బెట్టింగ్.. బెట్టింగ్
ప్రొద్దుటూరు క్రైం : సుమారు 40 రోజుల పాటు క్రికెట్ ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపిన ఐపీఎల్ క్రికెట్ పండుగ ముగింపు దశకు వచ్చింది. నేడు (ఆదివారం) ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కల్‌కత్తాలోని ఈడెన్‌గార్డెన్‌లో జరగ నుంది. ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ ముగిసిన వెంటనే ఐపీఎల్-15 సీజన్ ప్రారంభమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్ సీజన్‌లో పందేలు పెద్ద ఎత్తున జరిగినట్లు తెలుస్తోంది.
తీవ్రంగా నష్టపోతున్న యువత
ఈ సారి జరిగిన ఐపీఎల్ మ్యాచుల్లో క్రికెట్ పందేలు కాస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అన్ని కళాశాలలకు వేసవి సెలవులు కావడంతో డిగ్రీ, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు బెట్టింగ్ ఊబిలో పడినట్లు పోలీసు వర్గాల సమాచారం. చాలా మంది బుకీలు విద్యార్థులకు డబ్బు ఎరచూపి కొరియర్‌లుగా ఉపయోగించుకుంటున్నారు. మ్యాచ్ జరిగిన అనంతరం విద్యార్థుల ద్వారానే బుకీలు లావాదే వీలు జరిపిస్తున్నారు. గతంలో అయితే ఒక చోట టీవీలు ఏర్పాటు చేసుకొని బెట్టింగ్ నిర్వహించేవారు.
ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి రావడంతో సెల్‌ఫోన్‌లో లైవ్ క్రికెట్ ద్వారా పందేలు కాస్తున్నారు. పట్టణంలోని మెయిన్‌బజార్, దస్తగిరిపేట, వైఎంఆర్‌కాలనీ, మిట్టమడివీధి, భగత్‌సింగ్‌కాలనీ, గాంధీరోడ్డు, ఆర్ట్స్ కాలేజిరోడ్డు సర్కిల్, తదితర ప్రాంతాలలో బెట్టింగ్ పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి బుకీలు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. ప్రధాన బుకీలు శనివారం రాత్రికే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి ప్రాంతాలకు వెళ్లిపోయారు. సబ్ బుకీలు మాత్రమే స్థానికంగా ఉంటూ బెట్టింగ్ వ్యవహారాలు నడుపుతున్నారు.
గ్రామాలకు పాకిన జాడ్యం..
గత కొన్ని రోజుల వరకూ పట్టణాలలో మాత్రమే క్రికెట్ బెట్టింగ్ నిర్వహించేవారు. అయితే బెట్టింగ్ జాడ్యం గ్రామాలకు కూడా బాగా పాకినట్లు కనిపిస్తోంది. ప్రొద్దుటూరు చుట్టుపక్కల ఉన్న రాజుపాళెం, ఎర్రగుంట్ల, చాపాడు మండలాల్లోని గ్రామాల్లో క్రికెట్ పందేలు జరుగుతున్నాయి.
పోలీసుల మౌనం..
గతంలో ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా ప్రతి రోజూ బుకీలను పోలీసులు అరెస్ట్ చేసేవారు. అయితే ఈ సారి ఎందుకో పోలీసులు బుకీల జోలికి వెళ్లలేదు. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఒక అరెస్ట్ మినహా, 40 రోజుల్లో ఇతర స్టేషన్‌ల పరిధిలో ఒక్క బుకీని కూడా అరెస్ట్ చేయలేదు. ప్రొద్దుటూరులో బెట్టింగ్ జరగడంలేదా.. లేక బెట్టింగ్ జరుగుతున్నా పోలీసులు సెలైంట్‌గా ఉన్నారా అనేది ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
సమాచారం తెలిస్తే అరెస్ట్ చేస్తాం..
బెట్టింగ్ జరుగుతోందని సమాచారం తెలిస్తే మాత్రం ఎంతటి వారినైనా వదిలేది లేదని డీఎస్పీ పూజితానీలం అన్నారు. బుకీలు అందరూ ఎక్కడో హైదరాబాద్‌లో బెట్టింగ్ చేస్తుంటే అరెస్ట్ చేయడంలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. స్థానికంగా మాత్రం నిఘాపెట్టామని తెలిపారు.