విలువలు బోధించని నేటి విద్యా విధానం, నిఘా–నియంత్రణ లోపించిన టీవీ కార్యక్రమాలు, సామాజిక మాధ్యమ వేదికల్ని చేరువ చేసిన మొబైల్, ప్రపంచీకరణలో పెరుగుతున్న ఆర్థిక అంతరాలు... ఇవన్నీ కూడా మానవ సంబంధాల్ని చెదరగొడుతున్నాయి. విలువల్ని హరించి, జుగుప్సాకరమైన అట్టడుగుస్థాయికి చేరుస్తున్నాయి. వేధింపులు, బ్లాక్‌మెయిల్ బెదిరింపులు, డబ్బు గుంజడం, హింస, హత్యలు వంటి నేరాలకు ఇది దారితీస్తోంది. ఇంతటి వేదన, అశాంతి, హింసకు కారణమౌతున్న మూలాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. వీటిని ఒట్టి నేరాలుగానే చూడకుండా, నేపథ్యంలో ఉన్న సామాజికార్థికాంశాల్నీ పరిశీలించాలి. మూల కారణాల్ని వెతికి, తగిన సామాజిక, చట్టపరమైన చికిత్స చేయాల్సిన అవసరముంది. ఈ ఉపేక్ష సమాజానికి ఎన్నో రెట్ల నష్టం చేస్తోంది. ఈ సమస్యను ఇకనైనా పట్టించుకోవాలి.
సాంకేతిక పరిజ్ఙానం ఆకాశపు అంచులు తాకుతుంటే మానవతా విలువలు పాతా ళాన్ని అంటుతున్నాయి. మానవ సంబంధాలు రోజు రోజుకు పలుచ బారి భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తోంది. కనుచూపు మేర పరి ష్కారం కనిపించనంత అయోమయం నెలకొంది. స్థలం కోసం తలి దండ్రుల్ని తగులబెట్టి చంపే కొడుకు–మనవలు, ప్రియుడి చేతిలో కీలుబొమ్మై కన్న తల్లిని కడతేర్చే కూతుళ్లు, నిద్రపోయే తండ్రికి ఆస్తి యావతో నిప్పంటించే తనయులు, బడిపిల్లల్ని గర్భవతులు చేసే నవ కీచకులు... ఇవన్నీ అక్కడక్కడ జరిగే ఒకటీ, అరా అరుదైన ఘటన లుగా చూడటంలోనే లోపముంది. ఈ దారుణాల్ని కేవలం నేర ఘట నలుగా పోలీసు కేసు–దర్యాప్తులు, కోర్టు విచారణ–తీర్పులు, జరి మానా–శిక్షలు... ఈ దృష్టికోణంలో పరిశీలించడమే మన సమాజం పాలిట శాపమౌతోంది. ఇంతటి వేదన, అశాంతి, హింసకు కారణమౌ తున్న మూలాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. సమాజాన్ని ఈ దుస్థితిలోకి నెడుతున్న ప్రభావకాల గురించి ఆలోచించడమే లేదు. లోతైన పరిశీలన, ఓ చర్చ, దిద్దుబాటు చర్యలు... ఏమీ లేవు. ఇవి కేవలం నేర ఘటనలు కావు, వాటి వెనుక బలమైన సామాజిక, ఆర్థిక కారణాలున్నాయన్న స్పృహే లేకుండా పోతోంది. ప్రాధాన్యతలు మారిన ప్రభుత్వాలకివి ఆనవు. పాలకులకివి జలజల ఓట్లు రాల్చే అంశాలే కావు కనుక పట్టదు. పేరుకుపోయిన కేసుల ఒత్తిళ్లలో నలిగే కోర్టులు సకాలంలో సరైన న్యాయం చేసే ఆస్కారం లేదు. సామాజిక వేత్తలు, విద్యావంతులు, మేధావి వర్గం తీవ్రంగా ఆలోచించాల్సిన పరిణామాలివి. సామాజిక సమిష్ఠి బాధ్యత కరువౌతోంది. డబ్బు డబ్బును పెంచినట్టే నేరం నేర ప్రవృత్తిని, సంస్కృతిని పెంచుతోంది. మన నేర–న్యాయ వ్యవస్థ లొసుగులు మనుషుల్లో విచ్చలవిడితనాన్ని ప్రేరేపిస్తున్నాయి.
