Technical knowledge
-
వచ్చేస్తుంది వెబ్ 3.0.. 2023 చివరికల్లా తుదిరూపం..! ఏం జరగబోతోంది?
దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (వరల్డ్ వైడ్ వెబ్) ఇంటర్నెట్ ప్రపంచానికి గుర్తింపు కార్డు. వెబ్ మొదలైనప్పటికీ ఇప్పటికీ పోలికే లేనంతగా మారిపోయింది. చదవడానికి, రాయడానికి, సమాచారాన్ని పంచుకోవడానికి వేదిక అయిన ఈ వెబ్ త్వరలో మరో అవతారం ఎత్తబోతోంది. మరింత స్వేచ్ఛాయుతంగా, ఆంక్షలులేని, అనుమతులు అవసరంలేని సరికొత్త వెబ్ ఆవిష్కృతం కాబోతోంది. వెబ్ పరిణామ క్రమాన్ని మూడు అంచెలుగా చెప్తున్నారు. తొలినాటి వెబ్‌ను వెబ్ 1.0గా, ప్రస్తుతం నడుస్తున్నదాన్ని వెబ్ 2.0గా రాబోయేదానిని వెబ్ 3.0గా పిలుస్తున్నారు. దీనిని సినిమాలతో పోలిస్తే.. వెబ్ 1.0 అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమా అయితే వెబ్ 2.0 రంగుల చిత్రం, అదే వెబ్ 3.0 ఏకంగా త్రీడీ సినిమా అనుకోవచ్చు. మరి వెబ్ పుట్టు పూర్వోత్తరాలు, దాని పరిణామం, రాబోయే రోజుల్లో ఏ విధంగా మారబోతున్నదో తెలుసుకుందాం. వెబ్ 3.0 సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి నిరంతరంగా సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే వెబ్ 3.0 తెరపైకి వస్తోంది. ఇది ఎప్పుడు మొదలవుతుందో కచ్చితంగా చెప్పలేకున్నా.. ప్రస్తుత పరిణామాల ఆధారంగా 2023 చివరికల్లా వెబ్ 3.0 ఒక రూపుదాల్చుతుందని సాంకేతిక పరిజ్ఞాన నిపుణుల అంచనా. ఎవరి నియంత్రణ అవసరం లేకుండా బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారంగా రూపొందిన క్రిప్టోకరెన్సీలే వెబ్ 3.0కు తొలి అడుగుగా వారు చెప్తున్నారు. గత వెబ్ వెర్షన్లకు రాబోయే 3.0కు ఉన్న ప్రాథమిక వ్యత్యాసం ఏమిటంటే.. రాబోయేది నియంత్రణలు లేని స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేయడమే. వెబ్ 3.0 మౌలిక నిర్మాణంలో పెద్దగా మార్పు లేకపోయినా.. నూతన సాంకేతిక పరిజ్ఞానాల కారణంగా దీని స్వభావాలు సమూలంగా మారబోతున్నాయి. ప్రస్తుతం వెబ్ వివిధ కంపెనీల నియంత్రణలో నడుస్తుండగా.. వెబ్ 3.0 పూర్తి స్వేచ్ఛా వాతావరణంలో పనిచేయబోతోంది. దీనికోసం బ్లాక్ చైన్ టెక్నాలజీతోపాటు కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషీన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీలు వెబ్‌కు జత అవుతున్నాయి. ప్రస్తుతం ఒకటి లేదా రెండు సర్వర్ల ఆధారంగా ఇంటర్నెట్ సమాచార మార్పిడి జరుగుతోంది. వీటిపై కార్పొరేషన్లు, ప్రభుత్వాల నియంత్రణ ఉంటోంది. సమాచార మార్పిడి ఐపీ అడ్రస్‌ల ఆధారంగా జరుగుతోంది. వీటికి అనుమతించడం, నియంత్రించడం ఆయా సర్వర్లపై పెత్తనం ఉన్న కంపెనీలు, ప్రభుత్వాలకే ఉంది. రాబోయే వెబ్ 3.0 సరికొత్త ఈ నియంత్రణలకు లొంగకుండా పనిచేస్తుంది. కంపెనీలు, ప్రభుత్వాల ఆధారంగా కాకుండా వినియోగించే వారి నియంత్రణలో పనిచేసే విధంగా ఉంటుంది. యూజర్ కోరే సమాచారాన్ని కృత్రిమమేధ ద్వారా ప్రపంచంలో ఏ సర్వర్‌లో ఉన్నా తీసుకునే హక్కు రాబోతోంది. వెబ్ 1.0 యూరప్ పరిశోధన సంస్థ ‘సెర్న్’లో కంప్యూటర్ సైంటిస్టుగా పనిచేసిన బెర్నర్స్‌లీ 1990లో వెబ్‌ను రూపొందించారు. వెబ్‌కు అవసరమైన ప్రాథమిక సాంకేతిక పరిజ్ఞానమైన హెచ్‌టీఎంఎల్, యూఆర్ఎల్, హెచ్టీటీపీల రూపకర్త బెర్నర్స్‌లీ. తొలి వెబ్‌పేజీని కూడా ఆయనే ఆవిష్కరించారు. తొంబై దశకం మొత్తంగా సాగిన ఈ తొలినాటి వెబ్‌లో కేవలం ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్‌కు వెబ్ పేజీల ద్వారా సమాచారం పంపడానికి మాత్రమే వీలయ్యేది. నెట్‌స్కేప్ వంటి వెబ్బ్రౌజర్ల ద్వారా ఈ–మెయిల్స్ పంపుకొనేవారు. ఇంటర్నెట్లో చాలా పరిమితంగా సమాచారం అందుబాటులో ఉండేది. రీడ్ఓన్లీగా పిలిచే ఈ వెబ్ 1.0 దాదాపుగా 1990లో మొదలై 2004 వరకు సాగింది. వెబ్ 1.0 చివరి రోజుల్లో క్రమంగా రూపాంతరం చెందుతూ వెబ్ 2.0 ఆవిర్భావానికి బాటలు వేసింది. వెబ్ 2.0 ప్రస్తుతం మనకు సుపరిచయమైన వెబ్ వెర్షన్ ఇది. తొలినాటి వెబ్‌కు ఏమాత్రం పోలికలేని స్థాయిలో మార్పు చెంది వెబ్ 2.0గా రూపుదాల్చింది. స్థిరమైన వెబ్ నుంచి అత్యంత వేగవంతమైన క్రియాశీల అప్లికేషన్‌గా అవతరించింది. చదవడానికి పరిమితమైన వెబ్‌పేజీల నుంచి చదవడం, రాయడం, పరస్పరం సంభాషించుకోగలడం వంటివాటికి వేదికైంది. అపార జ్ఞాన సంపదకు భాండాగారంగా మారింది. సోషల్ మీడియా నుంచి డిజిటల్ కరెన్సీ వరకు అన్ని రంగాలను ప్రభావితం చేసింది. యూట్యూబ్, ఫేస్బుక్, ఫ్లిక్కర్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ వంటి అనేకానేక సోషల్ మీడియా వెబ్సైట్లకు వెబ్ 2.0 పునాది అయింది. సమస్త సమాచారాన్ని ముంగిటకు తెచ్చి.. ప్రపంచ ప్రజల జీవనశైలినే మార్చేసింది. ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. క్రిప్టోకరెన్సీ వంటి డిజిటల్ కరెన్సీ చలామణీలోకి రావడానికి కూడా వెబ్ 2.0 తోడ్పడింది. వినోద రంగంలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ లాంటి వేల ఓటీటీ చానెల్స్, స్ట్రీమింగ్ సైట్ల పుట్టుకకు ఆస్కారం కల్పించింది. వెబ్ సాంకేతిక పరిజ్ఞానాలైన హెచ్‌టీఎంఎల్5, సీఎస్ఎస్3, జావా స్క్రిప్ట్ ఆధారంగా రోజురోజుకు కొత్త ఆవిష్కరణలతో గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ వంటి వందల కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యాల సృష్టిని సాకారం చేసింది. ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీతో 2.0 మరో అవతారం ఎత్తడానికి సమాయత్తం అవుతోంది. కచ్చితత్వం దిశగా.. ఈ సరికొత్త సాంకేతికత వల్ల వినియోగదారుడికి కచ్చితమైన సమాచారం అందే అవకాశాలు పెరగనున్నాయి. యూజర్ ఏదైనా సమాచారం కొరితే.. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష అంశాలన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో నిర్ణయించుకునే ఆస్కారం లేకుండాపోతోంది. ఇక మీద ఏదైనా సమాచారం కోరినప్పుడు వెబ్ 3.0లోని కంప్యూటర్ సమాచారం కోరిన నేపథ్యాన్ని కూడా అర్థం చేసుకుని, వాస్తవికతను జోడించి అవసరమైన మేరకే కచ్చితమైన సమాచారాన్ని అందించగలుగుతుంది. ఇక ముందు కంపెనీలన్నీ ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలను పొందుపర్చగల కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులను తీసుకురానున్నాయి. ఈ పరిజ్ఞానం ఆధారంగా పనిచేయబోయే యాప్‌లను కూడా డీయాప్స్ (డీసెంట్రలైజ్డ్ యాప్స్)గా పిలవబోతున్నారు. ఏం జరగబోతోంది? ►వెబ్ 3.0 యుగంలో మనకు నియంత్రిత సమాచారం నుంచి విముక్తి లభిస్తుంది. కోరుకున్న సమాచారం కచ్చితత్వంతో, ఎవరి ప్రమేయానికి లోనవకుండా అందుబాటులోకి వస్తుంది. మన వ్యక్తిగత వివరాలపై ఎవరి నియంత్రణ ఉండబోదు. విస్తృతమైన డేటా బేస్ ఉన్న ఫేస్బుక్, గూగుల్ వంటి కంపెనీలు ఇకముందు ఆ డాటాబేస్‌పై నియంత్రణ కోల్పోతాయి. ►కొత్త వెబ్‌లోని సమాచారంపై ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థలకు నియంత్రణ సాధ్యం కాదు. ప్రభుత్వ సెన్సార్షిప్లు పనిచేయవు. ఇప్పటికే సైబర్ క్రైంను అదుపు చేయడానికి అష్టకష్టాలు పడుతున్న పోలీసు వ్యవస్థకు దీనితో మరిన్ని కష్టాలు వచ్చే అవకాశముంది. ►డిజిటల్ సమాచారానికి సంబంధించిన ఆయా దేశాల చట్టాలను అమలు చేయడం కూడా సాధ్యం కాదు. ఇదివరకు కొన్ని సర్వర్ల ద్వారా సమాచార మార్పిడి జరిగేది. వాటి నియంత్రణ ద్వారా ప్రభుత్వాలు, పోలీసులు, కోర్టులు చట్టాలను అమలు చేయగలిగేవి. కొత్త వెబ్‌లో సమాచారం అనేక కేంద్రాల నుంచి లభించడం వల్ల.. దానిపై పెత్తనం అసాధ్యంగా మారబోతోంది. మారబోయే సరికొత్త సాంకేతిక వాతావరణంలో ప్రభుత్వాలు, చట్టాలను అమలు చేసే వ్యవస్థలు తమ పంథా మార్చుకోవలసిన పరిస్థితి రానుంది. -
నైపుణ్యం, సాంకేతికతతోనే దేశ ప్రగతి
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం అన్న రెండు స్తంభాల ఆధారంగానే భారతదేశ అభివృద్ధి ప్రస్థానం కొనసాగిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో సాంకేతిక పరిజ్ఞానం అన్నది అందరినీ కలుపుకొని పోయే సాధనంగా అవతరించిందని చెప్పారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో భారత శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన విభాగం నిర్వహిస్తున్న ‘ప్రపంచ భూ ప్రాదేశిక సమాచార కాంగ్రెస్ –2022’ నాలుగు రోజుల సదస్సు మంగళవారం హెచ్ఐసీసీలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని వీడియో ద్వారా తన సందేశం అందించారు. ఎవరూ వెనుకబడిపో కూడదనే ప్రపంచ భూ ప్రాదేశిక సమాచార కాంగ్రెస్ ప్రధాన ఇతివృత్తం (జియో ఎనేబిలింగ్ గ్లోబల్ విలేజ్: నో వన్ షుడ్ బి లెఫ్ట్ బిహైండ్) మాదిరిగానే భారత ప్రభుత్వం కూడా చిట్టచివరి వ్యక్తికీ సాధికా రత కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన కృషి చేస్తోందని మోదీ తెలిపారు. అట్టడుగు వర్గాలకు కూడా భారీ లబ్ధి చేకూర్చే లక్ష్యంతో తాము కార్యక్ర మాలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా 45 కోట్ల మందికి బ్యాంకింగ్ సౌకర్యాలు, 13.5 కోట్ల మందికి బీమా ప్రయోజనం, 11 కోట్ల కుటుంబాలకు పారిశుధ్య వసతి, ఆరు కోట్ల కుటుంబాలకు నల్లాల ద్వారా తాగునీరు అందించగలిగామని చెప్పారు. లబ్ధిదారులు పలు పాశ్చాత్యదేశాల జనాభా కంటే ఎన్నో రెట్లు ఎక్కువని మోదీ పేర్కొన్నారు. ఆ రెండే కీలకం... దేశ అభివృద్ధి ప్రస్థానంలో టెక్నాలజీ, నైపుణ్యం రెండే కీలకమైన స్తంభాలని ప్రధాని తెలిపారు. టెక్నాలజీ మార్పును తీసుకొస్తుందని, అతిచిన్న వ్యాపారి కూడా ఈ రోజున డిజిటల్ పేమెంట్లకు అంగీకరిస్తుండటం అలాంటి మార్పేనని వివరించారు. కోవిడ్–19 సమయంలోనూ ప్రభుత్వం టెక్నాలజీ సాయంతో పేదలను ఆదుకుందని జామ్ ట్రినిటీగా చెప్పుకునే జన్‌ధన్ యోజన, ఆధార్ కార్డు ఆధారిత డేటాబేస్, మొబైల్ నంబర్ల ద్వారా 80 కోట్ల మందికి సంక్షేమ ఫలాలు అందించగలిగిందని గుర్తుచేశారు. వాతావరణ మార్పుల వంటి అంతర్జాతీయ సమస్యలను ఎదుర్కొనేందుకు కూడా టెక్నాలజీనే కీలకం కానుందన్నారు. అందరికీ అందుబాటులో భూ ప్రాదేశిక సమాచారం కోవిడ్ మహమ్మారి ప్రపంచానికి ఓ మేలుకొలుపు లాంటిదని, సంక్షోభ సమయంలో అన్ని వర్గాల వారినీ కలుపుకుని పోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసిందని మోదీ చెప్పారు. భూ ప్రాదేశిక సమాచారం లాభాలను సమాజంతో పంచుకునే విషయంలో భారత్ ఇప్పటికే తనదైన ముద్ర వేసిందన్నారు. రెండు వందల సంవత్సరాలుగా పలు జాతీయ సంస్థలు సేకరించిన భూ ప్రాదేశిక సమాచారాన్ని ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తెచ్చామని.. ఇది దేశ ప్రగతి ప్రస్థానంలో రెండో స్తంభమైన యువ నైపుణ్యానికి కొత్త దారులు పరిచిందని చెప్పారు. స్టార్టప్‌ల ఏర్పాటులో అగ్రగామిగా భారత్ స్టార్టప్ కంపెనీల ఏర్పాటులో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని, 2021 నుంచి ఇప్పటివరకూ వందకోట్ల డాలర్ల టర్నోవర్ సాధించిన యునికార్న్ స్టార్టప్‌లు రెట్టింపు అయ్యాయని తెలిపారు. ఇదంతా యువత నైపుణ్యం వల్లనే సాధ్యమైందన్నారు. ప్రభుత్వం భూ ప్రాదేశిక రంగంతోపాటు డ్రోన్ల వినియోగాన్నీ ప్రోత్సహిస్తోందని, అంతరిక్ష రంగంలోనూ ప్రైవేట్ సంస్థలకూ భాగస్వామ్యం కల్పించిందని వివరించారు. మంగళవారం నాటి ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. -
అధికారులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలి: మంత్రి అవంతి
విశాఖ: పాడేరు ఐటీడీఏ పరిధిలో అభివృద్ధి పనులపై మంత్రి అవంతి శ్రీనివాస్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సచివాలయాలు, ఆర్బీకేల నిర్మాణాలకు త్వరలో బిల్లులు మంజురు చేస్తామని మంత్రి అవంతి పేర్కొన్నారు. ఏజెన్సీలో ప్రతి గ్రామానికి రోడ్డు,విద్యుత్,తాగునీటి సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. అధికారులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అదే విధంగా.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ రావు తెలిపారు. -
Amazon: రైతులకు టెక్నికల్‌గా సాయం
భారత్‌లో అన్ని రంగాల్లో పెట్టుబడులకు, వ్యాపారాలకు టెక్ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ తరుణంలో అమెజాన్ రిటైల్, రైతుల కోసం అగ్రోనమీ సర్వీసెస్‌ను ప్రారంభించింది. టెక్నాలజీ సంబంధిత ఈ సర్వీసుల ద్వారా రైతులకు వ్యవసాయ సంబంధిత సలహాలు, నిర్ణయాలు, వాళ్ల నుంచి విలువైన సూచనలు తీసుకుని మరికొందరు రైతులకు అందించే ఉద్దేశంతో ఆగ్రోనమీని మొదలుపెట్టింది. రైతులకు మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని అందించడంతో పాటు ఉత్పత్తిని మెరుగుపర్చుకునేందుకు అవసరమైన సలహాలు ఇచ్చేందుకే ఈ అగ్రోనమీ ప్రాజెక్టును తీసుకొచ్చినట్లు అమెజాన్ ఇండియా గ్రాసరీ, ఫుడ్ అండ్ హెల్త్ డైరెక్టర్ సమీర్ ఖేతర్పాల్ వెల్లడించారు. అగ్రోనమీ సేవలతో పాటు వ్యవసాయం పరిశోధకులను, నిర్వాహకుల్ని ఈ ప్రాజెక్టులో భాగం చేయనుంది అమెజాన్. శిక్షణ పొందిన రైతుల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన వాళ్లను.. మరికొందరికి శిక్షణ ఇచ్చే నిర్వాహకులుగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన వెల్లడించారు. గత దశాబ్దకాలంగా వ్యవసాయంలో టెక్నాలజీ పాత్ర పెరిగింది. ఈ తరుణంలో రైతులకు తోడ్పాటుగా నిలవడం ద్వారా అగ్రో సెక్టార్‌లోనూ ముందుకెళ్లాలని భావిస్తోంది అమెజాన్. మట్టి, వాతావరణాన్ని అంచనా వేసి రైతులకు అవసరమైన సూచనలు అందించే టెక్నాలజీని సైతం త్వరలో అగ్రోనమీ ప్రాజెక్టులో చేర్చనున్నట్లు అమెజాన్ తెలిపింది. చదవండి: దేశంలో ఆగిపోనున్న వీపీఎన్ సర్వీసులు? -
గోడలు మొలిచి.. గొడవలు పెరిగి!
విలువలు బోధించని నేటి విద్యా విధానం, నిఘా–నియంత్రణ లోపించిన టీవీ కార్యక్రమాలు, సామాజిక మాధ్యమ వేదికల్ని చేరువ చేసిన మొబైల్, ప్రపంచీకరణలో పెరుగుతున్న ఆర్థిక అంతరాలు... ఇవన్నీ కూడా మానవ సంబంధాల్ని చెదరగొడుతున్నాయి. విలువల్ని హరించి, జుగుప్సాకరమైన అట్టడుగుస్థాయికి చేరుస్తున్నాయి. వేధింపులు, బ్లాక్మెయిల్ బెదిరింపులు, డబ్బు గుంజడం, హింస, హత్యలు వంటి నేరాలకు ఇది దారితీస్తోంది. ఇంతటి వేదన, అశాంతి, హింసకు కారణమౌతున్న మూలాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. వీటిని ఒట్టి నేరాలుగానే చూడకుండా, నేపథ్యంలో ఉన్న సామాజికార్థికాంశాల్నీ పరిశీలించాలి. మూల కారణాల్ని వెతికి, తగిన సామాజిక, చట్టపరమైన చికిత్స చేయాల్సిన అవసరముంది. ఈ ఉపేక్ష సమాజానికి ఎన్నో రెట్ల నష్టం చేస్తోంది. ఈ సమస్యను ఇకనైనా పట్టించుకోవాలి. సాంకేతిక పరిజ్ఙానం ఆకాశపు అంచులు తాకుతుంటే మానవతా విలువలు పాతా ళాన్ని అంటుతున్నాయి. మానవ సంబంధాలు రోజు రోజుకు పలుచ బారి భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తోంది. కనుచూపు మేర పరి ష్కారం కనిపించనంత అయోమయం నెలకొంది. స్థలం కోసం తలి దండ్రుల్ని తగులబెట్టి చంపే కొడుకు–మనవలు, ప్రియుడి చేతిలో కీలుబొమ్మై కన్న తల్లిని కడతేర్చే కూతుళ్లు, నిద్రపోయే తండ్రికి ఆస్తి యావతో నిప్పంటించే తనయులు, బడిపిల్లల్ని గర్భవతులు చేసే నవ కీచకులు... ఇవన్నీ అక్కడక్కడ జరిగే ఒకటీ, అరా అరుదైన ఘటన లుగా చూడటంలోనే లోపముంది. ఈ దారుణాల్ని కేవలం నేర ఘట నలుగా పోలీసు కేసు–దర్యాప్తులు, కోర్టు విచారణ–తీర్పులు, జరి మానా–శిక్షలు... ఈ దృష్టికోణంలో పరిశీలించడమే మన సమాజం పాలిట శాపమౌతోంది. ఇంతటి వేదన, అశాంతి, హింసకు కారణమౌ తున్న మూలాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. సమాజాన్ని ఈ దుస్థితిలోకి నెడుతున్న ప్రభావకాల గురించి ఆలోచించడమే లేదు. లోతైన పరిశీలన, ఓ చర్చ, దిద్దుబాటు చర్యలు... ఏమీ లేవు. ఇవి కేవలం నేర ఘటనలు కావు, వాటి వెనుక బలమైన సామాజిక, ఆర్థిక కారణాలున్నాయన్న స్పృహే లేకుండా పోతోంది. ప్రాధాన్యతలు మారిన ప్రభుత్వాలకివి ఆనవు. పాలకులకివి జలజల ఓట్లు రాల్చే అంశాలే కావు కనుక పట్టదు. పేరుకుపోయిన కేసుల ఒత్తిళ్లలో నలిగే కోర్టులు సకాలంలో సరైన న్యాయం చేసే ఆస్కారం లేదు. సామాజిక వేత్తలు, విద్యావంతులు, మేధావి వర్గం తీవ్రంగా ఆలోచించాల్సిన పరిణామాలివి. సామాజిక సమిష్ఠి బాధ్యత కరువౌతోంది. డబ్బు డబ్బును పెంచినట్టే నేరం నేర ప్రవృత్తిని, సంస్కృతిని పెంచుతోంది. మన నేర–న్యాయ వ్యవస్థ లొసుగులు మనుషుల్లో విచ్చలవిడితనాన్ని ప్రేరేపిస్తున్నాయి. కుదేలయిన కుటుంబం బలమైన కుటుంబం ఓ మంచి సమాజానికి మూల స్తంభం. రక రకాల కారణాలు ఈ రోజున కుటుంబాన్ని చిద్రం చేశాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతోంది. ఇంటి సభ్యుల కష్టనష్టాలకు అనునయింపు, తప్పిదాలకు దిద్దుబాటో, సర్దుబాటో చేసే కుషన్ సమిష్ఠి కుటుంబ వ్యవస్థలో దొరికేది. విలువలు, మానవ సత్సంబం ధాలు కూడా వారసత్వంగా లభించేవి. కానీ, సామాజిక–ఆర్థిక కార ణాల వల్ల ఉమ్మడి కుటుంబాలు క్రమంగా తగ్గుతున్నాయి. చిన్న కుటుంబాలు, భార్య–భర్త, చిన్న పిల్లలు మాత్రమే ఉండే క్యూబికల్ ప్యామిలీ నమూనా బలపడుతోంది. ఇది ఇంట్లో ఉండే వృద్ధుల పాలిట శాపమౌతోంది. స్థాయి, స్థోమత ఉన్న వారు కూడా తలి దండ్రుల్ని నిర్దయగా వృద్ధాశ్రమాల పాల్జేస్తున్నారు. అవి సౌకర్యంగా ఉండి, వృద్ధులు సమ్మతితో వెళితే వేరు! కానీ, బలవంతంగా పంపే సందర్భాలు, ఆశ్రమాల్లో వసతులు లేక వారు అల్లాడే దయనీయ పరిస్థితులే ఎక్కువ. వేర్వేరు సమాజాల మధ్య, సమూహాల మధ్య, కుటుంబాల మధ్య, చివరకు వ్యక్తుల మధ్య సంబంధాలు సన్న గిల్లాయి. ఇందుకు సామాజిక, ఆర్థికాంశాలే ప్రధాన కారణం. ముఖ్యంగా పట్టణ, నగర ప్రాంతాల్లో ఈ ‘ఇరుగుపొరుగు పట్టని తనం’(సోషల్ అన్కన్సెర్న్నెస్) బాగా పెరిగిపోయింది. ఆ ఇంట్లో ఏం జరుగుతోందో ఈ ఇంటి వారికి పట్టదు. పొరుగువారి ఆర్థిక స్థితి, సాధకబాధకాల సంగతలా ఉంచి ఆయా ఇళ్లకు ఎవరు వచ్చి వెళు తున్నారు? ఇంట్లో వాళ్లెలా ఉంటున్నారు అన్నది కూడా తెలియని పరిస్థితి. తలుపేసి ఉంచిన ఇంట్లోని వారు ఏ కారణంగానో చనిపోతే, శవం కుళ్లి వాసనపట్టే వరకు అటువైపు తొంగి చూసే వారుండరు. పలు రెట్లుగా భూముల విలువ పెరిగిపోవడం కుటుంబాల్లో నిప్పులు పోసి, మానవ సంబంధాల్ని మంట కలుపుతోంది. గుంటూరు జిల్లాలో తల్లిని తనయ చంపిన తాజా ఘటన ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. భర్తను, కొడుకును పోగొట్టుకున్న ఓ తల్లికి కన్నకూతురే హంతకురాలవడం క్షీణించిన మానవ సంబంధాలకు పరాకాష్ట! భూమి విలువల పెరుగుదల రాజధాని అమరావతి పరిసరాల్లోని ఎన్నో కుటుంబాల్లో అశాంతి రగిలిస్తోంది. తలిదండ్రులు–పిల్లల మధ్య, అన్నదమ్ములు–అక్కచెల్లెల్ల మధ్య గోడలు మొలుస్తున్నాయి, గొడవలు పెరుగుతున్నాయి. సంపద ఘర్షణ, ఆస్తి తగాదాలు, భూవ్యాజ్యాలతో లిటిగేషన్ పెరిగింది. సివిల్ తగాదాలు క్రిమినల్ ఘటనలవుతున్నాయి, వచ్చి పోలీసుస్టేషన్లలో కేసులై వాలుతు న్నాయి. ఈ జాప్యం కూడా సహించనప్పుడు భౌతిక దాడులు, దారుణ హత్యలకు తలపడుతున్నారు. ఆజ్యం పోస్తున్న అసమానతలు ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్న సమాజాల్లో మానవ సంబం ధాల పరమైన నేరాలు పెరిగాయి. ఎక్కడికక్కడ హింస, అశాంతి ప్రబలుతోంది. మధ్య, దిగువ మధ్యతరగతి ఉన్నపళంగా దనవంతు లైన చోట వ్యత్యాసాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. సంపన్నులు, వారి సౌఖ్యాలను పోల్చుకొని నయా సంపన్నులూ పరుగెడుతున్నారు. నిర్హేతుకంగా పెరిగిన వస్తువ్యామోహం స్థాయిని మించిన ఆశలు రేపి, తప్పుటడుగులు వేయిస్తోంది. సంపన్న–పేద కుటుంబ వ్యక్తుల మధ్య పోలికలు అశాంతినే కాక నేర ప్రవృత్తినీ ప్రేరేపిస్తు న్నాయి. కక్ష–కార్పణ్యాలకు, పశుప్రవృత్తికి కారణమవుతున్నాయి. హయత్‌నగర్‌లో ఓ మహిళ వివాహేతర సంబంధం నెరపుతున్న వ్యక్తి పనుపున కన్నతల్లినే హతమార్చిన దుర్ఘటన దీనికి నిదర్శనం. ఈ కేసులో నిందితుడు ఏ సంపాదనా లేని జులాయిగా ఉండీ... ఓ కారు, ప్రియురాలు, సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు. ఇంకేదో ఆశిస్తున్నాడు. సఖ్యతతో ఉన్న యువతితో పెళ్లిపైనే కాక, తల్లి ఆస్తిపై కన్నేశాడు. భర్తెలాగూ తాగుబోతు, ఇక ఆమె అడ్డుతొలిగితే ఆస్తినెలాగయినా దక్కించుకోవచ్చన్న కుట్రకోణం దర్యాప్తులో వెల్లడవుతోంది. నమ్ము కున్న యువతిపై బ్లాక్‌మెయిల్‌కూ తలపడ్డాడు. అతని చేతిలో కీలు బొమ్మయిన ఆమె తన తల్లి హత్యకూ వెనుకాడలేదు. ఇంకో ఘట నలో, భార్యాభర్తా కూడబలుక్కొని, ఓ సంపన్నుడిని లైంగికంగా ముగ్గులోకి దించారు. రహస్యంగా తీసిన వీడియోతో బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజడం వంటివి దేనికి సంకేతం? ప్రభావకాలపై కన్నేయాలి విలువలు బోధించని నేటి విద్యా విధానం, నిఘా–నియంత్రణ లోపించిన టీవీ కార్యక్రమాలు, సామాజిక మాధ్యమ వేదికల్ని చేరువ చేసిన మొబైల్, ప్రపంచీకరణలో పెరుగుతున్న ఆర్థిక అంతరాలు... ఇవన్నీ కూడా మానవ సంబంధాల్ని చెదరగొడుతున్నాయి. విలువల్ని హరించి, జుగుప్సాకరమైన అట్టడుగుస్థాయికి చేరుస్తున్నాయి. వేధిం పులు, బ్లాక్మెయిల్ బెదిరింపులు, డబ్బు గుంజడం, హింస, హత్యలు వంటి నేరాలకు ఇది దారితీస్తోంది. వీటిని ఒట్టి నేరాలుగానే చూడకుండా, నేపథ్యంలో ఉన్న సామాజికార్థికాంశాల్నీ పరిశీలించాలి. మూల కారణాల్ని వెతికి, తగిన సామాజిక, చట్టపరమైన చికిత్స చేయాల్సిన అవసరముంది. నక్సలైట్ల హింసను శాంతిభద్రతల అంశంగా కాక సామాజికార్థికాంశంగా చూడాలని చెప్పే మేధావి వర్గం ఇక్కడెందుకో దృష్టి సారించడం లేదు. ఈ ఉపేక్ష సమాజానికి ఎన్నో రెట్ల నష్టం చేస్తోంది. విద్య ఫక్తు వ్యాపారమైన తర్వాత విలువల్ని బోధించడం కనుమరుగైంది. పాఠాలు బట్టీ పెట్టించి, ఫలితాలు సాధించి, ఉద్యోగాలు పట్టిచ్చే పరుగు పందెమయింది విద్య. టీవీ వినోద కార్యక్రమాల ముసుగులో వస్తున్న సీరియళ్లు మానవ సంబంధాలపై గొడ్డలి వేటు. ఆస్తి తగాదాలు, ఆధిపత్య పోరాటాలు, వివాహేతర సంబంధాలు, కక్ష–కార్పణ్యాలు, పగతీర్చు కునే హింస–దౌర్జన్యాలు, దారుణ హత్యలు... ఇవి లేకుండా వస్తున్న సీరియల్స్ ఎన్ని? మహిళను కేంద్ర బిందువు చేసి ఈ కాల్పనిక దౌష్ట్యాల్ని రుద్దితే, మహిళల్ని ఎక్కువగా ఆకట్టుకొని టీఆర్పీలు సాధించొచ్చనే కక్కుర్తి వారికి కలిసివస్తోంది. ఎక్కువ మహిళలు ఇవే చూస్తున్నారు. ఆ క్రమంలో ఇది ఎదిగే పిల్లలపై దుష్ప్రభావం చూపు తోంది. వారూ అనుకరిస్తున్నారు, వాటినే అనుసరిస్తున్నారు. మానవ సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇలా ఉండకూడదనే చర్చ గానీ, మార్గదర్శకాలు గానీ, చట్టపరమైన ప్రతిబంధకాలు గానీ లేవు. ఏ నియంత్రణా లేదు. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ వంటి సామా జిక మాధ్యమ వేదికల్ని యువతకు చేరువ చేసిన మొబైల్ ఈ విష యంలో మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తోంది. వీటన్నింటిపై లోతైన అధ్యయనం చేసి తగు పరిష్కారం కనుక్కోకుంటే నష్టం మరింత వేగంగా, తీవ్రంగా జరిగే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
అంగట్లో ఆధార్
* ఆన్లైన్లో ‘ఆధార్’ చౌర్యం * సాంకేతిక సాయంతో ఫొటోలు మారుస్తున్న వైనం * అధికారుల నిర్లక్ష్యంతోనే గోప్యత బట్టబయలు ఆధార్ కార్డు.. ప్రస్తుతం ప్రతి వ్యక్తికీ ఇదే ఆధారం. వంటిట్లో గ్యాస్ నుంచి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల అమలు వరకు ఆధార్ నంబరుతోనే అనుసంధానమై ఉన్నాయి. ఆధార్ నంబర్ విషయంలో గోప్యత ఎంతో అవసరం. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో మనకు తెలియకుండా ఆధార్ కార్డును దొంగిలించేస్తున్నారు. టెక్నాలజీ సాయంతో కార్డులోని ఫొటోలు మారుస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. గుంటూరు (నగరంపాలెం): కార్డుదారుని ప్రమేయం లేకుండానే ఆధార్ డౌన్లోడ్ చేసేస్తున్నారు. వీటిని కొంతమంది తమ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకుంటున్నారు. ఇటీవల రవాణా శాఖలో ఒకరి వాహనం యాజమాన్యం హక్కులు మార్చటం కోసం అతనికి తెలియకుండానే ఆధార్ కార్డును సంపాదించి పెద్ద మొత్తంలో రుణం పొందాడు. ప్రస్తుతం స్మార్ట్ పల్స్ సర్వేలో కూడా చాలా మంది ఆధార్ కార్డులు వారికి తెలియకుండానే వేరే వాటికి అనుసంధానం జరిగినట్లు తెలుస్తుంది. వ్యక్తిగత గుర్తింపు కార్డుల భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ యూనిక్ ఐడీ ఏర్పాటు నిమిత్తం ఆధార్ కార్డు నమోదు ప్రక్రియను ప్రారంభించింది. దీని ద్వారా సేకరించిన వివరాలను ఆన్లైన్lసర్వర్‌లో అప్లోడ్ చేసింది. రాష్ట్రాలకు వెరిఫికేషన్ కోసం స్టేట్ రెసిడెన్షియల్ డేటా హబ్ (ఎస్ఆర్డీహెచ్) వెబ్ సైట్‌ను రూపొందించి ఆన్లైన్ సర్వర్‌ను దీనికి లింక్ చేసింది. ఈ వెబ్‌సైట్‌కు ప్రత్యేక లాగిన్ పాస్‌వర్డు ద్వారా మాత్రమే రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని వ్యక్తి ఆధార్ కార్డు వివరాలనైనా తెలుసుకునే వీలు కలుగుతుంది. ప్రభుత్వ శాఖల్లో అందించే సేవలకు ఆధార్ కార్డు అనుసంధానం చేసినప్పటి నుంచి కార్యాలయంలోని గజిటెడ్ ర్యాంక్ అధికారులకు రెండేళ్ల క్రితం ఎస్ఆర్డీహెచ్ లాగిన్లు అందజేశారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి లాగిన్ పాస్వర్డ్లు.. ప్రభుత్వ కార్యాలయంలో సేవలు పొందుటకు అందించిన ఆధార్ కార్డు కాపీ సరైనదా ? కాదా ? తెలుసుకునేందుకు అధికారులు ఎస్ఆర్డీహెచ్ వెబ్‌సైట్‌కు లాగినై వివరాలు సరిపోల్చుకుంటారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు వినియోగిస్తున్న అన్ని సేవలకు ఆధార్ అనుసంధానం చేయాలని నిర్ణయించింది. గతంలో జారీ చేసిన ఓటరు కార్డులు, రేషన్ కార్డులు, వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్స్, మీటర్లు, భూమి రికార్డులకు ఆధార్ అనుసంధానం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్ట కాలంలో వాటిని పూర్తి చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేసింది. దీనికి ప్రజల నుంచి స్పందన లేకపోవటంతో సేవలు పొందుతున్న వారి ఆధార్ కార్డుల నంబర్లు ఎస్ఆర్డీహెచ్ సైట్‌కు లాగినై తెలుసుకున్నారు. దీని కోసం కార్యాలయంలోని క్షేత్రస్థాయి సిబ్బందికి, కొంత మంది ప్రైవేటు వ్యక్తులను ఎస్ఆర్డీహెచ్ లాగిన్లు, పాస్వర్డులు అందించి ఆధార్ వివరాలను సెర్చ్ చేయించారు. ఈ విధంగా లాగిన్, పాస్వర్డులు ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోకి వారి ద్వారా డీటీపీ, ఇంటర్నెట్, రిజిస్ట్రేషన్, ఆర్టీవో తదితర కార్యాలయాల వద్ద ఏజెంట్లకు చేరాయి. వీరు కార్డు నంబరు తెలిసినా, వ్యక్తి పేరు తెలిసినా అనధికారికంగా లాగినై కార్డులు డౌన్లోడ్ చేస్తున్నారు. కొంత మంది ఫొటోషాప్ సహాయంతో వాటిలో ఫొటోలు, వివరాలు సైతం మార్చి మోసాలకు పాల్పడుతున్నారు. రెండేళ్ల క్రితం లాగిన్లు, పాస్వర్డులు ఇప్పటికీ మార్చకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఎన్రోల్మెంట్ నంబర్లతో డౌన్లోడ్.. ఆధార్‌కార్డు డౌన్ లోడ్ చేయాలంటే ఎన్రోల్మెంట్ నంబరు (వివరాలు అందించినప్పుడు కేటాయించింది) కావాలి. వ్యక్తి పేరు, ప్రాంతం , ఆధార్ నంబరు తెలిస్తే ఎస్ఆర్డీహెచ్ సైట్ ద్వారా ఎన్రోల్మెంట్ నంబరు తెలుసుకుంటున్నారు. దీని ద్వారా యూఐడీఏ గెట్ ఆధార్ సైట్లో కార్డులను డౌన్లోడ్ చేస్తున్నారు. కార్డు డౌన్‌లోడ్‌కు రూ.100, కార్డు సెర్చింగ్‌కు రూ.200 నుంచి 500 వరకు అవసరాన్ని బట్టి వసులూ చేస్తున్నారు. ఫోన్ నంబరు రిజిస్టరయిన కార్డులు మాత్రమే ఆధార్ నంబరుతో డౌన్లోడ్ చేసే అవకాశముంది. మిగిలిన ఆధారు కార్డులన్నీ ఎన్రోల్మెంట్ నంబరు ద్వారానే డౌన్ లోడ్ చేయాల్సిందే.. -
ఇండిపెండెన్స్‌డే సీక్వెల్‌కు సిద్ధం
ఇండిపెండెన్స్‌డే రెండు దశాబ్దాల క్రితం తెరపైకి వచ్చిన హాలీవుడ్ చిత్రం ఇది. అయినా ఆంగ్ల చిత్రాల అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకుడిలో కూడా గుర్తుండి పోయిన చిత్రం ఇండిపెండెన్స్‌డే. 1996లో 75 మిలియన్ల అమెరికన్ డాలర్స్ వ్యయంతో రూపొంది 817 మిలియన్ల అమెరికన్ డాలర్లు వసూలు చేసి అప్పటి వరకూ విడుదలైన చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచిన దర్శకుడు రోలండ్ ఎమిరిచ్ అద్భుత సృష్టి ఇండిపెండెన్స్‌డే చిత్రం. విశేషం ఏమిటంటే ఈ చిత్రం అమెరికా స్వాతంత్య్రదినోత్సవం రోజైన ఏప్రిల్ నాలుగో తేదీన విడుదలవడం అన్నది యాదృచ్చికంగా జరిగిందే. అప్పట్లో గ్రామీ అవార్డును అందుకున్న ఈ చిత్రానికి రెండు దశాబ్దాల తరువాత ఇండిపెండెన్స్‌డే రీసర్జెన్స్ పేరుతో సీక్వెల్ నిర్మాణం జరిగింది. అప్పట్లో 75 మిలియన్స్ అమెరికా డాలర్లు వ్యయంతో రూపొందిన ఇండిపెండెన్స్‌డే చిత్రానికి పార్టు-2ను ఇప్పుడు 200 మిలియన్ల అమెరికన్ డాలర్లు వ్యయంతో ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించడం విశేషం. ఇండిపెండెన్స్‌డే చిత్రంలో నటించిన బిల్పుల్మాన్, జెఫ్ గోల్డ్బమ్ సీక్వెల్లోనూ నటించడం విశేషం. ఇండిపెండెన్స్‌డే చిత్ర కథను కూడా ఎవరూ మరచిపోలేరు. ఇతర గ్రహాల నుంచి ఎలియన్స్ మానవ జాతిపై దాడి చేయడం, వాటి నుంచి మానవులు ఎలా రక్షింపబడతారన్న పలు ఆసక్తికరమైన అంశాలను గ్రాఫిక్స్‌ను జోడించి బ్రహ్మాండంగా తెరకెక్కించిన చిత్రం ఇండిపెండెన్స్‌డే. అయితే దానికి సీక్వెల్ అయిన ఇండిపెండెన్స్‌డే రీసర్జెన్స్ను నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించినట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఆంగ్లం, తమిళ భాషల్లో ఈ నెల 24న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్వాహకులు వెల్లడించారు. -
టెక్నాలజీ సేవలు మరింత విస్తృతం
డీజీపీ రాముడు పలమనేరు : పోలీస్ శాఖలో నూత న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సేవలను మరింత విస్తృతం చేస్తామని డీజీపీ రాముడు చెప్పారు. పలమనేరులోని సీఐ కార్యాలయంలో డీఐజీ ప్రభాకర్‌రావు, ఎస్పీ శ్రీనివాస్, స్థానిక డీఎస్పీ శంకర్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. టెక్నాలజీని వాడుకోవడంతో సిబ్బంది కొరతను కూడా తగ్గించుకోవ చ్చన్నారు. త్వరలో రాష్ర్ట వ్యాప్తంగా కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసేలా చొరవ చూపుతామన్నారు. ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమలైతే కోర్టుకు కావాల్సిన సాక్ష్యాల సేకరణ చాలా సులభతరమవుతుందన్నారు. ట్రాఫిక్‌కు సంబంధించి తిరుపతి నగరంలో అధునాతన పద్ధతులను అవలంబిస్తున్నారని, ఇవి సత్పలితాలు ఇస్తాయని చెప్పారు. రాబోవు రోజుల్లో టెక్నాలజీ మరింత పెరుగుతుందని, నేరాలను అదుపు చేయడం కాస్త సులభతరమవుతుందని తెలిపారు. జిల్లాలో అమలవుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ సిస్టం చాలా బాగుందని మెచ్చుకున్నారు. పొలీసులు ప్రజల భాగస్వామ్యంతో నేరాలను అదుపుచేయడానికి ఆస్కా రం ఉంటుందన్నారు. ప్రజలు పోలీసులకు మరింత సహకరిస్తే వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. సీఐ సురేందర్ రెడ్డి, ఎస్ఐ లోకేష్ పాల్గొన్నారు. -
‘ప్రయివేటు’పైనే మక్కువ
ప్రభుత్వ ‘మెయిల్’ సదుపాయాన్ని వినియోగించుకోని అధికారులు సమాచారం భద్రతపై కేంద్రం ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు దేశంలో అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ప్రభుత్వ కార్యాలయాల మధ్య సమాచారం, సూచనలు, ఆదేశాలను ‘ఈ మెయిల్స్’ ద్వారా అందిస్తున్నారు. దీని కోసం జీమెయిల్, యాహూ మెయిల్ వంటి విదేశీ ప్రయివేటు సర్వీస్ ప్రొవెడర్స్ సేవలను వినియోగిస్తున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని, ఆన్లైన్ టెక్నాలజీని విస్తృతపరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ఆన్లైన్లో స్టోర్ చేసిన డేటా భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయివేటు సర్వీస్ ప్రొవెడర్స్కు చెందిన మెయిల్స్‌లో డేటాను అప్లోడ్ చేయటం వలన వారి ఆధీనంలో ఉన్న సర్వర్స్‌లో స్టోర్ అవుతాయి. దీని వలన దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం గతేడు దేశీయంగా సర్వర్లు ఏర్పాటు చేసింది. ఝ్చజీ.జౌఠి.జీ అనే వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీని ద్వారా ః జౌఠి.జీ అనే ప్రభుత్వ మెయిల్ సర్వీసును తయారు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఆదేశాలు.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, సిబ్బంది అధికారిక పనులకు సంబంధించి వివరాలు పంపటానికి ప్రభుత్వ మెయిల్ సర్వీసునే వినియోగించాలని ఆదేశాలు సైతం జారీ చేసింది. దీని కోసం కలెక్టర్ కార్యాలయంలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులందరికి ః జౌఠి.జీ మెయిల్ క్రియేట్ చేసే బాధ్యతను అప్పగించింది. అయితే జిల్లాలో సుమారు 15 వేల మంది ఉద్యోగులు ఉన్నా ఇప్పటివరకు 100 మంది లోపు మాత్రమే అధికారులు, మండలస్థాయిలోని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రస్తుతానికి మెయిల్ ఐడీలు క్రియేట్ చేసుకున్నారు. జిల్లా ప్రధాన కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉన్నతస్థాయి అధికారులతో పాటు వివిధ శాఖలు ఇప్పటికీ ప్రయివేటు మెయిల్స్ నుంచే సమాచారం, సూచనలు పంపుకుంటున్నారు. కొత్తగా క్రియేట్ చేసుకున్నవారు సైతం ప్రభుత్వ మెయిల్ సర్వీసును వినియోగించటం లేదు. కార్యాలయ హెచ్వోడీదే బాధ్యత.. ప్రభుత్వ మెయిల్స్‌ను ఉద్యోగులకు క్రియేట్ చేయించాల్సిన బాధ్యత ఆ శాఖ ఉన్నతస్థాయి అధికారిదే. ః జౌఠి.జీ మెయిల్ ఐడీని క్రియేట్ చేసే ఎన్ఐసీ అధికారులకు హెచ్‌వోడీ తమ కార్యాలయంలోని ఉద్యోగుల వివరాలను పంపించాల్సి ఉంటుంది. దీనికోసం ఝ్చజీ.జౌఠి.జీ వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఫార్మాట్లో ఉన్న విధంగా పేరు, వివరాలు మెయిల్ యూజర్ నేమ్‌తో వివరాలు పూర్తి చేసి ఎన్ఐసీ కార్యాలయానికి పంపితే వారు మెయిల్ ఐడీ క్రియేట్ చేస్తారు. మెయిల్ క్రియేటైన వెంటనే అందులోని ఉద్యోగి ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా మెయిల్ పాస్‌వర్డు వస్తుంది. ఈ మెయిల్ ఐడీ ద్వారా గ్రూప్ ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా పంపించుకునే వెసులుబాటు ఉంది. ఈ-ఆఫీస్‌లు అమలవుతున్న 10 కార్యాలయాల ఉద్యోగులకు మాత్రమే ఇటీవలే ఈ మెయిల్ ఐడీలను క్రియేట్ చేసుకున్నారు. పూర్తిస్థాయిలో చర్యలకు ఇంకెంత సమయం తీసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. -
మనిషిని చంపిన రోబో..
సుఖమయ జీవితం కోసం మానవుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని అనేక సౌకర్యాలను సృష్టించుకుంటున్నాడు. శారీరక శ్రమకు సెలవిచ్చి.. సృజనాత్మకతకు పదునుపెట్టి టెక్నాలజీని రోజుకో కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. అసాధ్యమనుకున్న అనేక అద్భుతాలను సుసాధ్యం చేసి రాబోయే తరాలకు కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తున్నాడు. తెలుగులో వచ్చిన ఆదిత్య 369 సినిమాలో చూపించినట్టుగా భూగర్భ నగరాలను నిర్మించడం, మందు బిళ్లల్నే భోజనంగా తీసుకోవడం.. వంటివెన్నో రాబోయే రోజుల్లో నిజం అయ్యేలా కనిపిస్తున్నాయి. ఆ విశేషాలేమిటో చూద్దామా..! భవిష్యత్ సిత్రాలు.. వచ్చే వందేళ్లలో ప్రపంచంలో ఎతైన ఆకాశహార్మ్యాలు, అండర్ వాటర్ నగరాలు, భూగర్భంలో 25 అంతస్తుల లోతైన భవనాలు, త్రీడీ పరిజ్ఞానంతో ముద్రించే ఇళ్లు.. ఇలా అనేక అద్భుతాలు సాధ్యమవబోతున్నాయి. భవిష్యత్తులో ప్రపంచంలో చోటుచేసుకోబోయే మార్పుల గురించి తెలుసుకోవడానికి మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సామ్సంగ్, స్మార్ట్‌థింగ్స్ కంపెనీలు సంయుక్తంగా ఓ అధ్యయనాన్ని చేపట్టాయి. విద్యావేత్తలు, భవిష్యత్తు పరిశోధకులు, వెస్ట్ మినిస్టర్ యూనివర్సిటీ అధ్యాపకులు ఈ అధ్యయన బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే మొదలవుతున్న డ్రోన్లు భవిష్యత్తులో బైక్‌ల మాదిరి అందుబాటులోకి వస్తాయని ఈ అధ్యయనం చెప్తోంది. త్రీడీ టెక్నాలజీని ఉపయోగించి కేవలం కొద్ది రోజుల్లోనే అందమైన ఇళ్ల నిర్మాణం సులువవనుంది. ఇప్పటికే సాధ్యమైన త్రీడీ ఆహారం భవిష్యత్తులో మరింత స్మార్ట్‌నెస్‌ను సంతరించుకొని, మనకు నచ్చిన చెఫ్‌ల వంటకాలను మన ఇంట్లోనే ఉన్న కంప్యూటర్ ప్రింటర్ నుంచే డౌన్లోడ్ చేసుకుని హాయిగా తినవచ్చు. గోడలు మన మూడ్‌కి అనుగుణంగా రంగులు మారుస్తుంటాయి. మరో వందేళ్లలో ఇలాంటి ఊహకందని అనేక అద్భుతాలను చూడబోతున్నామని ఈ అధ్యయనంలో పాల్గొన్న అంతరిక్ష శాస్త్రవేత్త డా.మాగీ అడెరిన్ పోకాక్ తెలిపారు. చంద్రుడు, అంగారకుడిపై నివాసాలను ఏర్పరచుకుంటామని, వాణిజ్య అవసరాల కోసం అంతరిక్షంలోకి పంపుతున్న రాకెట్లను రాబోయే రోజుల్లో ఇప్పటి విమానాల మాదిరిగా ఉపయోగిస్తామని పరిశోధకులు తెలిపారు. పొంచి ఉన్న ముప్పు.. ఇలాంటి ఊహకందని టెక్నాలజీలో భాగంగా మనిషి తాను చేసే ప్రతి పనికి ప్రత్యామ్నాయంగా రోబోలను తయారు చేస్తున్నాడు. మరి రోబో సినిమాలో చూపించినట్టు ఈ రోబోలు భవిష్యత్‌లో వినాశకారిగా మారితే పరిస్థితి ఏంటి..? మనిషిని చంపిన రోబో.. రోబో చేతిలో మనిషి ప్రాణాలు పోగొట్టుకోవడం మనదేశంలో తొలిసారిగా రాజధాని ఢిల్లీలో ఇటీవలే జరిగింది. గుర్గావ్లోని మానేసర్ ఎస్కేహెచ్ మెటల్స్ కంపెనీలో 63 మంది కార్మికులు, 34 రోబోలు పనిచేస్తున్నాయి. ఒక రోబో చేతిలో 24 ఏళ్ల రామ్‌జీ లాల్ నలిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఎలా జరిగింది..? ఫ్యాక్టరీలో అనేక రకాల పనులు చేసేందుకు ముందే ప్రోగ్రాం చేసిన రోబో అది. బరువైన మెటల్ షీట్లను ఎత్తుతుంది. రోబో ఎత్తిన షీట్ ఒకవైపు ఒరిగి ఉండటాన్ని గమనించిన రామ్ జీ లాల్ ఆ షీట్ కింద పడితే డేమేజ్ జరుగుతుందని భావించి దాన్ని సరిచేసేందుకు ముందుకు వె ళ్లాడు. అంతే రోబో అతణ్ని కూడా మెటల్‌గా భావించి నలిపేసింది. అక్కడికక్కడే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటివే.. 2014 జూన్ 29న జర్మనీలోని వోక్స్‌వేగన్ ఫ్యాక్టరీలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కార్మికుడిని రోబో ఒక లోహపు ప్లేటుకు అదిమి గుండెలపై నొక్కి చంపేసింది. 1979లో మిచిగాన్ ఫోర్టు కర్మాగారంలోనూ లైన్వర్కర్ను రోబో పొట్టనబెట్టుకుంది. 1984లో జపాన్‌లో ఇంజనీర్ కెంజి ఉరాడాను రోబో చంపేసింది. కాబట్టి నాణేనికి బొమ్మాబొరుసూ ఉన్నట్టే.. టెక్నాలజీకి కూడా మంచి చెడూ రెండూ ఉంటాయి. -
చైన్ స్నాచింగ్ నగర్
నగరంలో స్త్రీలు ఇంటి నుండి బయటకు వెళ్లాలంటేనే భయంతో వణికి పోతున్నారు. బంగారం దోచుకోడం మాటెలా ఉన్నా, ప్రాణాలు కూడా దక్కుతాయో? లేదోనని భయంతో వణికిపోతున్నారు. ఇంత మంది పోలీసులు ఉండి, అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న వాహనాలు ఉండి నేరాలు తగ్గిస్తామని చెప్పిన పోలీసులను చైన్ స్నాచర్స్ మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నారు. ఇన్నాళ్లు కొన్ని ప్రాంతాల్లో ఎక్కడో ఒకటో రెండో జరిగేవి, కానీ ఇప్పుడు మన నగరంలో చైన్ దొంగతనాలు జరగని ప్రాంతం లేదంటే, ఆశ్చర్యం లేదని చెప్పవచ్చు. ఒక పక్క కాల్పులు జరుపుతున్నా భయం లేకుండా రెచ్చిపోతున్నారు. ఇంతవరకూ జరిగిన సంఘటనల్లో బాధితులు పోగొట్ట్టుకున్న వస్తువులు దొరికిన దాఖలాలు లేవు. సరికదా ప్రాణాలు కూడా పోయిన సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం. ఇంక మన అభాగ్య నగరంలో స్త్రీలు బంగారం ధరించి బయటకు వెళ్లడం ఏ మాత్రం భద్రత లేదని రుజువవుతోంది. పోలీసులు నిఘా ఎంత పెంచినా బూడిదలో పోసిన పన్నీరు చందంగా ఉంది. హిందూ స్త్రీకి పవిత్రమైన మంగళ సూత్రం కూడా లేకుండా ఎలాగ? అని మహిళలు దుమ్మెత్తి పోస్త్తున్నారు. ఇప్పటికైనా గట్టి నిఘా పెట్టి మహిళలకు భరోసా కల్పించే దిశగా పోలీసులు పక్కాగా గొలుసు దొంగల భరతం పట్టి నగరంలో మహిళలకు భద్రత కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ దిశగా మన పోలీసులు కృషి చేయాలి. - ఎస్.రాజ్యలక్ష్మి చిక్కడపల్లి, హైదరాబాద్ -
‘సైబర్ సేఫ్’గా హైదరాబాద్
- రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ - సెక్యూరిటీ సొల్యూషన్ తీసుకురావాల్సిన అవసరముంది - రాబోయే ప్రపంచ యుద్ధం కీబోర్డులతోనే.. సాక్షి, సిటీబ్యూరో: సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతున్న తరుణంలో మన దేశంలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు. వీటికి చెక్ పెట్టేందుకు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్ తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ‘సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్’ ఆధ్వర్యంలో ద వెస్టిన్ హోటల్లో మంగళవారం ‘ఆన్యువల్ సైబర్ సెక్యూరిటీ కాన్క్లేవ్ 2015’ కార్యక్రమం నిర్వహించారు. డీఎస్‌సీఐ సీఈవో నందకుమార్ సరవడే, ఎస్సీఎస్సీ ైచైర్మన్ సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి మంత్రి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్‌ను సైబర్ సేఫ్ డెస్టినేషన్‌గా మార్చేందుకు ప్రభుత్వం నాస్కామ్, డీఎస్‌సీఐ సంస్థలతో కలిసి పనిచేస్తుందన్నారు. రాబోయే కొత్త ప్రపంచ యుద్ధం కీబోర్డులతోనే జరుగుతుందని దానిని ఎదుర్కొనేందుకు సైబర్ వారియర్స్‌ను తయారుచేస్తున్నామన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు రాష్ట్రాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, వీటిని నియంత్రించేందుకు భవిష్యత్‌లో సైబర్ టీచర్స్ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. హైదరాబాద్‌లో తొలిసారిగా ఈ సదస్సులో దాదాపు 100 కంపెనీలు పాల్గొన్నాయి. -
సాంకేతికతను గ్రామాల్లోకి తీసుకెళ్లాలి
కలెక్టర్ బాబు.ఎ విజయవాడ : సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామస్థాయికి తీసుకు వెళ్లగలిగేతేనే పూర్తి స్థాయిలో డిజిటల్ ఇండియా విధానంలో విజయం సాధించినవారవుతామని జిల్లా కలెక్టర్ బాబు.ఏ అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం డిజిటల్ ఇండియా వారోత్సవ కార్యక్రమాల జిల్లా స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలో వ్యక్తులను గుర్తించడంలో అత్యంత భద్రతతో కూడిన ఆధార్ 12 అంకెల గుర్తింపు వ్యవస్థను డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా భారతదేశం నిర్వహించిందని అన్నా రు. త్వరలోనే బందరు రోడ్డును స్మార్ట్ సిటీలో భాగంగా గోల్డెన్‌మైన్ ప్రాజెక్టుగా రూపుదిద్దుతున్నామని చెప్పారు. అంతర్జాతీయంగా పేరొం దిన సిస్కో సంస్థ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టినట్లు వివరించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, ప్రతి మండలంలోని ఒక గ్రామంలో పూర్తిస్థాయి డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రయినీ కలెక్టర్ సలోని సిడాన్, నూజివీడు ట్రిఫుల్ ఐటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సాయినాథ్, గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజి అసోసియేట్ ప్రొఫెసర్ వరుణ్ తదితరులు, జిల్లా ఇన్ఫర్మెట్రిక్ అధికారి శర్మ, ఎన్ఐసీ సిబ్బంది, మీసేవా కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించండి విజయవాడ : ఈ ఏడాది ఇంకా పాఠ్యపుస్తకాలు అందని విద్యార్థులకు సకాలంలో అందించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ బాబు.ఎ పేర్కొన్నారు. స్థానిక ఆటోనగర్‌లో పాఠ్యపుస్తకాలు భద్రపరచిన గోడౌన్‌ను శనివారం ఉదయం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లో ఉన్న పాఠ్యపుస్తకాలను కలెక్టర్ బాబు.ఎ, ట్రయినీ కలెక్టర్ సలోని సిడాన్‌తో కలిసి వ్యక్తిగతంగా పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా ఇంకా కొన్ని పాఠ్యపుస్తకాలు చేరలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీనిపై వెంటనే ఏఏ పాఠశాలలు, కళాశాలలకు పా ఠ్యపుస్తకాలు అందలేదో నివేదికలు అందించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు వివరించారు. గోడౌన్లకు పుస్తకాలు ఏఏ సమయాల్లో పంపిణీ దారులు పంపుతున్నారో ముందస్తుగానే సమగ్ర సమాచారం తెప్పించుకుని పంపిణీలో జాప్యం లేకుండా చూడాలని అధికారులను కోరారు. అనంతరం కలెక్టర్ జిల్లా విద్యాశాఖాధికారిని, ఇం టర్మీడియెట్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థుల పాఠ్యపుస్తకాలను దశలవారీగా పంపనున్నట్లు కలెక్టర్‌కు వివరించారు. ప్రాంతీయ ఇంటర్మీడియెట్ అధికారి ఎం.రాజారావు మాట్లాడు తూ ఇంటర్ విద్యార్థులకు సరఫరా చేయాల్సి న పాఠ్యపుస్తకాలను తీసుకువెళ్లాల్సిందిగా క ళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించామన్నారు. -
కాయ్ రాజా.. కాయ్
- జోరుగా ఐపీఎల్ బెట్టింగ్‌లు - రూ.కోట్లలో పందేలు - నిండా మునుగుతున్న జనం - వ్యవహారమంతా ఫోన్, ఆన్లైన్లోనే.. - కార్పొరేట్ కల్చర్‌కు ఖాకీల వత్తాసు! మెదక్ టౌన్: జిల్లాలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఈ వ్యవహారాన్ని గుట్టుగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఈ వ్యవహారం భారీగా సాగుతోంది. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. క్రికెట్ మాయలో పడ్డ కొందరు బెట్టింగ్ కడుతూ డబ్బులు ఖర్చు చేస్తున్నారు. మరికొందరు అప్పులు సైతం చేసి ఇందులో పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లాలో పోలీసులు సరైన తీరుగా స్పందించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని పలుచోట్ల ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. ఐపీఎల్ సీజన్-8లో భాగంగా శనివారం రాత్రి జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మ్యాచ్ సందర్భంగా జిల్లాలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు సమాచారం. కార్పొరేట్ విష సంస్కకృతి నగరాలకే పరిమితం కాకుండా పట్టణాలు, పచ్చని పల్లెల్లోనూ చిచ్చు రేపుతోంది. జెంటిల్మెన్ గేమ్‌గా పేరుగాంచిన క్రికెట్ ఆట ప్రపంచీకరణలో భాగంగా పూర్తిగా కమర్షియల్ అయిపోయింది. ఇందులో భాగంగా బెట్టింగ్‌ల వ్యవహారమంతా ఫోన్లు, ఆన్లైన్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పొట్టిఫార్మాట్ 20-20 మ్యాచ్‌లు ప్రారంభమైనప్పటి నుంచి ఆటగాళ్లను అంగట్లో సరుకుగా కొనుక్కోవడం ఫ్యాషన్ అయిపోయింది. దీనికి బడా పారిశ్రామికవేత్తలు, సినీ బాలీవుడ్ ప్రముఖులంతా ఒక్కో టీమ్‌ను చేజిక్కించుకోవడాన్ని చూస్తే కార్పొరేట్ విష సంస్క ృతి ఎంతగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో జిల్లాలోని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, పటాన్చెరు, రామచంద్రాపురం, జోగిపేట, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, రామాయంపేట తదితర ప్రాంతాల్లో కేవలం ఒక్కరోజులోనే కోట్లాది రూపాయలు బెట్టింగ్ రూపంలో చేతులు మారినట్టు సమాచారం. బెట్టింగ్‌లను అరికట్టాల్సిన పోలీస్ యంత్రాంగం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. శనివారం రాత్రి జరిగిన 20-20 మ్యాచ్ సందర్భంగా సంగారెడ్డిలోని ప్రశాంత్ నగర్లో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న బెజుగం నరేన్కుమార్, తునికి లక్ష్మణ్‌రెడ్డి, భాను, మాడపాటి స్వామిసతీష్, పట్లోళ్ల సంతోష్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి రూ.6 వేల నగదు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మెదక్‌లో ఆరుగురిని పట్టుకున్నారు. స్థానికంగా పలుకుబడి గల అధికార పార్టీ నేత అర్ధరాత్రి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ‘ఖాకీలకు’ లక్ష రూపాయలిచ్చి వారిని తీసుకెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. యువకులు పెద్ద మొత్తంలో బెట్టింగ్‌లు కడుతున్నారు. ఈ క్రమంలో భారీగా డబ్బులు కూడగట్టుకుంటున్న వారు కొందరైతే... ఉన్న డబ్బులు పోగొట్టుకొని అప్పుల ఊబిలో కూరుకుపోతూ లబోదిబోమంటున్న వారు కొందరు. ఇంకొందరూ భార్య మెడలోంచి పుస్తెలతాడు, వాహనాలు, సెల్ఫోన్లు, ఇతర సామగ్రిని సైతం తాకట్టుపెట్టి మరీ బెట్టింగ్‌లు కాస్తున్నట్టు సమాచారం. నిఘా పెట్టాల్సిన పోలీసులు నిద్రావస్థలో ఉండటంతోపాటు భారీగా డబ్బులు వసూళ్లు చేస్తూ ఈ దందాను అడ్డుకోకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత పోలీసు శాఖ మొద్దునిద్ర వీడి బెట్టింగ్‌ల పట్ల కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. అమాయకులు బలి... క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారంటూ మెదక్ పట్టణానికి చెందిన నలుగురిని పోలీసులు ఆదివారం సాయంత్రం స్టేషన్‌కు పిలిపించారు. బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిని చూపెడతామంటూ సాయంత్రం 6.30 గంటలకు మీడియాను ఆహ్వానించారు. కబురు అందుకొని స్టేషన్‌కు వచ్చిన విలేకరులను గంటపాటు కూర్చోబెట్టారు. అనంతరం స్థానిక సీఐ సాయీశ్వర్‌గౌడ్ మళ్లీ వస్తానంటూ బయటకు వెళ్లిపోయారు. ఎంతకీ రాకపోవడంతో సీఐ తీరుపై విలేకరులు అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి నిష్ర్కమించారు. -
ఖాకీలకు ‘ఐటీ’ సాయం
* నేరాల అదుపునకు సాంకేతిక పరిజ్ఞానం * పోలీసులకు ఐటీ నిపుణుల అవగాహన * డేవ్థాన్ సదస్సులో సీవీ ఆనంద్ సాక్షి, సిటీబ్యూరో: నగర శివారులో పట్టపగలు నడిరోడ్డులో హత్యో, రోడ్డు ప్రమాదమో జరిగితే.. ఫుల్ ట్రాఫిక్ జాం.. పోలీసులు వెళ్లేందుకు ఆలస్యమవుతుంది.. అక్కడేం జరిగిందో తెలియదు.. ఇక ముందు అలాంటి చోట ఎయిర్ కాప్ వాలిపోతుంది. అక్కడ జరుగుతున్నది ఫోటోలు, వీడియోలు తీసి వాయిస్ రికార్ట్తో సహా కంట్రోల్ రూం సర్వర్‌కు పంపుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇలాంటివెన్నో ఐటీ నిపుణులు రూపొందించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులకు తెలియజేసేందుకు శనివారం గచ్చిబౌలిలోని కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ‘డేవ్థాన్’ సదస్సులో ప్రయోగాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడారు. ఐటీ నిపుణులు రూపొందించిన కాప్కామ్, రిపోర్ట్ యాప్, అడాప్టివ్ ట్రాఫిక్, ఎయిర్కాప్, చలాన్ అలర్ పోలీసులకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఐటీ నిపుణులు ప్రజల భద్రతపై దృష్టి సారించడం శుభపరిణామమన్నారు. అడాప్టివ్ ట్రాఫిక్ టెక్నాలజీని ఐటీ నిపుణులు కునాల్, చందన్‌లు రూపొందించారన్నారు. ఎయిర్ కాప్‌ను నిరంజన్ తయారు చేశాడని తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేని వారు ఒకే ఒక్క మొబైల్ యాప్‌తో పోలీసులకు రిపోర్టు చేయవచ్చన్నారు. ఈ యాప్‌ను ఐటీ నిపుణులు హిమబిందు, నితిన్‌రెడ్డి రూపొందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ పోలీసు కమిషనర్ శశిధర్‌రెడ్డి, డీసీపీలు ఎ.ఆర్.శ్రీనివాసులు, రామారాజేశ్వరి, కార్తికేయతో పాటు పలువురు ఐటీ నిపుణులు ఉన్నారు. -
బీ స్కూల్స్‌లో.. అమ్మాయిల హవా!
టాప్ స్టోరీ: ఇంజనీరింగ్ పూర్తిచేసిన అర్చన..మూడేళ్లకు పైగా ఓ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేసింది. కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే.. టెక్నికల్ నాలెడ్జ్‌తోపాటు మేనేజ్మెంట్ స్కిల్స్ అవసరమని గుర్తించింది. ఆమె ఇప్పుడు నగరంలోని ప్రముఖ బీస్కూల్లో చేరి, మేనేజ్మెంట్ నైపుణ్యాలను మెరుగుపరచుకునే పనిలో నిమగ్నమైంది. ఒక్క అర్చనేకాదు.. ఇలా ఎంబీఏలో చేరుతున్న అమ్మాయిల సంఖ్య ఏటేటా గణనీయంగా పెరుగుతుంది. సిటీలోని బీస్కూల్స్‌లో అమ్మాయిల హవాపై ప్రత్యేక ఫోకస్.. నగరంలోని టాప్ మేనేజ్మెంట్ కళాశాలల్లో గతంతో పోల్చితే.. ఎంబీఏలో చేరుతున్న అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐబీఎస్), ఓయూ, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్(ఐపీఈ) వంటి ప్రముఖ మేనేజ్మెంట్ విద్యాసంస్థల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం అడ్మిషన్లలో అమ్మాయిల శాతం గతం కంటే భారీగా పెరిగింది. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) రికార్డు స్థాయిలో 30శాతానికి పైగా అమ్మాయిలకు అడ్మిషన్ కల్పించినట్లు ఐఎస్బీ డిప్యూటీ డీన్ సవితా మహాజన్ తెలిపారు. ఈ బీస్కూల్ చరిత్రలో ఇది అత్యధికమన్నారామె! ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలలో విద్యార్థినుల శాతం బాగా పెరిగిందని ఓయూ, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ డీన్ కృష్ణారెడ్డి తెలిపారు. బాధ్యతలను నూటికి నూరుశాతం నిర్వర్తించడంలో మహిళలు చొరవ చూపుతుండటమే తాజా ట్రెండ్స్‌కు కారణమంటున్నారు ఐపీఈ అసోసియేట్ ప్రొఫెసర్ అంజిరాజు. దేశవ్యాప్తంగా అదే ట్రెండ్ దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూల్స్ ఐఐఎం, ఎక్స్ఎల్ఆర్ఐ, ఐఎస్బీ వంటి వాటిలో 2014-16 బ్యాచ్ అడ్మిషన్ల ప్రత్యేక ఏంటో తెలుసా..?! ఎంబీఏలో చేరుతున్న అమ్మాయిల సంఖ్య ఎన్నడూలేనంతగా పెరగడం..! ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్స్ (ఐఐఎంలు) గతేడాదితో పోల్చితే.. ఈ సంవత్సరం అమ్మాయిలను అధిక సంఖ్యలో చేర్చుకున్నాయి. అంతేకాదు ఐఐఎంలు, ఐఎస్బీలాంటి ప్రముఖ బీస్కూల్స్.. మేనేజ్మెంట్ కోర్సుల వైపు అమ్మాయిలను ప్రోత్సహించేందుకు ఎంపిక ప్రక్రియను మరింత సరళతరం చేస్తుండటం విశేషం. ఐఐఎం, కలకత్తా అయితే ఇంటర్వ్యూకు సెలక్ట్ అయిన మహిళలకు ఏకంగా మూడు మార్కులు అదనంగా ఇచ్చేందుకు నిర్ణయించింది. ఐఐఎం, లక్నో కూడా విద్యార్థినులకు ప్రత్యేక వెయిటేజీ ఇస్తోంది. అలాగే.. ఐఐఎం, అహ్మదాబాద్; ఐఐఎం, బెంగళూరు కూడా గతంలో పోల్చితే ఈ ఏడాది అధిక సంఖ్యలో అమ్మాయిలకు ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ పంపించాయి. ఐటీలోనే కాదు.. మేనేజ్మెంట్లో సైతం మహిళలకు లాజికల్ స్కిల్స్ తక్కువ... అందుకే ఐటీ ఉద్యోగాల్లో అంతగా రాణించలేరనే అపోహను అధిగమించి ఐటీ సెక్టార్లో పాగా వేసిన అమ్మాయిలు.. ఇప్పుడు మేనేజీరియల్ కెరీర్ దిశగా దూసుకుపోతున్నారని విశ్లేషిస్తున్నారు నిపుణులు. సంస్థను నడిపించటం అంత తేలిక్కాదు. అపార అనుభవం ఉన్న పురుషులకే సాధ్యం కావట్లేదు.. ఇక మహిళల వల్ల ఏమవుతుంది? అనే మాటలు సత్యదూరమని నిరూపించారు ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందాకొచ్చర్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్పర్సన్ అరుంధతీభట్టాచార్య తదితరులు. వీరిని ఆదర్శంగా తీసుకుంటూ.. అదేబాటలో నడుస్తూ.. మేనేజ్మెంట్ కోర్సులకు ప్రాధాన్యతనిస్తున్నారు నవతరం అమ్మాయిలు. దేశంలో ప్రముఖ బీస్కూల్స్ క్యాంపస్‌లలో సీటు సంపాదించిన ప్రతి నలుగురిలో ఒకరు అమ్మాయిలే ఉన్నారని తాజా విశ్లేషణలు తెలుపుతున్నాయి. విశేషం ఏమంటే.. రిజర్వేషన్ కాకుండా.. మెరిట్ ద్వారా సీటు సంపాదిస్తున్న విద్యార్థినుల సంఖ్య పెరుగుతుండటం! ఐఎస్బీ.. ఏడేళ్లలో 120 శాతం బీస్కూల్స్‌లో నగరంలోని ఐఎస్‌బీకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ఫ్రెషర్స్‌కే కాకుండా.. ఐదారేళ్ల వర్క్ ఎక్స్‌పీరియన్స్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ చేసే వీలుంది. 2014-2015 విద్యాసంవత్సరంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్.. హైదరాబాద్, మొహాలీ ప్రాంగణాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్(పీజీపీ)లో 30 శాతం మంది అంటే.. 231 మంది విద్యార్థినులే ఉన్నారని ఐఎస్బీ డిప్యూటీ డీన్ సవితా మహాజన్ తెలిపారు. ఏడేళ్ల వ్యవధిలో ఐఎస్బీలో విద్యార్థినుల చేరిక రేటు 120 శాతం పెరిగినట్లు ఆమె చెప్పారు. ఐఐఎం అహ్మదాబాద్‌లో గతంలో 11 నుంచి 22 శాతం మాత్రమే ఉన్న విద్యార్థినుల సంఖ్య.. తాజా బ్యాచ్‌లో 28శాతానికి పెరిగింది. ఓయూలో 80కి 24 మంది అమ్మాయిలే! ‘‘పాతికేళ్ల క్రితం.. ఇంట్లో వాళ్లను ఒప్పించి ఓయూ క్యాంపస్‌లో ఎంబీఏ కోర్సులో చేరాను. మొదటిరోజు క్లాసులోకి వెళ్లగానే ఆశ్చర్యం. అందరూ మగపిల్లలే.. ఆ ఏడాది ఎంబీఏలో చేరిన ఒకే ఒక్క అమ్మాయిని నేనే. ప్రస్తుతం యువతుల ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. మేనేజ్మెంట్ కోర్సులు చేసేందుకు పోటీపడు తున్నారు’’అంటున్నారు ఓయూ డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ హెడ్ ప్రొఫెసర్ సెల్వరాణి బాలన్. ఓయూ క్యాంపస్‌లో ఎంబీఏలో 80 సీట్లు ఉంటే.. ప్రతి క్లాసులో 24మందికి పైగా అమ్మాయిలే ఉంటున్నారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థినులు మెరిట్ ద్వారా సీటు తెచ్చుకుంటున్నారు. అబ్బాయిలతో పోటీపడి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో చోటు సంపాదిస్తున్నార ని ఆమె చెప్పారు. మహిళలకే ఎంఎన్సీల ఓటు మల్టీనేషనల్ కంపెనీలు కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సమయంలో అమ్మాయిలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయంటున్నారు ఓయూ ప్రొఫెసర్ చంద్రిక. సహజంగా మహిళలకు ఉండే ఓర్పు.. నేర్పు... వీటికి అదనంగా టీంవర్కులో పరిణితితో నిర్ణయాలు తీసుకోవడం వంటి ప్రత్యేక నైపుణ్యాలు ‘ఆమె’కు సంస్థలు ప్రాధాన్యత కట్టబెట్టేందుకు కారణాలంటూ విశ్లేషించారు. ‘కుటుంబ సంక్షేమానికి మహిళలు ఎంతగా బాధ్యత వహిస్తారో.. తాను పనిచేసే సంస్థ ఎదుగుదలకూ అంతకుమించిన బాధ్యత స్వీకరిస్తారు. ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధిస్తున్న విజయాలు ఇప్పటి యువతుల్లో ప్రేరణనింపుతున్నాయి. కార్పొరేట్ ప్రపంచంలో ఉన్నతస్థానంలో నిలిచేందుకు ఎంబీఏతో బిజినెస్, మేనేజ్మెంట్ నైపుణ్యాలను సాధిస్తున్నారు. తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పు కూడా అమ్మాయిలు ఎంబీఏ వంటి ఉన్నత చదువులకు రావడానికి మరో కారణం. పనిచేసే చోట పురుషులతో పోల్చితే మహిళలు మరింత పారదర్శకంగా ఉంటారు’ అంటూ.. ఇటీవల ఐఎస్బీలో నిర్వహించిన సమావేశానికి హాజరైన ఐఐఎం పూర్వ విద్యార్థిని, ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (యూబీఎస్ ఇండియా) సెక్యూరిటీస్ ఛీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనూష భగత్ మేనేజ్మెంట్ కోర్సుల వైపు అమ్మాయిలు ఆకర్షితులవడానికి కారణాలను విశ్లేషించారు. -
నేర పరిశోధనకు సాంకేతిక పరిజ్ఞానం
ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో నేరాల పరిశోధనకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో రెండు రోజులపాటు నిర్వహించే ‘రోల్ బేస్ ట్రైనింగ్’ కార్యక్రమాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్, ఉట్నూర్, నిర్మల్ పోలీసు సబ్ డివిజన్ల నుంచి 40 మంది ఎస్సైలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పనసారెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. వాహనాల డ్రైవర్లకు అవగాహన కల్పించాలని, రోజూ జరుగుతున్న ప్రమాదాలను విశ్లేషించుకోవాలని సూచించారు. స్టేషన్లలో కేసు నమోదు అనంతరం బలమైన సాక్షులను ప్రవేశపెట్టాలన్నారు. పోలీసు వ్యవస్థను పటిష్టంగా అమలు చేయడం ద్వారానే నేరాల సంఖ్య తగ్గుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో శిక్షణ కేంద్రం డీఎస్పీ కె.సీతారాములు, ఏఆర్ డీఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు వి.మధుకర్, పి.గంగాధర్, కంప్యూటర్ విభాగం నిపుణులు శివాజీ చౌహాన్, శివకుమార్, ఎండీ. ఫారుఖ్‌అలీ తదితరులు పాల్గొన్నారు. -
నూతన విద్యావిధానం అవసరం
ఐఎస్ఆర్ డిగ్రీల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పింప్రి, న్యూస్‌లైన్: సాంకేతిక పరిజ్ఞానం విషయంలో మన దేశం ప్రపంచ చేశాలతో పోటీ పడాలంటే కొత్త కొత్త ప్రయోగాలను చేయాలని, ఇందుకు యువత కృషి ఎంతో అవసరమని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఎస్ఆర్) సంస్థ ఆదివారం జరిగిన డిగ్రీల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ర్టపతి ప్రణబ్ ప్రసంగిస్తూ .. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు ప్రాచీనమైనవని సూచించారు. కాలానుగుణంగా ప్రపంచస్థాయిలో పోటీ పడాలంటే కొత్త కొత్త ప్రయోగాలు, పరిశోధనల ద్వారానే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచంలోని మొదటి 200 విద్యాసంస్థల్లో మన దేశానికి చెందిన ఒక్క విద్యా సంస్థ కూడా లేకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రపంచదేశాల విద్యాసంస్థలకు దీటుగా మన దేశ విద్యా సంస్థలు పనిచేయడానికి నూతన విద్యావిధానం అవసరముంటుందన్నారు. ఇందుకుగాను యువశక్తి తోడ్పాటు ఎంతో అవసరమని పేర్కొన్నారు. యువత కృషితో పాటు విద్యాసంస్థలు తగిన ఏర్పాట్లను చేసినప్పుడే అది సాధ్యపడగలదని రాష్ట్రపతి తెలిపారు. తర్వాత సంస్థ నూతన భవనాన్ని ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రారంభించారు. ఇదిలా వుండగా ఈ ఏడాది సంస్థ ద్వారా 13 మంది పీహెచ్‌డీలు, 94 మంది డిగ్రీలు పొందారు. కార్యక్రమానికి రాష్ర్ట గవర్నర్ కె.శంకర్ నారాయణన్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఐఎస్ఆర్ సంస్థ డెరైక్టర్ డాక్టర్ కె.గణేష్, పాలక మండలి అధ్యక్షుడు టి.వి.రామకృష్ణన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్య సాధనకు తపనే ఊపిరి!
ఇష్టమైన కొలువును సాధించాలంటే కేవలం పరీక్షల్లో మార్కులు బాగా వస్తే సరిపోదు. రెజ్యుమె ఘనంగా ఉంటే ఉద్యోగం ఖాయమనుకోవడం పొరపాటే. మార్కుల కంటే ముఖ్యమైన లక్షణాలు విద్యార్థుల్లో ఉండాలి. సంస్థలు తమ ఉద్యోగుల ఎంపికలో వీటికే పెద్దపీట వేస్తున్నాయి. మౌఖిక పరీక్షల్లో.. అభ్యర్థుల మార్కుల జాబితాలను పక్కనపెట్టి వారి గుణగణాలను, నైపుణ్యాలను, నడవడికను, వ్యక్తిత్వాన్నే ఎక్కువగా పరిశీలిస్తారు. కాబట్టి అలాంటి లక్షణాలను తప్పనిసరిగా పెంపొందించుకోవాలి. అందుకు తగిన కృషి నిరంతరం చేయాలి. మనిషిలో నిజంగా తపన ఉంటే కోరుకున్నది సాధించడం కష్టమేమీ కాదు. టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్: సాంకేతిక పరిజ్ఞానం, ఆంగ్ల భాషపై పట్టు, సమయపాలన, ఆత్మవిశ్వాసం వంటి వాటితో కార్పొరేట్ సంస్థల్లో అప్పగించిన ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయొచ్చు. కాబట్టి ఇంటర్వ్యూలో టైమ్ మేనేజ్ మెంట్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు వారి ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్‌ను గడువులోగా పూర్తి చేశారా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తారు. ఇందుకోసం కొన్ని ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది. విద్యార్థులు తమ ప్రతిభాపాటవాలతోపాటు సమయానికి ఇచ్చిన ప్రాముఖ్యతను ప్రాధాన్యతా క్రమంలో వివరించాలి. ఇలా చెప్పినప్పుడు అభ్యర్థికి సమయపాలనపై అవగాహన ఉందని ఇంటర్వ్యూ బోర్డు సభ్యులకు తెలుస్తుంది. తోటి విద్యార్థులతో కలిసి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసినప్పుడు మీరు అనుసరించిన ప్రణాళికను వివరించవచ్చు. కాలపరిమితిపై విద్యార్థులు చక్కని అవగాహ నతో ఉండాలి. సాఫ్ట్ స్కిల్స్: కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్‌కు సాఫ్ట్ స్కిల్స్‌తో దగ్గరి సంబంధం ఉంది. కార్పొరేట్ సంస్థలు సాఫ్ట్ స్కిల్స్‌కు పెద్దపీట వేస్తాయి. ముఖ్యంగా అభ్యర్థుల వ్యక్తిత్వం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన, సానుకూలంగా మాట్లాడటం, ఆశావహ దృక్పథం, నమ్మకం, ఎదుటివారి కళ్లలోకి నేరుగా చూస్తూ మాట్లాడటం, బృందంలో మాట్లాడటం, నాయకత్వ లక్షణాలను కలిగి ఉండడం వంటి నైపుణ్యాలను ఇంటర్వ్యూల్లో పరిశీలిస్తారు. ఒక విద్యార్థిలో చక్కటి వ్యక్తిత్వం ఉంటేనే తదుపరి ప్రశ్నలు వేయడానికి సుముఖత చూపుతారు. వ్యక్తిత్వంలో భాగంగా అంకితభావం ప్రదర్శించడం, మృదు స్వభావం, చిరునవ్వు, అర్థం చేసుకుంటూ వినడం, చక్కని శరీర భాష, సమయస్ఫూర్తిని ప్రదర్శించడం వంటి లక్షణాల ద్వారా ఎదుటివారు ఆకర్షితులవుతారు. వ్యక్తిత్వం అనేది అభ్యర్థిలో రాత్రికి రాత్రే జరిగే మార్పు కాదు. కాబట్టి మంచి లక్షణాలను విద్యార్థి దశలోనే అలవర్చుకోవాలి. ఇందుకోసం తగిన కృషి అవసరం. నిత్య విద్యార్థిగా మారాలి: నేర్చుకోవాలన్న తపన మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. ‘నేను నిత్య విద్యార్థిగా ఉండిపోవాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే అప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు’ అంటూ స్వామి వివేకానంద చెప్పినట్లుగా విద్యార్థి దశలో కొత్త విషయాలను నేర్చుకొనేందుకు ప్రయత్నించాలి. బలమైన తపన ఉన్నప్పుడే లక్ష్యసాధన దిశగా అడుగులేస్తారు. తపనను లక్ష్యానికి ఊపిరిగా పేర్కొనవచ్చు. తాము ఎంపిక చేసుకొనే అభ్యర్థిలో కొత్త విషయం నేర్చుకోవాలనే ఆసక్తి ఉందా? లేదా? అనే విషయాన్ని కార్పొరేట్ సంస్థలు చూస్తాయి. మీ లక్ష్యం ఏమిటి? నాలుగైదేళ్లలో ఏ స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నారు? వంటి ప్రశ్నలను ఇంటర్వ్యూలో అడుగుతారు. మీరిచ్చే సమాధానాల ద్వారా.. మీకున్న అంకితభావం, తపన ఇట్టే తెలిసిపోతాయి. నమ్మకాన్ని నమ్ముకోవాలి: నమ్మకంతో చేసే ఏ పనైనా సఫలమవుతుందంటారు. నమ్మకం రెండు రకాలు. తమపై తమకు నమ్మకం, ఎదుటి వ్యక్తులపై నమ్మకం. నమ్మకానికి వ్యక్తి ఆలోచనే పునాదిగా చెప్పుకోవచ్చు. తనలోని ఆలోచనలపై పట్టు కొనసాగిస్తూ, ఎదుటివారికీ అంతే పట్టుతో సమాధానం చెప్పగలగాలి. అంతేకాదు ఇతరులను నమ్మడం ద్వారా బృందంలో పనిచేసేటప్పుడు లక్ష్య సాధనకు మార్గం సుగమమవుతుంది. ఇంటర్వ్యూ చేసేటప్పుడు అభ్యర్థుల్లో నమ్మకాన్ని పరీక్షిస్తారు. కొన్ని సమయాల్లో చెబుతున్న సమాధానాలు తప్పే అని తెలిసినప్పటికీ మీరు ఎంత నమ్మకంగా చెబుతున్నారు అనేది పరీక్షిస్తారు. అంతేకాదు అభ్యర్థులు తమ తప్పును నిజాయతీగా ఒప్పుకుంటే ఇంటర్వ్యూ చేసేవారు ప్రశంసిస్తారు. కలివిడితనంతో కలుగును మేలు: ప్రాజెక్ట్‌ల్లో పనిచేసేటప్పుడు కొన్నిసార్లు ఒక్కరే కాకుండా ఇతరులతో కలిసి బృందంగానూ పని చేయాల్సి ఉంటుంది. ఇలాంటి నైపుణ్యాన్ని విద్యార్థులు కళాశాలలో ఉన్నప్పుడే అలవర్చుకోవాలి. ప్రాజెక్ట్‌ల్లో భాగంగా రకరకాల వ్యక్తులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. బృందంలోని ఇతర సభ్యులతో స్నేహపూర్వకంగా, కలుపుగోలుగా వ్యవహరిస్తే త్వరగా నిలదొక్కుకుంటారు. ఒక బృందంలో పని చేసినప్పుడు ఎదుటివారు చెప్పే విషయాలను శ్రద్ధగా వినడం, ప్రతిస్పందించడం వంటి లక్షణాలతో వారిని ఇట్టే ఆకట్టుకోవచ్చు. ఎదుటివారు చెప్పిన విషయాలకు సానుకూలంగా ప్రతిస్పందించడం వల్ల మీపై వారికి గౌరవం పెరుగుతుంది. ప్రాజెక్ట్‌లను సకాలంలో పూర్తి చేయడంలో మీ వంతు భాగస్వామ్యాన్ని సంస్థ యాజ మాన్యానికి ఎప్పటికప్పుడు తెలియజేయాలి. బృందంలో పని చేసేటప్పుడు కాలానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. అప్పగించిన పనిని సకాలంలో పూర్తి చేయకపోతే మీకు, మీ సంస్థకు చెడ్డపేరు రావొచ్చు. కాబట్టి బృందంలో పని చేసిన అనుభవాన్ని ఇంటర్వ్యూలో పరీక్షిస్తారు. ఇందుకోసం విద్యార్థులు తమ కళాశాలలో నిర్వహించే వార్షికోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. వీటిలో మీ పాత్ర ప్రశంసనీయంగా ఉండాలి. మీరు తోటి విద్యార్థులతో కలిసి ఎంత విలక్షణంగా, సృజనాత్మకంగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేశారు అనేది ఉదాహరణలతో సహా వివరించాలి. బృందంలో పనిచేసినప్పుడు మీరు ఆచరించిన ప్రణాళిక, ఎదుర్కొన్న ఇబ్బందులు, సమయానికి ఇచ్చిన ప్రాధాన్యత వంటి వాటిని ప్రస్తావించాలి. సమూహాల్లో పనిచేసే తత్వానికి ప్రాంగణ నియామకాల్లో అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇతర సభ్యులతో కలిసి పని చేయడం ద్వారా నాయకత్వ లక్షణాలు అలవడతాయి. నాయకత్వ లక్షణాలకు మూలం సవాళ్లను ఎదు ర్కొనే ధైర్యం ఉండడం. ఒక విద్యార్థి ఏ సమయంలోనైనా సవాళ్లను ఎదుర్కొనే లక్షణాన్ని కలిగి ఉంటేనే లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలు గుతాడు. -
రైతు బిడ్డల స్ఫూర్తియాత్ర భూమిపుత్ర
టీవీక్షణం పల్లెలన్నీ ఖాళీ అవుతున్నాయి. నగరాలు జనంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఏదో తెలియని గమ్యం వైపు అర్థం లేని పరుగులు! యంత్రాల ముందు కూర్చుని మనుషులు కూడా యాంత్రికంగా మారిపోతున్నారు. ఎప్పుడో ఓ ఒంటరి సాయంకాలం వరుసగా వేసుకొనే ఎన్నో ప్రశ్నలకు దొరికే సమాధానం ఒకటే - పల్లె, పంట చేను. పల్లెటూరుకి, పట్టణానికి మధ్య పెరుగుతున్న ఈ దూరాల్ని దగ్గర చేసే ప్రయత్నాన్ని విజయవంతంగా నెరవేరుస్తోంది మాటీవీ ‘భూమిపుత్ర’. లాభాపేక్ష లేకుండా, ఒక సామాజిక బాధ్యతగా రైతులకు మేలు చేయాలన్న ఆలోచనతో మాటీవీ ఈ బృహత్ ప్రయత్నాన్ని ప్రారంభించింది. ప్రతి శనివారం ఉ. 8 గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా, పరిస్థితులకు అనుగుణంగా సరికొత్త విధానాల్లో వ్యవసాయం చేసే ఎందరో రైతుల్ని, వారి అనుభవాల్ని వారం వారం పరిచయం చేస్తోంది. రైతులకు అండగా నిలవడం, కొత్త తరాన్ని సేద్యం వైపు ఆకర్షించడం, సేద్యం మన సంస్కృతిగా చూడటం మౌలికంగా ఈ కార్యక్రమం ఉద్దేశం. పర్యావరణానికి, మనుషులకు, నేలకు ఎలాంటి హాని జరగకుండా లాభదాయకంగా సేద్యాన్ని సాగించే అభ్యుదయ రైతులపై దృష్టి పెట్టింది ‘భూమిపుత్ర’. ఆచరణలో ఎన్ని సమస్యలు ఎదురైనా, మన రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశంతో 90 వారాలకుపైగా ఈ సస్యయజ్ఞం చేస్తోంది. టెలివిజన్‌లో ప్రత్యక్షంగా, యూ ట్యూబ్‌లో పరోక్షంగా లక్షల మంది ప్రేక్షకులు ఈ కార్యక్రమం ద్వారా స్ఫూర్తి పొందుతున్నారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానం, సమాచార మార్పిడికి భూమిపుత్ర ఒక వేదికగా నిలిచింది. రేపటి సేద్యానికి తిరుగులేని ఆశను కలిగించడం భూమిపుత్ర వల్ల జరిగిన ప్రయోజనం. ఇప్పుడు ఎగిసిపడుతున్న ఈ అలలన్నీ ఒకనాడు విరిగిపడేవే. నిలబడేది ఒకటే. వ్యవసాయం. అది భవిష్యత్తు!