బీ స్కూల్స్‌లో.. అమ్మాయిల హవా! | Girls will be the first more than boys in Business schools | Sakshi
Sakshi News home page

బీ స్కూల్స్‌లో.. అమ్మాయిల హవా!

Published Thu, Jul 10 2014 12:34 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

బీ స్కూల్స్‌లో.. అమ్మాయిల హవా! - Sakshi

బీ స్కూల్స్‌లో.. అమ్మాయిల హవా!

టాప్ స్టోరీ:  ఇంజనీరింగ్ పూర్తిచేసిన అర్చన..మూడేళ్లకు పైగా ఓ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేసింది. కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే.. టెక్నికల్ నాలెడ్జ్‌తోపాటు మేనేజ్‌మెంట్ స్కిల్స్ అవసరమని గుర్తించింది. ఆమె ఇప్పుడు  నగరంలోని ప్రముఖ బీస్కూల్‌లో చేరి, మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను మెరుగుపరచుకునే పనిలో నిమగ్నమైంది. ఒక్క అర్చనేకాదు.. ఇలా ఎంబీఏలో చేరుతున్న అమ్మాయిల సంఖ్య ఏటేటా గణనీయంగా పెరుగుతుంది. సిటీలోని బీస్కూల్స్‌లో అమ్మాయిల హవాపై ప్రత్యేక ఫోకస్..
 
 నగరంలోని టాప్ మేనేజ్‌మెంట్ కళాశాలల్లో గతంతో పోల్చితే.. ఎంబీఏలో చేరుతున్న అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐబీఎస్), ఓయూ, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్(ఐపీఈ) వంటి ప్రముఖ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం అడ్మిషన్లలో అమ్మాయిల శాతం గతం కంటే భారీగా పెరిగింది. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ) రికార్డు స్థాయిలో 30శాతానికి పైగా అమ్మాయిలకు అడ్మిషన్ కల్పించినట్లు ఐఎస్‌బీ డిప్యూటీ డీన్ సవితా మహాజన్ తెలిపారు. ఈ బీస్కూల్ చరిత్రలో ఇది అత్యధికమన్నారామె! ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలలో విద్యార్థినుల శాతం బాగా పెరిగిందని ఓయూ, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ డీన్ కృష్ణారెడ్డి తెలిపారు.  బాధ్యతలను నూటికి నూరుశాతం నిర్వర్తించడంలో మహిళలు చొరవ చూపుతుండటమే తాజా ట్రెండ్స్‌కు కారణమంటున్నారు ఐపీఈ అసోసియేట్ ప్రొఫెసర్ అంజిరాజు.
 
 దేశవ్యాప్తంగా అదే ట్రెండ్
 దేశంలోని ప్రముఖ  బిజినెస్ స్కూల్స్ ఐఐఎం, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, ఐఎస్‌బీ వంటి వాటిలో 2014-16 బ్యాచ్ అడ్మిషన్ల ప్రత్యేక ఏంటో తెలుసా..?! ఎంబీఏలో చేరుతున్న  అమ్మాయిల సంఖ్య  ఎన్నడూలేనంతగా పెరగడం..! ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్స్ (ఐఐఎంలు) గతేడాదితో పోల్చితే.. ఈ సంవత్సరం అమ్మాయిలను అధిక సంఖ్యలో చేర్చుకున్నాయి. అంతేకాదు ఐఐఎంలు, ఐఎస్‌బీలాంటి ప్రముఖ బీస్కూల్స్.. మేనేజ్‌మెంట్ కోర్సుల వైపు అమ్మాయిలను ప్రోత్సహించేందుకు ఎంపిక ప్రక్రియను మరింత సరళతరం చేస్తుండటం విశేషం. ఐఐఎం, కలకత్తా అయితే ఇంటర్వ్యూకు సెలక్ట్ అయిన మహిళలకు ఏకంగా మూడు మార్కులు అదనంగా ఇచ్చేందుకు నిర్ణయించింది.  ఐఐఎం, లక్నో కూడా విద్యార్థినులకు ప్రత్యేక వెయిటేజీ ఇస్తోంది. అలాగే.. ఐఐఎం, అహ్మదాబాద్; ఐఐఎం, బెంగళూరు కూడా గతంలో పోల్చితే ఈ ఏడాది అధిక సంఖ్యలో అమ్మాయిలకు ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ పంపించాయి.
 
 
 ఐటీలోనే కాదు.. మేనేజ్‌మెంట్‌లో సైతం
 మహిళలకు లాజికల్ స్కిల్స్ తక్కువ... అందుకే ఐటీ ఉద్యోగాల్లో అంతగా రాణించలేరనే అపోహను అధిగమించి ఐటీ సెక్టార్‌లో పాగా వేసిన అమ్మాయిలు.. ఇప్పుడు మేనేజీరియల్ కెరీర్ దిశగా దూసుకుపోతున్నారని విశ్లేషిస్తున్నారు నిపుణులు. సంస్థను నడిపించటం అంత తేలిక్కాదు. అపార అనుభవం ఉన్న పురుషులకే సాధ్యం కావట్లేదు.. ఇక మహిళల వల్ల ఏమవుతుంది? అనే మాటలు సత్యదూరమని నిరూపించారు ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందాకొచ్చర్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్‌పర్సన్ అరుంధతీభట్టాచార్య తదితరులు. వీరిని ఆదర్శంగా తీసుకుంటూ.. అదేబాటలో నడుస్తూ.. మేనేజ్‌మెంట్ కోర్సులకు ప్రాధాన్యతనిస్తున్నారు నవతరం అమ్మాయిలు. దేశంలో ప్రముఖ బీస్కూల్స్ క్యాంపస్‌లలో సీటు సంపాదించిన ప్రతి నలుగురిలో ఒకరు అమ్మాయిలే ఉన్నారని తాజా విశ్లేషణలు తెలుపుతున్నాయి. విశేషం ఏమంటే..  రిజర్వేషన్ కాకుండా.. మెరిట్ ద్వారా సీటు సంపాదిస్తున్న విద్యార్థినుల సంఖ్య పెరుగుతుండటం!
 
 ఐఎస్‌బీ.. ఏడేళ్లలో 120 శాతం
 బీస్కూల్స్‌లో నగరంలోని ఐఎస్‌బీకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ఫ్రెషర్స్‌కే కాకుండా.. ఐదారేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ చేసే వీలుంది. 2014-2015 విద్యాసంవత్సరంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్.. హైదరాబాద్, మొహాలీ ప్రాంగణాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్(పీజీపీ)లో 30 శాతం మంది అంటే.. 231 మంది విద్యార్థినులే ఉన్నారని ఐఎస్‌బీ డిప్యూటీ డీన్ సవితా మహాజన్ తెలిపారు. ఏడేళ్ల వ్యవధిలో ఐఎస్‌బీలో విద్యార్థినుల చేరిక రేటు 120 శాతం పెరిగినట్లు  ఆమె చెప్పారు.  ఐఐఎం అహ్మదాబాద్‌లో గతంలో 11 నుంచి 22 శాతం మాత్రమే ఉన్న విద్యార్థినుల సంఖ్య.. తాజా బ్యాచ్‌లో 28శాతానికి పెరిగింది.  
 
 ఓయూలో 80కి 24 మంది అమ్మాయిలే!
 ‘‘పాతికేళ్ల  క్రితం.. ఇంట్లో వాళ్లను ఒప్పించి ఓయూ క్యాంపస్‌లో  ఎంబీఏ కోర్సులో చేరాను. మొదటిరోజు క్లాసులోకి వెళ్లగానే ఆశ్చర్యం. అందరూ మగపిల్లలే.. ఆ ఏడాది ఎంబీఏలో చేరిన ఒకే ఒక్క అమ్మాయిని నేనే. ప్రస్తుతం యువతుల ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. మేనేజ్‌మెంట్ కోర్సులు చేసేందుకు పోటీపడు తున్నారు’’అంటున్నారు ఓయూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ హెడ్ ప్రొఫెసర్ సెల్వరాణి బాలన్.  ఓయూ క్యాంపస్‌లో ఎంబీఏలో 80 సీట్లు ఉంటే.. ప్రతి క్లాసులో 24మందికి పైగా అమ్మాయిలే ఉంటున్నారు. వీరిలో ఎక్కువ మంది  విద్యార్థినులు మెరిట్ ద్వారా సీటు తెచ్చుకుంటున్నారు. అబ్బాయిలతో పోటీపడి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో చోటు సంపాదిస్తున్నార ని ఆమె చెప్పారు.
 
 మహిళలకే ఎంఎన్‌సీల ఓటు
 మల్టీనేషనల్ కంపెనీలు కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సమయంలో అమ్మాయిలకే అధిక ప్రాధాన్యత  ఇస్తున్నాయంటున్నారు ఓయూ ప్రొఫెసర్ చంద్రిక. సహజంగా మహిళలకు ఉండే ఓర్పు.. నేర్పు... వీటికి అదనంగా టీంవర్కులో పరిణితితో నిర్ణయాలు తీసుకోవడం వంటి ప్రత్యేక నైపుణ్యాలు ‘ఆమె’కు సంస్థలు ప్రాధాన్యత కట్టబెట్టేందుకు కారణాలంటూ విశ్లేషించారు. ‘కుటుంబ సంక్షేమానికి మహిళలు ఎంతగా బాధ్యత వహిస్తారో..  తాను పనిచేసే సంస్థ ఎదుగుదలకూ అంతకుమించిన బాధ్యత స్వీకరిస్తారు. ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధిస్తున్న విజయాలు ఇప్పటి యువతుల్లో ప్రేరణనింపుతున్నాయి.
 
 కార్పొరేట్ ప్రపంచంలో ఉన్నతస్థానంలో నిలిచేందుకు ఎంబీఏతో బిజినెస్, మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను సాధిస్తున్నారు.  తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పు కూడా అమ్మాయిలు ఎంబీఏ వంటి ఉన్నత చదువులకు రావడానికి మరో కారణం. పనిచేసే చోట పురుషులతో పోల్చితే మహిళలు  మరింత పారదర్శకంగా ఉంటారు’ అంటూ.. ఇటీవల ఐఎస్‌బీలో నిర్వహించిన సమావేశానికి హాజరైన ఐఐఎం పూర్వ విద్యార్థిని, ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (యూబీఎస్ ఇండియా) సెక్యూరిటీస్ ఛీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనూష భగత్ మేనేజ్‌మెంట్ కోర్సుల వైపు అమ్మాయిలు ఆకర్షితులవడానికి కారణాలను విశ్లేషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement