‘సైబర్ సేఫ్’గా హైదరాబాద్
- రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్
- సెక్యూరిటీ సొల్యూషన్ తీసుకురావాల్సిన అవసరముంది
- రాబోయే ప్రపంచ యుద్ధం కీబోర్డులతోనే..
సాక్షి, సిటీబ్యూరో: సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతున్న తరుణంలో మన దేశంలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు. వీటికి చెక్ పెట్టేందుకు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్ తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ‘సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్’ ఆధ్వర్యంలో ద వెస్టిన్ హోటల్‌లో మంగళవారం ‘ఆన్యువల్ సైబర్ సెక్యూరిటీ కాన్‌క్లేవ్ 2015’ కార్యక్రమం నిర్వహించారు. డీఎస్‌సీఐ సీఈవో నందకుమార్ సరవడే, ఎస్‌సీఎస్‌సీ ైచైర్మన్ సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి మంత్రి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్‌ను సైబర్ సేఫ్ డెస్టినేషన్‌గా మార్చేందుకు ప్రభుత్వం నాస్‌కామ్, డీఎస్‌సీఐ సంస్థలతో కలిసి పనిచేస్తుందన్నారు. రాబోయే కొత్త ప్రపంచ యుద్ధం కీబోర్డులతోనే జరుగుతుందని దానిని ఎదుర్కొనేందుకు సైబర్ వారియర్స్‌ను తయారుచేస్తున్నామన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు రాష్ట్రాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, వీటిని నియంత్రించేందుకు భవిష్యత్‌లో సైబర్ టీచర్స్ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. హైదరాబాద్‌లో తొలిసారిగా ఈ సదస్సులో దాదాపు 100 కంపెనీలు పాల్గొన్నాయి.