- జోరుగా ఐపీఎల్ బెట్టింగ్‌లు
- రూ.కోట్లలో పందేలు
- నిండా మునుగుతున్న జనం
- వ్యవహారమంతా ఫోన్, ఆన్‌లైన్‌లోనే..
- కార్పొరేట్ కల్చర్‌కు ఖాకీల వత్తాసు!
మెదక్ టౌన్: జిల్లాలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఈ వ్యవహారాన్ని గుట్టుగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఈ వ్యవహారం భారీగా సాగుతోంది. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. క్రికెట్ మాయలో పడ్డ కొందరు బెట్టింగ్ కడుతూ డబ్బులు ఖర్చు చేస్తున్నారు. మరికొందరు అప్పులు సైతం చేసి ఇందులో పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లాలో పోలీసులు సరైన తీరుగా స్పందించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలోని పలుచోట్ల ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. ఐపీఎల్ సీజన్-8లో భాగంగా శనివారం రాత్రి జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మ్యాచ్ సందర్భంగా జిల్లాలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు సమాచారం. కార్పొరేట్ విష సంస్కకృతి నగరాలకే పరిమితం కాకుండా పట్టణాలు, పచ్చని పల్లెల్లోనూ చిచ్చు రేపుతోంది. జెంటిల్‌మెన్ గేమ్‌గా పేరుగాంచిన క్రికెట్ ఆట ప్రపంచీకరణలో భాగంగా పూర్తిగా కమర్షియల్ అయిపోయింది. ఇందులో భాగంగా బెట్టింగ్‌ల వ్యవహారమంతా ఫోన్లు, ఆన్‌లైన్‌లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పొట్టిఫార్మాట్ 20-20 మ్యాచ్‌లు ప్రారంభమైనప్పటి నుంచి ఆటగాళ్లను అంగట్లో సరుకుగా కొనుక్కోవడం ఫ్యాషన్ అయిపోయింది.
దీనికి బడా పారిశ్రామికవేత్తలు, సినీ బాలీవుడ్ ప్రముఖులంతా ఒక్కో టీమ్‌ను చేజిక్కించుకోవడాన్ని చూస్తే కార్పొరేట్ విష సంస్క ృతి ఎంతగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో జిల్లాలోని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, పటాన్‌చెరు, రామచంద్రాపురం, జోగిపేట, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, రామాయంపేట తదితర ప్రాంతాల్లో కేవలం ఒక్కరోజులోనే కోట్లాది రూపాయలు బెట్టింగ్ రూపంలో చేతులు మారినట్టు సమాచారం. బెట్టింగ్‌లను అరికట్టాల్సిన పోలీస్ యంత్రాంగం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
శనివారం రాత్రి జరిగిన 20-20 మ్యాచ్ సందర్భంగా సంగారెడ్డిలోని ప్రశాంత్ నగర్‌లో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న బెజుగం నరేన్‌కుమార్, తునికి లక్ష్మణ్‌రెడ్డి, భాను, మాడపాటి స్వామిసతీష్, పట్లోళ్ల సంతోష్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి రూ.6 వేల నగదు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మెదక్‌లో ఆరుగురిని పట్టుకున్నారు. స్థానికంగా పలుకుబడి గల అధికార పార్టీ నేత అర్ధరాత్రి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ‘ఖాకీలకు’ లక్ష రూపాయలిచ్చి వారిని తీసుకెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. యువకులు పెద్ద మొత్తంలో బెట్టింగ్‌లు కడుతున్నారు. ఈ క్రమంలో భారీగా డబ్బులు కూడగట్టుకుంటున్న వారు కొందరైతే... ఉన్న డబ్బులు పోగొట్టుకొని అప్పుల ఊబిలో కూరుకుపోతూ లబోదిబోమంటున్న వారు కొందరు.
ఇంకొందరూ భార్య మెడలోంచి పుస్తెలతాడు, వాహనాలు, సెల్‌ఫోన్లు, ఇతర సామగ్రిని సైతం తాకట్టుపెట్టి మరీ బెట్టింగ్‌లు కాస్తున్నట్టు సమాచారం. నిఘా పెట్టాల్సిన పోలీసులు నిద్రావస్థలో ఉండటంతోపాటు భారీగా డబ్బులు వసూళ్లు చేస్తూ ఈ దందాను అడ్డుకోకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత పోలీసు శాఖ మొద్దునిద్ర వీడి బెట్టింగ్‌ల పట్ల కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.
అమాయకులు బలి...
క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారంటూ మెదక్ పట్టణానికి చెందిన నలుగురిని పోలీసులు ఆదివారం సాయంత్రం స్టేషన్‌కు పిలిపించారు. బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిని చూపెడతామంటూ సాయంత్రం 6.30 గంటలకు మీడియాను ఆహ్వానించారు. కబురు అందుకొని స్టేషన్‌కు వచ్చిన విలేకరులను గంటపాటు కూర్చోబెట్టారు. అనంతరం స్థానిక సీఐ సాయీశ్వర్‌గౌడ్ మళ్లీ వస్తానంటూ బయటకు వెళ్లిపోయారు. ఎంతకీ రాకపోవడంతో సీఐ తీరుపై విలేకరులు అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి నిష్ర్కమించారు.
కాయ్ రాజా.. కాయ్
Published Mon, May 4 2015 1:39 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement