IPL Cricket betting
-
బెట్టింగ్ ప్రేరేపణే నా భర్తను బలిగొంది..
గండ్రాయి (జగ్గయ్యపేట) : ఐపీఎల్ క్రికెట్ బెట్టింగే తన భర్తను బలి తీసుకొందని, తన కుటుంబాన్ని రోడ్డున పడేసిందని మండలంలోని గండ్రాయి గ్రామానికి చెందిన దొండపాటి కరుణ చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి. దొండపాటి నరసింహారావు గ్రామంలోని వ్యవసాయ ఉత్పత్తుల కమీషన్ వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవల రైతుల నుంచి మిర్చి, పత్తి కొనుగోలు చేసిన రైతులకు ఇవ్వవలసిన రూ.3.70 లక్షలు తన ఖాతాలో ఉంచుకొన్నాడు. ఈ క్రమంలో గత నెల 29న ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా గ్రామానికి చెందిన పి అనిల్, జీ వెంకటేశ్వరరావు, ఎం. రాంబాబు, ఎం. సతీష్, వత్సవాయి మండలం పెద్దమోదుగుపల్లి గ్రామానికి చెందిన కళ్యాణ జగన్మోహన్, కనగాల గణపతి ప్రేరేపించి ఆ నగదును బెట్టింగ్‌ల్లో పెట్టించారు. బెట్టింగ్‌లో నష్టపోవటంతోనే ఆత్మహత్య.. రైతులకు చెల్లించాల్సిన డబ్బులు బెట్టింగ్‌ల్లో నష్టపోవటంతో ఏ విధంగా ఇవ్వాలో తెలియక మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అప్పుల బాధ తాళలేక ఈ నెల ఒకటిన ఆత్మహత్య చేసుకొన్నట్లు కుటుంబ సభ్యులు భావించగా, మూడు రోజుల క్రితం ఇంట్లోని సామానులను సర్దుతుండగా నరసింహారావు రాసిన సూసైడ్ నోట్ లభించింది. ఈ నోట్లో పైన తెలిపిన వారి ప్రోద్బలం, ప్రేరణతో రైతులకు చెల్లించాల్సిన డబ్బులు బెట్టింగ్‌ల్లో పెట్టి నష్టపోయానని, తన చావుకు వారే కారణమని, ఆ డబ్బులు వసూలు చేసి రైతులకు చెల్లించాలని నరసింహారావు ఆ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. దీంతో భార్య చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఉన్న ఇల్లు, భూమిని సైతం గతంలోనే విక్రయించటం జరిగిందని, తన భర్త మరణంతో కుటుంబానికి అండ, ఆసరా లేకుండాపోయిందని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకొంది. -
కాయ్ రాజా.. కాయ్!
జోరుగా ‘ఐపీఎల్’ బెట్టింగ్‌లు - చేతులు మారుతున్న రూ.లక్షలు - కళ్లప్పగించి చూస్తున్న పోలీసులు - బడా వ్యాపారులు సైతం పందేలు - చిత్తవుతున్న యువత ► మెదక్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి బెట్టింగ్‌లో ఓడిపోవడంతో ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు కుదవపెట్టి డబ్బులు చెల్లించాడు. దీంతో ఆ కుటుంబంలో కొట్లాటలు మొదలయ్యాయి. ► అలాగే మరో యువకుడు బెట్టింగ్‌లు కాసి తీవ్రంగా నష్టపోయాడు. డబ్బులు చెల్లించాలని గెలిచిన వారు ఒత్తిడి చేయడమేకాకుండా దాడులకు దిగడంతో.. బాధితుడు తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేసి డబ్బులు చెల్లించినట్లు తెలిసింది. ► ఇంకా వెలుగుచూడని ఘటనలు ఎన్నో.. ఇలా బెట్టింగ్‌లతో యువత బతుకులు ఆగమవుతున్నాయి. నాలుగేళ్లుగా మెదక్‌పట్టణంలో బెట్టింగ్ దందా జోరుగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. మెదక్ మున్సిపాలిటీ: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లతో యువత చిత్తవుతోంది. ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రారంభమైనప్పటి నుంచి యువకులు బెట్టింగ్‌లో మునిగిపోయారు. బెట్టింగ్ రాయుళ్లు బిజీగా మారారు. మెదక్ పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా కొనసాగుతున్నట్టు సమాచారం. యువకులే కాకుండా పెద్ద వ్యాపారులు సైతం బెట్టింగ్‌లపై ఆసక్తి కనబరుస్తున్నట్టు వినికిడి. ఎప్పటికప్పుడు ఏ టీం బాగా ఆడుతోంది. ఈరోజు నేదీ గెలుస్తుందంటూ వారికి తెలిసిన వారిని ఆరా తీయడంతోపాటు నెట్లో డౌన్లోడ్ చేసుకుంటూ పందెం కాస్తున్నారు. రెండు టీంల మధ్య టాస్ పడినప్పటి నుంచి బెట్టింగ్‌లు కాస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా బంతి.. బంతికి, ఆటగాళ్ల మీద పందెం జరుగుతోంది. ఈ బెట్టింగ్లుసుమారు రూ.1000 నుంచి రూ. లక్ష వరకు మ్యాచ్ తీరునుబట్టి పెడుతున్నట్లు వినికిడి. దీంతో మ్యాచ్‌లలో ఓడినవారు ఆర్థికంగా దెబ్బతిని మానసికంగా కుంగిపోతున్నారు. ముఖ్యంగా ఈజీ మనీకి అలవాటు పడిన యువత ఈ తరహా జల్సాలకు బానిసలుగా మారుతున్నారని పలువురు చెబుతున్నారు. అంతా ఫోన్లలోనే.. పట్టణంలోని పలు పేరు మోసిన అడ్డాల్లో జోరుగా బెట్టింగ్ జరుగుతోందని సమాచారం. చాలా వరకు ఈ బెట్టింగ్‌లు ఫోన్లలోనే జరుగుతున్నాయి. యువత అంతా ఒకచోట అడ్డా ఏర్పాటు చేసుకొని, ఇంకొంతమంది ఇళ్లలో, వ్యాపార కేంద్రాల్లో, లాడ్జిలలో కూర్చొని బెట్టింగ్ దందా కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమైన నాటి నుంచి పట్టణంలో జోరుగా బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. మ్యాచ్‌లలో ఓడిపోయిన వారు బంగారంతోపాటు బైక్‌లను కుదవపెడుతూ రోడ్డున పడుతున్నారు. అంతేకాకుండా ఓడిపోయిన వారు మ్యాచ్ గెలుపొందిన వారికి డబ్బులు ఇవ్వక పోవడంతో దాడులకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మూడు నాలుగేళ్లుగా మెదక్‌పట్టణంలో ఈ బెట్టింగ్ విపరీతంగా జరుగుతోంది. అప్పట్లో పోలీసులు పలుమార్లు కేసులు నమోదు చేసినప్పటికీ దందా యథేచ్చగా కొనసాగుతూనే ఉంది. కానరాని పోలీసుల నిఘా.. పోలీసుల నిఘా లేకపోవడంతోనే పట్టణంలో జోరుగా బెట్టింగ్‌ల దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. లక్షల రూపాయలతో బెట్టింగ్‌లు చేస్తూ యువత రోడ్డున పడుతున్నా...అధికారులు స్పందించకపోవడం అన్యాయమని యువత తల్లిదండ్రులు వాపోతున్నారు. పట్టణంలో విస్తృతంగా విచారణ జరిపి బెట్టింగ్ జరుగుతున్న ప్రాంతాలపై, బెట్టింగ్ రాయుళ్లపై కఠిన చర్యలు తీసుకొని యువతను కాపాడాలని పలువురు కోరుతున్నారు. ప్రత్యేక దృష్టి సారించాం పట్టణంలో క్రికెట్ బెట్టింగ్‌లు జరుగుతున్న విషయం మా దృష్టికి రాగానే లాడ్జిల్లో రైడింగ్లు నిర్వహించాం. ఐపీఎల్ మ్యాచ్‌లు మొదలు కాగానే ప్రత్యేక దృష్టి సారించాం. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్టు తెలిస్తే తమకు సమాచారం అందించండి. బెట్టింగ్‌లకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించం. కఠిన చర్యలు తీసుకుంటాం. –భాస్కర్, మెదక్ పట్టణ సీఐ -
బంతి బంతికీ బెట్టింగ్!
♦ ఐపీఎల్ తుది పోరుపై పందేల జోరు ♦ చేతులు మారిన కోట్ల రూపాయలు ♦ కర్నూలు నగరంలో బెట్టింగ్‌రాయుళ్లు ♦ హోటళ్లు, లాడ్జిల్లో కొనసాగిన దందా ♦ మేము సైతం అన్న గ్రామీణులు సాక్షి, కర్నూలు : చెన్నై సూపర్‌కింగ్స్ గెలుస్తుంది.. నా పాట లక్ష ముంబై ఇండియన్స్ ఓడితే నేను రెండు రెట్లు అధికంగా ఇస్తాను బౌలర్ నెహ్రా 3 నుంచి 5 వికెట్లు తీస్తాడు.. లక్ష రూపాయల బెట్.. ..ఇవీ ఆదివారం జరిగిన ఐపీఎల్ టీ20 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్‌రాయుళ్లు ఇచ్చిన ఆఫర్లు. కర్నూలు నగరంలోని లాడ్జిలు, హోటళ్లలో ఈ దందా యథేచ్ఛగా సాగింది. జిల్లా పోలీసులు దీనిపై దృష్టి సారించక పోవడం బెట్టింగ్ రాయుళ్లకు వరంగా మారింది. కర్నూలు నగరంలో కనీసం రూ. 5 కోట్ల వరకు బెట్టింగ్ సాగినట్లు ఒక అంచనా. ఇక్కడి వారికి ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లోని ప్రధాన బుకీలతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. గతంలో పందేలు కాస్తూ పలువురు పోలీసులకు పట్టుబడ్డారు. ముంబై-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బంతికీ బెట్టింగులు నడవడం గమనార్హం. కొందరు అనుమానం రాకుండా నివాస గృహాల్లోనే ఈ వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. కర్నూలు నగరంతోపాటు జిల్లాలోని నంద్యాల, కోవెలకుంట్ల, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, డోన్, ఆత్మకూరు, పత్తికొండ తదితర పట్టణాలకూ ఈ బెట్టింగ్ దందా పాకింది. జిల్లాలో జరిగే వ్యవస్థీకృత బెట్టింగ్‌కు కర్నూలు నగరం ప్రధాన కేంద్రంగా ఉండడం గమనార్హం. చిరువ్యాపారుల నుంచి బడాబాబుల దాకా ఈ వ్యవహారం డబ్బులు పోగొట్టుకొని చేతులు కాల్చుకున్న వారే. పందేల కోసం కొందరు యువకులు ఏకంగా నేరాలకు సైతం పాల్పడుతున్నారు. చెన్నై-ముంబై జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌పై గ్రామీణ ప్రాంతాల్లో సైతం జోరుగా పందేలు సాగాయి. -
బెట్టింగ్.. బెట్టింగ్
ప్రొద్దుటూరు క్రైం : సుమారు 40 రోజుల పాటు క్రికెట్ ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపిన ఐపీఎల్ క్రికెట్ పండుగ ముగింపు దశకు వచ్చింది. నేడు (ఆదివారం) ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కల్కత్తాలోని ఈడెన్గార్డెన్లో జరగ నుంది. ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ ముగిసిన వెంటనే ఐపీఎల్-15 సీజన్ ప్రారంభమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్ సీజన్లో పందేలు పెద్ద ఎత్తున జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రంగా నష్టపోతున్న యువత ఈ సారి జరిగిన ఐపీఎల్ మ్యాచుల్లో క్రికెట్ పందేలు కాస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అన్ని కళాశాలలకు వేసవి సెలవులు కావడంతో డిగ్రీ, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు బెట్టింగ్ ఊబిలో పడినట్లు పోలీసు వర్గాల సమాచారం. చాలా మంది బుకీలు విద్యార్థులకు డబ్బు ఎరచూపి కొరియర్లుగా ఉపయోగించుకుంటున్నారు. మ్యాచ్ జరిగిన అనంతరం విద్యార్థుల ద్వారానే బుకీలు లావాదే వీలు జరిపిస్తున్నారు. గతంలో అయితే ఒక చోట టీవీలు ఏర్పాటు చేసుకొని బెట్టింగ్ నిర్వహించేవారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో సెల్ఫోన్లో లైవ్ క్రికెట్ ద్వారా పందేలు కాస్తున్నారు. పట్టణంలోని మెయిన్‌బజార్, దస్తగిరిపేట, వైఎంఆర్‌కాలనీ, మిట్టమడివీధి, భగత్‌సింగ్‌కాలనీ, గాంధీరోడ్డు, ఆర్ట్స్ కాలేజిరోడ్డు సర్కిల్, తదితర ప్రాంతాలలో బెట్టింగ్ పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి బుకీలు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. ప్రధాన బుకీలు శనివారం రాత్రికే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి ప్రాంతాలకు వెళ్లిపోయారు. సబ్ బుకీలు మాత్రమే స్థానికంగా ఉంటూ బెట్టింగ్ వ్యవహారాలు నడుపుతున్నారు. గ్రామాలకు పాకిన జాడ్యం.. గత కొన్ని రోజుల వరకూ పట్టణాలలో మాత్రమే క్రికెట్ బెట్టింగ్ నిర్వహించేవారు. అయితే బెట్టింగ్ జాడ్యం గ్రామాలకు కూడా బాగా పాకినట్లు కనిపిస్తోంది. ప్రొద్దుటూరు చుట్టుపక్కల ఉన్న రాజుపాళెం, ఎర్రగుంట్ల, చాపాడు మండలాల్లోని గ్రామాల్లో క్రికెట్ పందేలు జరుగుతున్నాయి. పోలీసుల మౌనం.. గతంలో ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా ప్రతి రోజూ బుకీలను పోలీసులు అరెస్ట్ చేసేవారు. అయితే ఈ సారి ఎందుకో పోలీసులు బుకీల జోలికి వెళ్లలేదు. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఒక అరెస్ట్ మినహా, 40 రోజుల్లో ఇతర స్టేషన్ల పరిధిలో ఒక్క బుకీని కూడా అరెస్ట్ చేయలేదు. ప్రొద్దుటూరులో బెట్టింగ్ జరగడంలేదా.. లేక బెట్టింగ్ జరుగుతున్నా పోలీసులు సెలైంట్‌గా ఉన్నారా అనేది ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. సమాచారం తెలిస్తే అరెస్ట్ చేస్తాం.. బెట్టింగ్ జరుగుతోందని సమాచారం తెలిస్తే మాత్రం ఎంతటి వారినైనా వదిలేది లేదని డీఎస్పీ పూజితానీలం అన్నారు. బుకీలు అందరూ ఎక్కడో హైదరాబాద్‌లో బెట్టింగ్ చేస్తుంటే అరెస్ట్ చేయడంలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. స్థానికంగా మాత్రం నిఘాపెట్టామని తెలిపారు. -
బెట్టింగ్‌ను పట్టించుకోరా?
ఏలూరు (సెంట్రల్), న్యూస్‌లైన్ :నగరంలో క్రికెట్ బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ క్రికెట్ ఆటగాళ్లు అందరూ కలసి ఆడే ఐపీఎల్ టీ 20 మ్యాచ్‌లు కీలక దశకు చేరడంతో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ మ్యాచ్‌లను తిలకిస్తున్నారు. నగరంలోని చాలాచోట్ల ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్ విస్తరించింది. ఆదివారం జరిగే ఫైనల్‌తో ఐపీఎల్ మ్యాచ్‌లు ముగియనున్నాయి. దీంతో పందెపురాయుళ్లు మరిం తగా విజృభించనున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం బెట్టింగ్‌లపై సరైన నిఘా పెట్టకపోవడంతో పందెం రాయుళ్లకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. బుకీలు చెప్పే మాయ మాటలను విని నగరంలోని చాలామంది యువకులు బెట్టింగ్‌లు కాస్తూ అప్పులపాలౌతున్నారు. ఆ అప్పులు తీర్చలేక, తమ ఇంటిలో చెప్పలేక ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. గత ఏడాది స్థానిక అముదాల అప్పలస్వామి కాలనీకి చెందిన గాజుల కృష్ణసాయి(21) ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఏలూరులోని ఓ గ్యాస్ కంపెనీలో గుమస్తాగా పనిచేసేవాడు. క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడి తెలిసిన వాళ్లందరి దగ్గర సుమారు రూ.4 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పల వారి నుంచి వేధింపులు ఎక్కువవడంతో గత ఏడాది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వేగవరానికి చెందిన ఓ యువకుడు గత ఏడాది బెట్టింగ్‌లు ఆడి నిద్రమాత్రలను మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బుకీలు నగరంలోని హోటళ్లలో గదులను అద్దెకు తీసుకుని బెట్టింగ్ సాగిస్తున్నారు. శాంతినగర్, సత్రంపాడు వంటి చోట్ల ఇళ్లను అద్దెకు తీసుకుని బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. క్రికెట్ బుకీలు పోలీసులు తమ జోలికి రాకుండా నెలసరి మామూళ్లూ పంపించి వేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. శుక్రవారం బెంగళూరు - చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌కు సుమారు రూ.2 కోట్లకు పైగా పందాలు జరిగినట్టు సమాచారం. ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్‌కు కూడా భారీగా బెట్టింగ్‌లు జరిగే అవకాశం ఉంది. ఏ ఓవర్లో ఎంత? ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా జరుగుతున్న బెట్టింగ్‌లో పందెంరాయుళ్లు ఎక్కువగా ఫ్యాన్సీలపై మక్కువ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పందాలు ఒక ఓవర్లో ఎన్ని రన్స్ కొడతారు. ఎన్ని వికెట్లు పడతాయి అనే అంశాలపై జోరుగా సాగుతున్నాయి. మ్యాచ్ జరిగిన రోజు బెట్టింగ్ కాస్తే తరువాత రోజు ఉదయం 10గంటల కల్లా నగదును బుకీకి అప్పగించాలి. సులువుగా డబ్బును సంపాదించేందుకు పలువురు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కానీ ఈ బెట్టింగ్ వల్ల బుకీలకు మాత్రమే ఎక్కువగా లాభం చేకూరుతుందని పలువురు పందెం రాయుళ్లే చెబుతున్నారు. విద్యార్థులే : ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయంటే చాలు ఎక్కువగా పలు కాలేజీలకు చెందిన విద్యార్థులే ఈ బెట్టింగ్‌కు బలౌతున్నారు. ఒకవేళ మ్యాచ్ తరువాత డబ్బు చెల్లించకపోతే బుకీలే వారికి డబ్బు ను అప్పుగా ఇచ్చినట్టు నోటును రాయించుకుంటున్నారని తెలిసింది. ఇప్పటికైనా పో లీసు ఉన్నతాధికారులు నగరంలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్‌లపై ప్రతేక్య నిఘాను ఏర్పాటు చేసి, యువత భవిష్యత్తును కాపాడాలని పలువురు కోరుతున్నారు. -
కాయ్ రాజా.. కాయ్
