
హిమబిందు హత్య కేసులో ఇద్దరి అరెస్టు
పరారీలో మరో నలుగురు: డీసీపీ
హత్య చేసి కిడ్నాప్ డ్రామా..
విజయవాడలోని సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ భార్య హిమబిం దుపై అత్యాచారం చేసి, హత్య చేసిన కేసు లో ఇద్దరు నిందితులను పటమట పోలీ సులు అరెస్టు చేశారు. కృష్ణాజిల్లా యనమలకుదురుకు చెందిన ప్రధాన నిందితుడు, అపార్టుమెంట్ యజమాని కారు డ్రైవర్ మ హ్మద్ సుభాని, ఇతని స్నేహితుడు సామన గోపీకృష్ణ(24) పట్టుబడగా, మరో నలుగు రు నిందితులు పరారీలో ఉన్నట్టు శాంతి భ ద్రతల డీసీపీ రవిప్రకాష్ సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు.
పథకం ప్రకారమే...: హిమబిందుపై అఘాయిత్యం పథకం ప్రకారమే చేసినట్టు విచారణలో వెల్లడైందని డీసీపీ తెలిపారు. గతంలో అవకాశం కోసం పలుమార్లు ప్రయత్నాలు చేసి విఫలమైన నిందితులు.. ఈనెల 15న ఉదయం మరోసారి ప్రయత్నించారు. భర్త, కుమార్తె బయటకు వెళ్లిన తర్వాత ఇంట్లో హిమబిందు ఒంటరిగా ఉన్న సమయంలో సుభాని, గోపీకృష్ణ, మరో యువకుడు వచ్చి కాలింగ్ బెల్ మోగిం చారు. కిటికీ నుంచి చూసిన ఆమె, తెలిసినవారే కావడంతో తలుపు తీశారు. కింద నీళ్లు రావడం లేదని, పైపు మరమ్మతు కోసం వచ్చామని చెప్పి బాత్‌రూమ్‌లోకి వెళ్లారు. ఇంతలో మరో ముగ్గురు ఇంట్లోకి ప్రవేశించి హిమబిందుపై దాడి చేయడంతో పాటు, అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం తమ గుట్టు బయట పెడుతుందని భావించి హత్య చేశారు.
పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఆమె నగలు, దుస్తులు, చెప్పులు మాయం చేసి, వాటితో ఇంటి నుంచి వెళ్లిపోయిందన్నట్టుగా సీన్ క్రియేట్ చేశారు. ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగించే వాతావరణం సృష్టించారు. ఆమె సెల్‌ఫోన్ తీసుకెళ్లి 15వ తేదీ వరకు కిడ్నాప్ డ్రామా ఆడారు. ఆమె పక్కనే ఉందంటూ చెప్పడం ద్వారా పోలీసులను తప్పుదోవ పట్టించి పొరుగు జిల్లాలపై దృష్టి సారించేలా చేశారు. ఆపై మృతదేహాన్ని అర్ధరాత్రి సమయంలో సమీపంలోని బందరుకాల్వలో పడేశారు. పోలీసు విచారణలో భాగంగా 17న బందరు కాల్వలో ఓ మృతదేహం ఉందని వచ్చిన సమాచారం మేరకు కుటుంబ సభ్యులను తీసుకెళ్లి చూపించగా ఆది హిమబిందుదేనని గుర్తించారు. ప్రాథమిక నివేదికలో ఆమెను గొంతు నులిమి చంపడంతో పాటు అంతకుముందు అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయింది.