సాయి చెప్పిన స్వీయకథ | Sai path interval 42 | Sakshi
Sakshi News home page

సాయి చెప్పిన స్వీయకథ

Published Sun, Mar 24 2019 12:31 AM | Last Updated on Sun, Mar 24 2019 12:31 AM

Sai path interval 42 - Sakshi

బంగారపు నగని ఎలా సరైన పెట్టెలోనే భద్రపరుస్తారో గొప్పవిలువైన మంత్రాన్ని ఎలా శక్తి సంపూర్ణంగా నిండిన రోజున మాత్రమే ఎలా ఉపదేశిస్తారో అలా ఈ పాదుకాప్రతిష్ఠని ఎప్పుడు చేయవలసిందిగా సెలవునిస్తావో చెప్పవలసిందని సాయిని అడగ్గానే ఆయన – ‘శ్రావణపూర్ణిమనాడు సరిగ్గా 11 గంటలకు’ అని ఆజ్ఞాపించారు.సరిగ్గా 11 గంటలకి ప్రతిష్ఠ చేసేందుకు వీలుగా దీక్షిత్‌ తన శిరసు మీద ఆ పవిత్రపాదుకలని పెట్టుకుని పవిత్రమైన ఖండోబా మందిరం నుండి బయలుదేరగానే భక్తుల సాయినామస్మరణతో దిక్కులు మార్మోగిపోసాగాయి.శివుడు పరశురామునికి యుద్ధవిద్యని నేర్పుతూ ఉన్న కాలంలో శంకరుని చేతిలో ఉన్న గొడ్డలికి సంబంధించిన ఓ ఇనుపముక్క నేలనపడింది. దాన్ని శివుడు ఓ అయఃఖండాన్ని (ఇనుపముక్కని) పరశురామునికే ఇచ్చేశాడు ఈ సంఘటనకి గుర్తుగా.అలాఇనుపముక్క తెగిపడ్డ గొడ్డలి కల ఆ శంకరుణ్ణి ‘ఖండపరశుడు’ అని అప్పటినుండే పిలిచారు. ఆ ఖండపరశుణ్ణే మరాఠీ భాషలో ’ఖండోబా’ అని పిలుస్తారు. అంతటి శివశక్తి నిండిన గ్రామదేవతాశక్తికూడా నిండిన (శంకరుడు అర్థనారీశ్వరుడు కదా!) ఆ ఆలయం నుండి పాదుకలని ద్వారకామాయికి తెచ్చారు ఊరేగింపుగా.సాయి వద్దకి ఆ పాదుకలు రాగానే ఆయన తన చేతితో వాటిని స్పృశించి (తన తపశ్శక్తిని ఆ పాదుకలలోనికి ప్రవహింపజేయడానికి సంకేతం అది) ఇవి శ్రీహరి పాదాలు. దైవచరణాలు.. అన్నాడు.మేళతాళాలతో భజన కీర్తనలతో బాజా భజంత్రీలతో అగరు «ధూపాలతో చందనపు నీటి చల్లులతో కర్పూరపు హారతులతో ఆ ప్రదేశం వర్ణించడానికి వీల్లేనంత గొప్పదిగా అనిపించింది అందరికీ.(శాలివాహన శకం 1834 – క్రీ.శ 1912)ఇప్పటికీ గురుశుక్రవారాల్లో విశేషార్చనలు సాగుతూంటాయి పాదుకలకి. ప్రతి రోజూ అర్చన – ఊదీ వితరణ (భస్మప్రసాదం) ఉంటూనే ఉంటుంది. పాదుకల్లో ఉన్న శక్తి అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి తప్ప చెప్తే అర్థమయ్యేది కానే కాదు. ‘ఏదైనా తినడానికి పెట్టనామ్మా?’ అని సంతానం గనుక అడిగితే – ‘అయ్యో! వాళ్లు అడిగే దాకా వాళ్ల ఆకలిని చూడలేకపోయా’ అనే ఒకింత బాధతోనూ, ఇంకా నయం! నేను ఇంట్లో ఉండగానే అడిగారు’ అనే మరింత ఆనందంతోనూ ప్రతి తల్లీ ఎలా వాళ్లకిష్టమైన తినుబండారాన్ని చేసి కడుపునింపుతుందో, అలా సాయికి కూడా మసీదు నిండుగా భక్తులుండి – ఏదైనా చెప్పవూ సాయీ! అనడిగితే చెప్పలేని ఆనందం ఆయనకి. ఇదీ అదీ చెప్పచ్చూ చెప్పకూడదూ ఇది సమ్మానం, అది అవమానకర సంఘటన అనుకోకుండా తట్టిన విశేషాలని యథార్థంగా జరిగిన వాటిని కళ్లకి కట్టినట్టుగా చెప్పేస్తాడాయన. అందరికీ సాయంటే ఇష్టం ఇందుకే. సాయికి కూడా వాళ్లంటే వాత్సల్యం, అభిమానం అందుకే! అలా సాయే చెప్పిన తన కథని అనుకుందాం!

