హిమబిందు హత్య కేసు కొట్టివేత
అభియోగాలు నిరూపించలేకపోవడమే కారణం
తొలి నుంచీ సరిగా స్పందించని పోలీసులు
విజయవాడ సిటీ: సంచలనం కలిగించిన ఏపీలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజర్ ఎం.సాయిరామ్ భార్య హిమబిందు(41)పై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య, దోపిడీ కేసులో నిందితులపై పోలీసులు మోపిన అభియోగాలను ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోవడంతో కేసును కొట్టివేస్తూ మహిళా సెషన్స్‌కోర్టు న్యాయమూర్తి అనుపమాచక్రవర్తి మంగళవారం తీర్పు చెప్పారు. నిందితులపై ఇతర కేసులు లేనిపక్షంలో వారిని విడుదల చేయాలంటూ జైలు అధికారులను ఆదేశించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. విజయవాడ పటమట శాంతినగర్‌లోని ఎంటీఎస్ టవర్స్‌కు చెందిన సాయిరామ్ యనమలకుదురు సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌గా పని చేస్తున్నారు. గతేడాది మార్చి 15న విధుల నిర్వహణ కోసం సాయిరామ్ బ్యాంకుకు, పిల్లలు చదువుకునేందుకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన సాయిరామ్‌కి భార్య కనిపించకపోవడంతో పలుచోట్ల విచారించారు.
ప్రయోజనం లేకపోవడంతో ఆమె కనిపించ డం లేదంటూ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే గోశాల వద్ద బందరు కాల్వలో మహిళ మృతదేహం స్వాధీనం చేసుకొని పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను అదృశ్యమైన హిమబిందుగా కుటుంబసభ్యులు గుర్తించారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరగడంతోపాటు నిందితులు ఇంట్లోని నగలు, నగదు దోచుకుపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో పక్క ప్లాటు యజమాని కారు డ్రైవర్ మహ్మద్ సుభాని సహా సోమన గోపీకృష్ణ, వేల్పూరి దుర్గాప్రసాద్, జనపాల కృష్ణ, లంకపల్లి రమణ, మహ్మద్ గౌస్‌లను నిందితులుగా పేర్కొం టూ పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. చార్జిషీటులో 54 మంది సాక్షులను పేర్కొనగా 36 మందిని ప్రాసిక్యూషన్ తరఫున విచారించారు. నిందితులపై పోలీసులు మోపిన నేరాభి యోగాలు నిరూపించలేకపోవడంతో కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. తీర్పుపై పైకోర్టుకు అప్పీలుకు వెళ్లనున్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. న్యాయమూర్తి తీర్పు వెలువరించిన తర్వాత హిమ బిందు కుటుంబసభ్యులు హతాశులయ్యారు.
అడుగడుగునా పోలీసుల వైఫల్యం...
హిమబిందు కేసును కోర్టు కొట్టేయడం వెనుక పోలీసుల వైఫల్యం అడుగడుగునా బయటపడింది. ఫిర్యాదువేళ ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వ్యవహరించారు. అత్యాచారం జరిగే సమయంలో ఆమె అరవకుండా నోటికి ఖర్చీఫ్ అడ్డుపెట్టారని, తర్వాత మెడకు చీర బిగించి చంపేశారని ప్రాసిక్యూషన్ అభియోగం మోపింది. ఆధారాలను సేకరించి కోర్టుకు అందజేయడంలో వైఫల్యం చెందారు. ఆమెపై అత్యాచారం జరిగినట్టు వైద్య పరీక్షల్లో తేలినప్పటికీ ఆధారాలతో నిరూపించలేకపోయారు.