నగరంలో స్త్రీలు ఇంటి నుండి బయటకు వెళ్లాలంటేనే భయంతో వణికి పోతున్నారు. బంగారం దోచుకోడం మాటెలా ఉన్నా, ప్రాణాలు కూడా దక్కుతాయో? లేదోనని భయంతో వణికిపోతున్నారు. ఇంత మంది పోలీసులు ఉండి, అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న వాహనాలు ఉండి నేరాలు తగ్గిస్తామని చెప్పిన పోలీసులను చైన్ స్నాచర్స్ మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నారు. ఇన్నాళ్లు కొన్ని ప్రాంతాల్లో ఎక్కడో ఒకటో రెండో జరిగేవి, కానీ ఇప్పుడు మన నగరంలో చైన్ దొంగతనాలు జరగని ప్రాంతం లేదంటే, ఆశ్చర్యం లేదని చెప్పవచ్చు. ఒక పక్క కాల్పులు జరుపుతున్నా భయం లేకుండా రెచ్చిపోతున్నారు.
ఇంతవరకూ జరిగిన సంఘటనల్లో బాధితులు పోగొట్ట్టుకున్న వస్తువులు దొరికిన దాఖలాలు లేవు. సరికదా ప్రాణాలు కూడా పోయిన సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం. ఇంక మన అభాగ్య నగరంలో స్త్రీలు బంగారం ధరించి బయటకు వెళ్లడం ఏ మాత్రం భద్రత లేదని రుజువవుతోంది. పోలీసులు నిఘా ఎంత పెంచినా బూడిదలో పోసిన పన్నీరు చందంగా ఉంది. హిందూ స్త్రీకి పవిత్రమైన మంగళ సూత్రం కూడా లేకుండా ఎలాగ? అని మహిళలు దుమ్మెత్తి పోస్త్తున్నారు. ఇప్పటికైనా గట్టి నిఘా పెట్టి మహిళలకు భరోసా కల్పించే దిశగా పోలీసులు పక్కాగా గొలుసు దొంగల భరతం పట్టి నగరంలో మహిళలకు భద్రత కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ దిశగా మన పోలీసులు కృషి చేయాలి.
- ఎస్.రాజ్యలక్ష్మి చిక్కడపల్లి, హైదరాబాద్
చైన్ స్నాచింగ్ నగర్
Published Tue, Nov 3 2015 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 11:54 AM
Advertisement