
యనమలకుదురులో బ్యాంక్ మేనేజర్ భార్య హత్య
విజయవాడ: కృష్ణ జిల్లా యనమలకుదురులో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సాయిరాం భార్య హిమబిందును హత్య చేశారు. హిమబిందు ఈ నెల 15 నుంచి కనిపించడంలేదు. ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారని భావించారు. కంకిపాడులోని గోశాల బందర్ కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డబ్బు, నగలు కోసమే ఆమెను హత్య చేసిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సాయిరాం ఇంటి నుంచి పెద్ద మొత్తంలో నగదు, డబ్బు దొంగిలించినట్లు తెలుస్తోంది. నగదు, డబ్బు తీసుకువెళ్లినవారు హిమబిందును ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియడంలేదు. ఈ హత్య పలు అనుమానాలకు దారితీస్తోంది.
సిమ్ కార్డు ద్వారా నిందితుడిని పోలీసులు గుర్తించారు. సాయిరాం పక్క ఇంట్లో ఉండే డ్రైవర్ సుబాలీ ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అతనితోపాటు మరో నలుగురికి కూడా ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. డ్రైవర్ సుబాలీని పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.