ఇండిపెండెన్స్‌డే సీక్వెల్‌కు సిద్ధం
ఇండిపెండెన్స్‌డే రెండు దశాబ్దాల క్రితం తెరపైకి వచ్చిన హాలీవుడ్ చిత్రం ఇది. అయినా ఆంగ్ల చిత్రాల అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకుడిలో కూడా గుర్తుండి పోయిన చిత్రం ఇండిపెండెన్స్‌డే. 1996లో 75 మిలియన్ల అమెరికన్ డాలర్స్ వ్యయంతో రూపొంది 817 మిలియన్ల అమెరికన్ డాలర్లు వసూలు చేసి అప్పటి వరకూ విడుదలైన చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచిన దర్శకుడు రోలండ్ ఎమిరిచ్ అద్భుత సృష్టి ఇండిపెండెన్స్‌డే చిత్రం. విశేషం ఏమిటంటే ఈ చిత్రం అమెరికా స్వాతంత్య్రదినోత్సవం రోజైన ఏప్రిల్ నాలుగో తేదీన విడుదలవడం అన్నది యాదృచ్చికంగా జరిగిందే.
అప్పట్లో గ్రామీ అవార్డును అందుకున్న ఈ చిత్రానికి రెండు దశాబ్దాల తరువాత ఇండిపెండెన్స్‌డే రీసర్జెన్స్ పేరుతో సీక్వెల్ నిర్మాణం జరిగింది. అప్పట్లో 75 మిలియన్స్ అమెరికా డాలర్లు వ్యయంతో రూపొందిన ఇండిపెండెన్స్‌డే చిత్రానికి పార్టు-2ను ఇప్పుడు 200 మిలియన్ల అమెరికన్ డాలర్లు వ్యయంతో ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించడం విశేషం. ఇండిపెండెన్స్‌డే చిత్రంలో నటించిన బిల్‌పుల్‌మాన్, జెఫ్ గోల్డ్‌బమ్ సీక్వెల్‌లోనూ నటించడం విశేషం.
ఇండిపెండెన్స్‌డే చిత్ర కథను కూడా ఎవరూ మరచిపోలేరు. ఇతర గ్రహాల నుంచి ఎలియన్స్ మానవ జాతిపై దాడి చేయడం, వాటి నుంచి మానవులు ఎలా రక్షింపబడతారన్న పలు ఆసక్తికరమైన అంశాలను గ్రాఫిక్స్‌ను జోడించి బ్రహ్మాండంగా తెరకెక్కించిన చిత్రం ఇండిపెండెన్స్‌డే. అయితే దానికి సీక్వెల్ అయిన ఇండిపెండెన్స్‌డే రీసర్జెన్స్‌ను నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించినట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఆంగ్లం, తమిళ భాషల్లో ఈ నెల 24న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్వాహకులు వెల్లడించారు.