కాయ్‌ రాజా.. కాయ్‌! | IPL Cricket betting going on high | Sakshi
Sakshi News home page

కాయ్‌ రాజా.. కాయ్‌!

Published Wed, May 3 2017 5:30 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

కాయ్‌ రాజా.. కాయ్‌! - Sakshi

కాయ్‌ రాజా.. కాయ్‌!

జోరుగా ‘ఐపీఎల్‌’ బెట్టింగ్‌లు
- చేతులు మారుతున్న రూ.లక్షలు
- కళ్లప్పగించి చూస్తున్న  పోలీసులు
- బడా వ్యాపారులు సైతం పందేలు
- చిత్తవుతున్న యువత


► మెదక్‌ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి బెట్టింగ్‌లో ఓడిపోవడంతో ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు కుదవపెట్టి డబ్బులు చెల్లించాడు. దీంతో ఆ కుటుంబంలో కొట్లాటలు మొదలయ్యాయి.
► అలాగే మరో యువకుడు బెట్టింగ్‌లు కాసి తీవ్రంగా నష్టపోయాడు. డబ్బులు చెల్లించాలని గెలిచిన వారు ఒత్తిడి చేయడమేకాకుండా దాడులకు దిగడంతో.. బాధితుడు తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేసి డబ్బులు చెల్లించినట్లు తెలిసింది.
► ఇంకా వెలుగుచూడని ఘటనలు ఎన్నో.. ఇలా బెట్టింగ్‌లతో యువత బతుకులు ఆగమవుతున్నాయి. నాలుగేళ్లుగా మెదక్‌పట్టణంలో బెట్టింగ్‌ దందా జోరుగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.

మెదక్‌ మున్సిపాలిటీ:  ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లతో యువత చిత్తవుతోంది. ఐపీఎల్‌ మ్యాచ్‌ల ప్రారంభమైనప్పటి నుంచి యువకులు బెట్టింగ్‌లో మునిగిపోయారు. బెట్టింగ్‌ రాయుళ్లు బిజీగా మారారు. మెదక్‌ పట్టణంలో క్రికెట్‌ బెట్టింగ్‌ జోరుగా కొనసాగుతున్నట్టు సమాచారం. యువకులే కాకుండా పెద్ద వ్యాపారులు సైతం బెట్టింగ్‌లపై ఆసక్తి కనబరుస్తున్నట్టు వినికిడి. ఎప్పటికప్పుడు ఏ  టీం బాగా ఆడుతోంది. ఈరోజు నేదీ గెలుస్తుందంటూ వారికి తెలిసిన వారిని ఆరా తీయడంతోపాటు నెట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటూ పందెం కాస్తున్నారు. రెండు టీంల మధ్య టాస్‌ పడినప్పటి నుంచి బెట్టింగ్‌లు కాస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా బంతి.. బంతికి, ఆటగాళ్ల మీద పందెం జరుగుతోంది. ఈ బెట్టింగ్‌లుసుమారు రూ.1000 నుంచి రూ. లక్ష వరకు మ్యాచ్‌ తీరునుబట్టి పెడుతున్నట్లు వినికిడి. దీంతో మ్యాచ్‌లలో ఓడినవారు ఆర్థికంగా దెబ్బతిని మానసికంగా కుంగిపోతున్నారు. ముఖ్యంగా ఈజీ మనీకి అలవాటు పడిన యువత ఈ తరహా జల్సాలకు బానిసలుగా మారుతున్నారని పలువురు చెబుతున్నారు.

అంతా ఫోన్లలోనే..
పట్టణంలోని పలు పేరు మోసిన అడ్డాల్లో జోరుగా బెట్టింగ్‌ జరుగుతోందని సమాచారం.  చాలా వరకు ఈ బెట్టింగ్‌లు ఫోన్లలోనే జరుగుతున్నాయి. యువత అంతా ఒకచోట అడ్డా ఏర్పాటు చేసుకొని, ఇంకొంతమంది ఇళ్లలో, వ్యాపార కేంద్రాల్లో, లాడ్జిలలో కూర్చొని బెట్టింగ్‌ దందా కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభమైన నాటి నుంచి పట్టణంలో జోరుగా బెట్టింగ్‌ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. మ్యాచ్‌లలో ఓడిపోయిన వారు బంగారంతోపాటు బైక్‌లను కుదవపెడుతూ రోడ్డున పడుతున్నారు. అంతేకాకుండా ఓడిపోయిన వారు మ్యాచ్‌ గెలుపొందిన వారికి డబ్బులు ఇవ్వక పోవడంతో దాడులకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మూడు నాలుగేళ్లుగా మెదక్‌పట్టణంలో ఈ బెట్టింగ్‌ విపరీతంగా జరుగుతోంది. అప్పట్లో  పోలీసులు పలుమార్లు కేసులు నమోదు చేసినప్పటికీ దందా యథేచ్చగా కొనసాగుతూనే ఉంది.  

కానరాని పోలీసుల నిఘా..
పోలీసుల నిఘా లేకపోవడంతోనే పట్టణంలో జోరుగా బెట్టింగ్‌ల దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. లక్షల రూపాయలతో బెట్టింగ్‌లు చేస్తూ యువత రోడ్డున పడుతున్నా...అధికారులు స్పందించకపోవడం అన్యాయమని యువత తల్లిదండ్రులు వాపోతున్నారు. పట్టణంలో విస్తృతంగా విచారణ జరిపి బెట్టింగ్‌ జరుగుతున్న ప్రాంతాలపై, బెట్టింగ్‌ రాయుళ్లపై కఠిన చర్యలు తీసుకొని యువతను కాపాడాలని పలువురు కోరుతున్నారు.

ప్రత్యేక దృష్టి సారించాం
పట్టణంలో క్రికెట్‌ బెట్టింగ్‌లు జరుగుతున్న విషయం మా దృష్టికి రాగానే లాడ్జిల్లో రైడింగ్‌లు నిర్వహించాం. ఐపీఎల్‌ మ్యాచ్‌లు మొదలు కాగానే ప్రత్యేక దృష్టి సారించాం. ఎవరైనా క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్టు తెలిస్తే తమకు సమాచారం అందించండి. బెట్టింగ్‌లకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించం. కఠిన చర్యలు తీసుకుంటాం.     –భాస్కర్, మెదక్‌ పట్టణ సీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement