
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు పెద్ద పీట వేశారని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సుపరిపాలన అందిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ అన్నారు. రాష్ట్రంలో అర్హులైన వారికి ఉచితంగా ఇల్లు ఇస్తున్నారన్నారు. మహిళల పేర్లతో ఇళ్ల పట్టాలిస్తున్నామని తెలిపారు. ఆదివారం ఆయన యనమాలకుదురులో మెగా టౌన్‌షిప్‌లో అర్హులైన మూడు వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 634 మందికి టిడ్కో ఇళ్ల పత్రాలు పంచారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. దమ్మున్న నాయకుడు సీఎం జగన్ పేద ప్రజలకు అండగా ఉన్నారని అభయమిచ్చారు. సీఎం జగన్ 30 లక్షల మందికి ఇల్లు ఇచ్చారని తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు హామీలకే పరిమితమైతే సీఎం జగన్ పాదయాత్రలో చెప్పిన హామీలు నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. ఇక తూర్పు నియోజకవర్గంలో 30 వేల మందికి అమ్మ ఒడి వస్తుందన్నారు. (చదవండి: ప్రధాని ప్రశంసలు సైతం దక్కాయి: దేవినేని అవినాష్)