
హిమబిందు ఫైల్ ఫొటో
విజయవాడ: కృష్ణా జిల్లా యనమలకుదురులో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సాయిరాం భార్య హిమబిందు హత్యకేసులో నిజాలను పోలీసులు నిర్ధారించారు. కారు డ్రైవర్ సుభానితోపాటు అతనికి సహకరించిన స్నేహితుడు గోపికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. పథకం ప్రకారమే మరో నలుగురి సహాయంతో హిమబిందుపై అత్యాచారం చేసి హత్యచేసినట్లు నిందితులు వెల్లడించారు. అత్యాచారం చేసిన తరువాత, డ్రైవర్ సుభానీని గుర్తిస్తుందని వారు ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆ తరువాత ఆమె నుంచి బంగారాన్ని తీసుకున్నట్లు నిందితులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, వెయ్యి రూపాయల నగదు, 3 ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కుట్ర, డెకాయిట్, నిర్భయ కేసులు నమోదు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయం చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హిమబిందు ఈ నెల 15 నుంచి కనిపించలేదు. ఆ తరువాత మూడు రోజులకు కంకిపాడులోని గోశాల బందర్ కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. విషయం తెలిసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సిమ్ కార్డు ద్వారా నిందితుడిని గుర్తించారు. సాయిరాం పక్క ఇంట్లో ఉండే డ్రైవర్ సుభాని ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావించారు. అతనితోపాటు మరో నలుగురికి కూడా ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు అప్పుడే వారు అనుమానించారు.