కుదేలయిన కుటుంబం
బలమైన కుటుంబం ఓ మంచి సమాజానికి మూల స్తంభం. రక రకాల కారణాలు ఈ రోజున కుటుంబాన్ని చిద్రం చేశాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతోంది. ఇంటి సభ్యుల కష్టనష్టాలకు అనునయింపు, తప్పిదాలకు దిద్దుబాటో, సర్దుబాటో చేసే కుషన్ సమిష్ఠి కుటుంబ వ్యవస్థలో దొరికేది. విలువలు, మానవ సత్సంబం ధాలు కూడా వారసత్వంగా లభించేవి. కానీ, సామాజిక–ఆర్థిక కార ణాల వల్ల ఉమ్మడి కుటుంబాలు క్రమంగా తగ్గుతున్నాయి. చిన్న కుటుంబాలు, భార్య–భర్త, చిన్న పిల్లలు మాత్రమే ఉండే క్యూబికల్ ప్యామిలీ నమూనా బలపడుతోంది. ఇది ఇంట్లో ఉండే వృద్ధుల పాలిట శాపమౌతోంది. స్థాయి, స్థోమత ఉన్న వారు కూడా తలి దండ్రుల్ని నిర్దయగా వృద్ధాశ్రమాల పాల్జేస్తున్నారు. అవి సౌకర్యంగా ఉండి, వృద్ధులు సమ్మతితో వెళితే వేరు! కానీ, బలవంతంగా పంపే సందర్భాలు, ఆశ్రమాల్లో వసతులు లేక వారు అల్లాడే దయనీయ పరిస్థితులే ఎక్కువ.
వేర్వేరు సమాజాల మధ్య, సమూహాల మధ్య, కుటుంబాల మధ్య, చివరకు వ్యక్తుల మధ్య సంబంధాలు సన్న గిల్లాయి. ఇందుకు సామాజిక, ఆర్థికాంశాలే ప్రధాన కారణం. ముఖ్యంగా పట్టణ, నగర ప్రాంతాల్లో ఈ ‘ఇరుగుపొరుగు పట్టని తనం’(సోషల్ అన్‌కన్సెర్న్‌నెస్) బాగా పెరిగిపోయింది. ఆ ఇంట్లో ఏం జరుగుతోందో ఈ ఇంటి వారికి పట్టదు. పొరుగువారి ఆర్థిక స్థితి, సాధకబాధకాల సంగతలా ఉంచి ఆయా ఇళ్లకు ఎవరు వచ్చి వెళు తున్నారు? ఇంట్లో వాళ్లెలా ఉంటున్నారు అన్నది కూడా తెలియని పరిస్థితి. తలుపేసి ఉంచిన ఇంట్లోని వారు ఏ కారణంగానో చనిపోతే, శవం కుళ్లి వాసనపట్టే వరకు అటువైపు తొంగి చూసే వారుండరు. పలు రెట్లుగా భూముల విలువ పెరిగిపోవడం కుటుంబాల్లో నిప్పులు పోసి, మానవ సంబంధాల్ని మంట కలుపుతోంది. గుంటూరు జిల్లాలో తల్లిని తనయ చంపిన తాజా ఘటన ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. భర్తను, కొడుకును పోగొట్టుకున్న ఓ తల్లికి కన్నకూతురే హంతకురాలవడం క్షీణించిన మానవ సంబంధాలకు పరాకాష్ట! భూమి విలువల పెరుగుదల రాజధాని అమరావతి పరిసరాల్లోని ఎన్నో కుటుంబాల్లో అశాంతి రగిలిస్తోంది. తలిదండ్రులు–పిల్లల మధ్య, అన్నదమ్ములు–అక్కచెల్లెల్ల మధ్య గోడలు మొలుస్తున్నాయి, గొడవలు పెరుగుతున్నాయి. సంపద ఘర్షణ, ఆస్తి తగాదాలు, భూవ్యాజ్యాలతో లిటిగేషన్ పెరిగింది. సివిల్ తగాదాలు క్రిమినల్ ఘటనలవుతున్నాయి, వచ్చి పోలీసుస్టేషన్లలో కేసులై వాలుతు న్నాయి. ఈ జాప్యం కూడా సహించనప్పుడు భౌతిక దాడులు, దారుణ హత్యలకు తలపడుతున్నారు.
ఆజ్యం పోస్తున్న అసమానతలు
ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్న సమాజాల్లో మానవ సంబం ధాల పరమైన నేరాలు పెరిగాయి. ఎక్కడికక్కడ హింస, అశాంతి ప్రబలుతోంది. మధ్య, దిగువ మధ్యతరగతి ఉన్నపళంగా దనవంతు లైన చోట వ్యత్యాసాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. సంపన్నులు, వారి సౌఖ్యాలను పోల్చుకొని నయా సంపన్నులూ పరుగెడుతున్నారు. నిర్హేతుకంగా పెరిగిన వస్తువ్యామోహం స్థాయిని మించిన ఆశలు రేపి, తప్పుటడుగులు వేయిస్తోంది. సంపన్న–పేద కుటుంబ వ్యక్తుల మధ్య పోలికలు అశాంతినే కాక నేర ప్రవృత్తినీ ప్రేరేపిస్తు న్నాయి. కక్ష–కార్పణ్యాలకు, పశుప్రవృత్తికి కారణమవుతున్నాయి. హయత్‌నగర్‌లో ఓ మహిళ వివాహేతర సంబంధం నెరపుతున్న వ్యక్తి పనుపున కన్నతల్లినే హతమార్చిన దుర్ఘటన దీనికి నిదర్శనం. ఈ కేసులో నిందితుడు ఏ సంపాదనా లేని జులాయిగా ఉండీ... ఓ కారు, ప్రియురాలు, సౌఖ్యాలు అనుభవిస్తున్నాడు. ఇంకేదో ఆశిస్తున్నాడు. సఖ్యతతో ఉన్న యువతితో పెళ్లిపైనే కాక, తల్లి ఆస్తిపై కన్నేశాడు. భర్తెలాగూ తాగుబోతు, ఇక ఆమె అడ్డుతొలిగితే ఆస్తినెలాగయినా దక్కించుకోవచ్చన్న కుట్రకోణం దర్యాప్తులో వెల్లడవుతోంది. నమ్ము కున్న యువతిపై బ్లాక్‌మెయిల్‌కూ తలపడ్డాడు. అతని చేతిలో కీలు బొమ్మయిన ఆమె తన తల్లి హత్యకూ వెనుకాడలేదు. ఇంకో ఘట నలో, భార్యాభర్తా కూడబలుక్కొని, ఓ సంపన్నుడిని లైంగికంగా ముగ్గులోకి దించారు. రహస్యంగా తీసిన వీడియోతో బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు గుంజడం వంటివి దేనికి సంకేతం?
ప్రభావకాలపై కన్నేయాలి
విలువలు బోధించని నేటి విద్యా విధానం, నిఘా–నియంత్రణ లోపించిన టీవీ కార్యక్రమాలు, సామాజిక మాధ్యమ వేదికల్ని చేరువ చేసిన మొబైల్, ప్రపంచీకరణలో పెరుగుతున్న ఆర్థిక అంతరాలు... ఇవన్నీ కూడా మానవ సంబంధాల్ని చెదరగొడుతున్నాయి. విలువల్ని హరించి, జుగుప్సాకరమైన అట్టడుగుస్థాయికి చేరుస్తున్నాయి. వేధిం పులు, బ్లాక్‌మెయిల్ బెదిరింపులు, డబ్బు గుంజడం, హింస, హత్యలు వంటి నేరాలకు ఇది దారితీస్తోంది. వీటిని ఒట్టి నేరాలుగానే చూడకుండా, నేపథ్యంలో ఉన్న సామాజికార్థికాంశాల్నీ పరిశీలించాలి. మూల కారణాల్ని వెతికి, తగిన సామాజిక, చట్టపరమైన చికిత్స చేయాల్సిన అవసరముంది. నక్సలైట్ల హింసను శాంతిభద్రతల అంశంగా కాక సామాజికార్థికాంశంగా చూడాలని చెప్పే మేధావి వర్గం ఇక్కడెందుకో దృష్టి సారించడం లేదు. ఈ ఉపేక్ష సమాజానికి ఎన్నో రెట్ల నష్టం చేస్తోంది. విద్య ఫక్తు వ్యాపారమైన తర్వాత విలువల్ని బోధించడం కనుమరుగైంది.
పాఠాలు బట్టీ పెట్టించి, ఫలితాలు సాధించి, ఉద్యోగాలు పట్టిచ్చే పరుగు పందెమయింది విద్య. టీవీ వినోద కార్యక్రమాల ముసుగులో వస్తున్న సీరియళ్లు మానవ సంబంధాలపై గొడ్డలి వేటు. ఆస్తి తగాదాలు, ఆధిపత్య పోరాటాలు, వివాహేతర సంబంధాలు, కక్ష–కార్పణ్యాలు, పగతీర్చు కునే హింస–దౌర్జన్యాలు, దారుణ హత్యలు... ఇవి లేకుండా వస్తున్న సీరియల్స్ ఎన్ని? మహిళను కేంద్ర బిందువు చేసి ఈ కాల్పనిక దౌష్ట్యాల్ని రుద్దితే, మహిళల్ని ఎక్కువగా ఆకట్టుకొని టీఆర్పీలు సాధించొచ్చనే కక్కుర్తి వారికి కలిసివస్తోంది. ఎక్కువ మహిళలు ఇవే చూస్తున్నారు. ఆ క్రమంలో ఇది ఎదిగే పిల్లలపై దుష్ప్రభావం చూపు తోంది. వారూ అనుకరిస్తున్నారు, వాటినే అనుసరిస్తున్నారు. మానవ సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇలా ఉండకూడదనే చర్చ గానీ, మార్గదర్శకాలు గానీ, చట్టపరమైన ప్రతిబంధకాలు గానీ లేవు. ఏ నియంత్రణా లేదు. ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్ వంటి సామా జిక మాధ్యమ వేదికల్ని యువతకు చేరువ చేసిన మొబైల్ ఈ విష యంలో మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తోంది. వీటన్నింటిపై లోతైన అధ్యయనం చేసి తగు పరిష్కారం కనుక్కోకుంటే నష్టం మరింత వేగంగా, తీవ్రంగా జరిగే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త!
దిలీప్ రెడ్డి
ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment