రైతు బిడ్డల స్ఫూర్తియాత్ర భూమిపుత్ర
టీవీక్షణం
పల్లెలన్నీ ఖాళీ అవుతున్నాయి. నగరాలు జనంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఏదో తెలియని గమ్యం వైపు అర్థం లేని పరుగులు! యంత్రాల ముందు కూర్చుని మనుషులు కూడా యాంత్రికంగా మారిపోతున్నారు. ఎప్పుడో ఓ ఒంటరి సాయంకాలం వరుసగా వేసుకొనే ఎన్నో ప్రశ్నలకు దొరికే సమాధానం ఒకటే - పల్లె, పంట చేను. పల్లెటూరుకి, పట్టణానికి మధ్య పెరుగుతున్న ఈ దూరాల్ని దగ్గర చేసే ప్రయత్నాన్ని విజయవంతంగా నెరవేరుస్తోంది మాటీవీ ‘భూమిపుత్ర’. లాభాపేక్ష లేకుండా, ఒక సామాజిక బాధ్యతగా రైతులకు మేలు చేయాలన్న ఆలోచనతో మాటీవీ ఈ బృహత్ ప్రయత్నాన్ని ప్రారంభించింది.
ప్రతి శనివారం ఉ. 8 గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా, పరిస్థితులకు అనుగుణంగా సరికొత్త విధానాల్లో వ్యవసాయం చేసే ఎందరో రైతుల్ని, వారి అనుభవాల్ని వారం వారం పరిచయం చేస్తోంది. రైతులకు అండగా నిలవడం, కొత్త తరాన్ని సేద్యం వైపు ఆకర్షించడం, సేద్యం మన సంస్కృతిగా చూడటం మౌలికంగా ఈ కార్యక్రమం ఉద్దేశం. పర్యావరణానికి, మనుషులకు, నేలకు ఎలాంటి హాని జరగకుండా లాభదాయకంగా సేద్యాన్ని సాగించే అభ్యుదయ రైతులపై దృష్టి పెట్టింది ‘భూమిపుత్ర’.
ఆచరణలో ఎన్ని సమస్యలు ఎదురైనా, మన రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశంతో 90 వారాలకుపైగా ఈ సస్యయజ్ఞం చేస్తోంది. టెలివిజన్‌లో ప్రత్యక్షంగా, యూ ట్యూబ్‌లో పరోక్షంగా లక్షల మంది ప్రేక్షకులు ఈ కార్యక్రమం ద్వారా స్ఫూర్తి పొందుతున్నారు.
రైతులకు సాంకేతిక పరిజ్ఞానం, సమాచార మార్పిడికి భూమిపుత్ర ఒక వేదికగా నిలిచింది. రేపటి సేద్యానికి తిరుగులేని ఆశను కలిగించడం భూమిపుత్ర వల్ల జరిగిన ప్రయోజనం. ఇప్పుడు ఎగిసిపడుతున్న ఈ అలలన్నీ ఒకనాడు విరిగిపడేవే. నిలబడేది ఒకటే. వ్యవసాయం. అది భవిష్యత్తు!