
అంతా వాళ్లే చేశారు!
అక్రమ కట్టడాలకు అధికార పార్టీ దన్ను
విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసిందీ టీడీపీ ప్రజాప్రతినిధే
మంత్రిని ఆశ్రయించిన బిల్డర్లు
ఆసక్తికరంగా మారిన యనమలకుదురు వ్యవహారం
విజయవాడ : యనమలకుదురు గ్రామంలో అక్రమ కట్టడాల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామంలో వందల సంఖ్యలో అక్రమ కట్టడాల నిర్మాణం దగ్గర్నుంచి ఫిర్యాదుల వరకు అంతా టీడీపీ ప్రజాప్రతినిధుల డెరైక్షన్‌లోనే జరిగిందన్నది బహిరంగ రహస్యం. గ్రామ పంచాయతీ కార్యదర్శులు అడ్డగోలుగా అక్రమ కట్టడాలకు పచ్చజెండా ఊపారు. దండిగా కాసులు దండుకున్నారు. సీన్ కట్ చేస్తే.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగి సమగ్ర విచారణ జరిపి నలుగురు గ్రామ కార్యదర్శులు , ఇద్దరు ఆర్కిటెక్చర్లను ఈ అక్రమ కట్టడాలకు కారకులుగా తేల్చి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. సాక్షిలో అక్రమ కట్టడాల వ్యవహారంపై వరుస కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో బిల్డర్లలో వణుకు మొదలైంది. విజి‘లెన్స్’ నుంచి తమను కాపాడాలంటూ జిల్లాకు చెందిన ఓ అమాత్యుడిని ఆశ్రయించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అంతా తాను చూసుకుంటానని ఆ మంత్రి వారికి హామీ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గతంలో మూడుసార్లు విచారణ జరుగగా.. ఫైల్‌ను తొక్కిపెట్టారు. తాజా పరిణామాల నేపథ్యంలో విజిలెన్స్ నివేదికపై అధికార పార్టీలో అంతర్మథనం మొదలైంది.
టీడీపీ నేతల వింత ధోరణి
రెండేళ్ల కిందట అక్రమ కట్టడాలకు అనుమతులు ఇప్పించింది అక్కడున్న టీడీపీ నాయకులే. అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేలా చేసిందీ స్థానిక నాయకులే. మళ్లీ వారే మూడు నెలల కిందట అక్రమ కట్టడాల వ్యవహారం, గ్రామంలో గాడితప్పిన పంచాయతీ పాలనపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికార పార్టీ ఎమ్మెల్యే అక్రమ కట్టడాల సంగతి తేల్చాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో గతంలో ఈ గ్రామ పంచాయతీపై జిల్లా పంచాయతీ అధికారులు విచారణ నిర్వహించారు. ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ కూడా నిర్వహించింది. అన్ని నివేదికలు అక్రమాలు జరిగాయని తెల్చిచెప్పాయి. తాజాగా స్థానిక ప్రజాప్రతినిధి ఫిర్యాదుతో ప్రభుత్వం విజిలెన్స్‌ను రంగంలోకి దింపి విచారణ నిర్వహించింది. విజిలెన్స్ కూడా అక్రమాలను నిర్ధారించింది. ఈ విచారణలన్నింటికీ మూలం స్థానిక అధికార పార్టీ నేతల ఫిర్యాదులే. కానీ వారు దీనికి భిన్నంగా ప్రజల ముందు మరో కోణంలో వ్యవహరిస్తుండడం గమనార్హం. ఫిర్యాదుచేసిన వారే ఈ వ్యవహారాన్ని మళ్లీ భుజానికి ఎత్తుకొని అండగా నిలవడం విశేషం. దీని వెనుక పెద్ద మొత్తం చేతులు మారిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. అటు అక్రమ కట్టడాల వ్యవహారంతో పాటు ఇటు అధికార పార్టీ నేతల రెండు ధోరణులపై ఊళ్లో విస్తృత చర్చ జరుగుతోంది.