నగరం: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయి కాబట్టే జైలుకు వెళ్లాడని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ను సానుభూతిగా మార్చుకోవాలని టీడీపీ భావించినా, ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. బాపట్ల జిల్లా వెలమవారిపాలెం గ్రామంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో సీమెన్స్ అనే బోగస్ సంస్థను సృష్టించి, సుమారు రూ.370 కోట్లు తన బినామీ కంపెనీలకు తరలించారనే ఆధారాలతో సీఐడీ అరెస్ట్ చేసిందన్నారు. దీనికి సంబంధించి 2018లోనే జీఎస్టీ నోటీసులు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టి, ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉండటం వల్లే చంద్రబాబు రిమాండ్‌కు వెళ్లారన్నారు.
అవినీతికి పాల్పడి, అడ్డంగా దొరికి జైలుకు వెళితే టీడీపీ నాయకులు అక్రమంగా చంద్రబాబును జైల్లో పెట్టారనడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్‌ను టీడీపీ నాయకులు ఖండిస్తున్నారంటే దొంగను, అవినీతిని సమర్థించినట్టేనన్నారు.
కౌంట్ డౌన్ మొదలు..
రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌లో చంద్రబాబు కట్టిన బిల్డింగ్‌లోనే ఆయన్ను కట్టిపడేశారని ఆయన సతీమణి భువనేశ్వరి పేర్కొన్నారని మోపిదేవి చెప్పారు. ఆయన కట్టించిన బిల్డింగ్‌కు ముద్దాయిగా వెళ్లారని తెలిపారు. ఎటువంటి తప్పు చేయకపోయినా చంద్రబాబును జైలుకు పంపారని బాలకృష్ణ అనడం హాస్యాస్పదం అన్నారు. తప్పు చేశాడనే విషయం ఆధారాలతో బయటపడిందని, అందుకే న్యాయస్థానం రిమాండ్ విధించిందనే విషయాన్ని బాలకృష్ణ తెలుసుకోవాలన్నారు.
చంద్రబాబుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, సీరియల్‌గా కేసులు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాజధాని నిర్మాణంలో ఇన్నర్ రింగ్ రోడ్డు భూ సేకరణలో జరిగిన అవకతవకల్లో చంద్రబాబు, అప్పుడున్న మంత్రులు అవినీతికి పాల్పడినట్లు సీఐడీ దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. చట్టానికి అందరూ సమానులేనని, ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించక తప్పదన్నారు.
చంద్రబాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు తమ బంధువని టీడీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదని చెప్పారు. న్యాయమూర్తితో తమకు బంధుత్వం లేదని సృష్టం చేశారు. ఉన్నత స్థానంలో ఉన్న వారిపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment