకు పాల్పడుతున్న టీడీపీ నేతకు చిత్తశుద్ధి ఉంటే ఈ పనులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. యనమలకుదురులో నకిలీ గ్రూప్‌హౌస్‌ల ప్లాన్లపై విచారణ చేయించాలి. అక్రమాలకు పాల్పడిన బిల్డర్లపై క్రిమినల్ కేసులు పెట్టించాలి.మోసపోయి ప్లాట్లు కొనుగోలు చేసిన వారి ప్లాట్లు సీఆర్డీఏలో రెగ్యులర్ (బీఆర్ఎస్) చేయించాలి. యనమలకుదురులో ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధ్ది పనులు చేపట్టాలి.యనమలకుదురులో గతంలో అక్రమాలకు పాల్పడిన కార్యదర్శల నుంచి సొమ్ము పంచాయతీ ఖజానాకు జమ చేయించాలి. పంచాయతీ పై జరిగిన విజిలెన్స్ విచారణ నివేదిక బహిర్గతం చేయాలి.గతంలో టీడీపీ నేత వసూళ్లు చేసిన రూ.1.5 కోట్లకు గ్రామస్తులకు లెక్క అప్పగించాలి. నకిలీ ప్లాన్లు రాకుండా అధికారులు చర్యలు తీసుకునే విధంగా పని చేయించాలి. మిగితా గ్రామాల్లో అక్రమంగా నిర్మాణాలు, గ్రూప్హౌస్లపై కూడా విచారణ చేపట్టాలి.ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి కూడా న్యాయం చేయాలి. సీఆర్డీఏ అధికారులకు స్వేచ్ఛ ఇవ్వాలి. -
వేయి మునుల కుదురు యనమలకుదురు
సందర్శనీయం కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని యన మలకుదురు గ్రామంలో ‘మునిగిరి’ అనే పేరు గల కొండపై శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం కొలువై ఉంది. శివుడు ఇక్కడ ‘రామలింగేశ్వరుడు’గా ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ శివుడు స్వయం భువుగా వెలిశాడు. ఈ దేవాలయంలో శివుడిని వాయులింగంగా కొలుస్తారు. చరిత్ర ఒకప్పుడు యనమలకుదురు ప్రాంతం ఎంత ప్రశాంతంగా, తపస్సుకు యోగ్యంగా ఉండేదని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అందువల్లనేమో... విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చి శివుని కోసం తపస్సు చేసుకున్నాడట. ఆ సమయంలోనే అక్కడ వేయి మంది మునులు కొలువు తీరి, యజ్ఞం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. క్షత్రియ లక్షణాలున్న పరశురాముడు, వారు చేస్తున్న యజ్ఞాన్ని రాక్షసుల బారి నుంచి రక్షించాడు. యజ్ఞ పరిసమాప్తి అయ్యాక ఆ ప్రాంతంలో పరశురాముడు శివలింగాన్ని ప్రతిష్టించి ప్రాణప్రతిష్ఠ చేశాడని స్థలపురాణం చెబుతోంది. ఆయన ప్రతిష్ఠ చేసిన కారణంగానే ఇక్కడి శివుడిని రామలింగేశ్వరుడుగా భక్తులు ప్రేమగా భక్తితో, పిలుచుకుంటారు.ఈ గిరి చుట్టూ వేయి మంది మునులు కూర్చుని శివుని గూర్చి తపస్సు చేశారు కనుక, ఈ ప్రాంతాన్ని ‘వేయి మునుల కుదురు’ అని పిలిచారు. వేయి మునుల కుదురు అంటే వెయ్యి మంది మునుల సమావేశం అని అర్థం. కాలక్రమేణా స్థానికుల భాషలో ఇది యనమలకుదురుగా మారిపోయింది. భూమి మీద 612 అడుగుల ఎత్తులో ఉన్న ఈ మునిగిరి కొండ ముఖద్వారంలో ఎత్తయిన హనుమంతుడు స్వాగతం పలుకుతాడు. ఇక్కడ మహాశివరాత్రిని వైభవంగా నిర్వర్తిస్తారు. చేరుకోవడానికి మార్గాలు... బస్ మార్గం: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. విజయవాడకు కేవలం 5 కి.మీ. దూరం. రైలు మార్గం: అతి సమీప ైరె ల్వే స్టేషను విజయవాడ. కేవలం 8 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ నుంచి దేవాలయం వరకు బస్సులు, ఆటోరిక్షాలు అందుబాటులో ఉన్నాయి. - డా. పురాణపండ వైజయంతి -
అంతా వాళ్లే చేశారు!