నాలుగే మార్గాలు
ఓ సారి మేం ఓ నలుగురం మాత్రం– అసలు ఈ సృష్టేమిటి? బ్రహ్మపదార్థమేమిటి? బ్రహ్మజ్ఞానమేమిటి? ఈ రహస్యాన్ని స్వయంగా సాధించేసి – దీని గురించిన ఏ అవగాహన లేని ఎందరికో చాలా తేలికగా అర్థమయ్యేలా వాళ్ల వాళ్ల అనుభవానికి వచ్చేసేలా చేసేద్దాం! మనుకుంటూ బయల్దేరి ఓ నిర్జన (ఏ జనమూ ఉండని) వనానికి వెళ్లిపోయాం.ఈ తోవలో నలుగురం నాలుగు మార్గాలని – ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం ఎన్నుకున్నాం! మొదటివాడు – ఎవరో మనని ఉద్ధరిస్తారనుకోవడం శుద్ధభ్రమ. కాలయాపన(కాలక్షేపం) మాత్రమే. మోక్షం కోసం ఎవరినో ఆశ్రయించడం కంటే మనని మనమే ఉద్ధరించుకోగల ప్రయత్నాన్ని ప్రారంభిస్తే చాలు మనం ఉద్ధరింపబడతాం! ఇదే నిజమైన మార్గమంటూ కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు కదా!(ఉద్ధరే దాత్మనాత్మానమ్‌) అన్నాడు.వెంటనే రెండవవాడు – అసలు అన్నింటికీ కారణం మననందరినీ మంచివైపుకీ చెడువైపుకీ నడిపిస్తూ ఏ మాత్రమూ కనిపించని మనసు మాత్రమే. కాబట్టి మంచిపనికీ (సంకల్పానికీ) ద్రోహం, వంచన, అసత్యం, దర్పం... (వికల్పానికీ) లాంటి వాటిని చేయడానికీ మూలం మనసు మాత్రమే కదా! మూలం అవుతోంది. దాన్ని కాస్తా స్వాధీనం చేసుకోగలిగితే – పులిని బంధించేసిన పక్షంలో అడవి కూడా మన సొంతిల్లులాగా ఎలా తిరగడానికి సాధ్యమైపోతుందో ఆ కారణంగా మనఃస్వాధీనం సరైనదన్నాడు.

ఈ ఇద్దరిదీ విన్న మూడవవాడు – ఈ కనిపించే చెట్టూ పుట్టా పదార్థం కాస్తా ప్రళయం వచ్చినప్పుడు మొత్తం ప్ర+లయం(ఒకదానిలో లీనం) అయిపోతుందో ఆ కారణంగా ఇదంతా అనిత్యం. ముగ్గులేసేవాడు ఓ మంచి బొమ్మనిగీస్తాడు. పెద్ద గాలొచ్చినా వానొచ్చినా లేక వానికి వాడే చెరిపేసినా అంత రాజుగారూ కోటా ఏనుగులూ రాజధాని.. అంతా హుష్‌కాకీయే కదా! అందుచేత ఈ ప్రపంచాన్ని నిత్యంగా భావించకుండా ఎప్పుడో ఒకప్పుడు పోయేవాళ్లమే– అనే నిర్వేదంతో వైరాగ్యంతో ఉంటే చాలు మోక్షం బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుందన్నాడు.నాల్గవవాడు – పుస్తకాలని చదివీ లోకజ్ఞానాన్ని దానికి మేళవించీ కాలాన్ని వెచ్చిస్తూ అనుభవాన్ని గడిస్తూ నిత్యం దైవాన్ని గూర్చిన అనుష్ఠానాన్ని (జపం ధ్యానం ఉపాసన తపస్సు అర్చన అభిషేకం...) గనుక చేస్తూ ఉంటే బ్రహ్మజ్ఞానం మోక్షం మనకి తప్పక లభిస్తుంది. ఎలా ఒక సుందరభవనంలోనికి ప్రవేశించాలంటే ఆ భవనానికి సంబంధించిన తాళపు చెవి అవసరమో, అలాంటివాడవుతూ ఉపాయాలని బోధించగల గురువుని ఎన్నుకోవడం అతిముఖ్యం. ఆయనంటూ మనకి దొరికాక ఈ శరీరాన్ని మనసునీ దాన్ని అదుపు చేయగల బుద్ధినీ ఆ గురువుకి ‘శరణాగతి’ విధానంతో సమర్పించేసుకుని – ఆయన మార్గదర్శకత్వంలో నడుస్తూ వెళ్లే చాలు – మోక్షం దానంతటదే సిద్ధిస్తుందన్నాడు. ఇలా గురువుని ఆశ్రయించినప్పుడు మాత్రం ఆయన మీద స్థిరమైన విశ్వాసం, దానికి తోడుగా ఓపిక (సహనం) అనేవి అవసరమని కూడా చెప్పాడు. అయితే ‘ఆ గురువు వివాదరహితుడూ ధనాభిలాషీమాయావీ... వంటివాడనే విమర్శలకి గురైనవాడేమో గమనించుకుని అలా కానివాడైన పక్షంలోనే అతడ్ని ఆశ్రయించాలని కూడా చెప్పాడు.

ఇలానే తర్కవితర్కాలు చేసుకుంటూ మొత్తానికి ఆ వనంలో తిరగడం ప్రారంభించాం బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనే అన్వేషణలో మహానుభావులకీ కనిపించిన ఏదైనా దివ్యమార్గం మహాపురుషదర్శనం ఆత్మజ్ఞానం కలుగుతుందేమోనని అడుగు మీద అడుగేసుకుంటూ ఆగకుండా తిరుగుతూనే ఉంటే క్రమంగా మేం వనం నుండి కీకారణ్యంలోకి వెళ్లిపోయాం. ‘ఇలాంటి ప్రదేశాల్లోనే దివ్యపురుషుల దర్శనమవుతుందనుకుంటూ నలుగురం వెళ్తున్నామన్నమాటే గాని ఆకలీ దప్పికా కారణంగానూ శారీరకశ్రమ కారణంగానూ ఓపిక పూర్తిగా నశించింది. నిర్వేదస్థితిలో ఉన్నా బలాన్ని కూడగట్టుకుని వెళ్తున్నాం.‘ఎవరు మీరు? ఎక్కడి కెళ్తున్నారు? ఏం కావాలని వెదుకుతున్నారు? తోవ తప్పారా? తోవ చెప్పనా?’ అంటూ ఓ వంజరి (అడవిలో తిరుగుతూ పక్షుల్ని కొట్టి జీవిస్తూ ఉండే వ్యక్తి) అడిగాడు నలుగుర్నీ. మా అంతటి జ్ఞానం లేని అతనికి మా ధ్యేయం చెప్పడమెందుకని భావించి మళ్లీ ముందుకే ఆశానిరాశలతో సాగిపోబోతుంటే – ‘దట్టమైన అడవి ఇది. ఇక్కడైతే నేనున్నా గాని ఆ మీదట మీకు దారీ తెన్నూ చెప్పేవాడు కూడా ఉండడు. పైగా ఎండ మండిపోతోంది. శోషవచ్చి పడిపోతే... ఆలోచించుకోండి! కొంతసేపు కనీసం విశ్రాంతైనా తీసుకోండి. నీళ్లుతాగి మీకు కావలసిందేమిటో వెతుక్కునే ప్రయత్నం చేసుకోండి’ అంటూ తాను చెప్పవలసింది చెప్పాడు. మా నలుగురికీ మాకు మేమే సాధించుకోగలమనే అహంకారముంది కదా! మీరు సమాధానం కూడా చెప్పకుండా మరింతగా ఓపిక కూడగట్టుకుని తిరుగుతూ తిరుగుతూ మళ్లీ అతని కంటనే పడ్డాం!

అతను ఈసారి ఓ నవ్వు నవ్వి– ‘భగవంతుని సంకల్పం లేనిదే దేనికోసం వెతకాలో తెలియదు. ఎక్కడ వెతకాలో కూడా తెలియదు. తిండిలేని ఈ నీరసశరీరంతో దాహంలో నాలుక పిడచగడుతున్న నోటితో ఇంకా ఇంకా తీవ్రత పెరుగుతున్న ఎండలో ఏం తిరుగుతారు? పైగా తెలిసి ఉన్న చోటుకి కాదుగా మీరు వెళ్తున్నది! అంటూ అందరికీ సరిపడిన అన్నాన్ని తినండన్నాడు. మిగిలిన ముగ్గురూ మాత్రం దాని వైపుకి చూడను కూడా చూడకుండా వెళ్లిపోయారు. నాకు మాత్రం ఆలోచనలు రాసాగాయి. అన్నం పరబ్రహ్మస్వరూపం కదా! అదీ కాక విష్ణువుకున్న పేర్లలో అన్నమే అనేది ఒకపేరు ఆయనకి. అంతేకాక ‘అన్నాద’ (అన్నాన్ని తింటూండేవాడు) అని కూడా ఆయన పేరే కదా! (అన్నమన్నాద పవ చ. సాయికి గీత శ్రీవిష్ణు సహస్రనామాలూ వచ్చుననే విషయం నాలుగైదు సంఘటనల్లో స్పష్టంగా తెలుస్తుంది. వాటిలో ఇదొకటి) స్వార్థం లేకుండా , మా ఆకలిదప్పికలని గమనించి ఓ తల్లిలా పిలిచి అన్నాన్ని పెడుతూ ఉంటే ఇటు ఆధ్యాత్మికంగానైతే హరిని తిరస్కరించినట్లూ అటు లౌకికంగానైతే ఆతిథేయుడ్ని (ఆతిథ్యం ఇచ్చేవాడు) అవమానించినట్లూను అని భావించి అతనిచ్చిన నీరు తాగి ఆహారాన్నితిన్నాను.

