independenceday
-
4 రోజులు బ్యాంకులు బంద్
సాక్షి, హైదరాబాద్: బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. శనివారం నుంచి వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈనెల 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న శ్రీకృష్ణ జన్మాష్టమి, 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ఈ 4 రోజులు బ్యాంకుల్లో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఆన్లైన్, డిజిటల్ లావాదేవీలు యథావిధిగా సాగుతాయి. ఇప్పటికే అరకొర నగదు, పని చేయని ఏటీఎంలతో సమస్యలు ఎదుర్కొంటున్న ఖాతాదారులకు వరుస సెలవుల రూపంలో ఇబ్బందులు పెరగనున్నాయి. మరోవైపు ఈనెల 25 నుంచి కూడా వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. 25న వినాయక చవితి, 26న 4వ శనివారం, 27న ఆదివారం కావడంతో మూడు రోజులు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. -
ఇండిపెండెన్స్‌డే సీక్వెల్‌కు సిద్ధం
ఇండిపెండెన్స్‌డే రెండు దశాబ్దాల క్రితం తెరపైకి వచ్చిన హాలీవుడ్ చిత్రం ఇది. అయినా ఆంగ్ల చిత్రాల అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకుడిలో కూడా గుర్తుండి పోయిన చిత్రం ఇండిపెండెన్స్‌డే. 1996లో 75 మిలియన్ల అమెరికన్ డాలర్స్ వ్యయంతో రూపొంది 817 మిలియన్ల అమెరికన్ డాలర్లు వసూలు చేసి అప్పటి వరకూ విడుదలైన చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచిన దర్శకుడు రోలండ్ ఎమిరిచ్ అద్భుత సృష్టి ఇండిపెండెన్స్‌డే చిత్రం. విశేషం ఏమిటంటే ఈ చిత్రం అమెరికా స్వాతంత్య్రదినోత్సవం రోజైన ఏప్రిల్ నాలుగో తేదీన విడుదలవడం అన్నది యాదృచ్చికంగా జరిగిందే. అప్పట్లో గ్రామీ అవార్డును అందుకున్న ఈ చిత్రానికి రెండు దశాబ్దాల తరువాత ఇండిపెండెన్స్‌డే రీసర్జెన్స్ పేరుతో సీక్వెల్ నిర్మాణం జరిగింది. అప్పట్లో 75 మిలియన్స్ అమెరికా డాలర్లు వ్యయంతో రూపొందిన ఇండిపెండెన్స్‌డే చిత్రానికి పార్టు-2ను ఇప్పుడు 200 మిలియన్ల అమెరికన్ డాలర్లు వ్యయంతో ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించడం విశేషం. ఇండిపెండెన్స్‌డే చిత్రంలో నటించిన బిల్పుల్మాన్, జెఫ్ గోల్డ్బమ్ సీక్వెల్లోనూ నటించడం విశేషం. ఇండిపెండెన్స్‌డే చిత్ర కథను కూడా ఎవరూ మరచిపోలేరు. ఇతర గ్రహాల నుంచి ఎలియన్స్ మానవ జాతిపై దాడి చేయడం, వాటి నుంచి మానవులు ఎలా రక్షింపబడతారన్న పలు ఆసక్తికరమైన అంశాలను గ్రాఫిక్స్‌ను జోడించి బ్రహ్మాండంగా తెరకెక్కించిన చిత్రం ఇండిపెండెన్స్‌డే. అయితే దానికి సీక్వెల్ అయిన ఇండిపెండెన్స్‌డే రీసర్జెన్స్ను నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కించినట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఆంగ్లం, తమిళ భాషల్లో ఈ నెల 24న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్వాహకులు వెల్లడించారు. -
మేడ్చల్ పీఏసీఎస్‌లో చోరీకి యత్నం
మేడ్చల్ న్యూస్‌లైన్: మండల కేంద్రంలోని పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం)లో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించి రికార్డులను చిందరవందరగా పడేశారు. పీఏసీఎస్ సిబ్బంది కథనం ప్రకారం.. గురువారం స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో కార్యదర్శి మోహన్‌రావు, అటెండర్ ప్రకాష్‌లు బుధవారం సాయంత్రం వరకు ఏర్పాట్లు చేశారు. మోహన్‌రావు 5 గంటలకు వెళ్లిపోగా అటెండర్ కార్యాలయాన్ని శుభ్రం చేసి సాయంత్రం ఏడు గంటల తర్వాత కార్యాలయానికి తాళాలు వేసి ఇంటికి వెళ్లాడు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న పీఏసీఎస్ కార్యాలయంలోకి బుధవారం రాత్రి దుండగులు ప్రహరీ దూకి ప్రవేశించారు. గది తాళాలు పగులగొట్టి లోపలకి చొరబడ్డారు. కార్యదర్శి, చైర్మన్ గదుల తాళాలు పగులగొట్టి రికార్డులను చిందరవందర చేశారు. ఫైళ్లను భద్రపరిచే బీరువాలను ధ్వసం చేశారు. చైర్మన్ అంతిరెడ్డి చాంబర్‌లోని టేబుల్ డ్రాతో పాటు కార్యదర్శి టేబుళ్లను పడేశారు. ఫైళ్లను ఛిన్నాభిన్నం చేశారు. పాత రికార్డులను ఉంచే మూటలను విప్పి అందులో రికార్డులను గదుల్లో పడేశారు. కంప్యూటర్ను ధ్వంసంచేసే యత్నం చేశారు. గురువారం కార్యాలయ సిబ్బంది సమాచారంతో సీఐ రాంరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని 2 లీటర్ల పెట్రోల్ సీసా, అగ్గిపెట్టె, ఓ తాపీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం క్లూస్ టీం వేలి ముద్రలు సేకరించింది. కార్యాలయం నుంచి ఎలాంటి ఫైళ్లు, సామగ్రి చోరీ కాలేదని పీఏసీఎస్ కార్యదర్శి మోహన్‌రావు తెలిపారు. అంతా అనుమానాస్పదం.. డబ్బులు, విలువైన వస్తువులు ఉండని పీఏసీఎస్‌లో చోరీయత్నం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. మేడ్చల్ పీఏసీఎస్ దాదాపు కోటి రూపాయల టర్నోవర్‌తో నడుస్తోంది. కాగా సంఘానికి అనుబంధంగా బ్యాంకు ఉంది. రుణాల రికార్డులను మాయం చేసేందుకు దుండగులు ఘటనకు పాల్పడి ఉండొచ్చని అనుమానాలు ఉన్నాయి. చోరీ యత్నంలో ‘ఇంటి దొంగల’ హస్తం ఏమైనా ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాంరెడ్డి తెలిపారు.