అభినేతృత్వం
భరతనాట్యం... ఒక సంప్రదాయ నృత్యరీతి... ప్రేక్షకులను అలరించడమే దాని లక్ష్యం. లీడర్‌షిప్, వ్యక్తిత్వ వికాసం... ఇవి యువతరానికి కెరీర్‌లో అత్యంత ఆవశ్యకమైన అంశాలు. భరత నాట్యం ద్వారా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునేందుకు, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతున్నారు అర్చనా కర్రె (వ్యాసం). ఎంబీఏ చదువుకుని, దాదాపు ఏడేళ్లు కార్పొరేట్ ఉద్యోగంలో కొనసాగిన అర్చన, నాట్యం కోసం ఆకర్షణీయమైన కెరీర్‌ను కాదనుకున్నారు. ఇప్పుడు నాట్యాన్నే తన సర్వస్వంగా తీర్చిదిద్దుకున్నారు. తొలుత సుప్రసిద్ధ నాట్య విద్వాంసుడు వెంపటి చినసత్యం వద్ద నృత్యం నేర్చుకున్నారు. తర్వాత చెన్నైలోని ‘కళాక్షేత్ర’లో చేరి, భరతనాట్యంలో పీజీ పూర్తి చేశారు. సోక్ట్రానిక్స్ సంస్థలో దాదాపు ఏడేళ్లు పనిచేశారు. తర్వాత మంజీరం అకాడమీ ఆఫ్ ఫైనార్ట్స్‌ను స్థాపించి, పూర్తిగా నాట్యానికే అంకితమయ్యారు.
భరతనాట్యాన్ని సంప్రదాయబద్ధంగానే నేర్చుకున్నా, అర్చన కేవలం సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాలేదు. సృజనాత్మకతను, ప్రయోగశీలతను జోడించి, శాస్త్రీయ నృత్యాన్ని ఆధునిక తరానికి చేరువ చేస్తున్నారు. ‘లీడర్‌షిప్ ఇన్ డ్యాన్స్’ (నాట్యంలో నాయకత్వం) ఆమెకు బాగా గుర్తింపు తెచ్చిన అంశం. ‘లీడర్‌షిప్ ఇన్ డ్యాన్స్’ ప్రదర్శనకు సత్యం స్కూల్ ఆఫ్ లీడర్‌షిప్
అర్చనను ‘ఫుల్ లైఫ్ సైకిల్ లీడర్’ (ఎఫ్‌ఎల్‌సీఎల్) అవార్డుతో సత్కరించింది. అంతే కాదు, ఈ అంశాన్ని తన శిక్షణ కార్యక్రమంలో పాఠ్యాంశంగా చేర్చింది. నృత్యం వినోదాన్ని పంచే కళ మాత్రమే కాదు, వ్యక్తిత్వ వికాసాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునేందుకు సైతం దోహదపడగల సాధనమని అర్చన తన ప్రదర్శనలతో నిరూపించుకున్నారు. నానాటికీ సంక్లిష్టంగా మారుతున్న వర్తమాన సమాజంలో శాంతిని పెంపొందించే సాధనం కూడా నృత్యమేనని ఆమె విశ్వసిస్తారు.
నగరంలోని సైనిక్‌పురి ప్రాంతంలో ఉంటున్న అర్చన పలు వేదికలపైనే కాకుండా, దేశ విదేశాల్లో లెక్కకు మిక్కిలిగా ప్రదర్శనలు ఇచ్చారు. ‘మంజీరం’ అకాడమీ ద్వారా ఒకవైపు విద్యార్థులకు నాట్యంలో శిక్షణ ఇస్తూనే, మరోవైపు వినూత్న ప్రయోగాలు చేపడుతున్నారు.
- పన్యాల జగన్నాథదాసు
నాట్యమే సర్వస్వం
నాట్యమే నా సర్వస్వం. నాట్యంపై అంతులేని తపన, నిబద్ధతతో పాటు కుటుంబ సభ్యుల మద్దతు ఉండటంతో ఒకవైపు నాట్యాన్ని, మరోవైపు చదువుని కొనసాగించగలిగా. మా అమ్మ ఇచ్చిన స్ఫూర్తితోనే నాట్యం నేర్చుకున్నా. ఎంబీఏ కొత్తగా ఆలోచించడం నేర్పింది. ఏడేళ్ల కార్పొరేట్ కెరీర్‌లో భిన్నమైన మనస్తత్వాలను, పరిస్థితులను ఆకళింపు చేసుకోగలిగాను. నాట్యం నిరంతర పరిణామం చెందే కళ. నాట్యం ద్వారా నాయకత్వ లక్షణాలు సహా చాలా జీవన నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. నాట్యం పట్ల అందరూ సానుకూలంగా స్పందించాలన్నదే నా ఆకాంక్ష.
- అర్చన