అది శిక్ష అనిపించలేదు
అలా ఆకలి దప్పికలని అతను తీర్చాడో లేదో వెంటనే ఇద్దరు కనిపించారు హఠాత్తుగా నన్ను ఎక్కడికో తీసుకెడతామన్నట్టుగా చేతిని పట్టుకుని వెళ్తూ అప్పటికప్పుడు ప్రత్యక్షమైన గురుమహారాజ్‌కి అప్పగించారు. గురుమహారాజ్‌ అంటే అన్ని సందేహాలనీ తీర్చేయగల శక్తిమంతుడని అర్థం. గంభీరకంఠస్వరంతో.. ‘ఎందుకొచ్చారు మీ నలుగురూ? ఏం కావాలనుకున్నారు? వెదుకులాటæ ఎంత వరకొచ్చింది?’ అని అడిగాడు. నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. ఆయనకాయనే అన్ని విషయాలనీ దాదాపుగా చెప్పేసేస్తూంటే! నేను మొత్తం చరిత్రని వివరించాను. అంతా తనకి తెలుసున్నట్లుగా విన్నాడాయన. అందుకే ఆశ్చర్యపడలేదు. మమ్మల్ని గురించి వ్యతిరేకధోరణితో మాట్లాడలేదు.‘సరే! నా మాటని తు. చ. తప్పకుండా పాటిస్తావా? నీ వెతుకులాట ముగిసేలా చేసి నీ ప్రయత్నాన్ని సఫలం చేస్తాను. ఇది నీ అంగీకారమైతే నాతోరా!’ అంటూ తన వెంట నన్ను తీసుకువెళ్లిపోయాడు కొంతదూరానికి. అక్కడ నా చేతులూ కాళ్లూ కట్టేసి పెద్దలోతైన బావి నాకు కిందుగా ఉండేలా చేస్తూ నన్ను నూతి గిలక (కప్పీ – నిలువుగా ఉంటూ గుండ్రంగా తిరిగే చక్రం) మీదుగా నన్ను కట్టిన తాడుని ఓ చెట్టు కొమ్మకి తాను కాస్తా నాకు అతని ముఖం కనిపించకుండా ఉండేలా అటు తిరిగి కూర్చున్నాడు.కాసేపయ్యాక అతనంతట అతనే తిరిగొచ్చి! ఎలా ఉన్నావు? ఏమనిపిస్తోంది? అంటూ నా శరీరాన్ని కన్నతల్లిలా ప్రేమ అనురాగ వాత్సల్యాలతో నిమిరి ఒడ్డుకి తెచ్చి కట్లు విప్పాడు.నిజానికి నాకు మాత్రం అదొక శిక్షలా అనిపించలేదు. అలా వేలాడుతున్నంత సేపు ఆ గురుమహారాజ్‌ మీద మాత్రమే దృష్టి అంతా. అతని రాకమీదనే మనసంతా. అలా కట్టువిప్పాక ఆయన పాదాలమీద పడుతూ ఉంటే నాకు అనిపించింది. తల్లిపక్షి ఎలా తన పిల్లని లోకం కనిపించకుండా రెక్కల్లో దాచి పక్షిబాల్యంలో రక్షిస్తుందో, కోతి ఎలా తన పిల్లని పడకుండా చూసుకుంటూ చెట్లూ గోడలూ ఇంటి మీది నుండి మరో ఇల్లూ దూక్కుంటూ వెళ్తుందో ఆవు ఎలా అప్పుడే పుట్టిన దూడని తన నాలుగుకాళ్ల మధ్యా నిలచెట్టుకుని గర్భవతి అయిన తనకి ఓపిక లేకున్నా ఎలా రక్షించుకుంటుందో... అలాగ. శరీరమంతా పులకలెత్తింది. మనసంతా ఆనందంతో నిండిపోయింది.

ఏం కావాలి?
అప్పుడు గురుమహారాజ్‌ నా ఒళ్లంతా నిమురుతూ... ‘నాన్నా! (ప్రేమపూర్వకమైన పిలుపు) నీకేం కావాలని ఆ సమయంలో అనిపించింది? ఆ కాలంలో దేని మీద నీ బుద్ధి నిలిచిపోయింది? ఏం చేస్తూ ఉండిపోయావు?’ అని అడిగాడు. ఆనందాశ్రువులు అలా రాలుతూ ఉండగా చెప్పాను – ‘గురూత్తమా! నాకెవరూ మరొకరు దిక్కులేరు. ఈ గురుమహారాజ్‌ మాత్రమే నాకు దిక్కు. ఆయనొచ్చి కట్లువిప్పితే చాలు. ప్రాణం నిలుస్తుంది. బతికి బట్టకడతాను. అయినా నా శరీరం మొత్తం ఆయనదే! అనుకుంటూ నిన్నే ధ్యానిస్తూ ఉండిపోయాను’ అన్నాను. అవి హృదయంలో నుండి వచ్చిన మాటలు కాబట్టి గురుమహారాజ్‌ కూడా ఆ మాటల్ని నమ్మాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరు మాట్లాడినా అవి నాలుక చివరి నుండి వచ్చిన మాటలా? కాదా? అనే విషయం స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. ఆ స్థాయిలో కూడా అబద్ధాన్నే మాట్లాడుతూ ఉంటే ముఖం అంటే కళ్లు మాత్రం నిజాన్ని కక్కేస్తాయి చూపుల ద్వారా. అంతే! గురువు వెంట మూగవాడిగా నడుస్తూ కదిలిపోయాను ఆయన అడుగులో అడుగువేసుకుంటూ.

గురువుల్ని గుర్తించండి!
భక్తులారా! నన్ను ఆ గురుమహారాజ్‌ గారి వద్దకి తీసుకెళ్లిన ఇద్దరూ నా తల్లిదండ్రులకి సంకేతమన్నమాట. తల్లీ తండ్రీ అనే వాళ్ల కర్తవ్యమేమంటే తమ సంతానాన్ని సరైన గురువు వద్దకి చేర్చడమే. ఇక ఆ గురువు కర్తవ్యమేమంటే ఈ శిష్యుడ్ని తన పుత్రునితో సమానంగా చూసుకుంటూ ఉండటమే. బంగారాన్నైనా సరే మంటలో వేసి కొద్దిపాటి రాగిని కలపకుండా సుత్తితో కొట్టకుండా ఉన్న పక్షంలో అలాగే గరుకుగా ఉండే ఆకురాతితో గీరకుండా అవసరమైతే సానపట్టకుండా అనుకున్న నగగా మారగలుగుతోందా? మదించిన ఏనుగునైనా సరే తోవలో గోతిలో పడేలా చేయకుండా, ఓ వారం రోజుల పాటు తిండి పెట్టకుండా ఉంటే అది మావటివాని మాట వింటుందా? అలాగే గురువు కూడా కొన్ని పరీక్షలకి గురి చేస్తాడు శిష్యుడ్ని. కేవలం అతడ్ని ఓ ప్రయోజకుడిగా చేయాలనేదే అతని లోనిభావం.

పండితులుంటారు లోకంలో. వాళ్లది విజ్ఞాన గర్వం. అంత చదువుకున్నాను. ఇంత చదువుకున్నాననే అహంకార భావం. అంతే కాక ఒకరు చెప్పిందాన్ని ఎలా ఖండించి అవతలివాడ్ని ఓడిద్దామా? అనే కండవాతి తప్పు. ఈ తీరు గురుత్వం వాళ్లలో ఉండదు. వాళ్లకి నచ్చదు. అవసరం కూడా లేదు వాళ్లకి. ఇక మరికొందరుంటారు గురువులు. ఎంతమటుక్కు మహిమల్ని ప్రదర్శించి బేలతనపు భక్తుల్ని నమ్మించడం సొమ్ము కాజేయడం శరీరం నిండుగా బంగారాన్ని ధరించి ఆకర్షించడం... వంటివి వారి లక్షణాలు. పొద్దుటి నుండి రాత్రి నిద్రించబోయే వరకూ ధనసంపాదనకి సంబంధించిన మార్గాలనీ ఉపాయాలనీ దైవం వంకతో చేస్తూ శిష్యవిత్తాలని (శిష్యులసొమ్ముని) అపహరించడమే వాళ్ల లక్ష్యం. ఇలాంటి వారిని సేవిస్తే పవిత్రమైన విలువైన సమయమంతా గడిచిపోయి ఏ తీరు సాధనా లేకుండా శరీరం కాస్తా మరణిస్తుంది. అప్పుడు చింతించే వీలు కూడా ఉండదు.

