Himabindu
-
ఏసీబీ జడ్జిపై అసత్య ప్రచారం.. టీడీపీ నేత అరెస్ట్
సాక్షి, కృష్ణా జిల్లా: స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించిన న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన టీడీపీ నాయకుడు బుర్ర వెంకట్‌ను కంకిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును మచిలీపట్నం సైబర్ బ్రాంచ్‌కు పోలీసులు అప్పగించారు. కాగా, చంద్రబాబుకు రిమాండ్ తర్వాత జడ్జిని కించపరుస్తూ కొందరు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు. నిన్న(బుధవారం) నంద్యాల జిల్లాకు చెందిన ఐటీడీపీ కార్యకర్త ఖాజా హుస్సేన్‌పై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
చంద్రబాబు అవినీతికి గట్టి ఆధారాలు
నగరం: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయి కాబట్టే జైలుకు వెళ్లాడని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ను సానుభూతిగా మార్చుకోవాలని టీడీపీ భావించినా, ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. బాపట్ల జిల్లా వెలమవారిపాలెం గ్రామంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో సీమెన్స్ అనే బోగస్ సంస్థను సృష్టించి, సుమారు రూ.370 కోట్లు తన బినామీ కంపెనీలకు తరలించారనే ఆధారాలతో సీఐడీ అరెస్ట్ చేసిందన్నారు. దీనికి సంబంధించి 2018లోనే జీఎస్టీ నోటీసులు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టి, ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉండటం వల్లే చంద్రబాబు రిమాండ్‌కు వెళ్లారన్నారు. అవినీతికి పాల్పడి, అడ్డంగా దొరికి జైలుకు వెళితే టీడీపీ నాయకులు అక్రమంగా చంద్రబాబును జైల్లో పెట్టారనడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్‌ను టీడీపీ నాయకులు ఖండిస్తున్నారంటే దొంగను, అవినీతిని సమర్థించినట్టేనన్నారు. కౌంట్ డౌన్ మొదలు.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో చంద్రబాబు కట్టిన బిల్డింగ్‌లోనే ఆయన్ను కట్టిపడేశారని ఆయన సతీమణి భువనేశ్వరి పేర్కొన్నారని మోపిదేవి చెప్పారు. ఆయన కట్టించిన బిల్డింగ్‌కు ముద్దాయిగా వెళ్లారని తెలిపారు. ఎటువంటి తప్పు చేయకపోయినా చంద్రబాబును జైలుకు పంపారని బాలకృష్ణ అనడం హాస్యాస్పదం అన్నారు. తప్పు చేశాడనే విషయం ఆధారాలతో బయటపడిందని, అందుకే న్యాయస్థానం రిమాండ్ విధించిందనే విషయాన్ని బాలకృష్ణ తెలుసుకోవాలన్నారు. చంద్రబాబుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, సీరియల్‌గా కేసులు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాజధాని నిర్మాణంలో ఇన్నర్ రింగ్ రోడ్డు భూ సేకరణలో జరిగిన అవకతవకల్లో చంద్రబాబు, అప్పుడున్న మంత్రులు అవినీతికి పాల్పడినట్లు సీఐడీ దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. చట్టానికి అందరూ సమానులేనని, ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించక తప్పదన్నారు. చంద్రబాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు తమ బంధువని టీడీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదని చెప్పారు. న్యాయమూర్తితో తమకు బంధుత్వం లేదని సృష్టం చేశారు. ఉన్నత స్థానంలో ఉన్న వారిపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. -
అమెరికాలో నృత్య ప్రదర్శనకు చీపురుపల్లి యువతులు
చీపురుపల్లి: విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన ఇద్దరు నృత్యకళాకారిణిలకు అరుదైన అవకాశం లభించింది. తాము నేర్చుకున్న విద్యను ఖండాంతరాల్లో ప్రదర్శించేందుకు అర్హత సాధించారు. చిన్నప్పటి నుంచి నృత్యంలో శిక్షణ పొంది దేశంలో ఎన్నో వేదికలపై వందలాది నృత్య ప్రదర్శనలు ఇచ్చిన హిమబిందు, ప్రవళ్లికలు ఇప్పుడు విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సంస్థ ఆధ్వర్యంలో భారతదేశ ప్రభుత్వమే స్వయంగా వీరిని అమెరికాలో నృత్య ప్రదర్శనలకు పంపిస్తోంది. ఆజాదికా అమృత మహోత్సవ్‌లో భాగంగా ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద భారత ప్రభుత్వం వందేభారతం పేరుతో భారీ కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించింది. అందులో దేశ వ్యాప్తంగా 300 బృందాలు ప్రదర్శనలు ఇచ్చాయి. అందులో ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన 35 బృందాలను విదేశాల్లో ప్రదర్శనలు కోసం ఎంపిక చేశారు. ఆ 35 బృందాల్లో శ్రీకాకుళానికి చెందిన శివశ్రీ కళా నృత్యనికేతన్ బృందానికి చెందిన నృత్యకారులు ఎంపికకాగా, అందులో చీపురుపల్లికి చెందిన నృత్యకారిణిలు ఇద్దరు ఉన్నారు. చీపురుపల్లి రిక్షాకాలనీకి చెందిన హిమబిందు ప్రస్తుతం టెక్‌మహీంద్రా కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తుండగా, ఆంజనేయపురానికి చెందిన జి.ప్రవళ్లిక ఎమ్మెస్సీ చదువుతోంది. 12 బృందం నృత్యకారులు నృత్యనికేతన్ మాస్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ పర్యవేక్షణలో నృత్య ప్రదర్శనలకు మంగళవారం బయలుదేరి వెళ్లనున్నారు. జూలై 21న అమెరికాలోని పలు ప్రాంతాల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెబుతూ నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నారు. (క్లిక్: ఔను... ఆయనకు ఉద్యోగం వచ్చింది) -
వేట మొదలైంది
మధు సాయివంశీ హీరోగా, శ్రావణి నిక్కీ, హిమబింధు హీరోయిన్లుగా కె.రవీంద్ర కల్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జునవేట’. రోజా శ్రీనివాస్ సినిమాస్ పతాకంపై వాయల శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత సి.కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా రైస్ పుల్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. జూలై 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతాం. హైదరాబాద్, చెన్నై, కేరళ వంటి ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం. ఐదు భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. సుబ్బరాజు, ‘వెన్నెల’ కిశోర్, రావు రమేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్, సంగీతం: డి. ఇమామ్. -
మెరిసిన చంద్రలేఖ
సాక్షి, గుంటూరు వెస్ట్: బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే లీగ్‌లో చంద్రలేఖ (101 బంతుల్లో 71; 11 ఫోర్లు) అర్ధ శతకంతో మెరవడంతో ఆంధ్ర జట్టు నాలుగో విజయం నమోదు చేసుకుంది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సౌరాష్ట్ర పై ఆంధ్ర జట్టు 62 పరుగుల తేడాతో గెలిచింది. లీగ్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన ఆంధ్ర నాలుగింట గెలిచి 16 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. సౌరాష్ట్రతో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 203 పరుగులు చేసింది. చంద్రలేఖ అర్ధసెంచరీకి తోడు హిమబిందు (67 బంతుల్లో 41; 4 ఫోర్లు) రాణించింది. అనంతరం ఆంధ్ర బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సౌరాష్ట్ర 50 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులే చేయగలిగింది. ఆంధ్ర బౌలర్లలో అంజలి శర్వాణి 3, కెప్టెన్ పద్మజ 2, ఝాన్సీ లక్ష్మి, పుష్పలత, మల్లిక ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇతర మ్యాచ్‌ల్లో పంజాబ్‌పై గోవా, విదర్భపై హరియాణా గెలిచాయి. -
హిమబిందు హత్య కేసు కొట్టివేత
అభియోగాలు నిరూపించలేకపోవడమే కారణం తొలి నుంచీ సరిగా స్పందించని పోలీసులు విజయవాడ సిటీ: సంచలనం కలిగించిన ఏపీలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజర్ ఎం.సాయిరామ్ భార్య హిమబిందు(41)పై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య, దోపిడీ కేసులో నిందితులపై పోలీసులు మోపిన అభియోగాలను ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోవడంతో కేసును కొట్టివేస్తూ మహిళా సెషన్స్‌కోర్టు న్యాయమూర్తి అనుపమాచక్రవర్తి మంగళవారం తీర్పు చెప్పారు. నిందితులపై ఇతర కేసులు లేనిపక్షంలో వారిని విడుదల చేయాలంటూ జైలు అధికారులను ఆదేశించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. విజయవాడ పటమట శాంతినగర్‌లోని ఎంటీఎస్ టవర్స్‌కు చెందిన సాయిరామ్ యనమలకుదురు సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌గా పని చేస్తున్నారు. గతేడాది మార్చి 15న విధుల నిర్వహణ కోసం సాయిరామ్ బ్యాంకుకు, పిల్లలు చదువుకునేందుకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన సాయిరామ్‌కి భార్య కనిపించకపోవడంతో పలుచోట్ల విచారించారు. ప్రయోజనం లేకపోవడంతో ఆమె కనిపించ డం లేదంటూ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే గోశాల వద్ద బందరు కాల్వలో మహిళ మృతదేహం స్వాధీనం చేసుకొని పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను అదృశ్యమైన హిమబిందుగా కుటుంబసభ్యులు గుర్తించారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరగడంతోపాటు నిందితులు ఇంట్లోని నగలు, నగదు దోచుకుపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో పక్క ప్లాటు యజమాని కారు డ్రైవర్ మహ్మద్ సుభాని సహా సోమన గోపీకృష్ణ, వేల్పూరి దుర్గాప్రసాద్, జనపాల కృష్ణ, లంకపల్లి రమణ, మహ్మద్ గౌస్‌లను నిందితులుగా పేర్కొం టూ పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. చార్జిషీటులో 54 మంది సాక్షులను పేర్కొనగా 36 మందిని ప్రాసిక్యూషన్ తరఫున విచారించారు. నిందితులపై పోలీసులు మోపిన నేరాభి యోగాలు నిరూపించలేకపోవడంతో కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. తీర్పుపై పైకోర్టుకు అప్పీలుకు వెళ్లనున్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. న్యాయమూర్తి తీర్పు వెలువరించిన తర్వాత హిమ బిందు కుటుంబసభ్యులు హతాశులయ్యారు. అడుగడుగునా పోలీసుల వైఫల్యం... హిమబిందు కేసును కోర్టు కొట్టేయడం వెనుక పోలీసుల వైఫల్యం అడుగడుగునా బయటపడింది. ఫిర్యాదువేళ ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వ్యవహరించారు. అత్యాచారం జరిగే సమయంలో ఆమె అరవకుండా నోటికి ఖర్చీఫ్ అడ్డుపెట్టారని, తర్వాత మెడకు చీర బిగించి చంపేశారని ప్రాసిక్యూషన్ అభియోగం మోపింది. ఆధారాలను సేకరించి కోర్టుకు అందజేయడంలో వైఫల్యం చెందారు. ఆమెపై అత్యాచారం జరిగినట్టు వైద్య పరీక్షల్లో తేలినప్పటికీ ఆధారాలతో నిరూపించలేకపోయారు. -
మీడియా ముందుకు ' హిమబిందు' నిందితులు
విజయవాడ : విజయవాడలో సంచలనం రేకెత్తించిన బ్యాంకు మేనేజర్ భార్య హిమబిందు హత్య కేసులో నిందితులను పోలీసులు బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి నుంచి మృతురాలి నగలను స్వాధీనం చేసుకున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన యువకులు, తల్లి వయసున్న మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆనక ఆమెపైనే పుకార్లు సృష్టించారని పోలీసులు తెలిపారు. అటు మృతురాలి బంధువులను, ఇటు తమను అందరినీ తప్పుదోవ పట్టించారని పోలీసులు వెల్లడించారు. నిందితులకు తగిన శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
హిమబిందు హత్య కేసులో ఇద్దరి అరెస్టు
పరారీలో మరో నలుగురు: డీసీపీ హత్య చేసి కిడ్నాప్ డ్రామా.. విజయవాడలోని సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ భార్య హిమబిం దుపై అత్యాచారం చేసి, హత్య చేసిన కేసు లో ఇద్దరు నిందితులను పటమట పోలీ సులు అరెస్టు చేశారు. కృష్ణాజిల్లా యనమలకుదురుకు చెందిన ప్రధాన నిందితుడు, అపార్టుమెంట్ యజమాని కారు డ్రైవర్ మ హ్మద్ సుభాని, ఇతని స్నేహితుడు సామన గోపీకృష్ణ(24) పట్టుబడగా, మరో నలుగు రు నిందితులు పరారీలో ఉన్నట్టు శాంతి భ ద్రతల డీసీపీ రవిప్రకాష్ సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. పథకం ప్రకారమే...: హిమబిందుపై అఘాయిత్యం పథకం ప్రకారమే చేసినట్టు విచారణలో వెల్లడైందని డీసీపీ తెలిపారు. గతంలో అవకాశం కోసం పలుమార్లు ప్రయత్నాలు చేసి విఫలమైన నిందితులు.. ఈనెల 15న ఉదయం మరోసారి ప్రయత్నించారు. భర్త, కుమార్తె బయటకు వెళ్లిన తర్వాత ఇంట్లో హిమబిందు ఒంటరిగా ఉన్న సమయంలో సుభాని, గోపీకృష్ణ, మరో యువకుడు వచ్చి కాలింగ్ బెల్ మోగిం చారు. కిటికీ నుంచి చూసిన ఆమె, తెలిసినవారే కావడంతో తలుపు తీశారు. కింద నీళ్లు రావడం లేదని, పైపు మరమ్మతు కోసం వచ్చామని చెప్పి బాత్రూమ్లోకి వెళ్లారు. ఇంతలో మరో ముగ్గురు ఇంట్లోకి ప్రవేశించి హిమబిందుపై దాడి చేయడంతో పాటు, అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం తమ గుట్టు బయట పెడుతుందని భావించి హత్య చేశారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఆమె నగలు, దుస్తులు, చెప్పులు మాయం చేసి, వాటితో ఇంటి నుంచి వెళ్లిపోయిందన్నట్టుగా సీన్ క్రియేట్ చేశారు. ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగించే వాతావరణం సృష్టించారు. ఆమె సెల్‌ఫోన్ తీసుకెళ్లి 15వ తేదీ వరకు కిడ్నాప్ డ్రామా ఆడారు. ఆమె పక్కనే ఉందంటూ చెప్పడం ద్వారా పోలీసులను తప్పుదోవ పట్టించి పొరుగు జిల్లాలపై దృష్టి సారించేలా చేశారు. ఆపై మృతదేహాన్ని అర్ధరాత్రి సమయంలో సమీపంలోని బందరుకాల్వలో పడేశారు. పోలీసు విచారణలో భాగంగా 17న బందరు కాల్వలో ఓ మృతదేహం ఉందని వచ్చిన సమాచారం మేరకు కుటుంబ సభ్యులను తీసుకెళ్లి చూపించగా ఆది హిమబిందుదేనని గుర్తించారు. ప్రాథమిక నివేదికలో ఆమెను గొంతు నులిమి చంపడంతో పాటు అంతకుముందు అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయింది. -
యనమలకుదురులో బ్యాంక్ మేనేజర్ భార్య హత్య
-
యనమలకుదురులో బ్యాంక్ మేనేజర్ భార్య హత్య
విజయవాడ: కృష్ణ జిల్లా యనమలకుదురులో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సాయిరాం భార్య హిమబిందును హత్య చేశారు. హిమబిందు ఈ నెల 15 నుంచి కనిపించడంలేదు. ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారని భావించారు. కంకిపాడులోని గోశాల బందర్ కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డబ్బు, నగలు కోసమే ఆమెను హత్య చేసిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సాయిరాం ఇంటి నుంచి పెద్ద మొత్తంలో నగదు, డబ్బు దొంగిలించినట్లు తెలుస్తోంది. నగదు, డబ్బు తీసుకువెళ్లినవారు హిమబిందును ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియడంలేదు. ఈ హత్య పలు అనుమానాలకు దారితీస్తోంది. సిమ్ కార్డు ద్వారా నిందితుడిని పోలీసులు గుర్తించారు. సాయిరాం పక్క ఇంట్లో ఉండే డ్రైవర్ సుబాలీ ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అతనితోపాటు మరో నలుగురికి కూడా ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. డ్రైవర్ సుబాలీని పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.