అక్రమ కట్టడాలకు అధికార పార్టీ దన్ను విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసిందీ టీడీపీ ప్రజాప్రతినిధే మంత్రిని ఆశ్రయించిన బిల్డర్లు ఆసక్తికరంగా మారిన యనమలకుదురు వ్యవహారం విజయవాడ : యనమలకుదురు గ్రామంలో అక్రమ కట్టడాల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామంలో వందల సంఖ్యలో అక్రమ కట్టడాల నిర్మాణం దగ్గర్నుంచి ఫిర్యాదుల వరకు అంతా టీడీపీ ప్రజాప్రతినిధుల డెరైక్షన్లోనే జరిగిందన్నది బహిరంగ రహస్యం. గ్రామ పంచాయతీ కార్యదర్శులు అడ్డగోలుగా అక్రమ కట్టడాలకు పచ్చజెండా ఊపారు. దండిగా కాసులు దండుకున్నారు. సీన్ కట్ చేస్తే.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగి సమగ్ర విచారణ జరిపి నలుగురు గ్రామ కార్యదర్శులు , ఇద్దరు ఆర్కిటెక్చర్లను ఈ అక్రమ కట్టడాలకు కారకులుగా తేల్చి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. సాక్షిలో అక్రమ కట్టడాల వ్యవహారంపై వరుస కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో బిల్డర్లలో వణుకు మొదలైంది. విజి‘లెన్స్’ నుంచి తమను కాపాడాలంటూ జిల్లాకు చెందిన ఓ అమాత్యుడిని ఆశ్రయించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అంతా తాను చూసుకుంటానని ఆ మంత్రి వారికి హామీ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గతంలో మూడుసార్లు విచారణ జరుగగా.. ఫైల్‌ను తొక్కిపెట్టారు. తాజా పరిణామాల నేపథ్యంలో విజిలెన్స్ నివేదికపై అధికార పార్టీలో అంతర్మథనం మొదలైంది. టీడీపీ నేతల వింత ధోరణి రెండేళ్ల కిందట అక్రమ కట్టడాలకు అనుమతులు ఇప్పించింది అక్కడున్న టీడీపీ నాయకులే. అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేలా చేసిందీ స్థానిక నాయకులే. మళ్లీ వారే మూడు నెలల కిందట అక్రమ కట్టడాల వ్యవహారం, గ్రామంలో గాడితప్పిన పంచాయతీ పాలనపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికార పార్టీ ఎమ్మెల్యే అక్రమ కట్టడాల సంగతి తేల్చాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో గతంలో ఈ గ్రామ పంచాయతీపై జిల్లా పంచాయతీ అధికారులు విచారణ నిర్వహించారు. ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ కూడా నిర్వహించింది. అన్ని నివేదికలు అక్రమాలు జరిగాయని తెల్చిచెప్పాయి. తాజాగా స్థానిక ప్రజాప్రతినిధి ఫిర్యాదుతో ప్రభుత్వం విజిలెన్స్‌ను రంగంలోకి దింపి విచారణ నిర్వహించింది. విజిలెన్స్ కూడా అక్రమాలను నిర్ధారించింది. ఈ విచారణలన్నింటికీ మూలం స్థానిక అధికార పార్టీ నేతల ఫిర్యాదులే. కానీ వారు దీనికి భిన్నంగా ప్రజల ముందు మరో కోణంలో వ్యవహరిస్తుండడం గమనార్హం. ఫిర్యాదుచేసిన వారే ఈ వ్యవహారాన్ని మళ్లీ భుజానికి ఎత్తుకొని అండగా నిలవడం విశేషం. దీని వెనుక పెద్ద మొత్తం చేతులు మారిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. అటు అక్రమ కట్టడాల వ్యవహారంతో పాటు ఇటు అధికార పార్టీ నేతల రెండు ధోరణులపై ఊళ్లో విస్తృత చర్చ జరుగుతోంది. -
'హిమబిందు' కేసులో పోలీసులపై వేటు
-
హిమబిందు' కేసులో పోలీసులపై వేటు
విజయవాడ: కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన సప్తగిరి గ్రామీణ బ్యాంకు బ్రాంచి మేనేజర్ సాయిరాం భార్య హిమబిందు దారుణహత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై వేటు పడింది. పడమట పీఎస్ సీఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. కేసులో నిర్లక్ష్యం వహించినందుకు వారిపై విజయవాడ నగర కమిషనర్ ఈ చర్య తీసుకున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో యనమలకుదురులో హిమబిందు హత్యకు గురైంది. మార్చి 15న ఆమె నుంచి కనిపించలేదు. ఆ తరువాత మూడు రోజులకు కంకిపాడులోని గోశాల బందర్ కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. హిమబిందుపై అత్యాచారం చేసి, హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నిందితులందరీ పోలీసులు అరెస్ట్ చేశారు. -
హిమబిందు హత్యకేసులో నిజాల నిర్ధారణ
విజయవాడ: కృష్ణా జిల్లా యనమలకుదురులో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సాయిరాం భార్య హిమబిందు హత్యకేసులో నిజాలను పోలీసులు నిర్ధారించారు. కారు డ్రైవర్ సుభానితోపాటు అతనికి సహకరించిన స్నేహితుడు గోపికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. పథకం ప్రకారమే మరో నలుగురి సహాయంతో హిమబిందుపై అత్యాచారం చేసి హత్యచేసినట్లు నిందితులు వెల్లడించారు. అత్యాచారం చేసిన తరువాత, డ్రైవర్ సుభానీని గుర్తిస్తుందని వారు ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆ తరువాత ఆమె నుంచి బంగారాన్ని తీసుకున్నట్లు నిందితులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, వెయ్యి రూపాయల నగదు, 3 ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కుట్ర, డెకాయిట్, నిర్భయ కేసులు నమోదు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయం చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హిమబిందు ఈ నెల 15 నుంచి కనిపించలేదు. ఆ తరువాత మూడు రోజులకు కంకిపాడులోని గోశాల బందర్ కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. విషయం తెలిసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సిమ్ కార్డు ద్వారా నిందితుడిని గుర్తించారు. సాయిరాం పక్క ఇంట్లో ఉండే డ్రైవర్ సుభాని ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావించారు. అతనితోపాటు మరో నలుగురికి కూడా ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు అప్పుడే వారు అనుమానించారు. -
యనమలకుదురులో బ్యాంక్ మేనేజర్ భార్య హత్య
-
యనమలకుదురులో బ్యాంక్ మేనేజర్ భార్య హత్య
విజయవాడ: కృష్ణ జిల్లా యనమలకుదురులో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సాయిరాం భార్య హిమబిందును హత్య చేశారు. హిమబిందు ఈ నెల 15 నుంచి కనిపించడంలేదు. ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారని భావించారు. కంకిపాడులోని గోశాల బందర్ కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డబ్బు, నగలు కోసమే ఆమెను హత్య చేసిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సాయిరాం ఇంటి నుంచి పెద్ద మొత్తంలో నగదు, డబ్బు దొంగిలించినట్లు తెలుస్తోంది. నగదు, డబ్బు తీసుకువెళ్లినవారు హిమబిందును ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియడంలేదు. ఈ హత్య పలు అనుమానాలకు దారితీస్తోంది. సిమ్ కార్డు ద్వారా నిందితుడిని పోలీసులు గుర్తించారు. సాయిరాం పక్క ఇంట్లో ఉండే డ్రైవర్ సుబాలీ ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అతనితోపాటు మరో నలుగురికి కూడా ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. డ్రైవర్ సుబాలీని పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.