
యనమలకుదురే టార్గెట్
చేతల్లో నిజాయతీ ఏది..
ఇతర గ్రామాల జోలికి వెళ్లని టీడీపీ ముఖ్యనేత
పెనమలూరు : తాను నిజాయతీ పరుడినని.. అభివృద్ధి కోసమే వసూళ్లు చేస్తున్నానని చెబుతున్న నియోజకవర్గ ముఖ్యనేత ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యనమలకుదురులో నకిలీ ప్లాన్‌లపై అధికారులు క్రిమినల్ కేసులు పెట్టడానికి ముందుకు రాగా ముఖ్యనేత అడ్డుకుంటున్నారు. ఓ బిల్డర్ ఇప్పటికే రూ.40 లక్షలు ముఖ్యనేతకు ముట్టచెప్పాడని గుసగుసలు వినపడుతున్న నేపథ్యంలో అక్రమ కట్టడాల వేగం పెరిగింది.
ఇతర గ్రామాల జోలికి వెళ్లని నేత
మండలంలో గ్రూప్‌హౌస్‌లు దాదాపుగా అన్ని గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నారు. అయితే ముఖ్యనేత ఇతర గ్రామాల జోలికి మాత్రం వెళ్లడంలేదు. ఆ గ్రామాల్లో టీడీపీ నేతలు బలంగా ఉండటంతో సొంతపార్టీ నేతల నుంచే ప్రతిఘటన ఎదురవుతుందని వెనక్కు తగ్గి యనమలకుదురు టార్గెట్‌గా పెట్టుకున్నారని టీడీపీ శ్రేణులే చెబుతున్నాయి. గ్రామాన్ని అభివృద్ధి చేయటానికే తాను యనమలకుదురులో వసూళ్లు చేస్తున్నట్లు కానూరులో ఆదివారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన ప్రకటించారు. మిగిలిన గ్రామాలను స్మార్టు విలేజ్‌లుగా అభివృద్ధి చేయటానికి అక్కడ ఎందుకు వసూలు చేయలేక పోతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
చిత్తశుద్ధి ఉంటే ఈ పని చేయగలవా..?
అభివృద్ది మంత్రం చదువుతూ వసూళ్లకు పాల్పడుతున్న టీడీపీ నేతకు చిత్తశుద్ధి ఉంటే ఈ పనులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. యనమలకుదురులో నకిలీ గ్రూప్‌హౌస్‌ల ప్లాన్‌లపై విచారణ చేయించాలి. అక్రమాలకు పాల్పడిన బిల్డర్లపై క్రిమినల్ కేసులు పెట్టించాలి.మోసపోయి ప్లాట్‌లు కొనుగోలు చేసిన వారి ప్లాట్‌లు సీఆర్‌డీఏలో రెగ్యులర్ (బీఆర్‌ఎస్) చేయించాలి. యనమలకుదురులో ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధ్ది పనులు చేపట్టాలి.యనమలకుదురులో గతంలో అక్రమాలకు పాల్పడిన కార్యదర్శల నుంచి సొమ్ము పంచాయతీ ఖజానాకు జమ చేయించాలి. పంచాయతీ పై జరిగిన విజిలెన్స్ విచారణ నివేదిక బహిర్గతం చేయాలి.గతంలో టీడీపీ నేత వసూళ్లు చేసిన రూ.1.5 కోట్లకు గ్రామస్తులకు లెక్క అప్పగించాలి. నకిలీ ప్లాన్‌లు రాకుండా అధికారులు చర్యలు తీసుకునే విధంగా పని చేయించాలి. మిగితా గ్రామాల్లో అక్రమంగా నిర్మాణాలు, గ్రూప్‌హౌస్‌లపై కూడా విచారణ చేపట్టాలి.ఇక్కడ ప్లాట్‌లు కొనుగోలు చేసిన వారికి కూడా న్యాయం చేయాలి. సీఆర్‌డీఏ అధికారులకు స్వేచ్ఛ ఇవ్వాలి.