- జోరుగా ఐపీఎల్ బెట్టింగ్‌లు - రూ.కోట్లలో పందేలు - నిండా మునుగుతున్న జనం - వ్యవహారమంతా ఫోన్, ఆన్లైన్లోనే.. - కార్పొరేట్ కల్చర్‌కు ఖాకీల వత్తాసు! మెదక్ టౌన్: జిల్లాలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఈ వ్యవహారాన్ని గుట్టుగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఈ వ్యవహారం భారీగా సాగుతోంది. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. క్రికెట్ మాయలో పడ్డ కొందరు బెట్టింగ్ కడుతూ డబ్బులు ఖర్చు చేస్తున్నారు. మరికొందరు అప్పులు సైతం చేసి ఇందులో పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లాలో పోలీసులు సరైన తీరుగా స్పందించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని పలుచోట్ల ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. ఐపీఎల్ సీజన్-8లో భాగంగా శనివారం రాత్రి జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మ్యాచ్ సందర్భంగా జిల్లాలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు సమాచారం. కార్పొరేట్ విష సంస్కకృతి నగరాలకే పరిమితం కాకుండా పట్టణాలు, పచ్చని పల్లెల్లోనూ చిచ్చు రేపుతోంది. జెంటిల్మెన్ గేమ్‌గా పేరుగాంచిన క్రికెట్ ఆట ప్రపంచీకరణలో భాగంగా పూర్తిగా కమర్షియల్ అయిపోయింది. ఇందులో భాగంగా బెట్టింగ్‌ల వ్యవహారమంతా ఫోన్లు, ఆన్లైన్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పొట్టిఫార్మాట్ 20-20 మ్యాచ్‌లు ప్రారంభమైనప్పటి నుంచి ఆటగాళ్లను అంగట్లో సరుకుగా కొనుక్కోవడం ఫ్యాషన్ అయిపోయింది. దీనికి బడా పారిశ్రామికవేత్తలు, సినీ బాలీవుడ్ ప్రముఖులంతా ఒక్కో టీమ్‌ను చేజిక్కించుకోవడాన్ని చూస్తే కార్పొరేట్ విష సంస్క ృతి ఎంతగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో జిల్లాలోని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, పటాన్చెరు, రామచంద్రాపురం, జోగిపేట, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, రామాయంపేట తదితర ప్రాంతాల్లో కేవలం ఒక్కరోజులోనే కోట్లాది రూపాయలు బెట్టింగ్ రూపంలో చేతులు మారినట్టు సమాచారం. బెట్టింగ్‌లను అరికట్టాల్సిన పోలీస్ యంత్రాంగం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. శనివారం రాత్రి జరిగిన 20-20 మ్యాచ్ సందర్భంగా సంగారెడ్డిలోని ప్రశాంత్ నగర్లో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న బెజుగం నరేన్కుమార్, తునికి లక్ష్మణ్‌రెడ్డి, భాను, మాడపాటి స్వామిసతీష్, పట్లోళ్ల సంతోష్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి రూ.6 వేల నగదు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మెదక్‌లో ఆరుగురిని పట్టుకున్నారు. స్థానికంగా పలుకుబడి గల అధికార పార్టీ నేత అర్ధరాత్రి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ‘ఖాకీలకు’ లక్ష రూపాయలిచ్చి వారిని తీసుకెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. యువకులు పెద్ద మొత్తంలో బెట్టింగ్‌లు కడుతున్నారు. ఈ క్రమంలో భారీగా డబ్బులు కూడగట్టుకుంటున్న వారు కొందరైతే... ఉన్న డబ్బులు పోగొట్టుకొని అప్పుల ఊబిలో కూరుకుపోతూ లబోదిబోమంటున్న వారు కొందరు. ఇంకొందరూ భార్య మెడలోంచి పుస్తెలతాడు, వాహనాలు, సెల్ఫోన్లు, ఇతర సామగ్రిని సైతం తాకట్టుపెట్టి మరీ బెట్టింగ్‌లు కాస్తున్నట్టు సమాచారం. నిఘా పెట్టాల్సిన పోలీసులు నిద్రావస్థలో ఉండటంతోపాటు భారీగా డబ్బులు వసూళ్లు చేస్తూ ఈ దందాను అడ్డుకోకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత పోలీసు శాఖ మొద్దునిద్ర వీడి బెట్టింగ్‌ల పట్ల కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. అమాయకులు బలి... క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారంటూ మెదక్ పట్టణానికి చెందిన నలుగురిని పోలీసులు ఆదివారం సాయంత్రం స్టేషన్‌కు పిలిపించారు. బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిని చూపెడతామంటూ సాయంత్రం 6.30 గంటలకు మీడియాను ఆహ్వానించారు. కబురు అందుకొని స్టేషన్‌కు వచ్చిన విలేకరులను గంటపాటు కూర్చోబెట్టారు. అనంతరం స్థానిక సీఐ సాయీశ్వర్‌గౌడ్ మళ్లీ వస్తానంటూ బయటకు వెళ్లిపోయారు. ఎంతకీ రాకపోవడంతో సీఐ తీరుపై విలేకరులు అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి నిష్ర్కమించారు.