‘కాబట్టి గురువు మందలించినా అరిచినా తిట్టినా రౌద్రంతో కనిపించినా అదంతా శిష్యుడ్ని తోవలోనికి తేవడానికి మాత్రమే అనే దృష్టితోనే సుమా!’ అని ఓ క్షణం ఆలోచనా దృష్టిని మరల్చిగాని చూసుకుంటే నిజగురువులెవరో.. అధర్మ, అసత్య, వంచన గురువులెవరో..ఇట్టే బోధపడిపోతుంది. కోయిలా కాకీ గుడ్డు దశలో ఒకలానే ఉంటాయి. గుడ్డు పగిలి పిల్ల బయటికొచ్చాక గొంతు విప్పితే చాలు ఆ కంఠస్వరంతో కాకీ కోకిలల తేడా మనకి ఎవరూ చెప్పనక్కర్లేకుండా అర్థమైపోతుంది.గురువుకి శిష్యుల మనసునీ బుద్ధినీ ఆకర్షించగల సత్యధర్మప్రవర్తన ఉండాలి తప్ప వస్త్రాలంకారాలు కాదు ప్రధానం. ఆ అరణ్యంలో అన్నాన్ని ఆ ‘వంజరి’ పెట్టినట్టుగా మీ శిష్యులు అన్నాన్ని (వరి, గోధుమలు, జొన్నలు, రాగులు..) పెడితే చాలు అదే గురువుకి పంచభక్ష్యపరమాన్నాలు కాగలగాలి. గురువుకి శిష్యులే నిజమైన సంతానం కాబట్టి వాళ్లలో ఎవరికి రోగం వచ్చినా గురువే వైద్యుడు కావాలి. వాళ్లలో ఎవరికి సంసారంలో సమస్య వచ్చినా గురువే దాన్ని పరిష్కరించే న్యాయాధిపతి కావాలి. వాళ్లలో ఎవరికి ఆకలి దప్పిక పేదతనం, దారిద్య్రం, ఆత్మహత్యా ఆలోచనం... వంటివొచ్చినా కచ్చితంగా వాటికి నివారణని చేయవలసిన బాధ్యత గురువుదే. అలా చేయగల ఉండగల శక్తీ ఇష్టం తగిన సమయం ఉన్నప్పుడు మాత్రమే ‘గురువు’గా తనకి తాను ఉండగలనని అనుకోవాలి. భక్తులు కూడా అలాంటి వాడ్నే గురువుగా (ఎంతో పరీక్ష చేశాక) ఎన్నుకోవాలి.ఎలా ఆవుదూడని ఓ వంద ఆవుల మందలోకి పంపినా అన్ని ఆవుల్నీ దాటుకుంటూ తన తల్లి పొదుగులో మాత్రమే తలని పెట్టి కుడుచుకుంటుందో అదే మరి గేదె, మేక.. వంటివాటికి ఈ నిర్ణయశక్తి లేదో అలా గురువుగా ఒకరినంటూ ఎంచుకున్నాక అలాగే వారివద్దనే కొనసాగిపోవాలి తప్ప– వస్త్రాలని మార్చినట్లు గురువుల్ని కూడా మార్చుకుంటూపోతే చివరికి ఎవరి మీదా గురి కుదరక చుక్కాని లేని నావలా జీవితం మొత్తం ఎటుకో ఎటుకో వెళ్లిపోతుంది. ఒక జీవితం మొత్తం శూన్యం అయిపోతుంది.
 – సశేషం
డా. మైలవరపు శ్రీనివాసరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement